"మిస్టర్ డి.ఐ.జి.! మీరు ప్రయాణీకుల రక్షణార్ధం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి. ఏ బెదిరింపులకూ లొంగవద్దు...."
"సర్...."డి.ఐ.జి. సలహా ఇవ్వడానికి ప్రయత్నించాడు.
"నో....ప్రజాస్వామ్యంలో మేము తిరగక తప్పదు, ప్రజలను కలుసుకోకా తప్పదు. అరాచక శక్తులకు ఇప్పుడు భయపడి తలవంచితే టెర్రరిజానికి మరింత ఊతమిచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు నన్నేమి చేసినా వాళ్ళ డిమాండ్స్ ను ఆమోదించను. ప్లీజ్! ఫాలో మై ఆర్డర్స్...." కరాఖండిగా చెప్పేసి మాన్ పాక్స్ నవీన్ కిచ్చారు సి.ఎం.
"మిస్టర్ సి.ఎం.! సూపర్ ఫాస్ట్ రైలును బ్లాస్ట్ చేస్తాను! మీరే కాదు, మీతో పాటు కొన్ని వందల మంది ప్రయాణీకులు ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుంది జాగ్రత్త...." అజ్ఞాత వ్యక్తి సవాల్ గా అన్నాడు.
సి.ఎం. మౌనం వహించాడు.
ముఖ్యమంత్రి ఆదేశించడంతో నవీన్ మిగిలిన కంపార్ట్ మెంట్లను చెక్ చేయడానికి బయలుదేరాడు.
* * *
తిరుపతి అవుట్ స్కర్ట్స్ లో వున్న రిజర్వ్ ఫారెస్టులో
పొదల మాటున వున్న కారును ఒక వ్యక్తి గమనించాడు.
ఆ సమయంలో అటుగా ఇంకెవ్వరూ వస్తున్న జాడలేదు. ఒక్క నిమిషం అలానే నిలిచి ఆ వ్యక్తి లోపల ఎవరో వున్నట్టు గమనించాడు. అతనికి కారులో ఎవరో బందీలు వున్నట్టు అర్ధమయింది.
కిడ్నాపర్లు పెట్టిన టైమ్ బాంబ్ పేలడానికి ఇంకా ఎన్నో క్షణాలు గడపవలసిన పనిలేదు.
ఈలోగా ఆ వ్యక్తి ఆ ప్రమాదాన్ని గుర్తించి సహాయపడగలిగితే బందీలిద్దరూ బతికి బట్టకడతారు. లేకుంటే బాంబ్ బ్లాస్ట్ లో మాడిమసైపోవడం ఖాయం.
ఆ వ్యక్తి అక్కడొక్క క్షణం ఆగి, ముందుకు కదిలి వెళ్ళిపోయాడు.
బందీలిద్దరూ నీరసపడిపోయారు. మిగిలిన ఒకే ఒక్క ఆశకూడా కలలా కళ్ళ ముందే కరిగిపోయినట్టయింది.
వాళ్ళిదరి మెదడు ఆలోచించి ఆలోచించి మొద్దుబారిపోయింది. ఇక చావు తప్పదనే ఆందోళన వాళ్ళ ముఖాలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది.
సరిగ్గా ఆ క్షణంలోనే స్టీరింగ్ వైపు డోరు దగ్గర చిన్నగా శబ్దమయింది.
కారు డోర్ తెరచిన వ్యక్తి లోపల కూర్చున్నాడు. వెనుకవైపు డోర్ తెరచి బందీ లిద్దర్నీ కిందకు తోసివేశాడు.
అతను కారు స్టార్ట్ చేసి గేరు మార్చాడు. కారు రోడ్డు ఎక్కడం, టైమ్ బాంబ్ బ్లాస్ట్ అవడం ఒకేసారి జరిగిపోయాయి.
పెద్ద శబ్దంతో కారు తునాతునకలయింది. పెట్రోల్ ట్యాంక్ అంటుకుని మంటలు ఉవ్వెత్తున లేచాయి.
స్టీరింగ్ ముందువున్న వ్యక్తి మాడిమసైపోయాడు.
ఆ వ్యక్తి ఆరితేరిన కార్ల దొంగ అనడానికి గుర్తుగా అక్కడ రోడ్డు మీద మారు తాళాల గుత్తి పడివుంది!
* * *
ఆ వార్త క్షణాలలో రాష్ట్రం అంతటా దవానలంలా వ్యాపించింది.
తమ ప్రియతమ నాయకుడు సూపర్ ఫాస్ట్ రైలులో ప్రయాణిస్తున్నట్టు, ప్రమాదంలో చిక్కుకున్నట్టు తెలుసుకున్న జనం విచ్చిన్నకర శక్తులమీద ధ్వజమెత్తారు.
అధికార పార్టీ మద్దతుదారులు నడివీధులలోకి వచ్చారు. వాడవాడలా నినాదాలు మిన్ను ముట్టాయి. ఎక్కడ ఏ నలుగురు చేరినా ఇదే చర్చనీయాంశమయింది.
కొందరు కుర్రకారయితే మితిమీరిన అభిమానంతో వాహనాలమీద రాళ్ళు రువ్వారు. బస్సులను తగులబెట్టారు.
వ్యాపారులు భయంతో స్వచ్చంద బంద్ ను పాటించారు.
ఇదే అదనుగా సంఘ విద్రోహ శక్తులు దోపిడీలకు, దహనకాండకు పాల్పడినారు.
పౌర జీవనం స్థంభించింది. అమాయక ప్రజల ఆక్రందనలు మిన్నుముట్టాయి.
శాంతి_భద్రతలు అదుపు తప్పాయి. వ్యవహారం కాల్పుల వరకు వెళ్ళిపోయింది.
పుకార్లు షికార్లు చేశాయి....
తమిళనాడు నుంచి ఎల్.టి.టి.ఇ మిలిటెంట్లు వచ్చి సి.ఎం.ను కిడ్నాప్ చేస్తున్నారని కొందరు, పంజాబ్ టెర్రరిస్టులే ఇంతగా బరితెగించగలరని మరికొందరు, 'ఉల్ఫా' తీవ్రవాదుల పని అని ఇంకొందరు, ఇది మిలిటెంట్లు చర్యేనని....ఇలా ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కథలల్లుకోవడం ప్రారంభించారు.
కుర్చీలో కూనిరాగాలు తీయడం కొందరికి అలవాటు, మరికొందరికి పరిపాటి!
ఈ రాష్ట్రంలోనే నక్సలైట్లు కాక, మరొక తీవ్రవాద సంస్థ ఏదైనా ఉద్భవించి ఈ అల్లకల్లోలానికి శ్రీకారం చుట్టిందా అని కొందరు అంచనా వేయడం ప్రారంభించారు. కాలక్షేపరాయుళ్ళు బుర్రలకు కావలసినంత పని!
సి.ఎం. సెక్యూరిటీ సంబంధించిన ఏ చిన్న అంశాన్ని బయటపెట్టక పోలీసులు తమ భద్రతా వ్యూహాన్ని పకడ్ బంద్ గా 'టాప్ సీక్రెట్' లో అమలుపరుస్తున్నారు.
కనుకనే రకరకాల ఊహాగానాలకు ఊపువచ్చింది. అంచనాలకు రెక్కలొచ్చాయి.