తెగులు వాచకము
మా నిర్భయ్ నగర్ కాలనీలో రాజకీయ కల్లోలం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొన్ని రోజులపాటు కాలనీలో మీటింగులూ, హడావుడులూ లేకుండా కాలనీని ప్రశాంతంగా ఉంచమని కాలనీ వాళ్ళు చాలా మంది ఆర్గనైజింగ్ సెక్రెటరీ శాయిరామ్ ని అభ్యర్థించారు. అలాగేనని శాయిరామ్ వారికి హామీ ఇచ్చాడు గానీ- అలా ఏ కార్యక్రమమూ లేకుండా కాలనీని ప్రశాంతంగా ఉంచటం అతనికేంమాత్రం నచ్చలేదని అతని మొఖ కవళికలు చెప్తూనే ఉన్నాయ్.
కాలనీ రెండు రోజులు నిజంగానే ఎలాంటి గొడవలూ లేకుండా గడచిపోవటం చూసేసరికి నాకే ఆశ్చర్యం కలిగింది. ఆ రెండు రోజులూ శాయిరామ్ చాలా అశాంతిగా కాలనీలో ఒంటరిగా రాత్రి పొద్దుపోయే వరకు తిరగటం కిటికీ సందుల్లోంచి గమనించాను.
ఇంకేం ఫరవాలేదనీ, శాయిరామ్ ఆ ప్రశాంతతకు అలవాటు పడిపోయాడనీ కనుక ఇంకేమి డిస్టర్బెన్స్ ఉండదనీ నమ్మకం కలిగాక- నా కిష్టమయిన మంచి నవలలు లైబ్రరీ నుంచి తెచ్చుకున్నాను రోజూ- చదువుకోడానికని!
ఆ రోజు ఆదివారం.
"అందమయిన నిశ్శబ్దం" అనే నవల నాలుగు పేజీలు చదివానో లేదో- హఠాత్తుగా బయట కేకలు వినిపించినయ్. కాలనీ వాళ్లందరూ పరుగెడుతున్న చప్పుడు! గుండె ఝల్లుమంది.
కాలనీలో మళ్ళీ ఏదో అవాంతరం ముంచుకొచ్చిందని తేలిపోయింది. అయినా పట్టించుకోకుండా నవల చదవడానికి ప్రయత్నించాను గానీ- మా తలుపు పగలగొట్టినంతగా బాదటం- వినిపించేసరికి వెళ్ళి తలుపు తెరవక తప్పలేదు. గోపాల్రావ్ నిలబడి ఉన్నాడక్కడ.
"త్వరగా పద! యాదగిరి పిలుస్తున్నాడు!" అన్నాడు.
"ఏం జరిగింది?"
"ఏమో తెలీదు? అర్జంటుగా అందరినీ పిలుచుకురమ్మన్నాడు."
ఇంక తప్పదని అతనితో బయల్దేరాను.
అప్పటికే ఆడా మగా, పిల్లా, పీచూ అందరితో కిక్కిరిసిపోయిందా ప్రాంతమంతా!
మధ్యలో శాయిరామ్, రంగారెడ్డి, జనార్ధన్ నిలబడ్డారు. వాళ్ళ రెండో అబ్బాయ్ ఉండుండి ముక్కుతుడుచుకుంటూ, జారిపోతున్న నిక్కరుని ఓ చేత్తో పైకి లాక్కుంటున్నాడు. చాలా భయంగా, ఆందోళనగా కనబడుతున్నాయ్ వాడి చిన్నారి ముఖంలో.
శాయిరామ్ మైక్ ముందుకొచ్చి నిలబడ్డాడు.
"సోదర సోదరీమణులారా! నిజానికి వారం రోజుల పాటు కాలనీని ప్రశాంతంగా ఉంచాలని చాలా మంది నన్ను హెచ్చరించారు! వారి కోరిక నెరవేర్చాలనే నేనూ ప్రయథ్నిమ్చాను౧ కానీ ఇంతలో ఇదుగో! యాదగిరికో విషమ సమస్య ముంచుకొచ్చింది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే ఆ సమస్యేమిటో చెప్తాను" అన్నాడు ఆనందంగా.
అంతా నిశ్శబ్దం అలుముకుంది. శాయిరామ్ యాదగిరి కొడుకుని ఎత్తుకుని స్టేజి మీద మైకు ముందు నిలబెట్టాడు.
"చెప్పరా రమేష్! నిన్న స్కూల్లో ఏం జరిగింది?" అడిగాడు శాయిరామ్.
"గిలి బక వలె సిల మరి కధ రుబ మనతసావలె!" అన్నాడు వాడు.
అందరూ విభ్రాంతితో ఒకరు మొఖం ఒకరు చూసుకున్నారు.
యాదగిరి భార్య కన్నీళ్ళతో పక్కనున్న డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి మీద వాలిపోయింది.
"ఇదే మాట అక్కా! పరేషాన్జేస్తుండు! అన్నీ గిసంటి మాటలే! మాకేమీ సమజ్ కావటం లేదు! ఉన్నదిద్దరు పోరలు! అందులో ఈడిట్ల పిచ్చి పట్టిన్లెక్క జేస్తుండు!" ఏడుపు అతికష్టం మీద ఆపుకుంటూ అందామె.
"సైలెన్స్" అంటూ అరచాడు శాయిరామ్.
"ఒరే రమేష్- మీ టెక్ట్స్ పుస్తకంలోని తెలుగుపద్యం చదవమ్మా!"
"గిలీ పులీ- గిలీ గిలీ- పులిగిలీ- గిలిపులీ- పులిగిలీ-" అన్నాడు వాడు.
యాదగిరి కూడా కన్నీళ్ళు తుడుచుకున్నాడు వాడిని చూచి.
"ఇగో- రాత్రంతా గిదే ఒరులుడు భాయ్! నిన్న సాయంత్రం స్కూలుకెళ్ళి రాంగానే షురూ జేసిండు గీ మాటలు! నేను నా భార్య పరేషాన్! బరాల్, దిల్లగీల గట్ట యాక్షన్ చేస్తుండొచ్చని ఖ్యాల్ చెయ్యలే! ఇయ్యాళ పొద్దుటేల్ లేస్తనే షురూ జేసిండు మళ్ళీ ఇదే లాంగ్వేజ్- మాకు గుబులు పుట్టి శాయిరామ్ అన్ననూ, రెడ్డన్ననూ తీసుకొచ్చినం" చెప్పాడతను.
అందరూ రమేష్ గాడి వంక విచిత్రంగా, భయంగా, జాలిగా చూడసాగారు.
డిటెక్టివ్ రాజేశ్వరి చురచరా రమేష్ దగ్గరకు నడిచింది. వాడి ముందు కూర్చుని వాడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది.
"ఒరే రమేషూ! సరిగ్గా మాట్లాడమ్మా! మనం మొన్న టీవీలో తెలుగు డ్రామా చూశాం కదూ! ఎలా వుందిరా అది?" బుజ్జగింపుతో అడిగింది.
"బలగితకమని కత వలె కర చుక తలముచ" అన్నాడు వాడు ఏడుపు మొఖంతో.
"మరా సంగతి చెప్పరేం? మొన్న హైద్రాబాద్ దూరదర్శన్ ప్రోగ్రామ్ చూశాడంటున్నాడు కదా అందుకే పిచ్చెక్కింది వాడికి! అందుకే అలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకు చూపించకూడదు. పెద్దాళ్ళం మనం చూస్తేనే రెండ్రోజుల పాటు పిచ్చి పిచ్చిగా ఉంటుంది" అంది పార్వతమ్మగారు.
రాజేశ్వరి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ఫోజిచ్చి లేచి నిలబడింది.
"టీవీ ప్రోగ్రాం కూడా కారణమయి ఉండవచ్చు గానీ, నాకింకో అనుమానం వస్తోంది!" అందామె.
"ఏమిటది?" అడిగాడు రంగారెడ్డి అనుమానంగా.
అందరూ ఆమె ఏం చెప్తుందా అని ఊపిరి బిగపట్టారు.
"అదే- చేతబడి!" అందామె.
అందరూ త్రుళ్ళిపడ్డారు. కొంతమంది రెండడుగులు వెనక్కివేశారు. ఇంకొంత మంది తమ పిల్లలను దగ్గరకు తీసుకున్నారు.
"వీడంటేవిపరీతమయిన ద్వేషం, పగ, కసి ఉన్న వారెవరో చేతబడి చేయించి ఉంటారు- నేను ఈ విషయంలో పరిశోధించి హంతకుడిని పట్టుకుంటాను"- అందామె డిటెక్టివ్ ఫోజుపెట్టి.
యాదగిరి భార్య ఆ మాటతో మరింత గాబరా పడిపోయి బిగ్గరగా ఏడ్వటం మొదలు పెట్టింది గానీ యాదగిరి ఒక్క కేక వేసి ఆమె నోరు మూయించేశాడు.