Home » Vasireddy seeta devi novels » Rabandulu Ramachilukalu


    ధర్మయ్య కుతూహలంగా శేఖరం కళ్లలోకి చూశాడు.

 

    ఆ కళ్ళు నిజాయితీతో నిర్మలంగా కన్పించాయి.

 

    "మనిషిని, మనిషి అంటరాని వాడిగా భావించడం ఒక్క మనదేశంలోనే వుందండీ! ఈ విషయంలో మనదేశం ప్రపంచంముందు సిగ్గుతో తలవంచుకోవాలి. గాని మనవాళ్లకు సిగ్గులేదు. మనదేశం ఆధ్యాత్మిక చింతన గల గొప్పదేశం అంటూ రొమ్ము విరుచుకొని వేదికలమీద ఉపన్యాశానికే పట్టిందండీ!"

 

    "ఈ ఒక్క గ్రామంలోనే కాదు బాబూ! దాదాపు అన్ని గ్రామాల్లో హరిజనుల పరిస్థితి అలాగే వుంది. ఆఁ ! చూడు బాబూ! ముందు మనం వాళ్ల యిబ్బంది గురించి ఆలోచించాలి. ఆ బావి సంగతి ఏదో కాస్త చూడు."

 

    "మొన్న సమితి స్టాండింగ్ కమిటీ మీటింగు జరిగిందండీ! బావి తవ్వించటానికి రిజల్యూషన్ పాస్ చేయించాను. కాని సమితిలో ఫండ్సు చాలా తక్కువగా వున్నాయి. సగం ఖర్చు సమితి భరిస్తుంది. మిగతా సగం నేను ఏర్పాటు చేస్తానండీ! ఇవ్వాళే రంగన్నను పిల్చి డబ్బు యిచ్చాను. నేను వచ్చేలోపే బావి త్రవ్వకం పూర్తి అవుతుంది" అన్నాడు శేఖరం.

 

    ధర్మయ్య గుండెలు సంతోషంతో పొంగాయి.

 

    "బాబూ!" ధర్మయ్య, శేఖరం రెండు చేతులూ పట్టుకున్నాడు.

 

    "నువ్వు సర్పంచ్ కావడం ఈ గ్రామ ప్రజల అదృష్టం బాబూ!" అన్నాడు ఆర్ద్రకంఠంతో.

 

    "నేను పెద్దగా చేస్తున్నదేముందండీ? నా కర్తవ్యాన్ని మీ ఆశీర్వాద బలంతో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాను" వినయంగా అన్నాడు శేఖరం.

 

    "చదువు....సంస్కారం....అందం....ఐశ్వర్యం....వినయ విధేయతలు....అన్నిటినీ మించిన నిజాయితీ....అన్నీ నీ సొత్తేబాబు! నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు!"

 

    ధర్మయ్య కళ్ళలో ఆనందభాష్పాలు మెరిశాయి.

 

    "వెళ్లొస్తానండీ! రాగానే కన్పిస్తాను" అంటూ నమస్కరించాడు శేఖరం.

 

    "వెళ్లిరా బాబూ!"

 

    శేఖరం రెండడుగులు వేశాడో లేదో "చూడు శేఖరం!" ధర్మయ్య పిల్చాడు.

 

    శేఖరం వెనక్కుతిరిగి వచ్చాడు.

 

    "మర్చిపోయాను అడగటం! ఆ బాల్వాడీ పిల్లలకు మధ్యాహ్నం భోజనం విషయం ఏంచేశావు బాబూ?"

 

    "సప్లై చేయించానండీ బాలాహార్ బ్యాగ్సూ, సలాడ్ ఆయిల్ టిన్సూ నిన్ననే తెప్పించాను. ఇవ్వాల్టినుంచి మళ్ళీ భోజనం పెట్టే ఏర్పాటు చేయించాను" అన్నాడు శేఖరం.

 

    "కానీ ఆ టీచర్ ఏదో....?"

 

    "అవును! విన్నాను. ఆయిల్ టిన్సూ, బాలహార్ కూడా చాటుగా అమ్ముకుంటున్నదట! అందుకే ఈసారి స్టాకు గ్రామ సేవికకు అప్పగించాను. ఆమె రోజూ అక్కడే వుండి వండించి వడ్డించేవరకూ చూస్తుంది. ఇక అలాంటిదేమీ జరగదులెండి" అన్నాడు శేఖరం.

 

    "ఆ బాలాహార్ ఒకరోజు నోట్లో వేసుకొని చూశాను. కాని గొంతు దిగలేదు. పొడి పొడిగా వుంది. ఇళ్ళల్లో అదికూడా దొరకని ఆ పసివాళ్ళు ఆవురావురుమని తింటుంటే నా కడుపు తరుక్కుపోయిం" దన్నాడు ధర్మయ్య. దరిద్ర దేవతకు ముద్దుబిడ్డలుగా పెరిగే ఆ పసివాళ్లు అతని కళ్ళల్లో కదిలారు.

 

    "అవునండీ ! నేనూ తినిచూశాను. అందుకే నెలకు పాతిక రూపాయలు నేను ఇస్తున్నాను. అందులో ఏ ఆకుకూరో, టమాటాలో వేసి వండితే కొంత రుచిగా కూడా వుంటుంది. మరీ అంత పొడి పొడిగా వుండదు."

 

    "బాబూ ధనవంతులంతా నీలాగే వుంటే ఎంత బాగుంటుంది!" అన్నాడు ధర్మయ్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ.

 

    "ఏమీ బాగుండదు" అన్నాడు శేఖరం ఖచ్చితంగా.

 

    ధర్మయ్య ఆశ్చర్యంగా, శేఖరం ముఖంలోకి చూశాడు.

 

    "అవునండీ! ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాల మీద మరోవ్యక్తి ఎందుకు ఆధారపడి వుండాలి? ఒకడు ఇచ్చేవాడూ మరొకడు తీసుకొనేవాడూ ఎందుకుండాలి?"

 

    ధర్మయ్య ఆలోచనలో పడ్డాడు.

 

    "నేను వెళ్ళొస్తానండీ!" అన్నాడు శేఖరం.

 

    "వెళ్ళిరా బాబూ! రాగానే కన్పించు."

 

    "అలాగేనండీ!"

 

    శేఖరం వెళ్ళి కార్లో కూర్చున్నాడు. నల్లరంగు కొత్త ఎంబాసిడర్ ఎండలో తళతళ మెరుస్తూ, దుమ్ము రేపుతూ వెళ్ళిపోయింది.

 

    ధర్మయ్య కారు వెళ్ళినవైపే చూస్తూ శేఖరం మంచితనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు.

 

    "ఏంటయ్యోయ్! అక్కడ చెట్టుక్రింద అట్టా నిలబడిపోయావేం?" జానకిరామయ్యతో కలిసివస్తున్న పరమయ్య దూరంనుంచే కేకపెట్టాడు.

 

    ధర్మయ్య రోడ్డుకేసి చూశాడు. జానకిరామయ్యా, పరమయ్యా, ధర్మయ్య దగ్గరకు వచ్చి నిలబడ్డారు.

 

    "ఎక్కడకయ్యా ఇంతెండలో బయలుదేరావు?" అన్నాడు జానకిరామయ్య.

 

    "పోస్టాఫీసుదాకా. అమ్మాయికి డబ్బు పంపించాలి" అన్నాడు ధర్మయ్య.

 

    "శేఖరం ఎక్కడకో వెళ్తున్నట్టున్నాడు? ఈ మధ్య ఎక్కువగా పట్నంలోనే వుంటున్నాడు లాగుంది. ఇంకెందుకుంటాడు? సర్పంచ్ అయిందాకా ఊళ్ళో వున్నాడు. అయ్యాక పట్నంలో వుంటున్నాడు" పుగాకు పాయతీస్తూ అన్నాడు పరమయ్య.

 

    "అదేం మాటయ్యా! ఇక్కడా అక్కడా వుంటున్నాడు. ఎక్కడుంటేనేం? గ్రామానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పరుస్తున్నాడుగా!" అన్నాడు ధర్మయ్య.

 

    "అవును ధర్మయ్యా! శేఖరం చాలా మంచికుర్రాడు. సమర్ధుడు కూడా. సర్పంచ్ అయి సంవత్సరమన్నా పూర్తి కాలేదు, ఊళ్ళోకి కరెంటు తెప్పించాడు. రోడ్డు వేయించాడు" _ జానకిరామయ్య నోట్లో చుట్ట తీసి ఖాండ్రించి ఊశాడు.

 

    "అంతేకాదు. హరిజనవాడలో బావి త్రవ్వించే ఏర్పాటు కూడా చేశాడు. సగం ఖర్చు తన చేతిది వేసుకుంటున్నాడు" ధర్మయ్య సంతోషంగా చెప్పాడు.

 

    "ఏసుకుంటాడు! ఎందుకేసుకోడూ? అబ్బ వదిలిపోయిన లప్పుందిగా లప్ప" అన్నాడు అప్పుడే అక్కడికొచ్చి ధర్మయ్య మాటలు విన్న చలమయ్య.

 

    "చాల్లే ఊరుకో! మరీ అంత అడ్డసుడిగా మాట్టాడబోక! ఉంటే! ఉన్నోళ్ళంతా లేనోళ్ళకోసం దుబారా చేస్తారా ఏంది? బడి కట్టడానికి చందా అడిగితే అలోపొలో మంటివే?" చలమయ్యను చెరిగేస్తూ అన్నాడు పరమయ్య.

 

    "అడ్డమయినోళ్ళందరికి సందాలిస్తూ కూసోటానికి నేనేం రాసులు పోసుకొని కూసోలేదు" కోపంతో "చుప్ చుప్" మంటూ చుట్ట కాల్చసాగాడు చలమయ్య.

 

    "ఏమన్నావ్? అడ్డమయినోణ్ణా?" పరమయ్య మీద మీదకు వచ్చాడు.

 

    "నిన్నన్నానా?" చుట్టతీసి తుపుక్కున ఊశాడు చలమయ్య.

 

    "నేనేగా వచ్చాను సందాకు. చూస్తున్నావుగా ధర్మయ్యా? ఎట్టా తుపుక్కున ఊశాడో?" పరమయ్య అన్నాడు.

 

    "ఊరుకోండయ్యా! మధ్య మీ గోలేంది?" విసుక్కున్నాడు జానకిరామయ్య.

 

    పరమయ్య చలమయ్యను మింగేసేలా చూశాడు. చలమయ్య పరమయ్యను నమిలేసేలా చూశాడు.

 

    పరమయ్యకు చలమయ్యంటే మొదటినుంచీ పడదు. చలమయ్య 'అవును'అంటే పరమయ్య 'కాదు' అంటాడు. పరమయ్య 'కాదు' అంటే చలమయ్య 'అవును' అంటాడు.

 

    "అవును చలమయ్యా! శేఖరం చాలా గొప్ప బుద్దికలవాడు. ఆదర్శ యువకుడు. తండ్రి సంపాదిస్తే మాత్రం కొడుకు లోకుల కోసం ఖర్చుపెట్టాలని ఎక్కడుంది? అట్లా ఎంతమంది ఈ ఊళ్ళో ఖర్చుపెడుతున్నారు? అధికారం, పరపతి వుంటే ఈ రోజుల్లో ఇంకా ఇంకా దోచుకోటానికే చూస్తున్నారు" అన్నాడు ధర్మయ్య.

 

    చుట్ట ముట్టించి "చుప్ చుప్"న కాల్చి, అది సరిగా కాలకపోతే చేతిలోకి తీసుకొని "దమ్మానింది. మండి సావటంలేదు" అన్నాడు పరమయ్య పై మాటలు వినిపించుకోనట్టు.

 

    "అవును! శేఖరం ఆ తండ్రి కడుపున పుట్టాల్సినవాడు కాదు. తెల్లవాడి అండలో జస్టిస్ పార్టీలోచేరి, పార్టీ నాయకుడై కూర్చున్నాడు. ఊళ్ళో బీదసాదల్ని నల్లుల్ని రాసినట్టు కాలికింద రాశాడు గదయ్యా!" అన్నాడు జానకిరామయ్య.

 

    "అవునవును!" అన్నాడు పరమయ్య, చలమయ్య ముఖంలోకి చూస్తూ.

 

    చలమయ్య ముఖం తిప్పుకున్నాడు.

 

    "అప్పుడు మనందరం ఏం చేశాం? ఆ రావుబహదూర్ చుట్టూ చేరి భట్రాజు పొగడ్తలు పొగిడాం! ఏ మాట కామాటే! ధర్మయ్య ఒక్కడేగా రావుసాహెబ్ అఘాయిత్యాలకూ ఎదురు నిలబడి సవాల్ చేశాడు?" అన్నాడు జానకిరామయ్య పరమయ్యనూ, చలమయ్యనూ మార్చి మార్చి చూస్తూ.

 

    పరమయ్యా, చలమయ్యా, దొంగకు తేలు కుట్టినట్టు కిక్కురు మనలేదు.

 

    "ధర్మయ్య తన ఆస్థిపాస్తుల్ని లెక్కచెయ్యలేదు. ప్రజలకోసం అనేక త్యాగాలు చేశాడు. కష్టాలు పడ్డాడు. రావుసాహెబ్ లాంటి ప్రజాకంటకుడికి సింహస్వప్నంగా అయ్యాడు.

 

    "ఏమిటయ్యా! జానకిరామయ్యా! నీకు నన్ను పొగడటం తప్పించి వేరే పనిలేదా? ఎంత అభిమానం వుంటే మాత్రం అట్లా మాట్లాడటం బాగాలేదు. నేనేం త్యాగాలూ చెయ్యలేదు. కష్టాలూ పడలేదు. మహావారధిని నిర్మించింది వానరులు. ఉడత కూడా తన శక్తి మేరకు శ్రీరామచంద్రుడి మీద వున్న భక్తిని తెలియజేసుకుంది. దానికి కూడా వానరులతోపాటు పేరొచ్చింది. అంతేనయ్యా నేను చేసిందీనూ! ఇదిగో యిప్పుడే చెబుతున్నా! మరెప్పుడూ నన్ను పొగుడ్తూ అవమానించకు" విసుక్కున్నాడు ధర్మయ్య.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra