"తధాస్తు, రేపు ఇదే వేళకి రండి బాబూ" అని వెళ్ళిపోయాడాయన.
ఆయన వెళ్ళగానే తమ్ముడి ముఖంలోకి చూసి, "అమ్మ ఉండగా ఆవిడచేత ఆశీర్వాదాలు పొందే అదృష్టం లేకపోయింది నాకు ఎప్పుడూ సంపాదన పైనే నాదృష్టి ఉండేది. అమ్మని సుఖపెట్టాలనే ఆలోచనే రాలేదు" అన్నాడు విచారంగా.
"అంత అకస్మాత్తుగా అమ్మ చనిపోతుందని మనం కలలు కన్నామా, అన్నయ్యా! ఎవరికెంత ప్రాప్తమో అంత! అయినా పోయిన ఆరు నెలల్లోగా పెళ్ళి జరిగితే పోయినవారి ఆత్మ తృప్తి పడుతుందట. ఇంటిలో ఎవరూలేక బిక్కుబిక్కుమంటూ ఎన్నాళ్ళుండగలవు నీవు? అందుకే నీ తరఫున నేను సరే అన్నాను."
రమణ నిట్టూర్చాడు.
* * *
మరుసటిరోజు సాయంకాలం గోపీ, రమణ వెంకయ్యగారి ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు బంధువులతో, మిత్రులతో కలకల లాడిపోతూంది. ఇంటిముందు పెద్ద పందిరి వేయించాడు. శాశ్వతంగా, దాన్ని మామిడి తోరణాలతో అలంకరించాడు. స్తంభాలకు అరటి స్తంభాలు కట్టించాడు.
వసారా నిండా కంబళ్ళు పరిపించాడు. దానిపై జంబుకానాలు వేయించి, సొరుగుడు దిళ్ళు వేయించాడు. బంధు మిత్రులంతా రాజదర్బారులో ఆసీనులయినట్లుగా కూర్చున్నారు.
రమణ, గోపీ ఇంటిముందుకిరాగానే సన్నాయి మధురంగా మ్రోగింది. కన్నెపిల్లలు ఇద్దరు ఎదురుగా వచ్చి పాటపాడి హారతి ఇచ్చారు. వెంకయ్య, ఇంకా కొంతమంది పెద్దలు, వెంకయ్య భార్య మహాలక్ష్మి ఎదురుగా వచ్చి ఆదరంగా పలకరించి వెంట ఉండి తీసుకెళ్ళారు.
రెండు అరుగులకీ మధ్య కుర్చీ వేయించి కూర్చోబెట్టారు రమణని.
గోపీ వెంకయ్య పక్కను కూర్చున్నాడు.
వెంకయ్య ఇంట్లో పనిచేసే కుర్రాడు విసనకర్ర తీసుకుని రమణకి విసురుతున్నాడు.
ఒక్కగానొక్క కూతురు సరోజ పెళ్ళికి ఎంత ఖర్చయినా వెనుదీయని వెంకయ్య. రమణ మనస్సుకి నచ్చేలా చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
"ఇక అమ్మాయిని పిలిపిస్తావా వెంకయ్యా?" బావగారి వరుసయిన ఓ వ్యక్తి జరగవలసిన కార్యక్రమాన్ని గుర్తు చేశాడు.
వెంకయ్య యింట్లోకి వెళ్ళాడు.
కొన్ని నిమిషాల తర్వాత వెంకయ్య భార్య సరోజని వెంట బెట్టుకుని వచ్చి రమణ కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది.
ఒక్క క్షణం చూశాడు రమణ.
నచ్చక పోవటానికీ, ఏదైనా పేరు పెట్టటానికీ ఏం వంక ఉందనీ? పైగా కొత్తగా చూస్తున్నాడా ఏమయినానా?
భూషయ్యగారి ఇంట్లో ఉన్నప్పుడు రోజూ చూచినా సరోజే కదా!
"సరోజా! ఏదైనా పాట పాడమ్మా" అన్నాడు వెంకయ్యకి తమ్ముని వరసయిన ఓ పెద్దమనిషి.
"రామయ్యమామా! ఏమిటిదంతా? ఏదో సాంప్రదాయికంగా రావాలని వచ్చాను. అంతేకానీ నేను సరోజని చూడలేదా పూర్వం? ఎదురుగా కూర్చోబెట్టటం, పాట పాడించటం, నడిపించటం తెలియని వాళ్ళకి శారీరక లోపం లేదని తెలుపటానికే కదా? ఇంకెందుకవన్నీ ఇప్పుడు?"
"అవునవును" అన్నారిద్దరు ముగ్గురు.
"అయితే నీకు నచ్చినట్లేగా?"
"నచ్చబట్టే వచ్చాను కదా! గోపీ. ఆ చేతి సంచిలోని పళ్ళూ అవీ ఆ పళ్ళెంలో పెట్టు" అన్నాడు రమణ.
ఎవరో ముత్తయిదువ అందించిన పళ్ళెంలో తను తెచ్చిన పసుపు కుంకుమ, చీర, రవిక, నెక్లెస్, పళ్ళు పెట్టాడు గోపీ.
అది అందుకుని, "పెద్దమ్మా! ఇవి అత్తగారి చేతికిచ్చి ఆమె కివ్వమని చెప్పు" అన్నాడు రమణ.
ఆమె సరోజ నుదుట కుంకుమ దిద్ది అవన్నీ చేతికి ఇచ్చి, "చీర కట్టుకుని రా అమ్మా" అంది.
వెంకయ్యకూడా నూతన వస్త్రాలు ఇచ్చాడు రమణకి.
ఇద్దరూ అవి కట్టుకుని వచ్చారు.
చూచే వాళ్ళకి అది పెళ్ళిపందిరిలా, కల్యాణ మంటపంలా కనుపించసాగింది.
"మామయ్యా! ఒక మాట చెపుతాను. వింటావా?" అని అడిగాడు రమణ.
"చెప్పు, రమణా!"
"నాకు విపరీతమైన ఖర్చులు, వ్యర్ధమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఇష్టంలేదు. మీకు సరోజ ఒక్కగానొక్క కూతురు. మీకు ఆమె పెళ్ళి ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి, ముత్యాల ముగ్గులు పెట్టించి, రత్నాల దీపాలు అలంకరించి, బాజా భజంత్రీలతో చేయాలని ఉంటుంది.
"కానీ, ఈ ఖర్చు వలన నాకు కానీ, మీకు కానీ ఒరిగేదేమిటి? భారీగా పెళ్ళి చేశాడు అన్న ఒక్కమాట తప్ప. మీకేమయినా వస్తుందా? ఆ ఒక్క మాటకొరకు కొన్ని వేలు దుబారా చేయటంలో అర్ధం ఉందా?
నిశ్చితార్ధానికే ఇంత ఖర్చు చేశారు మీరు. ఈ అట్టహాసం అవసరం అంటారా? ఇంత గొప్పగా ఏర్పాటు చేస్తేనేనా సంతోషం కలిగేది?
"కొన్ని కొన్ని సంసారాల్లో ఇప్పటి ఖర్చుతో రెండు పెళ్ళిళ్ళు సులభంగా చేయవచ్చు. వ్యక్తిగతంగా మనం వాళ్ళకంటే ఏం గొప్ప?
"నాకిదంతా నచ్చదు.
"నీ ఇష్టాయిష్టాలతో నాకేం పని? ఇదంతా నా డబ్బు. నా ఇష్టం నేను ఖర్చు చేస్తాను. చూస్తూ ఆనందించు. అంటారా? మీ ఇష్టం. ఆనందించటం మాట వదిలేస్తే చూస్తూ ఉంటాను.
లేదబ్బాయీ, నీ అభిప్రాయం చెప్పు - అంటారా?
"మళ్ళీ పెళ్ళి ముహూర్తమనీ, అదనీ, ఇదనీ ప్రయత్నాలు వద్దు. ఈ రోజే చాలా బాగా ఉందని శాస్త్రిగారు చెప్పారన్నారు. ఇదే ముహూర్తంలో మా పెళ్ళి జరిగిపోనివ్వండి. ఇంతకంటే శోభాయమానంగా పెళ్ళి జరుగుతుందా? చెప్పండి."
రమణ మాటలు విని అంతా నివ్వెరపోయారు.
"ఇదెక్కడి పద్ధతి?" అన్నారు కొందరు.
"పెళ్ళికోసం ముఖం వాచాడేమో?"
"పెళ్ళాం ముఖం చూడగానే మైకం కమ్మిందేమో?"
"అంతా చిత్రం!"
"విపరీతంగా ఉందమ్మా అబ్బాయి పద్ధతి."
"ఇదీ ఓ పిచ్చేమో?"
"సం-స్క-ర్త!"
రకరకాలుగా అంటున్నారు అంతా.
రమణ అదేమీ పట్టించుకోలేదు.
వెంకయ్య మౌనం వహించిన ఆ అయిదు నిమిషాలలో అంతా అలా మాటాడారు.
వెంకయ్య తేరుకున్నాడు,
"రమణా! నీవు చెప్పింది నిజం. నీ ఇష్టమే కానీ, శాస్త్రిగారూ, ఆశీర్వాదం చేయండి. ఒరేయ్ భజంత్రీలూ వాయించండి. ఇదిగో, వెళ్ళి మాంగల్యం తీసుకొనిరా, శాస్త్రిగారూ, టైము చూడండి. బాగుంది కదా? కార్యక్రమం ముగించండి."
ఇతరులు ఇంక ఏమీ అనటానికి వీల్లేకుండా మరో అయిదు నిమిషాల్లో సరోజ, రమణ భార్య అయింది. అందరికీ ఆశ్చర్యం కలిగించింది వెంకయ్యలో మార్పు.
* * *
నిశ్చితార్ధానికి వచ్చిన బంధు మిత్రులంతా ఆరోజు రాత్రి సుష్టుగా, తృప్తిగా విందు ముగించుకొని, 'వెంకయ్య అదృష్టవంతుడు. ఖర్చు మిగిలించే అల్లుడు దొరికాడు. సరోజ అదృష్టవంతురాలు, యోచనా పరుడైన భర్త లభించాడు. సుఖపడుతుంది' అనుకుంటూ, ఆశీర్వదిస్తూ, వెళ్ళిపోయారు.
అన్న పద్ధతి గోపికి ముందు విడ్డూరంగా అనిపించినా, తర్వాత ఆ పద్ధతిలో, గొప్పతనాన్నీ, దూరదృష్టినీ గమనించి సంతోషించాడు.
ఆ రాత్రికి రమణ అక్కడే ఉండిపోయాడు.
గోపీని కూడా ఉండిపొమ్మన్నారు, కానీ, "పశువులు ఇంట్లో ఉన్నాయి. వాటికి మేతా నీళ్ళూ చూసుకోవా"లని కదిలాడు గోపీ. మనిషిని పంపుతామన్నా అతను వినలేదు.