కనకారావు ఆమె వేపు తిరిగి, "మీరిచ్చిన డబ్బులో రెండు రూపాయలు పెట్టి డ్రింకు తాగుతాడట. మిగతావి ఇలాగే అడుక్కుంటాడు కాబోలు, మ్స్ ! నా దగ్గిర కూడా ఏమీ డబ్బులు లేవు. ఉంటే నేనూ ఉడతా భక్తి సాయంచేసి వుండేవాణ్ని."
రాధ మరో రెండ్రూపాయలు తీసి ఇస్తూ, "పాపం ఆ డబ్బు అలా వుంచుకొమ్మనండి. ఇదో దీనితో డ్రింకు తాగమనండి" అంది.
"హింత సహాయో మిసినిషి నామ్ నేమ్ సప్స" అన్నాడు మురళి.
"ఇంత సాయం చేసిన మీ పేరేమిటో తెలుసుకోవచ్చా అని అడుగుతున్నాడు మేడమ్ ! మీకభ్యంతరం లేకపోతే చెప్పండి. వీళ్ళకి ఎడారి దేవత అని చాలా పవర్ ఫుల్ దేవత వుంటుంది. అక్కడ మీపేర్న అర్చన చేయిస్తే శుభం కలుగుతుంది."
"రాధ" అంటూ పెద్ద బొట్టు, కంచి పట్టుచీరె అమ్మాయి.
వాళ్ళకి డబ్బులిచ్చి బయల్దేరి నాలుగు అడుగులు వేసేక ఏదో అనుమానం వచ్చి వెనుదిరిగి చూసింది రాధ. అప్పటికే మిత్రులిద్దరూ సిగరెట్ షాప్ దగ్గిరకి చేరి పగలబడి నవ్వుకుంటున్నారు.
"మిష్టర్ మీకు బుద్ధిలేదూ" అని వెనుక నుంచి వినపడ్డాయి మాటలు. ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. ముందు తేరుకున్నది మురళి.
"ఇహిహి. జస్ట్ ఫన్ సేక్ ! ఎలా వుందండీ ?" అన్నాడు.
"ఫన్నా ... నా మొహంలా వుంది."
"ఆఫ్ కోర్స్. మీకు కోపం రావటం సహజం అనుకోండి ! కానీ మీరిది ఈజీగా తీసుకోవాలి. కారణం ..."
"మీకు సిగ్గు వేయటం లేదూ !"
"సిగ్గా, ఎందుకండీ ?"
"అలాంటి వెధవ పనిచేసి పైగా నవ్వుకోవటానికి !"
"మీరే సిగ్గుపడాలి మాడమ్-పదహారణాల ఆంధ్రా అబ్బాయి, కాస్త క్రాఫు చెదిర్చి, బాష మార్చగానే థార్ ఎడారి వాసో, ఎస్కీమోనో అనుకోవటానికి-" అన్నాడు మురళి.
"షటప్" అనేసి విసవిసా అక్కణ్నుంచి వెళ్ళిపోయింది.
* * *
"అది సార్ జరిగింది" అంటూ పూర్తి చేశాడు మురళి. అంతా చెప్పి "అదే సార్ ఆ అమ్మాయిని మొదటిసారి చూడటం. అప్పటి నుంచీ కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆమే కనపడేది. నది వీధిలో, మధ్యాహ్నపు ఎండలో, అడగ్గానే అలా పర్సు తెరిచి ఏడు రూపాయలు ఇచ్చేసే జాలి గుండె, అంత అమాయకత్వమూ ఎవరికి వుంటాయి సార్ ? అసలామెని చూస్తేనే తులసి చెట్టు గుర్తొస్తుంది."
రామలింగం నవ్వి, "అదే నాయినా ప్రేమంటే ! ప్రియురాలు దగ్గినా - తుమ్మినా అందంగా వుండటమే ప్రేమంటే" అన్నాడు.
"కానీ ..."
"నువ్వు చెప్పబోయేది అర్ధమైంది. ఇలా మోసం చేసిన కుర్రవాణ్ణి ఎలా ప్రేమిస్తుంది అని కదూ నీ సంశయం ! అలాటిదేమీ పెట్టుకోకు. ఇంత అద్భుతంగా నాటకం ఆడి పందెం గెల్చినట్టు ఆ అమ్మాయికి తెలిసిందంటే నువ్వు హీరోవి అయిపోతావు. ఒకసారి నా కాలేజి లైఫ్ లో ఏం జరిగిందంటే ..."
"మీరాగండి సార్!" విసుగ్గా అన్నాడు విన్సెంటు. "కథ అక్కడితో ఆగలేదు. ఇది జరిగిన కొన్నాళ్ళకి మన మురళిలా వున్న వాడెవడో నదిబజార్లో ఆ అమ్మాయిని అందరూ చూస్తూ వుండగా దగ్గిరకి లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి, వాడే అనుకుని మురళి చెంప పగలగొట్టింది."
రామలింగం నమ్మలేనట్టు చూశాడు.
"అవును సార్ ! ఈ అదృష్టరేఖ చూడండి."
రామలింగం మనసారా నవ్వుకున్నాడు. ఇన్నాళ్ళకి తన కసి నెరవేరబోతూంది. ప్రేమ విషయం వచ్చేసరికి ఈ అల్లరి కోతులు మూడూ తన సలహా అడగటానికి రావటమే వాళ్ళు చేసిన మొదటి తప్పు !
ఒకే బాణానికి రెండు పక్షులు !
ఆ వుమెన్స్ కాలేజి హాస్టలు వార్డెనుకీ తనకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుంది. ఆవిడ హయాంలో అమ్మాయిలు ఎలా పాడైపోతున్నారో చెప్పటానికి ఇదో మంచి ఉదాహరణ! ఒక హాస్టల్ అమ్మాయి నడిరోడ్లో కాలేజి అబ్బాయికి డ్రింక్ ఇప్పించింది ! పైగా నడిరోడ్డుమీద విచ్చలవిడిగా ముద్దులిచ్చేస్తూంది. ఈ దెబ్బతో ఆ వార్డెను పని గోవిందా ! ఇహపోతే ఈ కుర్రోళ్ళు ! ఈ దార్లో వీళ్ళని ఇంకొంచెం ముందుకి పంపి అక్కడ దెబ్బ కొట్టాలి. గుక్క తిప్పుకోనివ్వకుండా దెబ్బ కొట్టాలి ! వీలైతే టి.సి. ఇప్పించి ...
"ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు ?"
"ఏమి లేదోయ్ ... అదే! నిన్ను ఆ అమ్మాయి ప్రేమించేలా చేయటం ఎలా అని ! అన్నట్టు నువ్వు ఒక ప్రేమలేఖ ఎందుకు వ్రాయకూడదోయ్ ?"
"అబ్బే అది చాలా ఓల్డ్ టెక్నిక్ సార్ !"
ప్రేమకు ఓల్డు - న్యూ అని రెండు రకాలు లేవోయ్. అందంగా వ్రాసి, నాకు చూపించు. తరువాత ఆమెకి అందించు" అంటూ లేచాడు-"ముందు ఈ పని చెయ్యి. తరువాత రెండో స్టెప్పు నేను చెపుతాను" అని వెళ్ళిపోయాడు. అతడికి ఎప్పుడెప్పుడు లేడీస్ హాస్టల్ వార్డెన్ ని పట్టుకుని దులిపేద్దామా అని వుంది.