Previous Page Next Page 


    వీటన్నిటి బట్టి ఆలోచిస్తుంటే పెద్ద పథకం ఏదో బ్యాగ్రవుండ్ లో ఉన్నట్లు తోస్తుంది__

    శశాంక తన జీవితంలో ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్నాడు....

    "మీరేం జేస్తారన్నది నా కనవసరం. నా కొడుకు బయటికి రావాలి. ఎంత కావాలో చెప్పండి....? తలా ఐదు లక్షలా....? పది లక్షలా....? ఇరవై లక్షలా....?" సూటిగా చూస్తూ బేరం పెట్టాడు శశాంక అసహనంతో.

    సుదర్శన్ అదిరిపోయాడు.

    తనతో కలుపుకొని ఎనిమిదిమంది__అంటే కోటీ అరవై లక్షలు ఇస్తాడా....! ఇస్తాడు. శశాంక డబ్బు దగ్గర ఎప్పుడూ అబద్ధం చెప్పడు. పరువు....ప్రెస్టేజ్....ఇవే ఆలోచిస్తాడు ఎప్పుడూ.

    తన కొడుకు హత్య చేసాడని, అది పరువు తక్కువని అనుకోవటం లేదు. కొడుకుని రక్షించుకోలేక పోవటమే పరువు తక్కువగా భావిస్తున్నాడు.

    సరిగ్గా ఇదే సమయంలో పూణేలో దిగిన శుక్రాచార్య రైల్వేస్టేషన్ నుండి యస్.టి.డి. ద్వారా అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు....

    "హలో....సర్....విశ్వదత్తను మీరు తప్పించి....ఎఫ్.ఐ.ఆర్. మార్చగలిగితే పాతిక లక్షలు అందుతాయి మీకు...."

    "షటప్ రాస్కెల్....ఆ పచ్చినెత్తురు తాగే దుర్మార్గుడ్ని వదిలి పెట్టాలా....? నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నావా?" నిజాయితీ పరుడైన సర్కిల్ ఎగిరిపడ్డాడు.

    "కన్న తండ్రిని....ఏదో బాధలో...." ఆగాడు శుక్రాచార్య.

    సర్కిల్ ఫోన్ పెట్టేసాడు విసురుగా.

    కథ పాకాన పడుతోంది.

    నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు శుక్రాచార్య.

    వెంటనే మరలా యస్.టి.డి చేశాడు హైద్రాబాద్ కి.

    ఈసారి శుక్రాచార్య కాల్ ని సుదర్శన్ ఎత్తాడు__

    "ఫోన్ ఎవరు ఎత్తారన్నది నా కనవసరం. చెప్పింది చెప్పినట్లుగా శశాంకకి చెప్పండి ఓ సందర్భంలో నాకో సహాయం చేసాడు. శశాంక తేజదత్త ఆ కృతజ్ఞతతోనే చెబుతున్నాను. యజ్ఞభూపతికి చెందిన రెండు గుర్రపు పిల్లల్ని చాలా తెలివిగా లేపేశారంట శశాంక.

    పై పెచ్చు యజ్ఞభూపతి ఎంతో శ్రమపడి కెనడా నుంచి తెచ్చుకున్న రాయల్ కింగ్ ఫోటో సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది__అందులో భాగంగా సుదర్శన్ ని నీవు రంగంలోకి దింపినట్లు తెలిసింది.

    సుదర్శన్ అంత సీరియస్ గా ఆకాల్ ని అటెండ్ కావటాన్ని బట్టి అక్కడున్న అందరికీ అనుమానం కలిగించింది.

    శశాంక సుదర్శన్ వేపు వస్తుండగా, సుదర్శన్ ఫోన్ లో మాటల కోపం ఎదురు చూస్తుండగా షడన్ గా లైన్ కట్ అయిపోయింది.

    కోపంగా చూస్తున్న శశాంక తేజదత్తకు ఫోన్ వివరాలు చెప్పాడు సుదర్శన్.

    అప్పుడు శశాంక దృష్టి యజ్ఞభూపతి వేపుకు మళ్ళింది....క్రమంగా కసి, కోపం, అసహనం పెరగటం పిచ్చిగా హాల్ ధ్వనించేలా శశాంక కేకలు పెట్టడం అక్కడున్న అందరికీ భయాన్ని కలిగించింది....


                                                                     *    *    *


    భారతదేశంలో పేరు పొందిన పారిశ్రామిక వేత్తలలో యజ్ఞభూపతి ఒకడు. వయసు సుమారు యాభై వుంటుంది. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రకరకాల ఫ్యాక్టరీలున్నాయి. మరెన్నో కంపెనీలున్నాయి.

    అమెరికా, లండన్, హాంకాంగ్ లాంటి దేశాల్లో కొన్ని పెద్ద కంపెనీలో కూడా షేర్స్ వున్నాయి.

    "తేజ హోటల్స్ గ్రూప్" అంటే ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలున్నాయి. దాని అధిపతి యజ్ఞభూపతి.

    ఒబరాయ్, షేరటాన్, తాజ్, వెల్ కమ్ లాంటి ప్రముఖ చేయినీస్ హోటల్స్ లిస్ట్ లోకి వస్తుంది తేజ్ గ్రూప్.

    యజ్ఞభూపతి తాతగారు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటీషువారి దగ్గర ఒకప్పుడు కార్యదర్శి హోదాలో పనిచేశాడు. ఆయన రాజ సేవావానికి మెచ్చిన ఒక బ్రిటీష్ అధికారి భార్య తన వజ్ర కిరీటాన్ని పోతూపోతూ ఆయన కిచ్చిందనీ ఆ కిరీటాన్ని అమ్ముకోగా అప్పట్లో పదికోట్ల వచ్చాయని ఆ సొమ్ముతోనే ఆయన ఇండియన్ ఇండస్ట్రియల్ కింగ్ అయ్యాడని చెప్పుకుంటారు.

    ఆయనకు ఒకే కూతురు_ ఆ కూతురికి ఇద్దరు కొడుకులు. ఒక కూతురు__

    కాలగమనంలో ఇద్దరు మనవళ్ళు, మనవరాలు ఏమయ్యారన్నది ఎవరికి తెలియదు. యజ్ఞభూపతి ఒక మనవడు కాగా. మరో మనవడు, మనుమరాలు ఏమయ్యారన్నది ఆ కుటుంబ రహస్యంగానే మిగిలిపోయింది.

    రెండో మనవల్ని డబ్బు పిచ్చిలో ఓ ఉత్తర భారతదేశ మహారాజుకు దత్తత ఇచ్చాడని, మనవరాలు ఓ పేదవాడ్ని ప్రేమించిందనీ ఇంటి నుండి వెళ్ళగొట్టాడని అనుకోవటమే తప్ప నిజానిజాలు ఎవరికి తెలియవు....

    జమిందార్లు, మహారాజుల కుటుంబాల్లో ఎన్నో మిస్టరీలు మిస్టరీల్లాగే నిక్షిప్తమైపోతాయి.

    మరో కథ కూడా వుంది.

    ఈయనకి ఆ బ్రిటీష్ అధికారి భార్యతో సంబంధాలుండేవని. దానివల్లే ఆవిడ ఈయనతో ఉండిపోయిందని, దొరగారు ఆ దెబ్బతో ఆత్మహత్య చేసుకున్నాడని, దాంతో ఆయన ఎన్నో దారుణాలు చేసి సంపాదించుకున్న నిధిని ఈయనగారు చేజిక్కించుకున్నారని, ఆ తరువాత ఆమెను కూడా హత్య చేయించాడని పుకారుంది.

    యజ్ఞభూపతికి రేసుల పిచ్చి బాగా ఉంది. అది ఆయన తాతగారి నుండే సంక్రమించిందని చెప్పుకుంటారు.

    ఇప్పటివరకు రేసుల్లో ఎన్ని కోట్లు పోయాయో యజ్ఞభూపతి లెక్క రాస్తే అది మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను దాటిపోతుంది.

    ఇండియాలో వున్న రేస్ కింగ్స్ తో యజ్ఞభూపతికి ఎంత పేరుందో అంత పేరు శశాంక తేజదత్తకు కూడా వుంది.

    దేశవ్యాప్తంగా ఇలాంటి రేస్ కింగ్స్ ఓ యాభై దాకా వుంటారని అంచనా.   

    ఈ యాభై మంది సరదాగా ఆడుకొనే ఆట రేస్.

    ఆ ఆటలో ఎన్నో గుర్రాలు, జాకీలు, ట్రైనీలు, బుక్ మేకర్స్, పంబర్స్, వెటర్నటీ డాక్టర్స్, రేస్ క్లబ్ సిబ్బంది, మధ్యతరగతి ఆశా జీవులు మాడిమసైపోతుంటారు.

    ఆశ అనే బలహీనతను అడ్డం పెట్టుకుని ధనవంతుడు ఆడుకునే ఈ ఆటలో ఎంతమందో శలబాలైపోతుంటారు.

    ఈ ఆటలో గుర్రాల ఓనర్ కి ఓనర్ కి మధ్య కక్షలు, కారుణ్యాలు, మోసాలు, దుర్మార్గాలు__

    ఈ ధనవంతుల రేస్ పిచ్చి దగ్గరే శుక్రాచార్య తన పథకానికి పునాదులు వేసుకున్నాడు.


                             *    *    *


    శుక్రాచార్య స్టేషన్నుండి సరాసరి సిటీబస్ ఎక్కి పూనే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ వీధిలో దిగాడు.

    అప్పుడు టైమ్ ఉదయం 9_30 కావస్తోంది.

    ఆలోచిస్తూ ఇన్ స్టిట్యూట్ పక్కనుంచి వున్న ఐదో ఇంటివేపు బయలుదేరాడు.

    భరత్ ఈ టైమ్ లో అనంత్ ట్రైనింగ్ గ్రౌండ్ లో వుండాలి. వచ్చేసరికి పదికావచ్చు. అప్పటివరకు ఎదురుచూస్తూ కూర్చోవల్సిందే.

    శుక్రాచార్య జీవితంలో ఎప్పుడూ పడనంత ఆందోళన పడుతున్నాడు. జీవితపు ఆఖరి అంచులో కొట్టుమిట్టాడుతున్న తన ప్రాణానికి ఆలంబన విశ్వభరత్. తన కోరికను మన్నిస్తాడా? తన పగ, కసి తనవిగా భావించి చివరికోరిక తీరుస్తాడా....?

    మీకోసం నా జీవితాన్నెందుకు నాశనం చేసుకోవాలని ప్రశ్నిస్తే?

    ఈ నిరాశా నిస్పృహలమధ్య కొట్టుమిట్టాడుతోంది శుక్రాచార్య ఊపిరి.

    ఇంట్లోకి అడుగుపెట్టేసరికి కింద హాలంతా నిర్మానుష్యంగా ఉంది. తలుపులు ఓపెన్ చేసి ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళినట్లు....?

    దిగులుగా కూర్చున్నాడు సోఫాలో.

    పది నిముషాలు గడిచాయి....

    "ఎప్పుడొచ్చారు అంకుల్ ....?"

    "ఎప్పుడొచ్చారు అంకుల్ ....?"

    మూడోసారి అడుగుతుండగా స్పృహలోకి వచ్చాడు శుక్రాచార్య, ఉలికిపాటుగా చూసాడు_ఎదురుగా అశ్వభరత్.... తన ఆశలకు ఆశయాలకు ప్రతిరూపంగా.

    సన్నగా, నాజుగ్గా అందమైన ఆడపిల్లలా కనిపించే పందొమ్మిదేళ్ళ ఆ యువకుని కళ్ళలో మెరుపు.

    శరీరపు అంచులలో దృఢత్వం_కదులుతున్న కళ్ళలో వేటగాడి వాడి ఉత్తేజపూరితమైన కదలిక_సన్నగా అనిపిస్తూనే ఆరోగ్యంగా బలిష్టంగా అనిపించే చేతులు_చామనఛాయతో కూడా ఓ ప్రత్యేకమైన ఆకర్షణ_ఆరడుగులకి కాస్త తక్కువగా అనిపించే ఆ యువకునిలో అస్పష్టంగా కనిపించే రఫ్ నెస్.

    ఎంత విలక్షణంగా ఎదిగాడు...."!!!

    ఎప్పుడు ఇంత పరీక్షగా భరత్ ని పరికించని శుక్రాచార్యకే ఆశ్చర్యం....!!!

    "ఇప్పుడే వచ్చాను...."

    "ఈ సమాధానం రెండు నిమిషాలక్రితమే చెప్పి వుండాలి. పరిశీలనలో మునిగి ఉన్న శుక్రాచార్యను మౌనంగా చూపులతోనే ప్రశ్నించాడు అశ్వభరత్.

    అన్నిటికిమించి అశ్వభరత్ చూపులు మౌనంగా ప్రశ్నించగలవని.... మౌనంగానే సంతోషాన్ని వ్యక్తం చేయగలవు. మౌనంగానే కోపాన్ని, అభినందల్ని, అవతలవాడి ఆలోచనల్ని పసిగట్టగల మౌనమైన చూపులు.... వాడి చూపులు.

    "సమయం ఆసన్నమైంది కదా అంకుల్....?"

    మరింత ఆశ్చర్యపోయాడు.

    "మీరు ఇప్పుడిక మాట్లాడలేరు....ఇక మాట్లాడినా, చేసినా నేనే."

    అర్ధంకానట్లుగా చూశాడు శుక్రాచార్య.

    "నాకంతా తెలుసు అంకుల్, నెలకు 3,200 ఖచ్చితంగా సంపాదిస్తూ ఒకవంతు__కేవలం 800లతో మీ సంసారాన్ని సరిపెట్టుకొని 2,400 నాకు ఖర్చు పెడుతూ వచ్చారు. మీ జీవితాన్నే పణంగా పెట్టారు....?" 

 Previous Page Next Page