"చిరిగిన కోటు వేసుకొని వార్డులోకి వస్తుంటే నీకు ఏమీ అనిపించదా? సిగ్గుగా ఉండదూ. ఎందుకుండదూ? అది సహజమే. అందుకే నువ్వంటేనాకు జాలి."
"సిగ్గా ఎందుకూ? తప్పుచేసినవాడు సిగ్గుపడాలి. పరుల శ్రమను దోచుకొని విలాసాలను అనుభవించేవాళ్ళు సిగ్గుపడాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే బీదవాళ్ళు కాదు సిగ్గుపడాల్సింది.
వాళ్ళను అలా తయారుచేసినవారూ, మీలాంటి వాళ్ళూ సిగ్గుపడాలి" గౌతమ్ కంఠం గంభీరంగా పలికింది.
సుధ తెల్లబోయినట్టు చూసింది.
"మీ బీదతనానికి మధ్యలో మేమెందుకు సిగ్గుపడాలి? నీ ఆర్గ్యుమెంటు నాకు అర్థం కాలేదు."
"పాపం! నీకు ఎలా అర్థం అవుతుంది?"
"పోనీయ్ అర్థం అయ్యేలా చెప్పరాదూ?"
"అది ఒక్క మాటలో చెబితే అర్థం అయ్యే విషయంకాదు. ముఖ్యంగా నీలాంటివాళ్ళకు!" గౌతమ్ ముఖం చాలా గంభీరంగా ఉన్నది.
సుధకు తను మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పేమిటో బోధపడలేదు. అయినా గౌతమ్ ను శాంతపరచడానికి అన్నట్లు అన్నది. "అవును! బీదతనం పాపం కాదు. ధనవంతులకంటే బీదవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువే. వాళ్ళను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. కాని వాళ్ళు బీదవాళ్ళు కావడానికి భాగ్యవంతులదే తప్పంతా అన్నట్టు నువ్వు మాట్లాడటం తమాషాగా ఉంది. ఎవరి అదృష్టం వాళ్ళది. పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం అనుభవించాలిగా?" వేదాంతిలా అన్నది సుధ.
గౌతమ్ మాటలు ఆమె ఇంతకు ముందు ఎవరినోటా వినలేదు. గౌతమ్ ఉద్రేకంతో అంటూ ఉంటే ఆమెకు అతను ఎంతో అందంగా కనిపించాడు. తన్మయత్వంతో అతన్ని చూస్తూ ఉంటే ఆమెకు షేక్స్ పియర్ పాత్రలు గుర్తుకు వచ్చాయి.
ఆ పాత్రలు కంతం చెబుతున్నంత అందంగా ఉపస్యాసాలు ఇస్తాయి.
"అయితే మీ ఉద్దేశ్యం ధనవంతులంతా సుఖంగా ఉన్నారంటారా?
గౌతమ్ వాక్ ప్రవాహం ఆగింది.
"ఏం మీరు సుఖంగా లేరా?" ఆమె కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అడిగాడు.
"ఊహూ! ఆమాటకొస్తే ధవంతులకంటే చాలామంది బీదవాళ్ళే సుఖంగా ఉంటారు. నాకంటే ఆ ఎదురుగా కనిపించే పల్లెకారుల ఇంట్లో పెరిగే ఆడపిల్ల సుఖంగా ఉంటుంది?"
"ఎందుకని"
"ఆమెకు ఉన్న స్వేచ్చ నాకు లేదు. ఆమె తనకు నచ్చినట్లు....
గౌతమ్ పకపక నవ్వాడు.
"ఎందుకు అలా నవ్వుతున్నారు? నా మాటలు వింటుంటే మీకు ఎగతాళిగా ఉందికదూ!"
"కాదు! కాదు! మీ కష్టాలు చూస్తుంటే నవ్వొస్తోంది."
సుధ ముఖం చిన్నబుచ్చుకుంది.
"బాధ కలిగించానా?"
సుధ మాట్లాడలేదు.
"ఇక నాకు శెలవు ఇప్పిస్తారా?" అన్నాడు గౌతమ్.
"అలా బీచికి వెళ్ళి కూర్చుందాం. మీతో మాట్లాడాలి. వస్తారా?"
"రాను!" ఖచ్చితంగా అన్నాడు.
సుధ ముఖం మీద ఏదో చళ్ళుణ తగిలినట్టు అయింది.
ముఖంలో ఉలికి వస్తున్న భావాల్ని అణుచుకుంటూ "నాతో బీచ్ కి రావడం చిన్నతనంగా భావిస్తున్నారా?"
"అబ్బే అదేంకాదు త్వరగా వెళ్ళాలి. పని ఉంది."
"మీతో మాట్లాడాలి."
"ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు."
సుధ తృళ్ళిపడినట్టు చూసింది.
"తెలుసా?"
"ఆ"
"ఏం తెలుసు?"
"మీరు మాట్లాడాలనుకొనే విషయం!"
"ఎలా తెలుసు?"
"ఆ మాత్రం అర్థం చేసుకోగలను"
"లేదు నేను నమ్మను. నా గురించి ఎవరో మీకు లేనిపోనివి కల్పించి చెప్పి ఉంటారు" అక్కసుగా అన్నది.
ఆమె ఎవర్ని ఉద్దేశించి అన్నదో గౌతమ్ కు అర్థం అయింది.
"నేను నిజమే చెబుతున్నాను. కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థం అవుతాయి. మీరు అనవసరంగా ఎవర్నో మధ్యలో లాక్కు వస్తున్నారు"
"నన్ను మీరు...మీరు...అంటూ మన్నించనక్కర్లేదు"
"నువ్వు అని సంబోధించే చనువు మీ దగ్గర నాకు లేదు"
"కావాలంటే సంపాదించుకోవచ్చుగా?"
"ఏమిటి డబ్బా"
"కాదు చనువు"
గౌతమ్ నవ్వాడు.
"నేను చెప్పదల్చుకున్న విషయం మీకు తెలుసునన్నారుగదూ!"
"అవును!"
"మరి మీ సమాధానం?"
"అదికూడా చెప్పకుండానే అర్థం చేసుకోవలసిన విషయం. మీరు కొంచెం వివేకంతో ఆలోచిస్తే మీకే సమాధానం దొరుకుతుంది."
"అది మీ నోటినుంచి వినాలని ఉంది"
గౌతమ్ మాట్లాడలేదు.
"మీరు అర్థం చేసుకున్నా నేను చెప్పాలనే నిర్ణయించుకున్నాను."
"అయితే చెప్పండి త్వరగా!"