"పాపం కాదు విమలా! అది నా పాలిట శాపం! ఆ మనిషిని చూస్తే చాలా మొరగాలనిపిస్తుంది. మొఱిగి కరవాలనిపిస్తుంది. అల్లాంటి మనిషికా-మనతోపాటు మనింట్లో వుండమని ఆహ్వానం పంపుతావ్! అయినా ఆయనకేం తక్కువ? బోలెడు పెన్షనొస్తుంది. బ్యాంకులో బోలెడుంది."
"ఏముండి ఏం లాభం? వండి వార్చే దిక్కులేదు."
"వంటలక్కని పెట్టుకోమను."
"కన్నబిడ్డని నేనంటూ లేకపోతే ఆ పనే చేసేవారు!"
"కన్నబిడ్డ జీవితాంతం కన్నబిడ్డగానే మిగిలిపోదు విమలా! ఎవడో ఒకడికి కట్టుకున్న భార్యవుతుంది. వాడి అడుగుజాడల్లో నడిచే ఆదర్శ మహిళవుతుంది. ఇరవైతొమ్మిది గంటలు గడువిస్తున్నా?"
"గడువా? అదెందుకు?"
"ఈ ఇంట్లో నేనో మీ నాన్నో ఇద్దర్లో ఒకరే ఉండేందుకు! ఇద్దరం వుండి పులీమేకల్లాగా బతకలేం. నేను కావాలో మీ నాన్న కావాలో ఇరవై నాలుగ్గంటల్లో."
"ఇందాక ఇరవై తొమ్మిది గంటలన్నారు."
"ఆల్ రైట్ అట్లాగే! అన్ని గంటల్లోగా నిర్ణయమేమిటో బాగా ఆలోచించుకుని చెప్పు వస్తా!" అంటూ జగన్నాధం నోరు మూసుకుని ఫోటోలో బొమ్మయి పోయేడు.
విమల ఫోటోనుంచి కదిలి వస్తూ-
"అలగండలగండి. ఇట్లా ఎన్నిసార్లు అలిగి వెళ్ళిపోలేదూ...? ఎన్నిసార్లు తిరిగి రాలేదు! అసలీ కోపమంతా మా నాన్న మీదేగా! మనం పిలవగానే వచ్చేందుకు ఆయన అభిమానం లేని మనిషనుకున్నారా! మనింటికి రమ్మని నెలకిరవై చొప్పున ఉత్తరాలు రాస్తున్నాను. వచ్చేరా! ఆయనొచ్చేసినట్టు పెద్ద హంగామాచేసి వెళ్ళిపోయేరు గదూ! వెళ్ళండెళ్ళండి. ఎన్నాళ్ళు తిరుగుతారో తిరగండి." అంటూ ఆమె ఉయ్యాల బల్లమీద కూచుంది.
"ఇదే మా ఇల్లు" జగన్నాధం గొంతు వినిపించింది.
మళ్ళా ఫోటో మాట్లాడుతున్నదేమోనని విమల ముందర ఫోటో వేపు చూసింది. ఆ లక్షణాలేమీ కనిపించకపోవడంతో వీధి గుమ్మంవేపు చూసింది.
వసుంధరా కిష్టుడితో జగన్నాధం ఇంట్లో వెలిశాడు.
మొగుడొచ్చినందుక్కాదుగానీ వసుంధరనీ మరో కుర్రాడ్నీ తెచ్చినందుకు ఆశ్చర్యపోతూ ఉయ్యాలబల్ల దిగింది విమల.
జగన్నాధం ఒక గోడకి చెబుతున్నట్టు చెప్పేడు.
"ఎక్స్ కర్షనుట. క్లాసు పిల్లల్తో ఈ ఊరొచ్చింది బేబి. ఆఫీసుకి ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చేను."
విమల వసుంధరని దగ్గిరికి తీసుకుంటూ అడిగింది. "ఏమ్మా పంకజమ్మత్తయ్యా వాళ్ళు కులాసాగా వున్నారా?"
వసుంధర తలూపింది.
"ఎప్పుడొచ్చేరో ఏమిటో...ముందు స్నానం పూర్తిచెయ్యమ్మా! ఈలోగా వంట చేసేస్తాను" అంటూ విమల వసుంధరని తీసుకువెడుతోంది.
"మనం మాత్రం ఈ ఇంట్లో భోంచేయం. మగాళ్ళ హోటల్లో మీల్సు బ్రహ్మాండంగా వుంటాయి. అక్కడికే పోదాం. అట్లా కూర్చో ఇప్పుడే వస్తాను" అంటూ కిష్టుడ్ని కూచోబెట్టి జగన్నాధం తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు.
జగన్నాధం వరస కిష్టుడికి మొదట్నుంచీ అనుమానంగానే వుంది. ఎందుకైనా మంచిదని అతడు కూడా లేచి, కిటికీలోంచి జగన్నాధం గదిలోకి తొంగిచూసేడు.
జగన్నాధం ఎవరికో ఫోన్ చేస్తున్నాడు.
కిష్టుడి గుండెల్లో రాయిపడింది. అతను శబ్దం చేయకుండా కిటికీ పక్కనే నిలబడి వినే ప్రయత్నంలో వున్నాడు.
జగన్నాధం యస్టీడీ చేసేడు!
అవతల్నుంచి గొంతు వినిపించగానే జగన్నాధం తన గొంతు తగ్గించి అటూ ఇటూ చూస్తూ గబగబా మాట్లాడేస్తున్నాడు.
"నేనే పంకజం. జగన్నాధాన్ని. విశాఖపట్నంనుంచే..బేబీ ఎవడో కుర్రాడ్ని వెంటబెట్టుకుని ఈ ఊరొచ్చింది. ఆ...ఆ...అవునతనే! ఇద్దరూ ఇప్పుడు మా ఇంట్లోనే వున్నారు. అట్లాగే...నువ్వొచ్చేవరకూ వాళ్ళని వెయ్యి కళ్ళతో చూస్తాను. నువ్వు వెంటనే బయలుదేరు. అట్లాగే! ఇంతమాత్రానికే థాంక్సెందుగ్గానీ, నువ్వు వెంటనే బయలుదేరు, వుంటా!" అంటూ అతను ఫోన్ పెట్టేశాడు.
తాను అనుమానించినంతా జరిగినందుకు కిష్టుడు బాగా వర్రీ అయిపోయేడు.
తెల్లవారితే పంకజ మొచ్చేస్తుంది.
ఇక ఆ తర్వాత అల్లరీ...భీభత్సం! ఎట్లా ఈ గండం గడిచేది!
-జగన్నాధం చొక్కా మార్చుకుని, గుండీలు పెట్టుకుంటూ గది నుంచి బయటపడ్డాడు.
ఏమీ ఎరగనట్టు బుద్ధావతారంలాగా కూర్చున్న కిష్టుడితో-
"ఏం లేదోయ్! షర్టు మార్చుకొచ్చేనంతే! ఊ...పద పద. హోటల్ కి పోదాం. బేబీ౧ మేము హోటల్లో భోంచేసి వస్తాం" అంటూ కిష్టుడ్ని వెంటబెట్టుకుని బయటకు వెళ్ళిపోయేడు జగన్నాధం.
వాళ్ళు వెళ్ళిపోయింతర్వాత వసుంధర విమలను అమాయకంగా ప్రశ్నించింది-
"అంకుల్ హోటల్లో భోంచేయడమేమిటీ?"
"నామీద కోపమొస్తే ఆయన హోటల్లోనే భోంచేస్తారు?"
"మీ మీద అంకుల్ కి కోపమొచ్చిందా?"
"అందుకే హోటలంటున్నారు. వెళ్ళనివ్వు. ఎంతైనా ఇంటి తిండి-ఇంటి తిండే! హోటల్లో ఆ రుచి ఎందుకుంటుంది? ఈయనగారి మూలాన పాపం ఆ అబ్బాయి హోటల్లో తిన్లేక ఇబ్బంది పడవలసి వచ్చింది. అవునూ, ఇంతకీ ఎవరా అబ్బాయి?"
"మా ఎదురింటి అబ్బాయి."
"మీ క్లాసబ్బాయి కాదా?"
"కాదు!"
"ఆంటీ! నేను ఆ అబ్బాయిని ప్రేమించేను" అంటూ ఏదో కథ చెబుతోంది వసుంధర...
* * *
కైలాసం ఈవినింగు ఎడిషన్ పేపరు తీసుకొచ్చేడు. దాన్ని శివుడి కిస్తూ అన్నాడు-
"మీరు చెప్పినట్టు బుజ్జులు ఫోటోతో సహా పేపర్లో ప్రకటన ఇచ్చాను-చూడండి!"
శివుడు పేపరు తీసుకున్నాడు.
అందులో ఒక చోట కిష్టుడి ఫోటో వేసేరు. దానికింద నాలుగు మాటలు రాసేరు. మాటలు మామూలే. ఎక్కడున్నా వెంటనే ఇంటికి రమ్మని! అతను రాకపోతే అతన్ని అప్పగించిన వారికి బహుమతి! కింద శివుడి చిరునామా-ఫోన్ నెంబరు వగైరా.
"మనం ప్రకటించిన బహుమతి చాలా మందిని ఆకర్షించింది, సార్." అన్నాడు కైలాసం.
"అయితే వెంటనే బుజ్జులు దొరుకుతాడు."
'ఇంత పెద్ద మొత్తం బహుమతిగా ఎవరూ ఎప్పుడూ ఎక్కడ ప్రకటించలేదని పేపరు వాళ్లే చెప్పేరు. ఈ విధంగా పెద్ద బహుమతి ప్రకటించి "కనపడుటలేదు" అనే శీర్షికతో మనం పెద్ద చరిత్ర సృష్టించినట్టు చెప్పాలి. ఒకటా రెండా-బుజ్జుల్ని అప్పగించిన వాళ్ళకి అయిదు వేల బహుమతి!"
"ఆఫ్టరాల్ అయిదువేలు. వాడు దొరికితే నాకదే పదివేలు."
"మీకు చెప్పకూడదు సార్."


