Home » Vasireddy seeta devi novels » Rabandulu Ramachilukalu


    "అది సరేగాని ధర్మయ్యా! నేనూ ఒప్పుకుంటా, శేఖరం నువ్వన్నట్టు కొన్ని మంచిపన్లే చేస్తున్నాడు. రోడ్డు వేయించాడు. బాగుంది. కరెంటు తెచ్చాడు. చాలా బాగుంది. బడి కట్టించబోతున్నాడు; ఇంకా బాగుంది. కాని హరిజనులకు ఇళ్లు కట్టించ బోతున్నాడట...." చలమయ్య అంటూ ఆగాడు.

 

    "ఏం? అది మాత్రం బాగాలేదా? వ్యంగ్యంగా అన్నాడు పరమయ్య.

 

    "ఆహా! బాగాలేకేం? బేషుగ్గా వుంది. ఊరి నడిబొడ్డుమీద, రావు సాహెబ్ గారి స్థలంలో ఇళ్లు కట్టించబోతున్నాడు" ఎట్లావుంది ఇప్పుడుచెప్పు అన్నట్టు చలమయ్య పరమయ్య ముఖంలోకి చూశాడు.

 

    "నిజంగా? అవ్వ! ఇదెక్కడన్నా వుందా? వాళ్ళనుతెచ్చి వూరి మధ్యలో పెడ్తాడా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు పరమయ్య ధర్మయ్యను చూస్తూ.

 

    ఇంతకాలానికి తనతో పరమయ్య ఏకీభవించి మాట్లాడటం చలమయ్యకు పరమానందాన్ని కలిగించింది.

 

    జానకిరామయ్య విస్తుబోయి ధర్మయ్య ముఖంలోకి చూస్తూ నిలబడిపోయాడు.

 

    "నిజంగా? హరిజనులకు ఇళ్లు కూడా కట్టిస్తున్నాడా శేఖరం?" ధర్మయ్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది.

 

    "నిజమే! రంగన్నను సర్పంచ్ చేసి వాళ్ళకు కొమ్ములు తెచ్చింది నువ్వేగా? వాడే చెప్పాడు. వాళ్ళను తెచ్చి ఊరిమధ్యలో పెడ్తే ఇంకేమన్నా వుందా? ఊరు ఊరంతా ఎంగిలి మంగలమై కూర్చోదూ? ఇప్పటికే వాళ్ళకు కళ్ళు నెత్తికొచ్చినయ్! ఇక మనమాట వింటారా! మనకు గౌరవం యిస్తారా?" అన్నాడు చలమయ్య.

 

    "అవును! మునుపటి గౌరవం యిప్పుడెక్కడుంది? చెట్టుక్రింద కూర్చుని వుంటారా? మనం రోడ్డున పోతుంటే లేవడం కూడా మానేశారు. నడిరోడ్డు మీద మనకెదురుగా నడుస్తున్నారు" అన్నాడు పరమయ్య కాలని చుట్టతో కుస్తీ పడుతూ.

 

    "ఇప్పుడు ఈ శేఖరంగాడి అండచూసుకొని వాళ్ళు మరీ రెచ్చిపోయారు. ఆ శేఖరానికి ఆ మాల గుడిసెల్లో ఏం పని? ఎప్పుడూ అక్కడే వుంటాడు. వాళ్ళను రాసుకుంటూ, పూసుకుంటూ తిరుగుతాడు" అన్నాడు చలమయ్య.

 

    "అవును! ధర్మయ్యా! ఇది మాత్రం బాగాలేదు. కాస్త కుడీ ఎడమా అంటూ వుండాలిగా? వాళ్ళకు ఇళ్ళు కట్టించమను. కాని ఆ కట్టే ఇళ్ళేవో వాళ్ళ గూడెంలోనే కడ్తే పోలా? నువ్వు చెబితే వింటాడు శేఖరం" అన్నాడు జానకిరామయ్య ధర్మయ్య ముఖంలోకి చూస్తూ.

 

    ధర్మయ్య నిట్టూర్చాడు. ఓ క్షణం జానకిరామయ్య ముఖంలోకి చూశాడు.

 

    "జానకిరామయ్యా! నువ్వు కూడా ఇట్లా మాట్లాడతా వనుకోలేదయ్యా! నాతో ఇంతకాలం స్నేహం చేసిన నువ్వు నాకిచ్చే సలహా ఇదా? వాళ్ళూ మనలాంటి మనుషులేగదయ్యా? మనిషిని మనిషి దూరంగా పెట్టడం ఏమిటయ్యా? అంతకంటే అన్యాయం మరొకటి వుందా? మహానాయకులెందరో వేదికలమీద హరిజనులకు జరిగే అన్యాయాల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. గాంధీమహాత్ముని కాలంనుంచీ వింటున్నాం ఈ ఉపన్యాసాలు. కాని నిజంగా వాళ్ళకోసం చేసిందేమిటి? ఎవరో కొద్దిమందిని.... చదువుకొని పెద్ద పదవుల్ని సంపాదించుకున్న వాళ్ళను వదిలేస్తే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఈ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలంలో....వారి జీవితాలలో ఎంత మార్పు వచ్చింది? సంఘంలో వారికి ఇచ్చిన స్థానం ఏమిటి? కులాలు పోవాలని ప్రతివాళ్ళూ వేదికలెక్కి అరుస్తున్నారు.

 

    కాని జరుగుతున్న దేమిటి? విద్య, రాజకీయ విజ్ఞత, డబ్బు, నాగరికత పెరిగినకొద్దీ కులాభిమానం కూడా పెరుగుతూనే వుంది. హరిజన కాలనీ ప్రతి గ్రామంలో కట్టించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా గ్రామాలలో కట్టించారు కూడా. కాని ఎక్కడ? వూరికి దూరంగా! 'హరిజనులు' అనే ముద్రవేసి మరీ కట్టిస్తున్నారు. అంటే గట్టి ఇళ్ళు కట్టించి, ఇప్పుడిప్పుడే నిద్రలేస్తున్న వాళ్ళను 'జో' కొట్టి పది కాలాలపాటు గాఢ నిద్రలో పడేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. ఆ కట్టే ఇళ్ళు ఊళ్ళో ఎందుకు కట్టించరు? దానికి హరిజన కాలనీ అనే పేరు ఎందుకు పెట్టాలి? మనం, మన పిల్లలూ కాకపోయినా, మన పిల్లల పిల్లలయినా కలిసి మెలిసి బతికే ఏర్పాట్లు ఎందుకు చెయ్యకూడదు?" ధర్మయ్య ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు.

 

    "ఇదిగో! ధర్మయ్యా! నువ్వెన్నన్నా చెప్పు! ఈ విషయంలో మాత్రం మేము ఒప్పుకోం! షావుకారు రామయ్య యిది విని కారాలు మిరియాలు నూర్తున్నాడు. శేఖరం సర్పంచ్ గా ఎట్లా వుంటాడో చూస్తానంటున్నాడు. బోర్డు మెంబర్లు ఎవరూ ఒప్పుకోరు. శేఖరాన్ని ఆ పదవి నుంచి తొలగించమని పిటీషను పెడతాం!" తను కూడా పంచాయితీ బోర్డు మెంబర్నేననే విషయాన్ని ధర్మయ్యకు గుర్తుచేస్తూ అన్నాడు చలమయ్య.

 

    ధర్మయ్య తెల్లబోయి చూశాడు.

 

    "అవును ధర్మయ్యా! శేఖరానికి చెప్పు! అన్ని ఊళ్లలో కట్టినట్టే మన ఊళ్లోనూ వాళ్ళకు ఊరిబయట ఇళ్ళు కట్టమని చెప్పు! మన ఒక్క ఊళ్ళో వాళ్ళను మధ్యలో తెచ్చిపెట్టి ఉద్దరించే దేముంది? అయినా ఇది జరిగేదా పెట్టేదా? అనవసరంగా కక్షలు పెంచడమే అవుతుంది" అన్నాడు పరమయ్య.

 

    "అవును ధర్మయ్యా! గుర్తుచేసుకో! ఆరేళ్ళకిందట ఏం జరిగింది? గిరిజనగూడెంలో నీళ్ళులేవని నీ ప్రోత్సాహంతోనే రంగన్న బావిలో చేద వేశాడు. దాంతో ఊరు ఒక రణరంగం అయింది. ఎంతమంది తలలు పగిలాయి? చివరకు నష్టపడింది ఎవరు?" అన్నాడు జానకిరామయ్య.

 

    ధర్మయ్య ఆలోచనలో పడ్డాడు.

 

    "సరే! చూద్దాంలే! శేఖరం వచ్చాక మాట్లాడతాను" ధర్మయ్య ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు.

 

    చలమయ్య కళ్లలో గర్వం తొణికిస లాడింది. పరమయ్య ముఖం విజయగర్వంతో గంభీరంగా మారింది.

 

    "నే వస్తా!" అంటూ ధర్మయ్య నీరసంగా ముందుకు కదిలాడు.

 

    నాలుగడుగులు ముందుకువేసి ఆగి వెనక్కు చూశాడు.

 

    ముగ్గురూ చెట్టుకింద నిలబడివున్నారు.

 

    "జానకిరామయ్యా నువ్వింటికి పద! నేనిప్పుడే వస్తాను" అన్నాడు ధర్మయ్య.

 

    "అక్కడికే బయలుదేరానులే!" అన్నాడు జానకిరామయ్య.

 

    ధర్మయ్య ముందుకు నడిచాడు. మనసులో ఆవేదనగా వుంది.

 

    వీళ్ళు అన్నంతపనీ చేస్తారు. ఆ షావుకారు రామయ్యకు శేఖరంమీద అసలే కోపంగావుంది.అందరికంటే ముందు సపోర్టుచేసి, ఇప్పుడు దించటానికి ప్రయత్నిస్తున్నాడు. అల్లుణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాడు. అది జరిగేది కాదని తెలుసుకొని, శేఖరం మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఆ రామయ్యకు వంతపాడటానికి ఈ చలమయ్య ఒకడు! శేఖరం కొద్దికాలంలోనే ఎన్నో మంచిపనులు చేసి బోర్డు మెంబర్ల అభిమానాన్ని పొందాడు. కాని ఈ విషయంలో మాత్రం ఎవరూ శేఖరంతో మాత్రం ఏకీభవించరు.

 

    అసలు శేఖరం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం తనేగదా? ఒకసారి మాటల సందర్భంలో శేఖరంతో అన్నాడు తను__ "హరిజనుల సంక్షేమంకోసం ఇదిచేస్తున్నాం, అదిచేస్తున్నాం, అంటూ వాళ్లను ఊరికి బయట పదిలమైన ఇళ్ళు కట్టించి స్థిరంగా హరిజనులుగానే వుండే ఏర్పాట్లు చేస్తున్నాం! అటువంటి పరిస్థితులల్లో వాళ్లు తాము హరిజనులం అనే విషయాన్ని మర్చిపోలేరు. ఇక అగ్రవర్ణాల వాళ్ళేం మర్చిపోతారు?" అని తను శేఖరంతో చాలాసార్లు అన్నట్టు గుర్తు.

 

    మళ్ళీ తనే శేఖరంతో ఆ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాలా?

 

    ధర్మయ్య ఊపుగా నడుస్తూ పోస్టాఫీసు చేరుకున్నాడు.


                                                                              9


    కాలేజీ ఆవరణ రంగురంగుల కాగితాలతో అలంకరించబడింది.

 

    ఆడిటోరియం బాగా అలంకరించబడింది.

 

    ఆడపిల్లలు రంగురంగుల దుస్తుల్లో, రకరకాల దుస్తుల్లో, కొత్త కొత్త అలంకరణలతో సీతాకోక చిలకల్లా గాలిలో తేలిపోతున్నట్లు తిరుగుతున్నారు. అబ్బాయిలు కొందరు బెల్ బాటమ్స్ తో, పెంచిన జుట్టుతో అమ్మాయిలను అనుకరిస్తున్నట్టు కన్పిస్తున్నారు. కొందరు కుర్రాళ్ళు టైట్ ప్యాంట్లలో, మరికొందరు ఫుల్ సూట్లలో అమ్మాయిలను ఆకర్షించే ప్రయత్నంలో వాళ్ళను రాచుకొంటూ తిరుగుతున్నారు. కొందరు కుర్రాళ్ళు ఏదోవంకతో అమ్మాయిల్ని పలకరిస్తున్నారు. కొందరు ఆడపిల్లలు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూనే ఓర చూపులు చూస్తున్నారు.

 

    ఆడపిల్లల ఓర చూపుల్ని చిరునవ్వులతో అందుకుంటున్నారు మగపిల్లలు.

 

    పరువంలో వున్న మనసులు పందెపు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి.

 

    ఉరవళ్లు పరవళ్లు తీస్తున్న యవ్వనం, కొండరాళ్ళ మీదనుంచి జలజల ప్రవహించే జలపాతాన్ని గుర్తు చేస్తోంది. ఆ వాతావరణం ఇంద్రధనస్సు విసిరినట్టుంది. విద్యుత్ లా కళ్ళను చెదరగొడుతున్నది.

 

    సునంద పాటతో కాలేజే వార్షికోత్సవం ప్రారంభం అయింది.

 

    తెర లేవగానే విద్యార్ధి ప్రేక్షకులనుంచి పిల్లికూతలూ, ఈలలూ వినిపించాయి.

 

    సునంద నిర్భయంగా, నిర్లక్ష్యంగా ఓసారి అందర్నీ కలియ చూసింది. పాట ప్రారంభించింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra