Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 12


    "భయపెట్టి ప్రభుత్వం చేయడం అనే సిద్ధాంతం మారిపోయింది. రాజు అంటే రంజింప చేసేవాడు కాని, కాలరాచేవాడు కాడు. ప్రభుత్వం ప్రజలలో విశ్వాసం కలిగించాలె. ప్రజలు ప్రభుత్వాన్ని తమది అనుకునేట్లు చేయాలి. జానకి ఏ భయంతో మిమ్ములను ప్రేమిస్తున్నది? జానకి విషయంలోనూ నాకు ప్రేమాభిమానాలు ఎందుకున్నాయి? వీటికి కారణం భయం కాదు, ప్రేమ, విశ్వాసం కారణాలు. ప్రభుత్వం అటువంటి వాటిని ప్రజల్లో కలిగించుకోవాలి. అది నిజమైన ప్రభుత్వం."

 

    వీరయ్యగారి తల తిరిగిపోయింది. వారు ఏదో అయోమయంలో పడ్డారు. వారికి రఘు చెప్పినవన్నీ స్పష్టంగా అర్థం కాలేదు. కాని వాటిలో ఎక్కడో సత్యం ఉందనే విషయం గోచరించింది. అయినా ఏదో క్షోభ మొదలైంది. రఘు ఏవేవో కొత్త కొత్త విషయాలు చెప్పుతున్నాడు. అతడు పురాణాలు చెప్పడంలేదు. జరిగిన వాటిని గురించే చెపుతున్నాడు. వినడానికి బాగున్నాయి. కాని ఆచరణలో అవి సాధ్యములా?

 

    వారికి జానకి విషయం గుర్తువచ్చింది. రఘును అతని వాక్ప్రవాహాన్ని తలచుకున్నారు. అతడు తన కూతురును సుఖపెట్టగలడా? తాను చిక్కుల్లో దూరి జానకిని ఈడ్చడుకదా? వీరయ్యగారికి తామె క్రమక్రమంగా ముళ్ళ పొదలోకి అడుగు వేస్తున్నట్లు అనిపించింది. ఇంకేవేవో ఇలాంటి ఆలోచనలే సాగాయి. ఆలోచనలు దూరం చేయడానికి చుట్ట వెలిగించారు. దాంతో అవి మరీ ముసురుకున్నాయి. రఘు అక్కణ్నుంచి లేచిపోయిండుగాని, జానకి భోజనం ముగించింది గాని గమనించలేదు. ఎప్పుడో తెములుకొని చూస్తే ఇద్దరూ కనిపించలేదు. లేచి గదిలోకి వెళ్ళి మేను వాల్చారు. కళ్ళు మూసుకున్నారు. నిద్రపోవడానికి ప్రయత్నించారు. కాని వారికి ఆలోచనలు వదల్లేదు. వాటికి సంబంధించిన స్పష్టమయిన రూపమూ కనిపించలేదు. ఎందుకో వారికి జానకిని పిలిచి అడగాలనిపించింది. పిలిచాడు. జానకి వచ్చి నుంచుంది. కాని ఏ మడగాలో అర్థంకాలేదు. కూర్చోమన్నాడు. కూర్చుంది. అయినా ఏమి అడగలేదు. అంతా మౌనం.

 

    "పిల్చినావు నాయనా?"

 

    "అవును పిల్చిన!"

 

    "ఏంది?"

 

    "అదే ఆలోచిస్తున్న. బావ ఏందెందో చెప్పుతడు నీకేమన్న అర్థమవుతున్నదా?"

 

    "అదేంది నాయ్నా. ఎందు కర్థమయితలేదు. బావ చెప్పెడిదంత నిజం. ఆయన వెలుగు నాయ్నా వెలుగు! ఏమన్న తప్పనిపిస్తున్నదా నీకు" అని, నాగేశ్ ఇంకా గట్టిగా వాదిస్తాడనీ, దోపిడీ, పీడిత ప్రజలు శ్రామికుల తిరుగుబాటు అనే పదాలు వాడుతూ వాదిస్తూనే పిడికిళ్ళు బిగించి పైకి ఉరుకుతాడనీ, అతనికి విప్లవం, తిరుగుబాటు తప్ప వేరే తెలియదనే చెప్పుదామనుకుంది తండ్రితో. కాని ఎందుకో ఆవిడ మనసు వారించింది.

 

    "ఏం నిజమో తల్లీ! నాకంత అయోమయం గున్నది. కొరివితో తలగోక్కుంటున్నామేమో అనిపిస్తుంది. జర నువ్వుకూడ ఆలోచించు తల్లీ" అన్నాడు. ఎంతో అనాలనుకున్నాడు కాని అంతకు మించి అనలేకపోయాడు.

 

    ఆ మాటలు జానకిలో ఉత్సాహాన్ని కలిగించాయి. తండ్రికి బావ చెప్పినట్లూ, బావతో నాగేశ్ వాదించినట్లూ వాదించాలనుకుంది. ఒక వాక్ప్రవాహం ఆమెలో పెల్లుబికింది. అయినా ఆనకట్ట తాకి నిలిచిపోయింది. "అవును నాయ్నా! త్యాగం చేయాలె" అన్నది.

 

    వీరయ్యగారు బిత్తరపోయి కూతురును చూచారు; ఇదొక కొత్తపదం! అంత వరకు విననిది. అదీ తన కూతురు నోటినుంచి! మొన్నటివరకు గడప దాటని పసిదాని నుంచి. ఆ పదం అర్థం కాలేదు వారికి. కళవర్ పడ్డాడు. అందును గురించిన వివరాలు అడుగుదామనుకున్నారు. కాని ఎవరిని అడగాలి! తన కూతురును, పసి కూనను. తనకు తెలియని ఇన్ని విషయాలు తెలుసునా ఈ చిన్న తల్లికి. ఏదో పెద్దతనం అడ్డం వచ్చింది. అడగలేకపోయారు. మనసు ఒప్పలేదు. "సర్లె తల్లి నీపని చూసుకో" అన్నారు.

 

    జానకి చిన్నబుచ్చుకుంది. వెళ్ళిపోయింది.

 

    వీరయ్యగారు ఆలోచనలను వదులుకోదలచుకున్నారు. అవి వారిని వదలడంలేదు. ఏదో అయోమయంలో పడిపోయారు. ఏదో చిట్టడవిలో, చీకటి కోనలో దారీ, తెన్నూ తెలియక సాగిపోతున్నట్లనిపించింది. ఒక నేల చెక్కకోసం, ఒక పశువుకోసం, ఒక పడతికోసం, ఒక పంతం కోసం పోట్లాడుకోవడాలు తాను ఎన్నో చూచాడు. అందుకోసం కాళ్ళూ కడుపులూ పట్టుకోవడాలు, కోర్టులకు తిరగడాలు తానెరుగును. కాని ఇవేమిటి? రాజులు లేకుండా చేస్తారట! తిరుగుబాట్లు లేవదీస్తారట! విప్లవం తెస్తారట. ఎవరికోసం ఈ పాట్లన్నీ? ఎందుకూ కష్టాలు కొనితెచ్చుకోవడం? గుబులుగా మనసులో ప్రవేశించింది. భయంగా మారింది. ఏదో తుపాను రేగపోతున్నట్లూ, అగ్గి కొండ బద్దలు కానున్నట్లూ అనిపించింది. దాన్ని వారించాలనుకున్నారు. అంటే ఎవరిని వారించాలి? రఘును. ఎలా? అతడు తనమీద అనిర్వచనీయమైన ప్రభావం వేశాడు. తాసిల్దారు మంత్రాలు తనమీద పనిచేయలేదు. కాని రఘు మాటలకు లొంగిపోయాడు తాను! మాటలకు మంత్రాలను మించిన ప్రభావం ఉందా? కుర్రకుంక. ఎన్ని నేర్చాడు! అన్ని వాస్తవాలె. చీకట్లు పోవాలి. వెలుగు రావాలి. వాస్తవంగానే వెలుగు ఎంత అందమైంది. చీకట్లు ఎంత భయంకరం అయినవి. చీకట్లకూ భయానికీ ఏదో దగ్గర సంబంధం ఉంది. అది నిజం చాకట్లు పోవాలి. నెలగారావాలి. నిజమే. జానకికూడ ఏదో అన్నది. అది తనకింకా అర్థం కాలేదు. ఏమిటీ ఆలోచనలు! ఆలోచనలు ఆలోచనలను పొదుగుతాయా? తాను రఘును వారించగలడా? వారించలేడు. అతడు వెలుగు తాను చీకటి. అతడు జ్ఞానం, తాను అజ్ఞానం. అయితే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి?

 

    ఆలోచనల్లోనే పగలు నిద్ర పట్టింది.

 

    రోజూ వచ్చినట్లే రాత్రికి వచ్చాడు నాగేశ్. బొడ్లోంచి పత్రిక తీసి రఘుకి అందించాడు. రఘు శీర్షికలు చూస్తూండగా జానకి గదిలో ప్రవేశించింది. నాగేశ్ కు నమస్కరించింది. ఈ మధ్య జానకి కూడా చర్చలో పాల్గొంటోంది.

 

    పత్రిక మడిచిపడేశాడు రఘు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ రాజకీయాలను గురించి చర్చించుకున్నారు. రష్యా యుద్ధంలో ప్రవేశించగానే అది ప్రజా యుద్ధంగా మారడాన్ని గురించి వారు ఎన్నోసార్లు చర్చించుకున్నారు. మళ్ళీ వాదించుకున్నారు. విసునూరు దొర దౌర్జన్యాలను గురించీ, ప్రజల పోరాటాలను గురించి మాట్లాడుకున్నారు. ప్రభుత్వంలో సగం స్థానాలు ఇత్తెహాదుల్ ముసల్మేన్ కు ఇవ్వాలనే నైజాం నవాబు ప్రతిపాదనను గురించి తీవ్రంగా చర్చించుకున్నారు. తరువాత మంగలి రావఁడి కథంతా చెప్పిన రఘు, పొలం ఇవ్వడానికి వీరయ్యగారు సుమారు అంగీకరించినట్లేనని చెప్పాడు.

 

    ఆ మాటలు విని నాగేశ్ మండిపోయాడు. అతని రక్తం తుక తుక ఉడికింది. కోపం పొంగింది. కస్సున తోక తొక్కిన తాచులా లేచాడు.

 

    "బడా భూస్వాములు, పెత్తందార్లు, జమీందార్లు చేతులలో ఉద్యమాలు నలుగుతున్నాయి. నసిస్తున్నాయి. మీలో ఫ్యూడల్ వ్యవస్థ జీర్ణించుకొని పోయింది. ఆ వ్యవస్థ మీలో చావలేదు. చావదు. చచ్చిందనుకోవటం నా తప్పు. ఔదార్యం చూపించాలె ననుకుంటరు - ఔదార్యం! ఎంత మంది కిస్తరు పోయిన భూములు? ప్రజలలో వచ్చిన అసంతృప్తి, ద్వేషం అనే అగ్నిని రాగల్చాలె. ఆ అగ్నిలో ఈ వ్యవస్థ కాలి బూడిద కావాలె. ఆ బూడిదలోంచి ఒక కొత్త వ్యవస్థ, ఒక నవసమాజం పుట్టాలె. అందులో పేదా, ధనికుడు, పాలకుడు, పాలితుడు ఉండరు. అందరు మనుషులే. అందరు సమానులే. మానవునికి మానవునికి ఉన్న సంబంధమే ఉంటుంది. వారికి ఈర్ష్యాద్వేషాలు ఉండవు. ప్రేమానురాగాలు ప్రభవిస్తాయి. అటువంటి సమాజం నీ నాయకత్వాన వస్తుందనుకున్న, పొరపాటుపడ్డ. ఇక నా దారి నేనే చూచుకుంట. ఆ మంగళ్ళలోనే అగ్గిరేపుత. ఆ మంగలి కత్తితోనే తాసిల్దారు గొంతు తెగాలి" అని నిప్పులు కక్కి దిగ్గున లేచాడు నాగేశ్, వెళ్ళిపోవడానికి ఉద్యక్తుడు అవుతూ.

 

    రఘు ఉక్కిరి బిక్కిరి అయినాడు. అదిరిపోయాడు. అతనికి ఏమీ తోచలేదు. తోచిందల్లా నాగేశ్ ను పోనివ్వరాదనేది. అమాంతంగా లేచి నాగేశ్ ను పట్టుకున్నాడు. "నాగేశ్! నీవు వెళ్ళిపోవద్దు నేను తప్పు చేసిన్నంటున్నవు. చేసిన. రా. కూర్చొ. దిద్దుకుందాం" అని నాగేశ్ ను కూర్చోబెట్టి "నాగేశ్! ఫ్యూడల్ మనస్తత్వం ఇంకా నాలోంచి దూరం కాలేదన్నావు. నిజం కావచ్చు. అయినా తమ్ముడూ! ఇంటి ముందరికి ఆకలిగొన్న ఒకడు వచ్చిండు. ఆకలిగా ఉన్నదని అరిచిండు. అప్పుడు ఏం చేయమంటవు? ఆకలి తీరటానికి గంటెడు గంజి పోయమంటవా? అతని ఆకలికి ఈ వ్యవస్థే కారణం అని ఉపన్యాసం ఇయ్యమంటవా? తమ్ముడూ నాగేశ్! నేను తప్పుచేసిన అంగీకరిస్త. ఇప్పుడు ఏం చేయాలెనో నిర్ణయించు. మనం మనం పోట్లాడుకోవటంవల్ల లాభంలేదు. ఏం చేద్దామో నిర్ణయించు. నువ్వు చేయమన్నట్లు చేస్త. అగ్గిలో దూకమంటే దూకుత."

 

    మౌనంగా కూర్చున్నాడు నాగేశ్. అందును గురించే ఆలోచించసాగాడు రఘు. నాగేశ్ చెప్పింది అమోఘం అనిపించింది జానకికి. కాని రఘు చెప్పిందాట్లో కూడా నిజం కనిపించింది ఆమెకు. ఒక నిర్ణయానికి రాలేక సతమతం అయింది.

 Previous Page Next Page