ఇంతలో "ఫుడ్" వచ్చింది.
సగం రొట్టి తిని ఊరుకున్నాడు కృష్ణాజీ.
రాజా మాత్రం సుష్టుగా లాగించేశాడు.
కాఫీ వచ్చింది.
"ఎక్స్ ట్రా షుగర్" వేసుకుని తాగాడు రాజా.
తర్వాత జేబులోనుంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు. ఒక సిగరెట్ తీసి పెదిమల మధ్య పెట్టుకున్నాడు. అతని చేష్టల్లో ధిక్కారం కనబడుతోంది.
అగ్గిపెట్టి తీసి, పుల్ల వెలిగించి, సిగరెట్ అంటించబోతూ, కృష్ణాజీ మొహంలోకి చూశాడు రాజా.
రాజా వేపే చూస్తున్నాడు కృష్ణాజీ.
కానీ ఏమీ అనలేదు.
కనీసం అతని మొహంలో కోపం, అభ్యంతరం కూడా కనబడటం లేదు.
కానీ....
కానీ....
కృష్ణాజీ కళ్ళలో కనబడుతున్న అంతుబట్టని భావం అదేదోగానీ, రాజాని కట్టిపడేసింది.
నెమ్మదిగా పెదిమల మధ్య ఉన్న సిగరెట్ తీసి, యాష్ ట్రేలో పడేశాడు రాజా.
"అయ్యిందా?" అన్నాడు కృష్ణాజీ.
"నేను రెడీ" అని లేచి నిలబడ్డాడు రాజా. హఠాత్తుగా తిక్కరేగినట్లయింది అతనికి. పెద్ద గొంతుతో అరుస్తున్నట్లు మాట్లాడటం మొదలుపెట్టాడు.
"నన్ను పట్టుకోవడం వల్ల మీకు ఒరిగేదేం వుంది? నీతి, నిజాయితీ, న్యాయం, దర్మం అని మీకు అంత పట్టింపు వుంటే మినిస్టర్లలో ముప్పాతిక మందిని జైల్లో పెట్టాల్సిందేగా! వాళ్ళందరినీ వదిలి నా బతుకు నేను బతుకుతున్న నన్ను పట్టుకుని హరాస్ చేస్తారెందుకని? పెద్దవాళ్ళ మీదికెళ్ళడానికి మీకు దమ్ముల్లేకనా? మంచిగా బతకబోతే మంచినీళ్ళు కూడా పట్టవు ఈ లోకంలో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకే గనక మొగతనం వుంటే పొలిటీషియన్స్ మీదకి పోండి ముందు! కడుపు నిండిన వాళ్ళు చేసే దొంగతనాలు అవి. కాలే కడుపు కోసం చేసే చిన్నచిన్న దొంగతనాలు మావి. ఎందుకొచ్చిన న్యాయం ఇదీ" అన్నాడు గట్టిగా.
బార్ లో ఉన్న వాళ్ళందరూ తిరిగి, వీళ్ళిద్దరినే చూస్తున్నారు.
రాజా ఒక పోలీసాఫీసరుతో అంత రూడ్ గా మాట్లాడడం చూస్తున్న బార్ మేనేజరూ, స్టివార్డ్స్, బేరర్లూ అందరూ చేష్టలుడిగి చూస్తూ నిలబడిపోయారు.
పోలీసులతో పోట్లాట ఎక్కడికి దారితీస్తుందో వాళ్ళకి తెలుసు.
రాజా అంటే వాళ్ళందరికీ అభిమానం వుంది.
రాజాకి ఏమన్నా జరిగితే వాళ్ళు భరించలేరు.
అలాగని, నేరుగా ఈ పోలీసాఫీసరుతో వైరం పెట్టుకోలేరు కూడా!
ఏం చెయ్యాలో పాలుపోక, అలాగే చూస్తూ వుండిపోయారు వాళ్ళందరూ.
లేచాడు కృష్ణాజీ.
అక్కడున్న అందరూ అనుకున్నారు.
ఇంక రాజా పని మూడింది.
ఈ 'టైగరు కృష్ణాజీ' రాజని చావచితక కొట్టేస్తాడని!
మరుక్షణంలో రాజా నెత్తిమీదా, వీపు మీదా దబదబ గుద్దులు పడ్డాయి.
కానీ ఆ దెబ్బలు కృష్ణాజీ కొట్టలేదు.
శని దేవతకి సొంత తమ్ముడిలా కనబడుతున్న ఒక మనిషి, వీరావేశంతో రాజాని పిడి గుద్దులు గుద్దుతున్నాడు. కోపం చల్లారక మోచేత్తో రాజా డొక్కలో పొడిచాడు. పిడికిలి బిగించి పళ్ళన్నీ రాలిపోయేటట్లు రాజా మొహం మీద కొట్టబోతుండగా, బలంగా అతని చేతిని పట్టుకుని ఆపేశాడు కృష్ణాజీ.
రొప్పుతూ, మొహానికి పట్టిన చెమటని మోచేత్తో తడుచుకున్నాడు ఆ మనిషి.
"వదలండి సార్! ఈడ్ని ఇవాళ ఖూనీ చేసెయ్యాలి. అయ్య బాబోయ్! ఎన్ని గుండెలండీ ఈ నంజి కొడుక్కి! మిమ్మల్నే అన్ని మాటలంటాడా?" అని, కాలితో రాజాని ఒక్క తన్ను తన్నాడు ఆ మనిషి.
ఆ దెబ్బకి తూలాడు రాజా. అతి కష్టం మీద టేబుల్ మీద చేతులు ఆనించి, తనని తాను బాలన్స్ చేసుకున్నాడు. కానీ ఆ ఇంపాక్ట్ కి టేబుల్ మీద వున్న వాటర్, జగ్గూ, గ్లాసులూ, ప్లేట్లూ కిందపడి భళ్ళున పగిలిపోయాయి.
"ఇదిగో! ఓ మనిషీ!" అన్నాడు కృష్ణాజీ కోపంగా. "ఇంకొక్కసారి నీ చెయ్యిగానీ, కాలుగానీ ఆ కుర్రాణ్ణి తాకిందా, ఆ చెయ్యో కాలో నేను తీసేస్తాను."
అదిరిపడి ఆగిపోయాడు ఆ మనిషి.
"అయ్యబాబోయ్! అదేటండీ! వీడు మిమ్మల్ని పబ్లిక్ ప్లేసులో పబ్లిగ్గా అట్టా తిట్టేస్తుంటే నా గుండె మండిపోదండీ! ఈ నా కొడుక్కి...."
"నువ్వెవరు?" అన్నాడు కృష్ణాజీ కరుగ్గా.
"అయ్యబాబోయ్! నేనాండీ! నేను ఈడి బాబునండీ! నిజంగానే ఈడ్నా కొడుకండి!"
ఆశ్చర్యంగా వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూశాడు కృష్ణాజీ.
ఈ రాజా ఈ నికృష్టుడి కొడుకా?
తండ్రీ కొడుకుల్లో ఎంత తేడా?
రాజా మొహం చూస్తే దైవాంశ సంభూతుడిలాగా వున్నాడు.
రాజా తండ్రినని చెప్పుకుంటున్న ఈ మనిషి రాక్షసుల తాలూకు రిప్రజెంటేటివ్ లాగా వున్నాడు.
"ఏమిటి? ఇతను చెబుతున్నది నిజమేనా?" అన్నాడు కృష్ణాజీ, రాజాతో.
"ఈయన మా నాన్న కాడు!" అన్నాడు రాజా.