గౌసుద్దీన్ కేం అర్ధంకాలేదు. అతనెందుకలా చూస్తున్నాడో.
అప్పుడన్నాడా అధికారి.
"పోలీసులు ఎక్కడ దొంగతనం జరిగినా పాత కేడిల్నే ఎందుకు అరెస్టు చేస్తారో అప్పుడర్ధమైంది. అలాగే మేమూ చేయాలి ఇక నుంచి" అన్నాడు వ్యంగ్యంగా.
ఇంకా అర్ధంకాక అయోమయంగా, కోపంగా చూస్తున్న అతని చెవిలో చిన్నగా అన్నాడు రాజర్షి. "దటీజ్ రాజర్షి" అని!
గౌసుద్దీన్ ఉలిక్కిపడ్డాడో క్షణం.
"ఇవి ఫేక్ నోట్సుని దైలాగ్సు చెప్పావు. పైగా నిజాయితీగల ఆఫీసర్ లా పోజులోకటి" అధికారి మాటలు పూర్తికాలేదు.
గౌసుద్దీన్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు.
రాజర్షి ఆ అధికారులకు తన అడ్రసు యిచ్చి వాళ్ళు చేయమన్న ఫైల్ మీద సంతకంచేసి గౌసీద్దీన్ వేపు చూస్తూ "ఓహో పాత ఖాతానేనా అయితే తప్పదుమరి" అంటూ వడివడిగా బయటకొచ్చేసాడు.
రాజర్షి చెప్పింది విని అతని అనుచరులు షాక్ తిన్నారో క్షణం.
"పాతికవేలు ఖర్చయినా పని జరిగింది" అంటూ ముందుకు సాగిపోయారు మామూలుగా.
"దెబ్బతిన్న ఎస్.పి. అంత తేలిగ్గా మనల్ని వదిలేస్తాడా?" జంకుతూనే అడిగాడు సహచరులు.
"ఊరుకోడు....ఇల్లుపీకి పందిరేస్తాడు...." వేగంగా నడుస్తూ అన్నాడతను.
"అందుకు మనం అడ్డుకోవాలిగదా? ప్రతిచర్య?"
రాజర్షి ఆజ్ఞకోసం ఎదురుచూస్తూ అడిగాడు సహచరులు.
"అడ్డుకోవటం మామూలు చర్య చెప్పానుగా....ఘర్షణ లేకుండానే వాడి వేలితో వాడే వాడికన్ను పొడుచుకునేలా చేయాలి."
అనుచరుల కర్ధంకాలేదు అతను చెప్పింది.
వెంటనే ఏం చేయవల్సింది అతను చెప్పుకుపోతున్నాడు.
అనుచరులిద్దరూ మౌనంగా వింటున్నారు.
అర్దరాత్రి కావటానికి మరో ఐదు నిముషాలుందనగా ఒక్కసారి ఆశ్రమం చుట్టుపక్కల పర్చుకున్న నిశ్శబ్దం బ్రద్దలయింది.
గౌసుద్దీన్ ఇద్దరు ఎస్.ఐ.లు పదిమంది పి.సి.లతో వచ్చి ఆశ్రమానికి ముందున్న మొక్కల్ని, కుండీల్ని నాశనం చేయమని ఆజ్ఞాపించాడు.
పిచ్చెక్కిన మదగజాల్లా కేవలం అరగంటలో ఆశ్రమం ముందున్న పొందికయిన పూలతోటను నామరూపాల్లేకుండా చేసేసారు.
లోపలనుంచి అనుచరులు ఆ భీభత్సాన్ని చూసి ఆవేశంతో ఊగి పోయారేతప్ప రాజర్షి ఆజ్ఞను మీరలేదు.
రాజర్షి ఆ టైమ్ లో నిశ్చింతగా నిద్రపోతున్నాడు!
మరుసటిరోజు ఉదయం ఏడుగంటలసమయం...."మిష్టర్ గౌసుద్దీన్ ఇది రాజర్షి ఫోన్ కాల్.
అన్నాడు రాజర్షి కిటికీలోంచి నాశనమయిపోయిన తోటను ఓరకంట చూస్తూ.
"నువ్వా....నీకు నేనేం అన్యాయం చేసాను. నన్ను అనవసరంగా రాప్షన్ కేసులో ఇరికించావు?" గౌసీద్దీన్ కోపంగా అన్నాడు.
చిల్లర దొంగతనాలు చేసుకొని పొట్ట పోసుకొనే ఓ కేడీని పట్టుకొచ్చి వాడే దొంగనోట్లు వ్యాపారం చేసాడని ఇరికించావ్. దొంగనోట్లు మార్చేవాడు వీధి రౌడీలా ఉండడు. వీధికి పెద్దలా వుంటాడు, వుండాలి. లేదంటే నోట్లు మార్చుకోలేడు. ఇక్కడ నీకు కామన్ సెన్స్ లోపించింది. ఇకపోతే వాడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ మంచానికి అతుక్కుపోయి వున్నాడు అందుకు వాడి శవాకారమే సాక్ష్యం.
ఇకపోతే అసలు దొంగ ఏ రాజకీయ నాయకుడో వ్యాపారవేత్తో అయుంటాడు. వాడ్ని పట్టుకోవటం చాతకాకో, చేతయినా ధైర్యం లేకో ఓ పిచ్చి వెధవని బొక్కలోకి తోసావ్. వాడు దొంగతనాలు చేయటం మంచా చెడా అన్న మీమాంస అటుంచితే_ వాడి చేతులాడందే వాడి పెళ్ళాం బిడ్డలకు తిండి వుండదు."
రాజర్షి చెప్పేది పూర్తి కాకుండానే గౌసుద్దీన్ "అయితే ఏంటి....? దానికీ నన్ను ఇరికించటానికి సంబంధమేమిటి?" అడిగాడు ఉక్రోషంగా.
"ఉంది, సంబంధం చాలా వుంది. ఎక్కడ అన్యాయం జరిగినా నేను సహించను. నీ మూలంగా వాడికి ఐదారేళ్ళు జైలుశిక్ష పడవచ్చు. దానిమూలంగా వాడి పెళ్ళాంబిడ్డలు అనాధలైపోతారు. ఇకపోతే సంబంధం అన్నావే చెబుతాను.
వాడ్ని విడిపించమని నా మనుష్యులొస్తే వాడు పాతకేడీ, వాడి ఈపని తప్పక చేసుంటాడని పొగరుగా అన్నావు. నీవు మర్చిపోయావేమో తెలీదు. కాని నీ చరిత్రలో నీవు రెండుసార్లు భారీ ఎత్తున లంచాలు తీసుకున్నావు"
గౌసుద్దీన్ ఉలిక్కిపడ్డాడు రాజర్షి చెప్పింది విని.
"దటీజ్ మై నెట్ వర్క్ ఇప్పుడు చెప్పు పాతకేడీ మరో తప్పుడు పనిచేసే అవకాశం వున్నప్పుడు పాత అవినీతి అధికారి మరో అవినీతి పని చేయడని నమ్మకం ఏమిటి? ఇదీ సంబంధం?"
"యూ బాస్టర్డ్...." గౌసుద్దీన్ పళ్ళు పటపట కొరుకుతూ అన్నాడు పెద్దగా.
"ఇకపోతే....అర్జంట్ గా ఆ రౌడీని వదిలెయ్యాలి. రెండు నా తోటను నాశనం చేసినందుకు పరిహారం చెల్లించాలి. తక్షణం ఈ రెండు జరగలేదనుకో...."