Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 11

    అతను పాతకేడీ అని, అతనే దొంగనోట్ల  వ్యాపారం  చేస్తుంటాడని, అందుకే  అరెస్టు చేశామని, సాక్ష్యాలకోసం  అన్వేషిస్తున్నామని, అతన్ని  చచ్చినా వదిలిపెట్టమని పైగా  అదసలే కేంద్ర హోంమంత్రి నియోజక వర్గమని, మరోసారి అతన్ని విడిపించాలంటూ వస్తే తమని కూడా అరెస్టుచేస్తామని తన అనుచరులను గౌసుద్దీన్ బెదిరించినట్లు  తెల్సుకున్నాడు రాజర్షి.

    అంతా విని అప్పుడతనేం మాట్లాడలేదు.

    మరుసటి రోజూ సరిగ్గా  ఒంటిగంటకు  రాజర్షి  ఓ బ్రీఫ్ కేసుతో గౌసుద్దీన్ ఛాంబర్ లోకి ఎంటర్ అయ్యాడు.
   
    తమ గురువు చేతిలోవున్న బ్రీఫ్ కేసులో ఏముందో.

    ఎ.ఎస్.పి.వి.ని ఎలా డీల్ చేయబోతున్నాడో  అర్ధంకాక అనుచరులంతా  ఆఫీస్ బయటే నించుని ఎదురుచూస్తున్నారు.

    పది నిమిషాలు గడిచాయి.

    అంతలో  ఆఫీస్ ముందో జీపు ఆగింది.

    అందులోంచి అయిదారుగురు వ్యక్తులు  హడావుడిగా గౌసుద్దీన్ ఛాంబర్ లోకి దూసుకెళ్ళారు.

    అది జరిగిన  మరో పదినిమిషాలకు  రాజర్షి చిరుదరహాసంతో బయటకొచ్చాడు.

    అనుచరులు భయపడుతూనే  అడిగారు ఏం జరిగిందంటూ-

    "హల్లో మిస్టర్ ఎ.ఎస్.పీ....నా పేరు రాజర్షి....అరగంట క్రితమే నాకు హోటల్ మేరీస్ వెనుకేపు గోడదగ్గర ఈ బ్రీఫ్ కేసు దొరికింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని దాని యజమానికోసం  పావుగంటసేపు  వెతికాను. అయినా ప్రయోజనం కనిపించలేదు. పోయిన వస్తువు తమది కాకపోయినా  తమదనే ఈ సార్ధ్వ ప్రపంచంలో దీన్ని  తమదంటూ  ఎవరూ ముందుకు  రాకపోవటంతో  నా కనుమానంవేసి  ఎవడన్నా ప్రాక్టికల్ జోక్ ప్లే చేసాడా అని దీన్ని ఓపెన్ చేసాను" అంటూ  రాజర్షి తన చేతిలోని బ్రీఫ్ కేస్ తీసి గౌసుద్దీన్ టేబుల్ పై ఉంచాడు.

    "దీన్నిండా కరెన్సీ నోట్లకట్టలున్నాయి" రాజర్షి కావాలనే పై వాక్యాన్ని  స్లో మాడ్యులేషన్ తో అన్నాడు.

    గౌసుద్దీన్ విస్మయంగా ముందుకు వంగాడు.

    "కాని ఆ నోట్లన్నీ  దొంగనోట్లే....ఫేక్ నోట్స్" అన్నాడు రాజర్షి నెమ్మదిగా.

    గౌసుద్దీన్ ఆశ్చర్యంతో  కుర్చీలో నిటారుగా అయిపోయి "వెరీ గుడ్....వెరీగుడ్.....సిటిజన్ అంటే అలా వుండాలి" అన్నాడు రాజర్షి వేపు ప్రశంశగా చూస్తూ.

    అప్పటికీ రాజర్షి ఆ గదిలోకొచ్చి  సరిగ్గా ఎనిమిది నిమషాలయింది.

    "ఈ నోట్లని మీ కస్టడీలో  దాయండి ఎందుకంటే  మీ ఆఫీసులో  పీ.సి.లెవరన్నా  కక్కుర్తిపడి  అవి మంచినోట్లని  కొన్నితీసి వాడుకుంటే  ప్రమాదం. బాధ్యతాయుతమైన పౌరుడిగా కేసు చివరివరకు నేను గట్టి సాక్ష్యం ఇస్తాను...." రాజర్షి మాటల్లో కృత్రిమమయిన నిజాయితీ తొంగిచూసింది.

    గౌసుద్దీన్ బ్రీఫ్ తెరిచి చూసాడు. నిండా పచ్చనోట్లు. అతని ముఖంలో  వృత్తిపరమైన ఉద్విగ్నత.

    రాజర్షి తిరిగి తొందరచేసాడు. వాటిని పర్సనల్ బీరువాలో భద్రపర్చండంటూ.

    గౌసుద్దీన్ కి తెలియదు తనో పెద్ద ఉచ్చులో  ఇరుక్కోబోతున్నట్టు.

    వెంటనే  బ్రీఫ్ ని తీసుకెళ్ళి  తన పర్సనల్ బీరువాలో భద్రపర్చి వెనుదిరిగాడు. అంతే ఎదురుగా  ఏంటీకరప్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు. విజిటింగ్ కార్డ్స్ తీసి బయటకు చూపిస్తూ ముందుకొచ్చారు.

    "మాకిప్పుడే  ఇన్ ఫర్మేషన్  వచ్చింది. మీరు పాతికవేలు  లంచం రాజర్షి అనే వ్యక్తినుంచి తీసుకోబోతున్నట్లు....."

    గౌసుద్దీన్ మొఖం కందగడ్డలా అయింది.

    "వాట్ నాన్ సెన్స్ యువార్ చార్జింగ్ - మైండ్  యువరోన్ బిజినెస్" అన్నాడు గౌసుద్దీన్ కోపంగా.

    వచ్చిన అధికారుల్లో ఒకరికి గౌసుద్దీన్ తిరస్కారం మాంటెక్కించింది.

    "అలాగే....మా బిజినెస్సే - మేము చూసుకుంటాం, మీరిప్పుడు బీరువాలో  ఏం దాచుకొని వస్తున్నారు?"

    "హోల్డ్ యువర్ ఠంగ్ ఆఫీసర్, అవి ఫేక్ నోట్స్ ఇతనికి దొరికితే నాకు తెచ్చిచ్చాడు."

    రాజర్షి పెదాలపై  సన్నని చిరునవ్వు కనురెప్పపాటుమెరిసి  అదృశ్యమయింది.

    "ఓకే....ఓకే....ఏవవి ఓసారి  పరీక్షిస్తాం" ఓ అధికారి చిరునవ్వుతో అన్నాడు.

    గౌసుద్దీన్ కి అరికాలిమంట  నెత్తికెక్కింది.

    "నేను చూపించను. ఫేక్ నోట్స్ కేస్ మీదికాదు, కనుక విల్ యూ ప్లీజ్ గెటవుట్!" అతను కోపంగా చూస్తూ గద్దించాడు.

    దాంతో  వచ్చిన అధికారులందరికీ  కోపం వచ్చింది.

    "ఫేక్ నోట్స్ అయితే మీ కేసు ఒరిజినల్ నోట్స్ అయితే మాకేసు. కైండ్లీ షోదట్ బ్రీఫ్ - బీయింగ్ ఏ రెస్పాన్సుబుల్ పోలీసాఫీసర్"

    ఓ అధికారి సౌమ్యంగానే అన్నా అందులోవున్న కరుకుదనం గౌసుద్దీన్ దృష్టిని దాటిపోలేదు.

    విసురుగా  వెళ్ళి బ్రీఫ్ తెచ్చి  టేబుల్ మీదకు గిరాటేశాడు.

    రాజర్షి లేచి గౌసుద్దీన్  పక్కకు  వచ్చాడు కావాలనే....

    ఓ అధికారి బ్రీఫ్ ఓపెన్ చేస్తే, మరో అధికారి ఒక నోటును బయటకు తీసి చెక్ చేశాడు.

    వెంటనే మరో నోట్....ఆ వెంటనే  మరో నోట్ చకచకా రెండు నిముషాల్లోనే ఐదారు నోట్సు తలెత్తాడు. అతని కళ్ళలో దొంగను చూస్తున్న భావం అస్పష్టంగా కనిపించింది.      

 Previous Page Next Page