Previous Page Next Page 
మగబుద్ధి పేజి 12


    "మొత్తం బిల్లు నేను ఇస్తాలెండి" అని అతని బిల్లూ రజనీనే ఇచ్చింది.

 

    "మీకు చిల్లర తక్కువైనప్పుడంతా మా రజనీని తలుచుకోండి. సువర్ణసుందరి కథలో నాగేశ్వరరావుకు అంజలీదేవి ప్రత్యక్షమైనట్టు ప్రత్యక్షమై మీ చిల్లర సమస్యను తీరుస్తుంది" అంది సరూ నవ్వుతూ.

 

    ఆమె మాటల్ని పట్టించుకోకుండా రజనీతో అన్నాడు.

 

    "చాలా థాంక్సండీ. నా పరువు పోకుండా కాపాడారు."

 

    రజని మొహమాట పడుతూ నవ్వింది.

 

    "ఇంతకీ మీరేం చదువుకున్నారు?" అడిగింది ఆమె.

 

    "ఎం.ఏ. ఫిలాసఫీ."

 

    "ఆ రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన కంపెనీ పేరేమిటి?"

 

    "స్మిత ఎక్స్ పోర్టింగు కంపెనీ."

 

    ఆమె ఏదో ఆలోచిస్తున్నట్టు ఓ నిముషంపాటు మౌనంగా ఉండిపోయి ఆ తరువాత "వస్తానండీ" అని చెప్పింది.

 

    రజని బయల్దేరేసరికి సరళ కూడా ఆమెను అనుసరిస్తూ "వెళ్ళొస్తాం." 'చితగారూ' అంది చిత అనే అక్షరాలను వత్తి పలుకుతూ.

 

    "చితగారూ! అలా అంటే ఏమిటే?" నడుస్తూనే అడిగింది రజని.

 

    "చిత అంటే చిల్లర తక్కువ" అని నవ్వింది సరళ.

 

    ఆ నిక్ నేమ్ కు రజనీకే నవ్వొచ్చింది. అయితే ఆమె బయటకు నవ్వలేదు. అతికష్టం మీద నవ్వకుండా నిగ్రహించుకుంది.

 

    "నిక్ నేమ్ వింటే అతను బాధపడతాడేమోనే" వెనక్కు తిరిగి చూస్తూ అంది రజని.

 

    ఆమె వూహించింది కరక్టే, తనకు పెట్టిన నిక్ నేమ్ ని నరేష్ విన్నాడు.

 

    అతను భారంగా అక్కడ్నుంచి కదిలాడు.

 

    అంతవరకు వాళ్ళ సంభాషణల్ని దొంగచాటుగా విన్న బ్రహ్మానందం కూడా బయటకు నడిచాడు.

 

                              *    *    *    *    *

 

    నరేష్ సుగుణ పెట్రోల్ ఫిల్లింగు స్టేషన్ లో పనిచేస్తున్నాడు. గంట క్రితమే ఆ పనిలో చేరాడు. పెట్రోల్ ఎలా పట్టాలో నేర్పించి, పెట్రోల్ పట్టమన్నారు. పైప్ ను తీసుకుని భయం భయంగా పెట్రోలు పడుతున్నాడతను. ఆ రోజంతా పనిచేస్తే పన్నెండు రూపాయలు వస్తాయి.   

 

    మరీ పూట గడవనప్పుడు అలాంటి చిన్న చిన్న పనులు చేయడం అతనికి అలవాటు. అంతకు ముందు ఓసారి ఆ పెట్రోల్ బంక్ లో పనిచేశాడు. ఆ పరిచయం దృష్ట్యా అతనిని పనిలో పెట్టుకున్నారు.  

 

    అప్పటికి టైమ్ పదకొండు గంటలైంది. వచ్చే వాహనాలకు నరేష్, మరో కుర్రాడు పెట్రోల్ పడుతున్నారు.

 

    ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల అతడికి బాగా ఆకలేస్తోంది. అయితే దాన్ని అతను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అతని మనసు నిండా రజనీ నిండిపోయింది. చూసింది రెండేసార్లయినా ఆమె రూపం అతనిలో ఇంకిపోయింది. తనకూ, ఆమెకు మధ్య జరిగిన సంఘటనలన్నిటిని పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు.  

 

    అప్పుడప్పుడే అడుగులు వేయడం ప్రారంభించిన పసిపిల్లాడు కేరింతలు కొడుతున్నట్టు అతను రజనీని తలుచుకుంటూ వుబ్బితబ్బిబై పోతున్నాడు. ఆమెను తలుచుకోవడమే అద్భుతమైన అనుభవంగా ఫీలవుతున్నాడు.

 

    ఆమె అంతస్థు గురించిగానీ, ఆమె తనకన్నా అన్ని విధాలా గొప్పదనిగానీ, ఆమె తనను ప్రేమిస్తుందా అన్న శంకగానీ అతనికి లేవు. వాటినన్నిటినీ బేరీజు వేసుకుని, లెక్కలు కట్టుకుని ఇష్టపడడం ప్రేమలోపడ్డ వారికి చేతకాదు. అందుకే చాలా ప్రేమలు 'వన్ సైడ్' ట్రాఫిక్ లానే మిగిలిపోతాయి. మరి అతను ఆమెను గెలుచుకుంటాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఈపాటి ఆలోచన కూడా లేదతనికి. ఆమె అంటే ఇష్టం ఏర్పడింది. అది పిచ్చిగా ముదిరే దశలో ఉంది మనసు చెప్పినట్లు అతను ప్రవర్తిస్తున్నాడు. జీవితంలో తొలిసారిగా అతను ఓ ఆడపిల్లను ప్రేమిస్తున్నాడు.  

 

    అంతలో ఓ స్కూటర్, ఒక మోపెడ్ వచ్చాడు.

 

    "గురూ! మోపెడ్ కి ఆయిల్ పట్టు" అని బంక్ కుర్రోడు చెప్పాడు నరేష్ తో.

 

    స్కూటర్ నుంచి దిగిన స్త్రీపై ఒక లుక్ విసిరి మోపెడ్ దగ్గరకు వెళ్ళాడు అతను.

 

    పెట్రోల్ పట్టుకున్నాక ఆ రెండు వాహనాలూ వెళ్ళిపోయాయి.

 

    స్కూటర్ కు ఆయిల్ పట్టిన ఆ కుర్రాడ్ని దగ్గరికి పిలిచి "ఇప్పుడు స్కూటర్ లో వచ్చిన అమ్మాయికి అన్నీ బాగున్నాయి, ముక్కు తప్ప. ఆ ముక్కు చివరలో కొద్దిగా బెండ్ అయివుంటే మరింత బావుండేది. అవునూ! ఒక్క విషయం గుర్తు పెట్టుకో. స్త్రీలు ఉన్న ఏ వాహనం వచ్చినా దానికి నేను ఆయిల్ పడతాను. మిగిలిన వాహనాలకు నువ్వు పట్టు సరేనా?" అని చెప్పాడు.

 

    "నీ విషయం తెలిసిందేగదా గురూ! నీకు ఆడపిల్లల యావ" నవ్వుతూ అన్నాడు ఆ కుర్రాడు.

 

    "దాన్ని యావ అంటే నీపై పెట్రోల్ పట్టేస్తాను. యావ కాదు. సౌందర్యారాధన. ప్రకృతిలోని సౌందర్యాన్నంతా తనలో నిక్షిప్తం చేసుకున్న జీవి స్త్రీ. రామచిలుక ముక్కులో అందం వుంటుంది. పాముకి పడగలో వుంటుంది. నెమలికి ఫించంలో ఉంటుంది. అయితే స్త్రీకి మాత్రమే అన్ని అవయవాల్లోనూ అందం వుంటుంది. ఆ అందాన్ని తనివితీరా గ్రోలడమే నేను చేస్తున్నది. మరో చెడు ఉద్దేశ్యం కలగదు నాకు వాళ్ళను చూసినప్పుడు. అర్థమైందా?"

 

    అర్థమైనట్లు తలవూపాడు ఆ కుర్రాడు.

 

    వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రాళ్ళపల్లి మోటార్ బైక్ మీద వచ్చాడు.

 

    ఆయన్ను చూస్తూనే "సార్" అంటూ దగ్గరికెళ్ళాడు నరేష్.

 

    "ఏమోయ్ నువ్వా! ఇదేమిటి ఇక్కడుంటున్నావ్?" అడిగాడు ఆయన.

 

    "మిమ్మల్ని అప్పు అడగడం ఇష్టం లేక తాత్కాలికంగా ఇక్కడ పనికి కుదిరాను సార్."

 

    "ఎం.ఏ చదివిన నువ్వు పెట్రోల్ పడుతున్నావా?"

 

    "అప్పు అడగడం కన్నా ఇది నయం కదాసార్" వినయంగా చెప్పాడు నరేష్.      

 Previous Page Next Page