అప్పటికే ఎన్ హైడ్రేనాని చేత్తో బయటికి తీశాడు జయేంద్ర.
అది ఉన్మాదమో లేక స్వయంగా పరిశీలించాలని జయేంద్ర చేసిన సాహసమో గ్రహించలేక ఉద్వేగంగా దగ్గరకు రాబోయింది శృతి.
తలా తోకా ఒకేలా వుండటంతో జయేంద్ర తోకవేపు పట్టుకున్నాడు. రెప్పపాటులో అది అతడి చెంపపై కాటేసింది.
శృతి ఆర్తనాదం గొంతులోనే సమాదై పోయింది. జయేంద్ర చెంపనుంచి రెండు రక్తపు బొట్లు జారిపడ్డాయి అప్పటికే...
జయేంద్ర ఇలాంటి సాహసం చేస్తాడని శృతి వూహించలేదు. ప్రధమచికిత్స చేయాలని ముందుకు రాబోతుంటే అప్పటికే పాముని కేజ్ ని వదిలిన జయేంద్ర ఆమెని చేత్తో వారించాడు.
"డాక్టర్ శృతీ" అతడి గొంతులో ఎలాంటి ఆందోళనా లేదు... చాలా మామూలుగా మాటాడుతున్నాడు. ఇక్కడ ఇప్పుడే మన విశ్వాసాల మధ్యవున్న వైవిధ్యతని చెరిపే ప్రయత్నంగా ఓ ప్రయోగాన్ని నిర్వహించాలనే ఇంత సాహసంగా పాముని బయటికి తీసింది. "మీ లెక్కప్రకారం ఎలాంటి వీనమ్ దీని కాటుకి పనిచేయదు... కాబట్టి నేను ప్రాణాలు వదలాలి. కాని బ్రతికే వుంటానూ అని మీరు నమ్మని మంత్రాలతోనే నేను నిరూపించబోతున్నాను."
"కానీ..." ఆమె ఆర్దోక్తిలోనే ఆగిపోయింది.
అప్పటికే జయేంద్ర పెదవులు మంత్రాన్ని వల్లెవేస్తున్నాయి. ఒక ధ్యానంలో మునిగిపోతున్నట్టు అతడి నేత్రాలు అరమోడ్పులయ్యాయి.
"అనంతం...వాసుకిం... శేషపద్మనాభంచ కంఖలమౌ శంఖ పాలం...సాయంకాలే పఠేన్నిత్యం...విషభయం నాస్తి..."
"సర్వత్ర విజయాపవేత్" ఇప్పుడు శృతికంఠం నుంచి ఉచ్ఛారణ మొదలయ్యింది...
ఒక అస్పష్టమైన అవాంతరం...అంతకుమించి అబ్బురంగా అనిపించిన జయేంద్ర నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
అప్పటికే శృతి కాటన్ తో జయేంద్ర చెంపలపైన రక్తాన్ని క్లీన్ చేస్తూంది.
"నాకు యీ మంత్రం ఎలా తెలుసని ఆశ్చర్యపోతున్నారా?" మృదువుగా నవ్వింది శృతి. "మరేంలేదు...ఒకనాడు ఓ మంత్రగాడ్ని నేనూ ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్నాను...కాబట్టే మీతో కలిసి ఉచ్చరించగలిగాను. చిత్రమేమిటంటే ఆ తర్వాత తెలిసింది...మరికొన్ని మంత్రాలు నేర్పుతానని మాటిచ్చిన ఆ పెద్దమనిషే ఆ తర్వాత పాముకాటుతో చనిపోయాడని."
"కానీ నేను..."
ఓ పసికందును చూస్తున్నట్టు లాలనగా అతడ్ని గమనిస్తూ నెమ్మదిగా అంది. "యస్...నిజానికి ఈపాటికే మీ స్థానంలో మరొకరుంటే ఈ షాక్ తో ప్రాణాలు వదిలేవారు. హెమరేజ్ లో రక్తం నురగలా బయటికివచ్చేది. కాని మీకలా కాలేదు. కారణం మంత్రం కాదు_ మీకేమీకాదన్న ధైర్యం..."
ఆ మాటలకి రోషంగా చూశాడు జయేంద్ర "అంటే...?"
"సింపుల్... నాట్రిక్స్ అనబడే నీటిపాము విషపూరితం కాకపోయినా ఆ కాటుతోనూ చనిపోయినవాళ్ళున్నారు జయేంద్రా! అక్కడ మరణానికి కారణం పాము కాటేసిందన్న భావం, దాని విషం కాదు" రిలాక్స్ డ్ ఓ కుర్చీలో కూర్చుంటూ అంది.
"అంటే ఎన్ హెడ్రేనా సముద్రసర్పం అయినా విషపూరితమైంది కాదా?"
"విషపూరితమైనది కాబట్టే ముందే కోరల్ని తీసేయడం జరిగింది."
ఈ జవాబుకి కొద్దిగా తొట్రుపడ్డాడు. ఉద్వేగంతో అతడి చెంపలు ఎరుపెక్కాయి.
"ఇకపోతే మీ చెంపలపైనుంచి రక్తం రావడానికి కారణం హెడ్రేనా. సర్పానికి తలభాగంలో వుండే పొలుసు మీ చెంపల్ని గీరుకుంది. గాయమైంది..." నిర్విణ్ణుడై నిలబడ్డ జయేంద్రనే తదేకంగా చూస్తూ అంది. "ఇక్కడ నేను మిమ్మల్ని అవమానించడం లేదు జయేంద్రా...ఇంత ప్రమాదమని తెలిసికూడా మీ నమ్మకంతో మీరు చేసిన సాహసానికి అభినందిస్తున్నాను" నిజాయితీగా అంది. "నేనిప్పుడు హేతువాదం గురించో లేక మీరంగీకరించని నాకు తెలిసిన సైన్స్ గురించో మీ ముందు ఏకరువు పెట్టి మిమ్మల్ని నా మార్గంలోకి మళ్ళించుకోవాలనుకోవడం లేదు. కొన్ని అనుభవాలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప అవగాహనకు రానివి. మనమధ్యవున్న కాంట్రాడిక్షన్సూ అంతే...సో...ఇందాక మీరు అడిగారే ఇప్పుడు నన్నేం చెయ్యమంటారూ అని, దానికి వెంటనే ఓ జవాబు చెబుతున్నాను."
భావరహితంగా చూశాడు శృతినే. ఇప్పుడామె కళ్ళలో చిలిపితనం లేదు.
"అసంపూర్తిగా మిగిలిపోయిన ఓ ప్రయోగాన్ని మీ సహకారంతో పూర్తి చెయ్యాలనుకుంటున్నాను...నిజానికి అది నాకు సాధ్యం కాదని తెలుసు. కాని తప్పదు..." సరిగ్గా అదే సమయంలో ఆమెకు డాక్టర్ సంఘమిత్ర గుర్తుకొచ్చాడు. అయినా ఆ విషయం మనసులోనే దాచుకుంటూ అంది. "శాస్త్రపరంగా ఇంత అభివృద్ధిచెందిన మనదేశం పాముకాటుతో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న వ్యక్తులుగల మొదటి మూడు దేశాలలో ఒకటి జయేంద్రా...మరో మూడు రోజుల్లో చివరి ప్రయోగానికి కావాల్సిన సర్పం యిక్కడికి రవాణా చేయబడుతూంది. దాన్ని నేను హేండిల్ చేయగలనన్న నమ్మకం లేదు. దానికి మీ సహాయం కావాలి."
జయేంద్ర భృకుటి ముడిపడింది. "ఏమిటిది?"
"ప్రపంచంలో అతి ప్రమాద భూయిష్టమైన పధ్నాలుగడుగుల బ్లాక్ మాంబా."
ఆ పేరు వినగానే జయేంద్ర సైతం ఉలికిపడ్డాడు.
* * * *
మధ్యాహ్నం పన్నెండుగంటలు కావడానికి సరిగ్గా అయిదు నిముషాలుంది. అప్పటికే డి.జి.పి. ఛాంబర్ లో ప్రత్యర్ధితో జరగబోయే చర్చ రికార్డ్ చేయడానికి కావలసిన సాంకేతికమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.
జంటనగరాలకి చెందిన పోలీసు ఉన్నతాధికారులంతా ఇప్పుడక్కడ సమావేశమై వున్నారు.
మరో రెండు నిముషాలు గడిచాయి.
క్షీణించిపోతున్న శాంతిభద్రతల్ని కాపాడలేకపోతున్న డి.జి.పి. గుండె, రెక్కలు తెగిన డేగలా హోరుమంటూంది. ఒక పక్క పత్రికలు దుయ్యబడుతూంటే మరోపక్క ముఖ్యమంత్రి అసంతృప్తితో తనపై విరుచుకు పడుతున్నాడు.
ఈ టెర్రరిజం మరోరోజు కొనసాగినా వూరుకోనని బాహాటంగా హెచ్చరించాడు కూడా...
చాలా నిజాయితీగా ఆ స్థానాన్ని చేరుకున్న వ్యక్తి ఆయన... అందుకే తన శక్తిని శంకిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇన్నేళ్ళ సర్వీసులో ఇంతటి నిస్సహాయస్థితి అతడెన్నడూ ఎదుర్కోలేదు.
వాల్ క్లాక్ పన్నెండుగంటలు కొడుతుండగా ఫోన్ రింగయింది.
చేతులు కంపిస్తుంటే ఊపిరి బిగపట్టి తక్కిన ఆఫీసర్లవేపు ఓమారు చూస్తూ రిసీవర్ అందుకున్నాడు.
"మిస్టర్ డి.జి.పి." గొంతు కర్కశంగా వినిపించింది. "నీ చుట్టూ చాలా మార్బలాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాని నేను ఫోన్ చేస్తున్నది ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. కాబట్టి మీవాళ్ళని ఎక్స్ చేంజ్ ద్వారా ఫోన్ వివరాలు కనుక్కోమని హడావుడి చేయకు..." ప్రత్యర్ధి తనను పూర్తిగా అంచనా వేయగలిగాడన్నది బోధపడిపోయింది.
"అయిదు నిముషాల టైమ్ ఇస్తున్నాను...వెంటనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి రావాలి...అక్కడ సరిగ్గా అంటే పన్నెండుగంటల ఆరు నిముషాలకి నీతో మాట్లాడబోతున్నాను...తప్పితే ఇక నిన్నిక కాంటాక్ట్ చేయను" అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఫోన్ క్రెడిల్ చేశాడు.
డి.జి.పి. ఏం విన్నదీ ఇప్పుడేం చేయబోతున్నదీ అందరూ గ్రహించేలోగానే డి.జి.పి దూకుడుగా బయటికి నడిచాడు.
ఇప్పుడు ఫోన్ వచ్చింది రాణిగంజ్ లోని ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. అంటూ ఓ ఎసిపి తెలియచేసినా అవేమీ పట్టించుకునే స్థితిలో లేడతను...
భయం బోనులోనుంచి గుండె లోలకంలా కొట్టుకుంటూంటే డిసిపి ప్రసనన్ని రమ్మని సౌంజ్ఞచేస్తూ తన కారుని చేరుకున్నాడు. ఇక్కడ గెలుపు ఓటమిల ప్రసక్తిలేదు. కనీసం ప్రాణరక్షణకోసమైనా తానో అడుగు వెనక్కి వేయాలి.
కారులో కూర్చుంటూ ఓ ట్రాఫిక్ ఎ.సి.పి.ని ఆదేశించాడు. "మూడు నిముషాలలో నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకోవాలి. కంట్రోల్ ది హెవీ ట్రాఫిక్!"
ఎసిపి వైర్ లెస్ లో ఆదేశాలు జారీచేస్తుండగానే డిజిపి కూర్చున్న కారు ప్రసన్నతోబాటు ముందుకు దూసుకుపోయింది.
సరిగ్గా పన్నెండూ అయిదున్నర నిముషాలకి డిజిపి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాడు. ఒక రాష్ట్రానికి చెందిన అంతటి ఉన్నతాధికారి అలా ఓ స్టేషన్ కి రావటం అన్నది ఎవరూ వూహించని విషయము కావడంతో అక్కడి స్టాఫంతా కట్రాడల్లా నిలబడి సెల్యూట్ చేసారు.
అప్పటికే ఫోన్ రింగవుతూంది.
నుదుట పేరుకుపోయిన చెమటని తుడుచుకుంటూ రిసీవర్ అందుకున్నాడు డిజిపి. "యస్!"