Previous Page Next Page 
కళ్ళు పేజి 12


    "ఎలా వుంది."

 

    "చాలా రిచ్ గా వుంది. అతను చాలా ధనికుడై ఉండాలి."

 

    "మీరు చూసినంతలో అతని మొహంమీదగాని, శరీరంమీదగాని ఏమయినా గుర్తులు- అంటే మచ్చలు, పుట్టుమచ్చలు వగైరాలు... అలాంటివేమైనా వున్నాయా?"

 

    "గుర్తులేదు. బహుశా వున్నట్లు లేవు."

 

    "అతని రంగు..."

 

    "తెలుపుక్రిందే వస్తాడు."

 

    "అతనికి మీసముందా?"

 

    "లేదు."

 

    "థాంక్స్. అవసరమున్నప్పుడు మళ్ళీ కలుస్తాను" రంజిత లేచింది.


                                        5


    అశ్వనీకుమార్ స్ప్రింగ్ డోర్ త్రోసుకొని లోపలికొచ్చాడు.

 

    "ఎవరు?" అంది మందాకిని.

 

    "నేను..."

 

    ఒక్కసారిగా ఆమె ఒళ్ళంతా పులకరించినట్లుగా అయి, అంతలో మామూలుగా మారిపోయింది.

 

    "నువ్వు... నువ్వు... నువ్వు... నా..." ఆమె పెదవిదాటి మాట బయటకు రాలేకపోయింది.

 

    "మందాకినీ!" అన్నాడు. "జరిగిందానికి నేను చాలా విచారిస్తున్నాను.

 

    ఆమె విషాదంగా నవ్వింది. "కూర్చో!" అంది.

 

    అతనామెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు.

 

    "అక్కడ కాదు. ఇక్కడ. ఎలా తెలిసిందని ఆశ్చర్యపడుతున్నావా? కళ్ళు పోయాక, వినికిడిని బట్టి పరిసరాలు గ్రహించటం కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను.

 

    అతనామె ప్రక్కకి వచ్చి కూర్చున్నాడు.

 

    "అశ్వనీ!" అంది. "ఎంత ఆనందంగా వుండేవాళ్ళం! జీవితాన్ని గురించి ఎన్ని రంగురంగుల కలలు కన్నాం!"

 

    "మందాకినీ! నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ దుర్మార్గుడెవరు?" ఎందుకు చేశాడు? వాడ్ని చంపేస్తాను. పొడిచి పారేస్తాను" అన్నాడు అశ్వనీకుమార్ ఆవేశంగా.


    
    మందాకిని నవ్వింది. అదే విషాదం.

 

    "అవన్నీ చేయటంవల్ల నా కళ్ళురావు, నేను సర్వస్వం కోల్పోయాను. ఆఖరికి నిన్ను కూడా!"

 

    అశ్వనీకుమార్ మాట్లాడలేదు.

 

    "అవునా?"

 

    అప్పటికీ అతని జవాబు లేదు.

 

    "అశ్వనీ! మా నాన్న కోటీశ్వరుడు. నేనాయన అందాల కుమార్తెను. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు. నా కళ్ళు బావుంటాయి- సారీ- బావుండేవి. వాటిని చూసి నువ్వు నన్ను ప్రేమించావు, ఆరాధించావు. నన్ను పెళ్ళి చేసుకుందామని తహతహపడ్డావు. ఇప్పుడా అందమైన, సొగసైన కళ్ళు లేవు అశ్వనే౧ ఇహరావు. ఆ కళ్ళులేని ఈ మందాకిని నీకక్కర్లేదు. అవునా?"

 

    అతను మౌనంగానే వున్నాడు.

 

    "మందాకినే౧ కళ్ళు ఉంటేనేం, లేకపోతేనేం. నా మనోనేత్రం ముందు అవెప్పుడూ మెదుల్తూనే ఉంటాయి. కేవలం నీ కళ్ళని చూస్తూ, ఆనందిస్తూ కాలక్షేపం చెయ్యలేదుగా. నిన్ను అణువణువునా ఆస్వాదించాను. ఈ బంధం కళ్ళు లేనంత మాత్రాన సడలిపోదు- అని అనలేకపోతున్నావు. కనీసం అనాలన్న ఆలోచనకూడా నీకు రావటంలేదు. అవునా!"

 

    "మందాకినీ?"

 

    "చెప్పు. ఇప్పుడు నేను నీకేమీకాను. మన బంధం పగిలిపోయింది. మనమిద్దరం పెళ్ళిచేసుకోబోవటంలేదు. చెప్పు అశ్వనీ!"

 

    "నన్ను క్షమించు... మందాకినీ... అపార్థం చేసుకోకు."

 

    "అర్థమయింది. ఇంకెప్పుడూ నా కళ్ళకు కనిపించకు. ఐయామ్ సారీ ఈ ఛాయలకు రాకు. ప్లీజ్ గెటవుట్."

 

    మందాకిని ఏడుస్తోంది కళ్ళనీళ్ళు రాకుండా- అవి రాలేవు, రాలలేవు కాబట్టి.


                                                          *  *  *


    మందాకిని తాలూకు కళ్ళు ఏమయి వుంటాయి? రంజితను ఇదే ప్రశ్న నిరంతరం వేధిస్తోంది. ఆమె కళ్ళ తాలూకు కార్నియా ఎంత జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసినా వారం రోజుల్లోపల ఇంకొకరికి ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడాలి. ఆ తర్వాత అవి ఇంకొకరికి ఉపయోగపడవు. దేశంలో కార్నియల్ డిసీజెస్ వల్ల అంధత్వం వచ్చినవారి సమాఖ్య విపరీతంగా ఉంది. వారి అంధత్వాన్ని తొలగించటానికుపయోగపడే ఐబాల్స్ డొనేట్ చేయబడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

 

    కళ్ళు!

 

    శరీరంలో వాటికి ఎంత విలువ వుంది! అవి లేకపోవటం వల్ల ఎంతమంది గొప్పవాళ్ళ జీవితాలు నిరర్థకాలయిపోయినాయి!

 

    అలాగే ఓ కన్ను పోయినా, రెండో కంటితో అలవాటు చేసుకుని అద్భుతంగా జీవితాన్ని సార్థకం చేసుకున్నవాళ్ళున్నారు. నవాబ్ ఆఫ్ పటౌడీ కారు యాక్సిడెంట్ లో ఓ కన్ను పోగొట్టుకున్నాడు. కాని ఆ తర్వాత ఒక్క రెండో కంటితోనే ఎడ్జస్ట్ చేసుకుని క్రికెట్ లో గొప్ప బ్యాట్స్ మేన్ గా, ఫీల్డర్ గా రాణించాడు.

 

    కాని యాక్సిడెంట్ వల్ల కాని, జబ్బులవల్లకాని, వృద్ధాప్యం వల్ల కాని చూపు పోగొట్టుకుని ఎంతో చైతన్యవంతంగా గడపవలసిన జీవితాన్ని అంధకారం చేసేసుకున్న వాళ్ళు కోకొల్లలు.

 

    కన్ను ఎంత చిన్న అవయవం! కాని అందులో ఎన్ని విభాగాలు! కన్ జంక్టయిన కార్నియా, ఐరిస్, లెన్స్, రెటీనా మాక్యులా ఆప్టిక్ నర్వ్, ప్యూపిల్, సిలియరీబాడీ.

 Previous Page Next Page