"వ్వాట్?!"
"ఎస్....అక్షరాలా యాభై లక్షలు"
"అప్పుడు శతృవు ప్రభుత్వం లేదా చట్టం అవుతాయిగానీ వేరేవాళ్ళెలా అవుతారు? ప్రభుత్వమైనా, చట్టమైనా శిక్షిస్తుందిగానీ చంపేందుకు గూండాల్ని జైలుకి పంపదుగా."
"అఫ్ కోర్స్! బట్....ఇప్పుడు వస్తున్నది ఆ ఏభై లక్షల్ని ఆశించిన వ్యక్తి తాలూకు మనుషులు."
"ఎవరు వచ్చేది?"
"భవానీ తాలూకు గూండాలు"
"భవానీ ఎవరు?"
"ఇప్పుడీ నగరాన్ని ఏలుతున్న పలుకుబడిగల గూండా"
"అంటే ఆశించేది భవానీనా? అంటే అతను, మీరు కలిసి దొంగతనం చేశారా? కలిసి ప్లాన్ చేశారా?"
"లేదు"
"మరి....ఎవరు? ఎవరో భవానీని కలిసి, అతని గూండాల్ని జైలుకి పంపించమని వుంటారు. అవునా? ఆ ఎవరో, ప్లస్ మీరు కలిసి బ్యాంక్ దొంగతనం చేసుంటారు- లేదా ప్లాస్ చేసుంటారు. చివరలో ఆ మొత్తాన్ని మీరు దక్కించుకొని ఉంటారు. అవునా?"
"మొత్తాన్ని కాదు-సగాన్నే"
"అంటే దొంగతనం జరిగిన మొత్తం ఎంత?"
"కోటి రూపాయలు"
"కోటా?" వివేక్ డీప్ షాక్ కి లోనయ్యాడు.
"అవును - కోటే"
"అయితే అతని వాటా యాభయ్ అతనికి దక్కాయిగదా? మరీ మీ యాభయ్ మీద కన్నేయటం ఏమిటి? దొంగలకయినా దొంగ న్యాయం వుంటుందటగదా!"
"దొంగలకుంటుంది దొంగ న్యాయం. రాజకీయ నాయకులకు వుండదుగా? అందుకేనా యాభయ్ కూడా ఆశించి భవానీ మనుషుల్ని పంపిస్తున్నాడు."
"రాజకీయ నాయకులా? అంటే మీరు-రాజకీయ నాయకులతో కలిసి బ్యాంకుని లూటీ చేశారా?!"
"ఎందుకంత ఆశ్చర్యం? హర్షద్ మెహతా వెనుక ఉన్నది రాజకీయ నాయకులు కాదా? ముస్తాక్ టైగర్ మెమన్ తో, దావూద్ ఇబ్రహీంతో రాజకీయ నాయకులకు సంబంధాలు లేవా? లేనప్పుడు మహారాష్ట్రలో మంత్రులు ఎం.ఎల్.ఎ.లు ప్రెస్ లోకెలా వచ్చారు?
మహారాష్ట్రలో పప్పుకలానీ, భాయ్ ఠాగూర్, హితేంద్ర ఠాగూర్ ఎం.ఎల్.ఎ.లు, ఏవో ఇన్ వెస్టిగేషన్ లో మాఫియా గాంగ్స్ కి వాళ్ళే గాడ్ ఫాదర్స్ అని బయటపడింది.
కర్నాటక సాండల్ ఉడ్ స్మగ్లర్ వీరప్పన్ వెనుక వున్నది ఇద్దరు ఎం.ఎల్.ఎ.లని పేపర్స్ అన్నీ కోడై కూశాయి.
అక్కడిదాకా ఎందుకు- ఇటీవల మన రాష్ట్ర గవర్నర్ (స్రీ కృష్ణ కాంత్) ఒక సభలో ఏమన్నారో తెలుసా? ఈ మధ్య గూండాలు, రౌడీలు రాజకీయ నాయకులయిపోతున్నారని-దాని మీద చట్ట సభలో పెద్ద దుమారం కూడా లేచింది. బెంగుళూరు గూండాస్ ఆయిల్ కుమార్, ముత్తప్పరే వెనుక కూడా మంత్రులున్నారట.
Wanted criminals obtaining party tickets to contest elections is nothing un common in indian politics you know....
నేటి రౌడీలూ, గూండాలే రేపటి రాజకీయ నాయకులు. అదీ మనదేశ ప్రజా దౌర్భాగ్యం...." డిజ్ గస్టింగ్ గా అన్నాడు రామదాసు తల విదిలిస్తూ.
"మీ విషయంలో ఎవరు?"
"జస్వంతరావ్....ది గ్రేట్ అగ్రికల్చరల్ మినిస్టర్ జస్వంతరావు" కసిగా పళ్ళు నూరుతూ అన్నాడు రామదాసు.
వివేక్ పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు. ఆ పేరు వింటూనే.
"అతనికీ మీకెలా సంబంధం ఏర్పడింది?" తేరుకుంటూ అడిగాడు.
రామదాసు ఏదో చెప్పేందుకు నోరు తెరవబోతూ ఆగి, చెవులు రిక్కించి దూరం నుంచి వినిపిస్తున్న నాడాల శబ్దాన్ని విన్నాడు.
"ష్....జైలు సూపరింటెండెంట్ వీరనారాయణగారొస్తున్నారు. ఆయన ఛండశాసనుడు. మాట్లాడకుండా అటు తిరిగి పడుకో-" అన్నాడు రామదాసు నెమ్మదిగా నేలమీద వాలిపోతూ.
వివేక్ చతుక్కున వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. కేవలం బూట్ల శబ్దాన్నిబట్టే వస్తున్నదెవరో చెప్పగల రామదాసు సామాన్యుడు కాదనుకున్నాడు వివేక్.
అసంకల్పితంగానే ఏదో చిరు ఆశ ఒక్కక్షణం అతని గుండెల్ని స్పృశించి వెళ్ళిపోయింది.
మృత్యువును మోసుకొస్తున్న కేన్సర్ ఒకపక్క - యమపాశంతో వస్తున్న శత్రువులొకపక్క-ఎలా? ఎలా తప్పించుకుంటాడీయన? కళ్ళలో ఏదో లక్ష్యం! ఏదో సాధించి తీరాలన్న తపన కనిపిస్తుంటాయి ఎప్పుడూ. కానీ ఎలా? వివేక్ ఇలా ఆలోచిస్తుంటే....
అటుపక్క సెల్ లో ఉన్న రామదాసు, జైలు సూపరింటెండెంట్ ఆకస్మిక తనఖీ గురించే ఆలోచిస్తున్నాడు.
* * * *
సత్యమూర్తి వారిస్తున్నా వినకుండా ఆ రాత్రే జైలుకి వెనుక వేపున అరకిలోమీటరు దూరంలో వున్న గ్రామాన్ని చేరుకుంది వేదవతి.
బయలుదేరేముందే, కావాలనే అనాగరికంగా, పల్లెటూరిదానిలా తయారయింది. తప్పక సత్యమూర్తి కూడా అలాగే తయారయ్యాడు.
వాళ్ళు ఆ గ్రామం వెళ్ళి చిన్న గది వెతుక్కుని అందులో సెటిలయ్యేసరికి రాత్రి పదకొండు గంటలయింది.
"ఇక్కడికెందుకొచ్చినట్లు? ఏం చేద్దామనక్కా?" అతను తన అక్క కళ్ళ లోతుల్లోకి చూడలేక ఎటో చూస్తూ ప్రశ్నించాడు.
"రేపటి నుంచి ఈ ఊరివాళ్ళతోపాటు జైలుకి కూలిపని నిమిత్తం వెళతాను. నా వృద్ధాప్యం ఎలా అవసరానికొచ్చిందో చూశావా? జైల్లో పనికి వృద్దుల్నే తీసుకెళతారట. స్వీపర్స్ గా, స్త్రీల వార్డ్ కి కేర్ టేకర్స్ గా నియమింపబడే వారి దగ్గర హెల్పర్స్ గా పని చేస్తారట" ఏ భావమూ లేని కంఠముతో అందామె చాపని పరిచి పక్కలు వేస్తూ.
"ఏమిటి దాని మూలంగా ప్రయోజనం?"
"నా పిరికి కొడుకుని ఉత్తేజపర్చడానికి. వాడిలో రక్తాన్ని వేడెక్కించి, పరిగెత్తించటానికి. అందుకు అప్పుడప్పుడు జైలుకెళ్ళి, వాళ్ళిచ్చే పది నిమిషాల కాలంలో ఆ పనిని నెరవేర్చలేను. పైగా సెంట్రీలేప్పుడూ ఖైదీల కోసం వచ్చిన విజిటర్స్ మీదే కన్నేసి వుంచుతారు. గట్టిగా వివరముగా మాట్లాడడానికి వుండదు. ఇలా అయితే తరచూ లోపలకెళ్ళవచ్చు. కావలసినంతసేపు లోపలే వుండవచ్చు. అంటే సుమారు ఆరేడు గంటలు- ఇక పడుకో....నా పథకానికి నేను సమాయత్తం కావాలి" అంది వేదవతి చాప మీద వాలిపోతూ గంభీరంగా.
పగబట్టిన మిన్నాగు కాటేసేవరకు పచ్చి మంచినీళ్ళు తాగదనే వాడుక తన అక్క విషయంలో నిజమేమోననిపించింది సత్యమూర్తికి.
అదెక్కడికి దారి తీస్తుందోనని దిగులుతోనే తనూ పక్కమీద వాలాడు.
జైలుగంట పదకొండుసార్లు మోగి ఆగిపోయింది. ఆ ఊరికి జైలు అరకిలోమీటరు దూరంలో వున్నా జైలుగంట అంత స్పష్టంగా విన్పించటానికి కారణం ఆ ప్రాంతంలో చిక్కగా పర్చుకున్న శ్మశాన నిశ్శబ్దమే. ఆ ఊరివాళ్ళకి కాలం తెలిసేది జైలుగంటల ద్వారానే.
తనకు గదిని అద్దెకిచ్చినవారి ద్వారానే జైల్లో స్వీపర్ గా చేరాలి. అటుగానీ-ఇటుగానీ ఎవరికీ అనుమానం రాని రీతిలో జరిగిపోవాలి.
జైల్లో తనను గుర్తుపట్టగలిగేది ఒక్క సబ్ జైలర్ నాయుడే. ఒకవేళ నాయుడే గుర్తుపట్టినా, కొంత డబ్బు అతని ముఖాన కొడితే సరిపోతుంది.
మరెవరన్నా గుర్తుపడితే-తనకున్న ఏకైక ఆధారం తన కొడుకే. వాడిప్పుడు అదే జైల్లో ఉరికంబం ఎక్కేందుకు రోజుల్ని లెక్కేసుకుంటున్నాడు. కనుక గతిలేక ఆ పనిలో చేరినట్టు- అప్పుడప్పుడు తనకు శాశ్వతంగా దూరం కాబోతున్న కొడుకుని చూసి సంతృప్తి పడవచ్చని చేరానని చెప్పవచ్చు.
ఇవి కాకుండా ఇంకేమన్నా సమస్యలెదురవుతాయా? ఎదురయితే ఎలాంటి పని? ఎలాంటివయినా ఉరితీసేలోపే తన కొడుకుని తను విడిపించుకోవాలి. అంతే! దీనికి ప్రత్యామ్నాయమేలేదు. ఉండకూడదనుకుంటూ కళ్ళు మూసుకుంది వేదవతి.
* * * *
జైల్లోనే కాదు- జైలు చుట్టుపక్కల కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం అయిదు గంటల వరకు SASFORNOR అమలులో వుంటుంది. షూట్ ఎట్ సైట్ ఫర్ నో రెస్పాన్స్....అందుకే రాత్రయితే ఆ ప్రాంతానికి వచ్చేందుకు ఎవరూ సాహసించరు.
జైలు లోపల-పన్నెండవ వార్డ్ లో....తిరిగి సంభాషణ మొదలైంది. అప్పుడు సమయం రాత్రి పదకొండున్నర గంటలు....
"అతనికీ మీకూ సంబంధమెలా ఏర్పడింది?" వేసిన ప్రశ్ననే తిరిగి వేశాడు వివేక్.
వివేక్ కి ఎందుకో రామదాసుతో సంభాషించాలనిపిస్తోంది. అతని అనుభవాల పొరల్లో దాగిన టెర్రిఫైయింగ్ ట్రూత్స్ ని తెలుసుకోవాలనిపిస్తోంది. దాని ప్రభావంగానే గతంలో అతనిలో గూడుకట్టుకున్న స్తబ్దత కరిగిపోతోంది క్రమంగా.
అతనికిప్పుడు తనకి పడిన ఉరి మీద దృష్టిలేదు. దాంతో దాని తాలూకు భయం, నిరాశ, నిస్పృహలు అతని అనుభవంలోంచి అదృశ్యమైపోయాయి.
"ఒకప్పుడు ఇద్దరికీ ఒకే వృత్తిగనుక."
"అంటే మంత్రి జస్వంతరావు ఒకప్పటి రౌడీ, గూండానా?!"
"అంతకంటే ఎక్కువే...."
"అతని గతాన్ని పోల్చటానికి రౌడీ, గూండా అనే పదాలు కూడా సరిపోనంత దుర్మార్గుడైతే మంత్రెలా అయ్యాడు?!"
"పిచ్చిప్రశ్న....నీలాంటి వెర్రిబాగులవాళ్ళే ఓటర్సు అయినప్పుడు కాక ఏమవుతాడు? తొండ ముదిరి ఊసర వెల్లవుతుంది-గొంగళి సీతాకోకచిలుకవుతుంది ఎలా?"