Previous Page Next Page 
జైలు పేజి 12


    తిలక్ కి పొలమారింది. మరొకరయితే కంగారుపడిపోయేవారే కాని అతను మాత్రం మరుక్షణంలో సర్దుకుని "అలాంటిదేమీ లేదు సత్యనారాయణ. వూరికే తెలుసుకుందామని!" అని కూల్ గా చెప్పాడు.

 

    కాసేపయ్యాక అతనే అడిగాడు. "వార్డర్లు ఎంతమంది వున్నారు?"

 

    "నలభైమంది దాకా వున్నారు బాబూ. వీళ్ళంతా మూడు షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. ఒక బాచ్ డ్యూటీ దిగగానే మరో బ్యాచ్ డ్యూటీ ఎక్కుతుంది."

 

 

    "బ్యారెక్కులో వేసినప్పుడు ఏ ఖైదీ అయినా కనిపించకపోతే ఏం చేస్తారు?"

 

    "వెంటనే అధికారులకు తెలియజేస్తారు. వార్డర్లు, గార్డులు చుట్టు పక్కలంతా గాలిస్తారు. మొత్తం టౌనంతా కాపు కాస్తారు. రైల్వేస్టేషన్,బస్టాండ్ లంతా గాలిస్తారు. అప్పటికీ కనిపించకపోతే పోలీసులకు తెలియజేస్తారు. ఇక అప్పట్నుంచి పోలీసువేట ప్రారంభమవుతుంది. అన్ని పోలీస్ స్టేషన్ లకు మెసేజ్ లు వెళతాయి."

 

    "ఓ. కే సత్యనారాయణా. చాలాసేపు మాట్లాడామంటే వార్డర్లకు అనుమానం వస్తుంది" అని లేచాడు తిలక్.

 

    న్యూజైల్ వెనక నుంచి తప్పించుకోవడం సులభంగా తోస్తోంది.అవతల మురికినీరు చేరడం వలన గడ్డి బాగా మొలిచి ఉంటుంది. అందులోనూ కొంతమేరకు ఖాళీస్థలం కనుక ఎవరూ గుర్తించే అవకాశం ఉండదు. న్యూజెయిలుకి వెనక ఏం వుందో చూడాలని అటువైపు నడిచాడు అతను.

 

    న్యూజెయిల్ దాటి మలుపు దగ్గర నిలబడ్డాడు.

 

    ప్రహరీగోడకూ, జెయిలుకూ మధ్య ఇరవై అడుగుల దూరం వుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సందులా వుంది.

 

    అక్కడక్కడా అప్పుడే కటింగ్ చేసుకున్న తలల్లా బోగన్ విల్లా పోదలున్నాయి.

 

    ఆ సందులో చిన్నగా నడవడం ప్రారంభించాడు.

 

    రాత్రి సమయంలో ఒక వార్డర్ ప్రహారీగోడచుట్టూ తిరిగుతుంటాడు. మొత్తం జెయిలంతా చుట్టిరావడానికి దాదాపు ఇరవైనిముషాలు పడుతుంది. అంటే గోడదగ్గరికి చేరుకున్నాక ఇరవైనిముషాల్లో అవతలివేపుకు దూకెయ్యాలి. లేకుంటే వార్డర్ కనిపెట్టేస్తాడు. సాయంకాలం బ్యారెక్కుకు వెళ్ళకుండా ఎక్కడయినా దాక్కుని, రాత్రయ్యాక గోడ దూకాలి. మరి కరెంట్ తీగలను తప్పించుకోవడం ఎలానో అర్థం కావడం లేదు.

 

    ఆలోచిస్తూ నడుస్తున్న అతను ఉలిక్కిపడ్డట్టు సడన్ గా ఆగిపోయాడు.

 

    ఎదురుగ్గా కనిపిస్తున్న బోగస్ విల్లా పొదలో చిన్న కదలిక -

 

    -అతని గుండె ఝల్లుమంది ఏదో తెలియని భయం రక్తాన్ని జిలకొడుతోంది. కళ్ళను అటే నిలబెట్టాడు.

 

    పొదలో కదలిక ఆగిపోయింది. అయితే తెల్లటిగుడ్డ పువ్వులా పైకి లేచింది.

 

    మరింత పరిశీలనగా చూశాడు. ఆ పువ్వుకున్న కాడలా నల్లటికాలు కనిపించింది.

 

    అప్పటికి తెలిసింది ఎవరో మనిషి అక్కడ దాక్కున్నారని. మెల్లగా పొదకేసి నడిచాడు.

 

    రెండుచేతులు ఠక్కున పొదనుంచి వచ్చి అతని కాళ్ళను పట్టుకున్నాయి. అనాలోచితంగా కాళ్ళను జాడించాడు. ఈసారి ఆ చేతులు పట్టు మరింత ఎక్కువయింది.

 

    "ఎవరదీ?" మెల్లగానే అడిగినా ఆ స్వరంలో గద్దింపు వుంది.

 

    మెల్లగా ఓ ఆకారం బయటికి వచ్చింది.

 

    ఒక్కక్షణం నిర్ఘాంతపోయాడు తిలక్.

 

    "బుద్ధా! నువ్వా!"

 

    "అవును బాసూ" అని తలదించుకున్నాడు బుద్ధుడు. తన దీనావస్థకు ఏడుపు తన్నుకొస్తోంది. మరీ ఆత్మీయుడైన తిలక్ కనిపించేసరికి అతనికి దుఃఖం ఆగటం లేదు.

 

    "ఏమిటిదంతా బుద్ధా"

 

    "నిజం చెప్పమంటావా? అబద్ధం చెప్పమంటావా" తల పైకెత్తడంతో అతను ఏడుస్తుండడాన్ని తిలక్ గుర్తించాడు.

 

    "నిజమే చెప్పు"

 

    "పారిపోదామని. ఎంతకాలం ఈ నాలుగు గోడలమధ్య జీవచ్ఛవంలా బతకడం. అందుకే బాసూ పారిపోదామని ఇక్కడ నక్కాను"

 

    ఆవేశాన్ని అణుచుకోలేక పోవడంతో మాటలు ఫోర్స్ గా వెలువడ్డాయి.

 

    "గోడల్లో కరెంట్ ప్రవహిస్తూ వుంటుంది తెలుసా?"

 

    "తెలుసు బాసూ, కానీ...." అని ఆగాడు అతను.

 

    "నిజమే బుద్ధా. ఇక్కడ మనిషన్నడాడు ఎవడూ వుండలేడు. జెయిల్లో వున్నప్పుడే స్వేచ్ఛ విలువ తెలిసేది. ప్రాణంకన్నా స్వేచ్ఛ ఎంతో గొప్పదని అనిపిస్తుంది. కానీ ఇలా మూర్ఖంగా పారిపోదలిస్తే నువ్వు నీ గమ్యాన్ని సాధించావు. దానికి ఓ పథకం వేసుకోవాలి. పకడ్బందీగా పారిపోవాలి. నేనూ ఆ ప్రయత్నం లోనే ఉన్నాను. ఎలాంటి సాహసాలు చేయాకూడదని మాటివ్వాలి" అని చేయి ముందుకు చాచాడు.

 

    ఆ అభిమానానికి కదిలిపోయాడు బుద్ధుడు. కన్నీళ్ళు దూకుతుండగా తిలక్ చేతిలో తన చేతిని ఉంచాడు.

 

    అంతలో ఎవరో వస్తున్నట్లు అలికిడి అయింది.

 

    "ఎవరో వస్తున్నట్టున్నారు. నువు ఇటు నుంచి తోటలోకి వెళ్ళిపో. నేను అటునుంచి వస్తాను" అని తిలక్ ముందుకు కదిలాడు.

 

    మరో అయిదునిముషాలకు తోటలో యధాప్రకారం అతను పాదులు తీస్తున్నాడు.

 

    అప్పుడే నీళ్ళు తాగడానికి బావిదగ్గరకు వచ్చిన సత్యనారాయణ తిలక్ దగ్గర ఆగాడు. "ఇంతకు ముందు ఓ విషయం చెప్పడం మరిచాను బాబూ. దాదా గ్రూప్ మనిషి కొండయ్య నన్ను ఏడిపిస్తున్నాడు. ప్రతి రాత్రీ ఒంటిగంటకు కరెంట్ ఆఫ్ అవుతుంది కదా, అప్పుడు వాడు నా దగ్గర్నుంచి టోకెన్లు దొంగిలిస్తున్నాడు బాబూ. ఇదేమిటని...."

 

    ఆయన చెప్పుకుపోతూనే వున్నాడు. కానీ తిలక్ ఆలోచనలు మాత్రం ఓ దగ్గర ఆగిపోయాయి. ప్రతిరాత్రీ ఒంటిగంటకు కరెంట్ ఆఫ్ అవుతుందన్న విషయం మాత్రమే అతని బుర్రలో సుడులు తిరుగుతోంది.

 

    "ప్రతిరాత్రీ కరెంట్ ఆఫ్ అవుతుందా?" సీరియస్ గా అడిగాడు.

 

    "అవును బాబూ. ఇప్పుడు కరెంట్ కోత కదా రాష్ట్రంలో. అందుకే మన జైల్లోనూ రాత్రి ఒంటిగంట నుంచి నాలుగు గంటలవరకు కరెంట్ కట్ చేస్తున్నారు. మన జైల్లో జనరేటర్ కూడా లేదు. ఆ చీకట్లో కొండయ్య...."

 

    తిలక్ బుర్రలో ఏదో ఫ్లాష్ అయింది. ఆ ఫ్లాష్ వెలుగుల్లో తను పారిపోవడానికి దారి స్పష్టంగా కనిపిస్తోంది.

 

                                   *    *    *    *

 Previous Page Next Page