Previous Page Next Page 
తృప్తి పేజి 13


    వర్ధనమ్మగారికి జ్వరమని తెలిసి ఆవిడ గదిలోకెళ్ళి పలుకరించి వచ్చింది. కావేరితో కబుర్లు చెప్తూ గోంగూర వలిచి పెట్టింది. ఆ తర్వాత అక్కగారికి వంటలోనూ, బట్టలు ఉతకడంలోనూ ఆ తర్వాత ఇల్లు సర్దడంలోనూ సహాయం చేసింది. ప్రభ గోంగూర పచ్చడి తీసుకుని 'మార్నింగ్ షోకి వెళ్ళాలి" అంటూ వెళ్ళిపోయింది.
    భోజనాలయ్యాక "వెళ్ళొస్తానక్కా. కాసేపు నిద్రపోకపోతే హాలిడే వేస్ట్ అయిపోతుందనిపిస్తుంది" అంది.
    అప్పుడే వెళ్ళిపోతావా? సాయంత్రం బావగారు దింపుతార్లే" అంది కావేరి.
    "నిన్నైతే ఒక్కపూట కూడా పంపరుగానీ గొప్ప బావగారే" అంది కినుకగా యమున.
    "నే వెళ్ళమనే అంటానోయ్, కాని మీ అక్కే రాదు. అయినా నీకిప్పుడే తెలీదులే! రేపు పెళ్ళయ్యాక మా ఆయన ఒక్కపూట కూడా పంపరక్కా. నే లేకపోతే ఆయనుండలేరు అంటూ కబుర్లు చెప్తావు" అన్నాడు.
    "ముందు నువ్వో పెళ్ళి కొడుకుని చూడ్రా! తరువాత చూద్దాం ఎన్ని కబుర్లు చెప్తుందో" అన్నారు వర్ధనమ్మగారు.
    "అమ్మో! ఈ నల్లబంగారానికి సంబంధాలు చూడ్డమంటే మాటలా! ఎన్ని చెప్పుల జతలు అరిగిపోవాలో" అంటూ ఉడికించాడు మరదల్ని.
    "మా చెల్లెలికేంటి కుందనపుబొమ్మ" అంటూ వెనకేసుకొచ్చింది కావేరి.
    "చిన్న సవరణ. కుందనపు కాదు చందనపు" అంటూ పక్కనే పూజ ఆడుకునే సామాన్లలోంచి నల్లచందనపు బొమ్మని తీసి చూపించాడు.
    "అక్కా చూడు" అంది రోషంగా యమున.
    "అవును మరదలా! ఈ మధ్య ట్యాంక్ బండ్ మీద ఎందుకు కూర్చుంటున్నావు? అటునుంచి వచ్చేటప్పుడల్లా అడుగుదామనుకుని మళ్ళీ ఎవరి కోసమో ఏమోలే అని వచ్చేస్తున్నాను" అన్నాడు.
    బావగారి ప్రశ్నకి గుండె గుభేలుమంది యమునకి. మొహం వివర్ణమయి పోయింది. "ఒళ్ళో ఏదో పుస్తకం పెట్టుకుని ఘంటంతో రాస్తున్నావు కూడా" అన్నాడు నవ్వుతూ.
    "పోదురూ బడాయి! మీ బావగారు చెప్తున్నది నల్లరాయి మొల్లవిగ్రహం గురించే" అంది కావేరి కూడా నవ్వుతూ. బావగారంటున్నది అర్థమయ్యాక "అమ్మయ్యా!" అనుకుని గుండె కుదుటపరుచుకుని తనూ నవ్వేసింది యమున.
    "ఆ విగ్రహమంత అందంగా వుంటే అంతకన్నా కావాల్సిందేముంది బావగారూ" అంటూ ఇంకో అరగంట కూర్చుని ఇంటికి బయల్దేరింది యమున.


                                            *    *    *    *


    గులాబీరంగులో వుండే పెదవులకి ఎర్రని లిప్ స్టిక్ వేసింది సింధు. జుట్టంతా పైకి దువ్వి ఫ్రెంచ్ స్టైల్లో ముడిపెట్టింది. పచ్చని ఆమె శరీరచ్ఛాయకి ఆమె వేసుకున్న ఎర్రటి జాకెట్టు. ఎర్ర అంచు తెల్లపట్టుచీర మరింత అందాన్నిస్తోంది.
    "అమ్మా! ఈ ఎర్రగులాబీ పక్కకి పెట్టుకోండి" అంటూ తెచ్చిచ్చింది చిట్టెమ్మ.
    "ఓ! థాంక్యూ" అంటూ అందుకుంది సింధు.
    "కనకాంబరాలు సిగచుట్టూ పెట్టుకో!" చెప్పాడు అరుణ్.
    "నో! మోటుగా ఉంటుంది. ఈ ఒక్క గులాబీ పెట్టుకుంటాను" అంది.
    అరుణ్ లేచి బైటికొచ్చాడు. దూరంగా ఒక పెంకుటిల్లుంది ఆ సందులో. ఆ ఇంటిముందో అమ్మాయి సందె గొబ్బెమ్మలు పెడ్తోంది. ప్రతిరోజూ ఆఫీస్ నుండొచ్చేటప్పుడు చూస్తాడా అమ్మాయిని. పొడుగాటి జడ వీపు మీంచి ముందుకు పడ్తుండగా లంగా ఓణీలో ముందుకు వంగి ముగ్గు పెడ్తుంటుంది. ఆ జడలో అప్పుడే విచ్చుకుంటున్న చమేలీ పువ్వులు కిలకిలా నవ్వుతుంటాయి. ఆ అమ్మాయి మొహమెలా ఉంటుందో తనకి తెలియదు. కానీ ఆ అమ్మాయిని చూడగానే "కృష్ణశాస్త్రి ఊర్వశి", "విశ్వనాధవారి కిన్నెరసాని" "బాపు సీత" "నండూరివారి ఎంకి" గుర్తుకొస్తారు. మనసంతా ఆహ్లాదంగా మారిపోతుంది.
    అసలు పెళ్ళిచూపుల్లో సింధూరని చూడగానే తన హృదయం లయతప్పి వేగంగా కొట్టుకోవడానికి కారణం ఆమె ముక్కున 'తళుక్కుమని' మెరిసిన ఒంటిరాయి ముక్కుపుడక, ఆర్గండీ చీరలో తలలో మల్లెపూలతో అరవిచ్చిన మొగ్గలా ఉంది. అక్కా, అమ్మ, బావగారూ ఆమె ఉద్యోగం, చదువు, తెలివితేటలూ, తండ్రి హోదా మెచ్చుకున్నారు. కానీ తను మాత్రం ఆమెనే ఇష్టపడ్డాడు. ఆమె అందం, ఆమె కంఠం, ఆమె నడక, ఆమె నవ్వు అన్నీ ఇష్టపడ్డాడు. అభిరుచులు కూడా కలిస్తే తమ దాంపత్యమంత మధురమైనది మరొకటుండదనుకున్నాడు. తాంబూలాలు పుచ్చుకున్నాక ఇద్దరూ కలసి సినిమాకెళ్ళారు. తను "దో ఆంఖే బారా హాత్" కెళ్దాం అన్నాడు. సింధు "స్టార్ వార్స్" కెళ్దాం అంది. ఆమె ఇష్టానికే ప్రాముఖ్యతనిచ్చాడు.
    "గోపి హోటల్లో ఇడ్లీ కారప్పొడి ఫేమస్" అన్నాడు.
    "షాన్ బాగ్ లో పావుబాజీ" తిందామంది. సరేనన్నాడు.
    రవీంద్రభారతిలో "రక్తకన్నీరు" నాటకం చూద్దామన్నాడు.
    "నయం! చింతామణి నాటకానికెళ్దామన్నావు కాదు" అంటూ నవ్వింది.
    అందులో నవ్వడానికేముందో తనకి అర్థంకాలేదు. కానీ ఆ నవ్వులో వెన్నెలంత సుఖముందని మాత్రం తెలుసుకున్నాడు. ఆ నవ్వు జీవితాంతం తన స్వంతమని మురిసిపోయాడు. "తుషార శీతల సరోవరానా... అంటూ పాడితే ఇంక భోజనం లేకపోయినా ఆ పాట వింటూ బ్రతికేయొచ్చు అనుకున్నాడు.
    పెళ్ళయ్యాక "భీమ్లీ" వెళ్దామన్నాడు "చలం హంపీ కన్యలు" గుర్తుకు తెచ్చుకుని.
    "లేదు. గోవా వెళ్దాం" అంది.
    పెళ్ళయిన తర్వాత మొదటిసారడిగాడు "సాగర సంగమం' సినిమాకెళ్దామని. "ప్లీజ్ అరుణ్ సినిమాకెళ్దామని మాత్రం అడక్కు. మూడుగంటలు కుర్చీ కతుక్కుపోయి కూర్చుని టైమ్ వేస్ట్ చేసుకోవడం నాకో పనిష్మెంట్ లా ఉంటుంది" అని తప్పించుకుంది. తను మళ్ళీ సినిమాకెళ్దామని ఎప్పుడూ ప్రపోజ్ చెయ్యలేదు. పెళ్ళికాకముందు ఒక్కడూ పెళ్ళినాటి ప్రమాణాలు, మరో చరిత్ర, అభిమాన్, దేవదాసు లాంటి మంచి సినిమాలు చూసినప్పుడూ "అదరజ్ కే పంజే' లాంటి నాటకాలు చూసినప్పుడు పెళ్ళయ్యాక భార్యకివన్నీ చూపించాలి. ఆమెతో కలసి ఈ ఆనందాన్ని పంచుకోవాలి అనుకునేవాడు. 'బారిష్టరు పార్వతీశాన్నీ', 'గణపతినీ', కంఠాభరణాన్నీ', 'జ్ఞానదనీ' భార్యతో కలసి చదివి చర్చించాలి అనుకునేవాడు. వెన్నెల డాబామీద కురుస్తుండగా అర్ధాంగి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని "కొండగాలి తిరిగింది.... గుండె ఊసులాడిందీ" అని పాడుతూ మైమరచిపోవాలని కలలు కన్నాడు. ఆమె పుట్టింటికెళ్తే "తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవీ' అంటూ జాబులు రాయాలనుకున్నాడు.

 Previous Page Next Page