టార్జాన్ కదలికలని తదేకంగా గమనిస్తున్నాడు అజిత్. అదనుచూసి మెరుపులా చెయ్యిజాచి, పిడికిలితో అతని దవడ మీద కొట్టాడు బలంగా.
పెద్ద సుత్తితో కొడితే ఎలా గింగిరాలు తిరిగి పడతారో అలా గింగిరాలు తిరిగిపడ్డాడు టార్జాన్. అతని దవడ ఎముక విరిగిపోయి, నోరు తెరుచుకుని, వదులుగా వేళ్ళాడుతోంది.
విషాన్ని కక్కుతున్నట్లు ఉమ్మేశాడతను. ఉమ్మికి బదులు రక్తం పడింది.
ఈలోగా మరికొన్ని జంటలు కార్లలో వచ్చాయి. అందరూ నగ్నంగానే ఉన్నారు. చుట్టూచేరి వినోదంగా ఈ పోరాటం చూడడం మొదలెట్టారు. టార్జాన్ అంతటి బలవంతుడు అలా దవడ పగిలి పడిపోతాడని వూహించలేదు వాళ్ళెవ్వరూ.
అతను మళ్ళీ లేవకుండా పడిపోగానే, అందరూ కోపోద్రిక్తులై, అజిత్ మీదకు దూకారు ఒక్కసారిగా. వాళ్ళందరూ కలిసి అజిత్ ని ముక్కలు ముక్కలుగా నరికేసి వుండేవారే. ఈ లోపల ఒక విచిత్రం జరగకపోతే -
"హుర్రే!" అని కేక వినబడింది. ఆ కేకలో పట్టరాని సంతోషం వుంది. భూమినీ, ఆకాశాన్నీ కలిపి ముడేస్తాం అన్నంత వెర్రి ఉత్సాహం వుంది.
అందరూ తలతిప్పి చూశారు.
ఆ కేక వేసిన మనిషి బాగా ఒడ్డూ, పొడుగూ ఉన్న ఒక అమ్మాయిని అవలీలగా భుజంమీద వేసుకొని తీసుకొచ్చి వాళ్ళందరి మధ్యా నిర్లక్ష్యంగా పడేశాడు. తోటి మనిషిని చూసినట్లు అభిమానంగా చూడలేదు ఆ అమ్మాయిని. తేరగా, సమృద్ధిగా దొరికే వస్తువుని దేన్నో పడేసినట్లు పడేశాడు.
కింద ఉన్న గులకరాళ్ళు గుచ్చుకుని బాధ కలిగినట్లుంది. ఆ అమ్మాయి గుక్కపట్టి ఏడవడం మొదలెట్టింది.
ఆశ్చర్యం! అది మూడునెలల పాప ఏడుపులా ఉంది గానీ, సంపూర్ణ యవ్వనం సంతరించుకున్న నవయువతి శోకంలా లేదు.
అందరూ కళ్ళు విప్పార్చి చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏడుస్తూనే వుంది. "ఉంగా! ఉంగా!" అని.
"రెడ్ ఉడ్! ఏమిటిది?" అన్నారెవరో ఉత్సుకతగా.
ఆ అమ్మాయిని మోసుకొచ్చిన రెడ్ ఉడ్ సగర్వంగా నవ్వాడు. "గిమ్మీ ఏ షాట్! ఒక్క ఇంజెక్షన్ పడెయ్యండి చెబుతాడు."
ఒక అమ్మాయి తన కారు దగ్గరికి వెళ్లి సిరెంజిలో ఒక డ్రగ్ నింపుకుని తెచ్చి ఇచ్చింది. దానితో తొడమీద పొడుచుకుని, మత్తు మందు ఇంజెక్ట్ చేసి సూది బయటికి లాగాడు రెడ్ ఉడ్. ఇప్పుడతని మొహంలోకి కొత్త కాంతి వచ్చింది.
"ఫ్రెండ్స్!" అన్నాడతను ఒక ఎత్తయిన బండమీద కూర్చుంటూ. "జెనెటిక్ ఇంజనీరింగ్ ని ఎవరు ఏ ముహూర్తంలో కనిపెట్టారో గానీ, తస్సదియ్యా. ఫాంటాస్టిక్ గా మార్చేసింది ప్రపంచాన్ని, అవునా?"
"అవును! అవును! అవును!" అన్నారు అందరూ ముక్తకంఠంతో.
'అలాగే, రాబొట్స్ ని కనిపెట్టిన తర్వాత మనుషులకి శారీరక శ్రమ అనేది బొత్తిగా తగ్గిపోయి, అంతా తీరికే మిగిలింది. ఇదివరకు మనుషుల గొడ్డు చాకిరీ అంతా రాబొట్స్ చేస్తున్నాయి ఇప్పుడు."
"అవును! ఇప్పుడింక మనకి వేరే పనేంలేదు. తిని, తాగి, తందనాలాడటం తప్ప!" అంది జేన్.
"అంతా ఆటోమేషన్ కావడం వల్ల మనం అస్సలు నడుం వంచఖ్ఖర్లేదు. బజారుకి కూడా వెళ్ళనక్కరలేదు. స్విచ్ వేస్తే షాపులో ఉండే వస్తువులన్నీ మన టీవీలో కనబడతాయి. కావలసినవి ఎంచుకుంటే ఒక రాబొట్ వాటిని తెచ్చి ఇంట్లో పడేసి వెళుతుంది. ఇంకో రాబొట్ వండి పెడుతుంది.
చివరికి మనం స్కూలుకి కూడా వెళ్లక్కరలేదు. ఫ్రెండ్స్! మీకు తెలుసు! మెదడు తన జ్ఞాపకాలని ఎలక్ట్రో కెమికల్ పద్ధతి ద్వారా ఎక్కడ, ఎలా దాచిపెట్టుకుంటుందీ అన్న రహస్యం బట్టబయలై పోయాక, ఒక్క ఇంజక్షనుతో ఆల్ జీబ్రాని గానీ, ఫిజిక్సుని గానీ మరే సబ్జెక్టును గానీ - ఒక్క ఇంజక్షన్ తో సబ్జెక్టునంతా మెదడులోకి ఇంజెక్ట్ చెయ్యగలుగుతున్నాం. అందువల్ల స్కూలూ, చదువూ అన్న లంపటం వదిలిపోయింది.
"పీడా వదిలింది" అన్నాడెవడో.
"ఫ్రెండ్స్! ఇంక జెనెటిక్స్ లోకి వద్దాం. క్లోనింగ్ ని పర్ ఫెక్ట్ చెయ్యడంతో మనం పెద్ద మెట్టు ఎక్కేశామన్న మాట! క్లోనింగ్ అంటే మీకందరికీ తెలిసే ఉంటుంది. మనందరం క్లోనింగ్ ద్వారానే పుట్టాం."
"తెలుసు! తెలుసు! సైన్సు పాఠాలు వద్దు బాబోయ్!" అంది ఒక కంఠం వెనక నుంచి బోర్ గా.
"ఆల్ రైట్! ఆల్ రైట్! నేను సైన్సు పాఠాలు వల్లించను. కానీ టూకీగా చెబుతాను - నేను చెప్పబోయే శుభవార్తకి ఉపోద్ఘాతంగా. ఓకే?
"మన తల్లిదండ్రులు క్లోనింగ్ పద్ధతిద్వారా అతిలోక సుందరంగా పుట్టించారు మనల్ని. దాదాపు క్రిందటి తరం వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడు మనం జీవకణంలో ఉండే 'జీన్' తాలూకు సమాచారం అంతా గ్రహించేసి - ఫ్రెండ్స్! ఒక్కమాట - ఒకే ఒక్క జీవకణంలో ఉండే జీన్ లోని కోడెడ్ సమాచారం అంతా కాగితాల మీద రాస్తే అది ఆరు లక్షల పేజీలవుతుంది - ఆ సమాచారం అంతా క్షుణ్ణంగా గ్రహించేశాం మనం. దానివల్ల ముసలితనాన్నీ, మృత్యువుని కూడా జయించేశాం. అది ఎలాగో చెబుతాను. మన వారసత్వపు లక్షణాలనేకాక, శరీరంలో జరిగే పెరుగుదలనీ, మిగతా క్రియలు అన్నిటినీ కూడా శాసిస్తూ ఉంటుంది జీన్.
"వార్థక్యం ఎప్పటికప్పుడు మనిషిమీద పడిపోదామని చూస్తూ ఉన్నా, జీన్ నిరోధిస్తూ ఉంటుంది. జీన్ లో ఎప్పుడు నిర్లప్తత ఏర్పడుతుందో, అప్పుడు వార్ధక్యం పులిలా మీదికి ఉరుకుతుంది. దాన్ని అనుసరించి వెనకాతలే వస్తుంది మృత్యువు.
"ఫ్రెండ్స్! మనం జీన్ యొక్క... తాలూకు సాంకేతిక కోడ్ నేర్చుకుని, ఆ కోడ్ లోనే 'వృద్ధాప్యాన్ని నిరోధించు' అన్న ఆజ్ఞ జారీ చేసి, జీన్ నిర్లిప్తత చెందకుండా జాగ్రత్త పడుతూ, నిత్య యౌవనంలో ఉంటున్నాం. బయోలాజికల్ క్లాక్ ని అదుపులో పెట్టుకున్నాం."
"బాష్! ఇదంతా పాత చింతకాయ పచ్చడి" అని సకిలించాడు ఒకడు.
"ఉండండి! ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, మనం చిరాయువులుగా వుండిపోతాం. ఎప్పుడూ మన పాత మొహాలు మనమే చూసుకుంటూ వుండవలసి వస్తుంది. కొత్తవాళ్ళని సృష్టించడం, వాళ్ళని సాకడం, వాళ్ళ ఆలనా పాలనా, ఓహ్ హెల్! అదంతా పెద్ద గొడవ! పైగా - కొత్తవాళ్ళని సృష్టిస్తే మనకున్న వనరుల్నీ, డబ్బునీ వాళ్ళతో పంచుకోవలసి వస్తుంది. ఆ తర్వాత, వాళ్ళు కూడా చావకుండా చిరాయువులుగానే ఉండిపోతారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు...
ఫ్రెండ్స్! ఇదంతా తలుచుకుంటేనే వళ్ళు జలదరిస్తుంది. అందుకని నేనొక అద్భుతమైన పరిష్కారం కనిపెట్టాను. జెనెటిక్ ఇంజనీరింగ్ లోనే సరికొత్త ప్రక్రియ! డిస్పోజబుల్ పీపుల్! వాడేసి అవతల పారెయ్యడానికి వీలయిన మనుషులు!
"ఇదివరకంతా డిస్పోజబుల్ పేపర్ నాప్ కిన్సూ, పేపర్ కప్పులూ, ప్లేట్లూ, చెక్క స్పూనులూ, అలాంటివి వచ్చాయి. కానీ ఇప్పుడు...ఐ రిపీట్! డిస్పోజబుల్ పీపుల్! మూడే నెలల్లో పూర్తిసైజు మనుషుల్లా ఏపుగా పెరిగిపోతారు. మీరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళని వాడుకోవచ్చు. వాళ్ళతో ఆడుకోవచ్చు! మీకు బోర్ కొట్టాక ఒక్క ఇంజక్షన్ తో చంపేసి, అవతల పారేసి, కొత్త మనిషిని కొనుక్కోవచ్చు. చాలా చౌకగా తయారుచెయ్యవచ్చు వీళ్ళని. ఈ పాపని చూడండి!"
అందరూ ఆ పాపని చూశారు. కిందపడి వున్న ఆ పాప లేచి కూర్చుని అమాయకంగా అందరినీ చూస్తోంది. పద్దెనిమిదేళ్ళ యువతీ శరీరంతో మూడు నెలల వయసుతో ఉన్న పాప! సైన్సు వెర్రి తలలు వేసి, జెనెటిక్స్ "జెనెట్రిక్స్" గా రాక్షస వినోదంగా మారగా పుట్టిన పాప!
రెడ్ వుడ్ మళ్ళీ మొదలెట్టాడు.
"చెట్లని పెంచడం కొన్నాళ్ళు అబ్జర్వ్ చేశాక నాకీ ఆలోచన తట్టింది. చెట్లు పెంచడంలో ఏమేం పద్ధతులున్నాయి?
"అంటుకట్టి అదే జాతి మొక్కని మొలిపించడం, సూపర్ ఎరువులు వేసి పెద్ద సైజు ఫలపుష్పాలని సృష్టించడం, త్వరత్వరగా ఫలానికొచ్చే వంగడాలనూ, హైబ్రిడ్ రకాలను కనుక్కోవడం -
"ఇదంతా చూసి నేను హైబ్రిడ్ మనుషులని తయారు చేశాను.
"కాయగూరల గింజలు అమ్మినట్టే ఇకనుంచీ షాపుల్లో ఫ్రోజెన్ బేబీస్ ని పాకెట్లలో అమ్ముతారు. పాకెట్ మీదే పెరగబోయే మనిషి తాలూకు రూపురేఖలూ, జుట్టు రంగూ, కళ్ళ రంగూ రాసి ఉంటుంది. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు తమ బ్రాండ్ పేర్లక్రింద వీళ్ళని తయారుచేస్తాయి.
"నౌ! ఈ డిస్పోజబుల్ బేబీని - ఈ పక్వాని కొచ్చిన పాపను మీకు అంకితం చేస్తున్నాను. వాడి పారెయ్యండి. తర్వాత మరో పాపను ప్రెజెంట్ చేస్తాను" అన్నాడు రెడ్ వుడ్. వెంటనే హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు అందరూ.
"రెడ్ వుడ్! పక్షపాతం! పాపేనా, బాబు లేడా?" అంది జేన్ ఆరోపణగా.
రెడ్ వుడ్ కళ్ళు పెద్దవిచేసి చూశాడు. "మైడియర్ జేన్! నువ్వు మరీ ఇంత ఓల్డ్ ఫ్యాషన్ అనుకోలేదు. ఏం? నీకు పాప పనికిరాదా?" అన్నాడు రెండర్ధాలు పలికిస్తూ.
"సరే! సరే! అడ్జస్టయిపోతాను. కానీ రేపు బాబుని తీసుకురా!" అంది జేన్ నవ్వుతూ.
ఇంతలో ఒకడు ఉన్మాదిలా నవ్వుతూ ముందుకు వచ్చాడు. అతను ఇరవై ఒకటో శతాబ్దపు హిప్పీలాంటి వాడు. ఇప్పటి హిప్పీలు సమాజం మీద తిరుగుబాటు చేస్తే, అతను సృష్టి మీదే తిరుగుబాటు చేసినట్లున్నాడు. ఒక కోతి తాలూకు తోకని తనకు ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు అతను. తను ఎవర్నీ లక్ష్యపెట్టడని ప్రదర్శించడానికి.
ఆ తోకని కదిలిస్తూ, ఆశగా ఆ పాపవైపు చూస్తూ, ఒక్కొక్క అడుగే ముందుకు వెయ్యడం మొదలెట్టాడు. 'మనిషి వేస్తున్న ఒక్కొక్క అడుగు మానవత్వానికే వెనకడుగు!' అనిపించింది అజిత్ కి.
వంపులు తిరిగిన ఒంటితో యౌవనవతిలా కనబడుతున్న ఆ హైబ్రిడ్ పాప, జరగబోతున్న కిరాతకం తెలియకపోయినా ఎందుకో గుక్కపెట్టి ఏడవడం మొదలెట్టింది. పాలబుగ్గలమీద నుంచి కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి.
మనసు కలచివేసినట్లయింది అపురూపకి. పాతకాలపు లాలిపాట ఒకటి గుర్తొచ్చింది.
"ఏడవకు ఏడవకు వెర్రి నా తల్లీ
ఏడిస్తె నీ కళ్ళు నీలాలు కారూ
పాలైన కారవే బంగారు కళ్ళూ!"
ఆ పాట గుర్తొచ్చి, కళ్ళు తడితడిగా అయిపోయాయి అపురూపకి. పరుగెత్తుకెళ్ళి ఆ పాపను ఆ నరరూప రాక్షసుల, అతి నాగరిక మనుషుల బారినుంచి తప్పించి, గుండెలకు హత్తుకోవాలనిపించింది. పొట్ట తడిమి, ఆకలేస్తోందేమో చూసి, పాలు పట్టాలనిపించింది.
తనలో మాతృత్వపు ఛాయలు కూడా ఉన్నాయని ఆ అమ్మాయికి అర్థమయింది. ముందుకు అడుగెయ్యబోయింది.
వెనకనుంచి చెయ్యిపట్టుకుని వారించాడు అజిత్. అతను గుండెలనిండా గాలి పీల్చుకుని, నరాలన్నీ బిగపట్టి, శరీరాన్ని ఉక్కులా చేసి, ఉరకడానికి సిద్ధంగా ఉన్నాడు.
తోక తగిలించుకున్న ఆ హిప్పీ డ్రమెటిక్ గా ఒక్కొక్క అడుగే వేస్తున్నాడు.
అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఉత్సుకత కనిపిస్తోంది వాళ్ళ మొహాల్లో.