Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 12

    "నీకు చెప్పగలిగేటంతదాన్ని కాదుగాని సాహసం చేస్తున్నావేమో ననిపిస్తోంది. శేఖరంగారు కాస్త బిడియస్థుడేగాని అతనికి  నువ్వంటే  చాలా అభిమానం."

    "నిజమేనేమో  కాని  అతనిమీద  నాకలాంటి  భావం  ఎప్పుడూ కలగలేదు. అంతా ఆలోచించే  ఈ నిర్ణయం  తీసుకున్నాను."

    'ఆత్మవంచన' - అని మనసులో అనుకుంది.

    "ఎనీవే అయామ్ హాపీ. ఇంతకీ పెళ్ళెప్పుడు ?" తెచ్చి పెట్టుకున్న  ఉత్సాహంతో అడిగింది.

    "రేపు  ప్రకాశరావు అంకుల్ తో మాట్లాడి నిర్ణయిస్తాం. గిరి ఈ నెలలోనే  చేసుకుందాం అంటున్నాడు. సాగర్ కనిపించి చాలా రోజులయింది. ఎప్పుడొస్తాడు" అడిగింది పద్మజ.

    "రెండు మూడు రోజుల్లో రావచ్చక్కా!"

    సాగర్ ప్రసక్తిరాగానే సిగ్గుపడింది హిమజ! పద్మజ వెళ్ళబోయి ఆగి, తటపటాయిస్తూ, "రెండు పెళ్ళిళ్ళూ  ఒకేసారి జరుగుతే బావుంటుందేమో" అంది. అందర్నీ అధికారంతో శాసించే అక్క ఈ రోజు ఇలా నసగటం చూసి హిమజకు నవ్వొచ్చింది.

    "చూద్దాంలే అక్కా!" అంది హిమజ.

    "గుడ్ నైట్" తలపు  దగ్గరగా వేసి వెళ్ళిపోయింది పద్మజ.

    పుస్తకంలో సాగర్ ఫోటోతీసి దాని వైపే తదేకంగా  చూస్తూ "అక్క కూడా అడుగుతోంది. త్వరగా రాకూడదూ?" అంటూ ముద్దుగా కోప్పడింది.

    కళ్ళు మూసుకు పడుకుంటే ఆమెకి సాగర్ తో తొలి పరిచయం గుర్తువచ్చింది. జర్నలిజం స్టూడెంట్ గా ఉన్నప్పుడు అందరూ ఔరంగాబాద్ వెళ్ళారు. కైలాస్ టెంపుల్ ఫోటో కాంపిటిషన్ పెట్టారు తమకు. అందరూ ఫోటోలు తీసుకుని వెళ్ళాక తను పై అంతస్థులో ఒక మూలగా కూర్చుని కెమెరా అడ్జస్టు చేసుకుంటోంది. కెమెరా వ్యూయర్ లోంచి ఏంగిల్ సరిచూసుకుంటుంటే  కనిపించాడతను. మెల్లిగా పైగోపురం మీదకు ఎగబ్రాకుతున్నాడు. కిందనుంచి అతని ఫ్రెండ్స్ కాబోలు  అరుస్తున్నారు. బెట్ కట్టాడేమో అతన్ని  పైదాకా  వెళ్ళనిచ్చి ఫోటో తీసింది తను. తను కూర్చున్న స్థలంనించి  ఆ ఏంగిల్లో ఫోటో అద్భుతంగా  వస్తుంది. తను  ఫోటో తీయడం గమనించాడతను. కావాలనే రెండు - మూడు ఫోజులిచ్చాడు. తనూ టకటకా ఫోటోలు  తీసింది. అతను కిందకు దిగిరాగానే దగ్గరగా వెళ్ళి కోప్పడింది.

    "ఎందుకలా  ఎక్కారు? ఎంత రిస్కో తెలుసా? అసలే అంతా రాయి! పడితే ఇంకేమయినా  ఉందా?"

    "బాగానే ఉంది. చక్కగా ఫోటోలు తీసుకుని ఇప్పుడొచ్చి కోప్పడుతున్నారా? అయినా లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అనుకునే వాళ్ళకు అన్నీ ఛాలెంజ్ లే" నవ్వేసి వెళ్ళిపోయాడు.

    తర్వాత హోటల్లో  కనిపించాడు. అక్కడే తెలిసింది అతని పేరు విద్యాసాగర్ అనీ, ఏదో కంపెనీకి సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడనీ.

    నెల రోజుల తర్వాత  ఒక పార్టీలో కనిపించాడు. ఫోటోలు తెచ్చిస్తారనుకున్నాను రాలేదేం అని అడిగాడు. తన ఫోటోకి  ప్రయిజ్ వచ్చిన సంగతి చెప్పింది. అతను చెప్పిన కంపెనీ పేరు సరిగ్గా గుర్తులేక ఇవ్వలేదండి. మర్నాడు ఇంటికి వచ్చాడతను. అలా తమ పరిచయం ఈ రోజు అందరికీ తెలిసిపోయే స్టేజిలోకి  వచ్చింది.


                       *    *    *


    "అయితే నువ్వు గిరిధర్ ని  చేసుకోవటానికి  నిశ్చయించుకున్నావన్నమాట, చాలా సంతోషం. నాకు తెలిసినంతవరకు  చాలా మంచివాడు. బిజినెస్ కూడా బాగానే వుంది. అతని సిస్టర్ బాగా తెలుసు నాకు. నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అసలతను నా దగ్గరకు ఎందుకు వచ్చాడో తెలుసా ?"

    "ఆ! చెప్పాడు అంకుల్."

    "రాధకీ అతనికీ వయసులో చాలా తేడా వుంది. అందుకే సందేహించాను, ఆ విషయం అతనేవచ్చి చెప్పాడనుకో! అతనితో మాట్లాడి డేట్ ఫిక్స్  చేస్తాను. వాళ్ళ సిస్టర్ వస్తుందేమో కనుక్కుని  అరేంజ్ చేస్తాను!"

    "థాంక్యూ అంకుల్ !"

   
                       *    *    *


    "హల్లో హిమజా స్పీకింగ్."

    "హాయ్ స్వీటీ" అట్నుంచి సాగర్ కంఠం.

    "సాగర్ - ఎప్పుడొచ్చావ్?" సంభ్రమంగా  అడిగింది.

    "ఇప్పుడే. రాగానే మొట్టమొదట చేస్తున్న పని యిదే. ఏమిటో విశేషాలు!"

    "వెంటనే రా, బోలెడు విశేషాలు. అక్కయ్య పెళ్ళి."

    "ఓహ్! గుడ్ న్యూస్ ఎవరు? సోమశేఖరేనా ?"

    "కాదు గిరిధర్ అని బిజినెస్ మాన్."

    సడెన్ గా సాగర్ మౌనం వహించాడు. చాలా సేపటి తర్వాత "సోమశేఖరం చాలా ఫీలవుతాడు" అని క్లుప్తంగా అన్నాడు. అతడు అంత హఠాత్తుగా మౌనం వహించటం హిమజకి ఆశ్చర్యం కలిగింది. "నువ్వు రారాదూ అన్నీ చెప్తాను. శుభలేఖలు  కూడా వచ్చేశాయి" అంది.           

    "ఓ.కే. ఇప్పుడే వస్తున్నా, శీ.యూ!" సాగర్ నిర్లిప్తంగా అన్నాడు.

    అతడికి సోమశేఖరం గుర్తొచ్చాడు.

    జీవితాన్ని సిగరెట్ తో పోల్చాడో భగ్నప్రేమికుడు. దానికి ప్రేమ అనే నిప్పు తగలగానే  పొగతో సాగి సాగి బూడిదతో పూర్తవుతుందట అది. నిజమేనేమో!


                                5


    "కూర్చోండి" అన్నాడు యినస్పెక్టర్.

    

 Previous Page Next Page