శృంగారం సప్తస్వర సమ్మేళనం.
స....అమ్మాయి సాగిపోయి ఒద్దంటుంది.
రి....రివ్వున వదిలిన బాణంలా అబ్బాయి ఆమెని అందుకుంటాడు.
గ....అమ్మాయి గారాలలో నయగారాలు కురిపిస్తుంది.
మ....అబ్బాయి మంకుపట్టు పట్టి మాట నెగ్గించుకుంటాడు.
ప....అమ్మాయి పరాగ్గా నటిస్తూ పందిరిలా అల్లుకోనిస్తుంది.
ద....అతను అందంగా దగ్గరయిపోతాడు.
ని....నీవూ నేనూ కలిసి మనం అయిపోదాం అనుకునే స్థితి.
అప్పుడే కొందరబ్బాయిలు రివర్సులో మళ్ళీ మొదటి మెట్టుకొచ్చి 'సా' అంటారు.
రిషి ఏమయ్యేవాడో కానీ అతను అయిదో మెట్టు మీదుండగానే ఎవరో పిలిచినట్టు చప్పుడయింది.
"ఛీ....బుద్ధిలేదూ ఈ టైంలోనా?" రిషి విసుక్కున్నాడు.
"ఏవిటి ఈ టైంలోనా?" ఆశ్రిత అడిగింది.
"మంచి మూడ్ లో డిస్టర్బ్ చేస్తున్నారు?" రిషి కోపంగా అన్నాడు.
"కళ్ళు తెరవండి" అంది ఆశ్రిత గట్టిగా కుదుపుతూ.
అతనికి తెరవాలనిపించలేదు. "ఉ....హూ!" అన్నాడు అలాగే కళ్ళు మూసుకుని.
వెంటనే మొహాన నీళ్ళు కళ్ళాపి జల్లినట్లుగా పడ్డాయి.
"ఏవిటీ?" రిషి అదిరిపడ్తూ కళ్ళు తెరిచాడు.
ఆశ్రిత చేతిలో చెంబుతో ఎదురుగా నిలబడి కోపంగా అంది "పక్కలో పిల్లిని పెట్టుకుని ఏవిటా వెధవ వేషాలు?"
రిషి అయోమయంగా చూస్తూ "పిల్లా! కాదు పిల్లే!" అన్నాడు.
"మీకు తగ్గాకా మాట్లాడుదురు. ముందు దాన్ని చంపకుండా ఒదిలిపెట్టండి" అంది.
రిషి అప్పుడు చూసుకున్నాడు పక్కలో వెచ్చగా పడుకున్న పిల్లి కన్నుకొడ్తూ 'మ్యా....వ్" అంది.
"ఛీ.... ఇందాకట్నించీ ఇదా!" రిషి చిరాగ్గా దానిని అదిలించాడు.
"మరి ఏది అనుకున్నారు?" ఆశ్రిత విసుగ్గా అడిగింది.
"అనుకున్నాను.... అదంటే మరీ.... ఇదన్నమాట!" రిషి నీళ్ళు నమిలాడు.
"దాని అరుపులూ మీ ఆగడం ఇందాకట్నించీ చూసి భరించలేక చచ్చాను! అంత ముద్దయితే పగలు కాసిని పాలు పొయ్యండి. రాత్రిళ్ళు రభస చెయ్యొద్దు!" చిరాగ్గా మొహంపెట్టి అంది ఆశ్రిత.
"అలాగే!" రిషి ఆముదం తాగినట్టు మొహంపెట్టి అన్నాడు.
"గుడ్ నైట్" కసిరినట్లు చెప్పి ఆశ్రిత నిలువెల్లా రగ్గు బిగించుకుని పడుకుంది.
"భలే ఎంజాయ్ చేశావు కదూ!" మనసు ఇకిలించింది.
"నోర్ముయ్! అప్పుడే అనుకున్నా. నీకంత ధైర్యం ఎక్కడిదా అని!" గుర్రుమన్నాడు రిషేంద్ర. "ఓసారి బల్లీ, ఇంకోసారి పిల్లీ" నవ్వింది మనసు.
"ఓసారి కలలో కాకుండా రియల్ గా ట్రై చేద్దామా" మనసు కవ్వించింది.
"ఒద్దు. నిద్రొస్తోంది!" నీరసంగా అన్నాడు రిషి.
"పాపం! ఏడో మెట్టుమీద నుంచి క్రిందపడిపోయావు కదూ. పడుకో" మనసు ఓదార్చింది.
రిషి అవలించి ఆ.... అనబోయి 'సా' అని నాలిక కరుచుకున్నాడు.
* * *
బలవంతంగా బడికొస్తున్న పిల్లాడిలా బద్ధకంగా వచ్చాడు సూర్యుడు. ఎర్రని ఎండ చెంపమీదపడి చుర్రుమనిపించగానే కాస్త తెలివొచ్చినట్లయి, కళ్ళు తెరవకుండానే "కా....ఫీ" అని అరిచింది ఆశ్రిత.
"కాఫీనా.... భూపాల రాగం ఒద్దూ! కోరికలకేం తక్కువలేదు పాపం!" రిషి ఉక్రోషంగా సణిగాడు.
"హాయ్! గుడ్ మార్నింగ్.... రాత్రి విశేషాలేమిటి?" శ్రీజ గాలి దుమరంలా వస్తూ అడిగింది.
ఆశ్రిత మంచంమీద నుండి లేచి కూర్చుంటూ"రాత్రి.... ఆయనా!" అంటూ నవ్వు మొదలెట్టి గుక్క తిప్పుకోలేక కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకుని మరీ "అసలేం జరిగిందంటే...." అని చెప్పడం ప్రారంభించింది.
"ఏం జరిగిందీ?" ఆసక్తిగా శ్రీజ మంచం మీద కూర్చుండి పోయింది.
"ఏం జరగలేదు. కాఫీ ఇదిగో" రిషి ఆశ్రితకి కాఫీ గ్లాసిస్తూ అరిచాడు.
"ఎందుకు జరగలేదూ.... చెప్పనీయండి" అంది ఆశ్రిత గ్లాసు అందుకుంటూ "అసలేం జరిగిందనీ?" రిషి కస్సుమన్నాడు.
"అదే రాత్రి ఆయన పక్కలో...." ఆశ్రితకి మళ్ళీ ఆపుకోలేనంత నవ్వొచ్చింది.
"ఆపండి.... ఆపమంటుంటే.... మిమ్మల్నే?" రిషి అరిచాడు.
"అబ్బా! సస్పెన్స్ తో చంపక చెప్పనియ్యి రిషీ!" శ్రీజ ఆతృత భరించలేక మోకాళ్ళమీద లేస్తూ అంది.
"ఓ రాత్రివేళ నాకు మెలుకువ వచ్చేసరికీ.... ఆయనా...." అంటూ ఆశ్రిత కాఫీ గుటకవేసి కెవ్వుమంది.
"ఏం చేసాడూ? కొంపదీసి నేను అనుకున్నంతా అయిపోయిందా?" శ్రీజ ఆమె గడ్డంపట్టి వూపేస్తూ అడిగింది.
ఆశ్రిత మాట్లాడలేదు. కళ్ళనీళ్ళు పెట్టుకుని నోరు గట్టిగా అర చేత్తో మూసేసుకుంది.
"అంత చెప్పరాని సంగతా?" శ్రీజ ఉత్సుకతగా అడిగింది.
ఆశ్రిత తల ఆడిస్తూ, నోరు కాలిందన్నట్లు సైగ చేసి చెప్పింది.
"బాగా అయింది" అక్కసుగా అన్నాడు రిషి.
"అంత వేడిగా యివ్వకపోతేనేం?" కోపంగా అడిగింది శ్రీజ.


