Previous Page Next Page 
శారద పేజి 12


    "అదేం? అప్పుడే?"

    "వారికి ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా వుండటంలేదుగా!"

    "ఏం?"

    "కారణం నేనుమాత్రం ఏం చెప్పగలను? అడపాదడపా జ్వరం వస్తుంటుంది. అవన్నీ తర్వాత చెప్పుకోవచ్చులే. అన్నం పెట్టనియ్యి" అని ఆమె లోపలకు వెళ్ళిపోయింది. ఓ అయిదునిముషాలసేపు అతను మెదలకుండా సోఫాలో కూర్చునివున్నాడు. ఇంతలో లోపల్నుంచి పిలుపువచ్చింది. "రా నాయనా రవీ! కాళ్ళు కడుక్కో."

    అతను నెమ్మదిగా లేచి లోపలికెళ్ళాడు. వంటిల్లు చాలాపెద్దది. ఒక్కసారి యాభైవిస్తళ్ళు లేపవచ్చు. ప్రక్కగదిలో పంపువుంది. వేసవికాలంలో నీళ్ళు పైకి ఎక్కకపోవటంచేత, వ్యాపారంలో లక్షలు సంపాదించిన గోవిందరావుగారు బావికి మోటారు, తరువాత ఇంట్లో ఓ ఎయిర్ కండీషన్ గది అమర్చుకుని, మేడపైనుంచి కాలుక్రింద పెట్టకుండానే సర్వసుఖాలూ అనుభవిస్తున్నాడు. వేసవికాలంలో కూల్ డ్రింక్స్, షర్బత్తు మొదలైన చల్లని పదార్ధాలు వాళ్ల రిఫ్రిజిరేటరులో తయారుచేసుకోవటమేకాక ఇరుగూపొరుగుకు పంపించటం పరిపాటి. అయితే ఈ ఒక్క చల్లనిపానీయాల పంపకాలవల్లే గోవిందరావుగారు ఆ ఊళ్ళో అంత మంచి పేరు సంపాదించుకున్నాడని అనటానికి వీలులేదు. ఇతరత్రా చాలా దానధర్మాలు చేశాడు. ఇప్పుడైతే పనివాళ్ళు లేకపోవటం వల్లా, ఇతర ఇబ్బందులవల్లా అన్నదానం సవ్యంగా జరుగుటలేదుగానీ ఆయన తండ్రి సత్యన్నారాయణగారు బ్రతికున్నరోజుల్లో ఆదివారంరోజున కొన్ని వందలమందికి అన్నదానంజరిగేదనీ, ఈయన గుణగణాలతో పాటు, చనిపోయిన ఆ పరమపురుషుడ్ని కీర్తిస్తారు. ఒక సంతానంలేమి అన్న దిగులు తప్ప గోవిందరావుగారికి మరి ఏమీ చింతలేదు. వాళ్ళ ఇంటికి వారానికొచ్చే ఒక ఎర్రటికుర్రాడిని పెంచుకుందామన్న అభిప్రాయంతో వున్నారని చిన్నక్క తమ్ముడికి చెప్పింది.  

    రవి భోజనం అరగంటకుగానీ పూర్తికానియ్యలేదు చిన్నక్క. దగ్గర కూర్చుని ఆ కబురూ, ఈ కబురూ చెప్పింది. మూడునెలల తర్వాత ఆమె చేతివంట రుచి చూశాడు. అమృతతుల్యం. మద్రాసు లాయర్స్ క్లబ్ లో కడుపు నిండీ నిండని భోజనం చేసేటప్పుడు చిన్నక్క గుర్తుకువస్తే కళ్ళలో నీళ్ళు తిరిగేవి. వంటవాడు ఒట్టి దుడుకుమనిషి. మజ్జిగ పోసేటప్పుడు చాలా రాద్ధాంతం చేసేవాడు. ఎవరికీ పూర్తిగా పొయ్యకుండానే, ఆబతీరక వాళ్ళింకా చెయ్యి అలా పెట్టివుంచినా పట్టించుకోకుండా వరుసగా పోస్తూ వెళ్ళిపోయేవాడు. తక్కినవాళ్ళకు కూడా గుర్రుగా వుండేది. కానీ అశ్రద్ధచేతా, సరిపెట్టుకునే గుణంచేతా ఎవరూ మాట్లాడలేకపోయేవారు. ఓనాడు రవి ఓ గుక్కతాగి మరో గుక్కకోసం చెయ్యి పెడుతుండగానే వాడు వెళ్ళిపోతున్నాడు. "ఇంకాస్త పొయ్యి" అన్నాడు రవి. వాడు వినిపించుకోకుండా వెళ్ళిపోవడానికి ఉపక్రమిస్తున్నాడు. "చెముడా!" అంటూ రవి కోపంతో నిలబడి ఒక్క లెంపకాయ కొట్టాడు. వంటవాడు అదిరిపడి తిరగబడబోయేలోపునే మిగిలినవాళ్ళంతా వచ్చి అతన్ని అవతలకు లాక్కువెళ్ళారు. మరునాటినుంచీ వంటవాడు తీసివేయబడ్డాడు. ఎప్పుడు రోడ్డుమీద కనిపించినా మింగివేసేటట్లు గుర్రుగా చూసేవాడు.   

    రవి పెరుగన్నం తింటూ ఈ అనుభవం చెప్పగా విని చిన్నక్క నిశ్చేష్ఠురాలై మెల్లమెల్లగా తేరుకుని గాద్గదికంగా అంది. "అయ్యో నాయనా! ఎంతపని చేశావు? అంత ఇబ్బందిగా వుంటే అక్కడినుంచి మరో హోటల్ కు మారిస్తే సరిపోయే. అసలే అర్భకుడివి. వాడు తిరగబడితే నా గతి ఏంకాను."    

    ఆమె భయంచూసి రవి చిరునవ్వు నవ్వాడు.

    "ఏమిటి చిన్నక్కా! నీదంతా చేదస్తంకానీ. వాడెంత? వాడి తాహతెంత? మళ్ళీ కలియబడటమే?" అన్నాడు.

    ఆమె ఇంకా కంగారుగానే "ఏమో బాబూ! ఊరుగాని ఊరుకు పోయినప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండాలి. నీవుగానీ ఏదయినా సాహసం చేశావంటే మేము ఇక్కడ క్షోభతో కుళ్ళిపోవాల్సివస్తుంది. ఇంకాస్త పెరుగు వేయించుకో."

    రవి అంగీకారంగా తల ఊపాడు. ఆమెపట్ల గౌరవభావంతో అతని మనస్సంతా నిండిపోయింది. ఆమె అమాయకత్వానికి ఎంతో జాలికూడా కలిగింది. "ఎంత మంచి చిన్నక్క! ఈమె అనురాగంలో నేను వెయ్యోవంతయినా గుర్తించలేకపోతున్నానేమో!" అని వ్యధలో మునిగిపోయాడు.

    రంగన్న వచ్చి వసారాలో మంచంవాల్చి పరుపువేసి క్రిందకు వెళ్ళిపోయాడు. పైన ఫాన్ తిరుగుతుండగా రవి సుఖంగా పడుకుని వున్నాడు. శారద ఇంకా ప్రక్కనే కూర్చుని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏవో ప్రశ్నలు వేస్తుంది. అతను సమాధానాలు చెబుతున్నాడేగానీ ఆమె కూర్చునివుండగా, తాను శుభ్రంగా పడుకుని వుండటంవల్ల చాలా కష్టంగావుంది. లేద్దామనుకుంటే ఆమె బలంగా వారించింది.

    "ఇంక వెళ్ళి నిద్రపో చిన్నక్కా, చాలా రాత్రయింది" అన్నాడు చివరకు బలహీనంగా.

    "ఉహు! నువ్వు నిద్రపోకపోతే నేనిక్కడినుంచి కదలను."

    గత్యంతరంలేక యిక మాటలు ఆపి నిద్రపోవటానికి ఉపక్రమించాడు. అప్పుడప్పుడూ ఆమె ఏవో చెబుతూనేవుంది. తను వినటంలేదని తెలిస్తే నొచ్చుకుంటుందేమోన్న శంకతో మగతతో ఊఁ కొడుతూనే ఎప్పుడో నిద్రపోయాడు.

    ఓ అర్ధరాత్రివేళ అతనికి మెలకువ వచ్చింది. వెంటనే మద్రాసులో తన గదిలో వున్నట్లు తోచింది. కొంచెంసేపు అవస్థపడి సరియైన స్థితిలోకి వచ్చాక తను ఇప్పుడు ఎక్కడ వున్నాడో స్ఫురించింది. అతనికి మళ్ళీ వెంటనే నిద్రపట్టలేదు.

    "చిన్నక్క చాలా విషాదజీవి."

    అవును. ఈ రహస్యం తనలో పదేళ్ళు దాచుకున్నాడు ఇప్పటికి. జీవితాలు పెద్దవైపోతున్నాయి. పదిహేనేళ్ళ బాలిక చిన్నక్క పాతికేళ్ళ స్త్రీ అయింది. దానికి సమానంగా తనూ పెరుగుతున్నందు వల్లనేమో ఈ వ్యత్యాసం తనకు కనబడటం లేదు. కానీ అంత నిగూఢమైన మనస్తత్వంగల మనిషి ప్రపంచంలో వుండదేమో! పుట్టెడు దుఃఖాన్ని దాచుకునికూడా దాన్నిగురించి చిన్న నిట్టూర్పైనా విడువదు. లేనిపోనీ విషయాలగురించి మనసు పాడుచేసుకుంటుంది. ఆ రోజుల్లో ఆమెనుగురించి చాలా అపోహలు పడ్డాడు. ఆమె కాపురం చేయదనీ, ఏదో ఒకరోజున తిరిగి వచ్చేస్తుందనీ, తనని కావలించుకుని ఏడుస్తుందనీ, అమ్మావాళ్ళకు ఇదేమీ తెలియక తెల్లబోతారానీ, అప్పుడు తను ధైర్యంగా ఎదురు నిలబడి, ఈ పెద్దవాళ్ళుచేసే అరాచకాలను గురించి దులిపెయ్యాలనీ... ఇలా ఏవో ఊహలు. అంతేకాదు అవసరంవస్తే ఎవరికీ చెప్పకుండా ఏదో ఊరికి చిన్నక్కను తీసుకుని వెళ్ళిపోవాలనీ, అక్కడ పూరిల్లో, పెంకుటిల్లో ఏదో వేసుకుని అందులో వుంటారు. తాను ఏదో కష్టపడి నాలుగు రాళ్ళు తెస్తాడు. ఆమె ఏదో మిషన్ కుట్టుకుని కొంత సంపాదిస్తుంది. ఇలా ఒకరికొకరు త్యాగాలు చేసుకుని జీవితాలు వెళ్ళబోస్తారు. అలాగే ముసలి వాళ్ళయిపోతారు. ఈలోగా ఎప్పుడైనా ఆ వెధవ కనిపిస్తే వాడికి చావచితకతన్నాలి. ఇప్పుడు సిగ్గుపడ్డాడు- అవన్నీ గుర్తుకువచ్చి, ఆరోజుల్లో కూడా తెలుసు ఇదంతా జరిగేది కాదని. వీటన్నిటివెనుకా ఒక ఊహో, పట్టుదలో, పంతమో, ప్రతినో పెరిగి పెద్దది అవుతూ వచ్చింది. అది ఇప్పుడు ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించుకుని కూర్చుంది.         

 Previous Page Next Page