"సుద్దరోడు తపస్సు చేస్తుంటే రాములోరు తల తెగనరికి న్రటకాదుండి" అడిగాడు రామకిష్ణయ్య గ్రహించారు నారాయణస్వామి.
"అవును వధించిన మాట నిజం. కాని వధించిన రాముడే శంబూకునకు వైరాజలోకాన్ని ప్రసాదించినాడు" అని శ్లోకం చదివారు స్వామిః____
"యాత్రానందాశ్చ మోదాశ్చయత్రపుణ్యాశ్చ సంపదః
వైరాజా నామతే లోకా స్తయ్ మిసాః సంతుతే శివాః"
సంస్కృతం విని ఉలకలేదు పలకలేదు రామకృష్ణయ్య. రామకృష్ణయ్యకు కృతఘ్నతను గురించి చెప్పాలనుకున్నారు స్వామి.
"రామకిష్ణయ్యా! రాముడు వాలిని వధించినాడు. శరత్కాలము వచ్చునంత వరకు సుగ్రీవుని సుఖములనుభవించమని రాముడు గుహలో ఉండిపోయినాడు. వర్ష కాలము గడచినది. శరత్తు వచ్చినది. కాని సుగ్రీవుని జాడ కానరాలేదు. అప్పుడు రాముడు లక్ష్మణునితో "ఆకృతఘ్నో ప్రకృతితో హన్ తి సత్యవతాంమనః" ఉపకారమునకు ప్రత్యుపకారము చేయకున్నా స్వాతికుల మనసు నోచ్చును. కాన నీవు సుగ్రీవుని కడకు పోయి యధోచితముగా చెప్పి అతనిని సీతాన్వేషణకు పురికొల్పుము అన్నవాడై లక్ష్మణుని సుగ్రీవుని కడకు పంపెను." అని "లక్ష్మణుడు సుగ్రీవునితో ఇట్లన్నాడు:-
బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తధా
నిష్క్రుతిర్విహితా సద్భిః క్రుతగ్నేనాస్తి నిష్క్రుతిః
అనగా బ్రహ్మహత్యకు, సురాపానమునకు, దొంగతనమునకు, వ్రత భంగము చెసికొనినవానికి ప్రాయశ్చిత్తము విధించబడినది. కాని కృతఘ్నునాకు ప్రాయశ్చిత్తము విధింపబడలేదు అని అర్ధము" అని చెప్పిన నారాయణస్వామి సీతా న్వేషణవరకు గల కథ అంతా చెప్పారు.
ఆనాటి పురాణం అంతటితో ముగిసింది.
"బాగా చెప్పిన్రుండి. లక్ష్మణులోరు పోకుంటే సుగ్రీవులోరు వచ్చెటోడె కాదన్న మాట" అన్నాడు రామకిష్ణయ్య.
తాను చెప్పదలచుకున్నది రామకిష్ణయ్యకు అర్ధం కాలేదా? అర్ధమయ్యీ కానట్లు నటిస్తున్నాడా అర్ధం కాలేదు నారాయణస్వామికి.
ఆనాటి నుంచి రామకిష్ణయ్య పురాణానికైతే వస్తున్నాడు అని పంపించాల్సింది పంపించడం మానేశాడు. అడిగే స్వభావం నారాయణస్వామి వద్ద లేదు. అందువల్ల ఇంట్లో కాస్త ఇబ్బంది మొదలయింది.
"రామకిష్ణయ్య సామాన్లు పంపదం బందు చేసిండు. ఒక్కసారి అడగరాదుండి" అన్నది నాంచారమ్మ.
నవ్వి వూరుకున్నారు నారాయణస్వామి.
"ఇంట్ల బొత్తిగా నెయ్యి అయిపోయింది. రామకిష్ణయ్య ఇంటికిపోయి తెత్తునా?" మరొక నాడన్నది నాంచారమ్మ.
"నేయ్యిలేక తినలేకపోతమా!" అని గంభీరించారు నారాయణస్వామి.
"లచ్చమ్మకు వంకాయకూర తినాల్నని ఉన్నదటనుండి. నూనె లేదు...." తరవాత మాట మింగేసింది నాంచారమ్మ.
నారాయణస్వామి గదిలోకి వెళ్ళి ఎక్కణ్ణుంచో వెతికి డబ్బులు తెచ్చి "ఈ డబ్బిచ్చి లచ్చమ్మనే నూనె తెమ్మను" అన్నారు.
నాంచారమ్మ కేమీ అర్ధం కాలేదు. భర్త చెప్పినట్లే చేసింది.
ఒకనాడు లచ్చమ్మ స్వామి ఇంటికి వచ్చింది___ఉసిరికాయపచ్చడి కావాలని. నాంచర్మ ఆకులో పచ్చడి తెచ్చి నేలమీద పెట్టి దూరం జరిగింది. లచ్చమ్మ ఆ ఆకు అందుకుంటున్నప్పుడు వీధిన వెళ్తున్న రామకిష్ణయ్య చూచాడు.
"అమ్మగారూ! అంటరానివాండ్లకు అన్నం కూరలు పెడ్తారుండి. మీరు పెద్దలు. చెప్పేదిపోయి చెప్పించుకోవాల్సి వచ్చె" అని సాగిపోయాడు.
నాంచారమ్మ కొయ్యబొమ్మలా అరుగు మీద నుంచుండి పోయింది.
లచ్చమ్మకు అదేమీ అర్ధం కాలేదు. పచ్చడి తీసుకొని వెళ్ళిపోయింది.
ఆనాటి నుంచి రామకిష్ణయ్య పురాణానికి రావటం తగ్గించాడు. రాలేదనకుండా అప్పుడప్పుడూ ముఖం చూపించి పోతున్నాడు.
ఒకనాటి రాత్రి___వేసవికాలం___ఆరుబయట మంచాలు వేసుకొని పడుకున్నారు నారాయణస్వామి నాంచారమ్మ. ఇంకా నిద్ర పోలేదు. ఇంటి పరిస్థితిని గురించి మాట్లాడుకుంటున్నారు. గురవయ్య పదం వినిపించింది దూరంగా___
లచ్చారిబొమ్మా!
జర కన్కోని తిరగమ్మ లచ్చారిబొమ్మ!
నా మగడు కుంటోడు, ఎడమ చేయి తొంటోడు.
నా అక్క మంకుది. ఊరంతా బొంకుతాది.
నాంచారమ్మకు గురవయ్య పదాలంటే మనను. ముచ్చట ఆపి పదం వినసాగింది.
లచ్చారిబొమ్మా, జర కన్కోలి తిరుగమ్మా.
మా అయ్యా మామగాడు. మందిని ముంచుతాడు.
పల్లెపదం సాగిపోయింది. గురవయ్య దాటిపోయాడు. అయినా అది కొంత సేపు చెవుల్లో రింగుమంటూనే ఉంది.
"ఏమండీ" భర్తను పిలిచింది. "గురువయ్యకు తాగుడుమాన్పించరాదుండి. మీరు చెప్పుతే ఇంటడు" అన్నది.
"పిచ్చిదానా! పొద్దుందాకా కష్టం చేస్తడు. కాస్త తాగకేం చేస్తడు. తాగక మంది కొంపలు ముంచే రామకిష్ణయ్య కంటే తాగే గురువయ్యే నయం" నారాయణ. స్వామి సమాధానం విచిత్రంగా అనిపించింది నాంచారమ్మకు. "మీరు చెప్పుతే వింటడు. చెప్పండి" మళ్ళీ ప్రాధేయపడ్డది.
"అట్లనేలే పడుకో" అన్నారు.
ఒకనాడు గురువయ్యను పిలిచారు స్వామి. "ఒక బస్తా గింజలమ్మి పైకం తెచ్చిపెడ్తవు!" అన్నారు.
గురువయ్య బస్తా వీపున వేసుకుని రామకిష్ణయ్య ఇంటికి చేరాడు.
"అయ్యగారిదేనా!" అడిగాడు రామకిష్ణయ్య. అవునన్నాడు గురువయ్య.
"అరే! అయ్యగారికి లేకుంటే పాయె. మాలగాడ్ది కొడుకువు నీకన్న ఉండోద్దుర. ఏ జన్మల ఏం చేసినవో మాలోనివై పుట్టినవు. పురుగులు పడి చస్తవు కుక్కల కొడక" అని నానా చీవాట్లు పెట్టి "ఇప్పటికి ఇయే ఉన్నయి తీస్కపో, ఆ టెన్క ఇస్తనని అయ్యగారితో చెప్పు" అని ఏదో కొంత పైకం ఇచ్చి పంపించాడు.
పైకం అయ్యవారిచేతిలో వేసి___రామకిష్ణయ్య చెప్పమన్నది చెప్పి వెళ్ళి పోయాడు గురువయ్య. ఇంటికి వెళ్ళి, "అయ్యగారింటికి పోతే పురుగులు పడిచస్తమట కోంటాయన చెప్పిండు. ఇగబంద్ అటు పోకు" అని లచ్చమ్మకు చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
లచ్చమ్మకు ఏమీ అర్ధంకాలేదు. నాంచారమ్మ ఇంటికి వెళ్ళాలని గడపలోంచి ఇంట్లోకి పదిసార్లు తిరిగింది-కాలుకాలిన పిల్లిలా. తుదకు చతికిలపడి చేతులు తలకు. పెట్టుకొని కూర్చుంది.
ఆ రోజునుంచి రామకిష్ణయ్య పురాణానికి రావడం బొత్తిగా మానేశాడు.
సాయంకాలం కాగానే వ్యాసపీఠంమీద పుస్తకం పెట్టుకొని కూర్చుంటున్నారు స్వామి. కొన్నాళ్ళు నలుగురు, ముగ్గురు, ఇద్దరు, ఒకరు వచ్చారు. ఇప్పుడు ఎవరూ రావడంలేదు. నారాయణస్వామి మాత్రం వేళకు పుస్తకం పట్టుకుని కూర్చుంటూనే ఉన్నారు. వినేవారు ఎవరూ లేకపోవడాన నాంచారమ్మకే చెపుతున్నారు.
నాంచారమ్మ మనసు పురాణం మీద నిలువడంలేదు. లచ్చమ్మ రావడం మానేసినందుకు ఆమెకు అదోలా ఉంది. లచ్చమ్మ ఏం తింటూందో? ఎలా ఉంటూందో? తనకు రుచులు చెప్పేది. పచ్చళ్ళు పెట్టించుకు పోయేది. కూరలు వడ్డించుకు తినేది. ఏదో చేతినిండా పని ఉన్నట్లుండేది. ఇప్పుడు మనసు శూన్యంగా ఉంది. ఇల్లు శూన్యంగా కనిపిస్తూంది. లచ్చమ్మ భౌతికంగా నాంచారమ్మకు ఎప్పుడూ దగ్గరగా రాలేదు. అయినా ఆమె మనసులో ఒక స్థానం సంపాదించింది. లచ్చమ్మ ఎందుకు రావడంలేదో ఆమెకు అర్ధం కాలేదు. అనేకసార్లు గురువయ్య ఇంటికివెళ్ళి పిలుద్దామనుకుంది. గడపదాకా వెళ్ళింది-ఏదో అహం అడ్డు వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. ఆ రోజు భోజనాలయి పడుకున్నప్పుడంది. "లచ్చమ్మ రావటంలేదు- గురువయ్య రావటంలేదు. ఎందుకండి?"