Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 13


    "ఇంత మంచి సాంఘిక వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్న మనం ఇప్పుడు చిరంజీవి మన చేయి జారిపోకుండా చూడాలి. అందుకు ఎలాంటి త్యాగాలయినా చేయాలి. మీ 'జాలీ లైఫ్' క్లబ్ సెక్రటరీయే మీ నియమాలకు వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుని జీవితం గడుపుతుంటే మీరు దానికి వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేస్తారని ఎవరయినా అడిగితే ఏం చెప్పగలం?"
    "అవును" అంటూ అరిచారు ఇద్దరు ముగ్గురు.
    జాకబ్ మరికొద్దిసేపు మాట్లాడి కూర్చోగానే ఈశ్వరరావు లేని నిలబడ్డాడు. "డియర్ ఫ్రెండ్స్! మనం ప్రారంభించిన ఈ సాంఘిక ఉద్యమంలో అంతిమ విజయం మనదేనని ఢంకా కొట్టి చెప్తున్నాను. నాకు ఇప్పుడే అందిన సమాచారాన్ని బట్టి చిరంజీవి ఇవాళ సాయంత్రం సంగీత అనే అమ్మాయిని ఏడు గంటలకు కృష్ణా ఓబరాయ్ హోటల్లో డిన్నర్ కి ఆహ్వానించాడు. వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు.
    "హాయ్" అంటూ పలుకరిస్తుందా అమ్మాయి.
    "హాయ్" అంటాడు చిరంజీవి.
    ఇద్దరూ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుంటారు.
    ఆ అమ్మాయి అతని కళ్ళలోకి చూస్తుంది.
    అతను ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తాడు.
    ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటారు.
    "యూ ఆర్ బ్యూటిఫుల్" అంటాడతను.
    ఆమె సిగ్గుపడుతుంది.
    "థాంక్యూ" అంటుంది.
    "అసలు మీరు దేవలోకంలో ఉండవలసినవారు" అంటాడతను.
    "మీరు మరీ పొగిడేస్తున్నారు"
    "లేదు సంగీతా! మిమ్మల్ని వర్ణించటానికి మాటలు చాలక ఆ మాట అన్నాను. నిజానికి మీరు అంతకన్నా కూడా ఎక్కువ."
    "అహో" అంటూందామె ఇంకా సిగ్గుపడిపోతూ.
    ఆమె సిగ్గుపడిపోయిందంటే అతను మరీ ఎట్రాక్ట్ అయిపోతాడు.
    అలాంటి అందాలరాశిని చప్పున గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది.
    "సంగీతా!" అంటాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని.
    "చిరంజీవి!" అంటుందామె అదే ప్రథమ స్పర్శ అన్న ఫీలింగ్ కలిగిస్తూ.
    "సంగీతా! ఆహా!" అంటాడు మనోడు తన్మయత్వంతో.
    "నాకేమిటోగా వుంది. వళ్ళంతా తేలిపోతున్నట్లుంది, చేయి వదిలేసెయ్ అంటుంది.
    చిరంజీవి మరింత గట్టిగా ఆమె చేతిని పట్టుకుంటాడు.
    చేతిని పెదాలకు హత్తుకుంటాడు.
    ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది.
    "హా!" అంటుంది.
    "అయ్ లవ్ యూ సంగీతా" అంటాడు గుసగుసలాడుతున్న ధోరణిలో.
    "అయ్ లవ్ టూ యూ" అంటుంది రహస్యంగా మాట్లాడుతున్నట్లు.
    బేరర్ వాళ్ళు ఆర్డరిచ్చిన అద్భుతమైన వంటకాలు తెచ్చి వాళ్ళ ముందుంచుతాడు.
    "ప్లీజ్! తీసుకో సంగీతా" అంటాడు తనే ఇద్దరికీ వడ్డిస్తూ.
    ఇద్దరూ తినటం ప్రారంభిస్తారు.
    రుచికరమైన భోజనం ఇద్దరికీ మరింత మత్తు కలిగిస్తుంది.
    వెన్నెల్లో ఫామ్ హౌస్ కి వెళ్తారు. చేతులు పట్టుకుని పూలమొక్కల మధ్య తిరుగుతారు.
    "వెన్నెల ఎంత అందంగా వుంది" అంటుందామె.
    "అయినా నీ అందం ముందు వెలవెలాపోతోంది" అంటాడతను.
    "ఊ!" అంటుందామె గారంగా.
    "ఊ!" అంటాడతను టీజింగ్ గా.
    హఠాత్తుగా అతని చేయి ఆమె నడుము చుట్టూ కొండచిలువలా తిరుగుతుంది.
    ఆమె భయం, సిగ్గు నటిస్తూ చూస్తుంది.
    అతని కౌగిలి బిగుసుకుంటుంది.
    "సంగీతా!" అంటాడు మత్తుగా.
    "చిరంజీవి!" అంటుంది ఇంకో లోకంలోకెళ్ళిపోతూ.
    "మనం పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా సంగీతా?" అడుగుతాడతను.
    "ఊ!" అంటుందామె "కానీ...."
    "కానీ...? ఎందుకు సంగీతా కానీ అన్నావ్? నేనేదయినా భరించగలనుగానీ ఈ కానీలను భరించలేను సంగీతా" అంటాడతను.
    "మీ కులం వేరు, మా కులం వేరు"
    "హ! కులాలు. నేనీ కులాలు, మతాలను ఎప్పుడూ పట్టించుకోను సంగీతా. మానవులంతా ఒక్కటే. మానవ రక్తం అంతా ఒక్కటే అని పాడుకోవటం నా హాబీ."
    "కానీ...." అంటుందామె మళ్ళీ.
    "ఏమిటి మళ్ళీ కానీ?"
    "నేను సినిమా స్టార్ నవ్వాలని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్న పద్యం అప్పర్ కేజీలో చదివినప్పటినుంచి కలలు కంటున్నాను. నా కలలు నిజం చేస్తావా చిరంజీవి?"
    "దేవతా! నీ కోసం మొత్తం సినిమా ఫీల్డ్ నే నీ పాదాల చెంతకు తెస్తా" అంటాడతను.
    "అయితే రేపే మన పెళ్ళి" అంటుందామె.
    దాంతో మర్నాడు ఠకీమని పెళ్ళయిపోతుంది" తన ఇమేజినేషన్ ముగించాడు ఈశ్వరరావు.
    అందరూ అతని ఇమేజినేషన్ లో నుంచి బయటపడ్డారు.
    "కనుక మనం ఈ పెళ్ళి ఆపాలంటే ఇవాళ సాయంత్రం వాళ్ళిద్దరూ కృష్ణా ఓబరాయ్ లో కలుసుకోకుండా ఆపాలి" అన్నాడతను.
    "ఎలా ఆపుతాం?" అడిగాడు జాకబ్.
    "అదే మనం ప్లాన్ తయారుచేయాలి"
    అందరూ ఆలోచనలో పడ్డారు.
    "ఆ వచ్చింది. బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది" అన్నాడు రాజు.
    "ఏమిటది?" కుతూహలంగా అడిగారందరూ.
    "మన హైద్రాబాద్ లో తేలిగ్గా సృష్టించగల అవరోధం ఒకటుంది. అదేమిటంటే ట్రాఫిక్ జామ్. చిరంజీవి కారుని ఎక్కడోచోట ఇరికించి ట్రాఫిక్ జామ్ చేసిపారేశామంటే అపాయింట్ మెంట్ తప్పిపోతుంది. ఆ పిల్ల చూసి చూసి వెళ్ళిపోతుంది. పెళ్ళి గోవిందా" ఆనందంగా చెప్పాడు అతను.
    "ఊహూ! ప్రేమికుల మనస్తత్వం నీకింకా తెలిసినట్లు లేదు. ప్రియురాలిని కలుసుకోడానికి వాడెవడో రాజు కోట గోడ మీద వేలాడుతున్న పాముని చూసి తాడనుకుని దానిని పట్టుకుని గోడ దూకి వెళ్ళాడట. కనుక ఆ రకంగా ఆపటం ఇంపాజిబుల్" అన్నాడు జాకబ్.
    ఆ ఇద్దరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు.
    "నాకో అద్భుతమైన ఐడియా వచ్చింది" అన్నాడు ఈశ్వరరావు.
    "చిరంజీవి ఫ్రెండ్స్ ద్వారా చిరంజీవిని మధ్యాహ్నం నుంచే మందు కొట్టించడం మొదలుపెట్టిస్తే సాయంత్రానికల్లా పూర్తిగా అవుటయిపోతాడు. అక్కడ ఆ పిల్ల మనవాడికోసం ఎదురుచూసి కోపం వచ్చి ఇంకొక ప్రియుడిని వెతుక్కుంటుంది."
    "వండర్ ఫుల్ ఐడియా" అన్నాడు జాకబ్.
    "కాకపోతే దీనికో చిన్న డిఫెక్ట్ వుంది" అన్నాడు రాజు.
    "ఏమిటది?"
    "సాయంత్రం ఆ ప్రోగ్రాం వుందన్న విషయం చిరంజీవి చస్తే మర్చిపోలేడు. ఎందుకంటే ప్రేమలో పడటం అనే ఫీలింగ్ అలాంటిది. అంచేత తాగమన్నా చస్తే తాగనని మొరాయించే ప్రమాదం వుంది."

 Previous Page Next Page