Previous Page Next Page 
బుద్ధిజీవి పేజి 10

అజిత్ మొహం సీరియస్ గా మారిపోయింది. టాప్ స్పీడులో పోనిస్తున్నాడు కారుని. దాన్ని ఎలాగైనా అందుకోవాలనే పట్టుదల కనబడుతోంది అతని మొహంలో.
ఒకవేళ అది నిజంగా ఫ్లయింగ్ సాసరే అయితే, క్షణంలో కళ్ళకు కనబడనంత దూరం వెళ్ళిపోగలదు. కానీ ఎందుకిలా చెలగాట మాడుతున్నట్లు కనబడి ఊరిస్తూ వుంది? పరాచికాలాడుతున్నారా గ్రహాంతరవాసులు?
తెలతెలవారుతోంది.
మెల్లమెల్లగా ఆకాశమంతటా వెలుగు ఒళ్ళువిరుచుకుంటోంది.
సూర్యకిరణాలు సోకీ సోకగానే కరిగి పోయినట్లు అదృశ్యమైపోయింది ఫ్లయింగ్ సాసర్.
ఆకాశంలో జరుగుతున్న ఈ నాటకాన్నంతా సంభ్రమంగా చూస్తోంది అపురూప.
'ఇదంతా తన భ్రమేమో?' అని మొదటిసారిగా అజిత్ సందేహంలో పడిన క్షణంలోనే 'ఏమిటిది? కొంపదీసి ఈ ఫ్లయింగ్ సాసర్ అన్నది నిజం కాదు గదా?' అన్న డౌటు కలిగింది అపురూపకి.
ఫ్లయింగ్ సాసర్ అదృశ్యమైపోగానే నిట్టూర్చి క్రిందకి చూశాడు అజిత్.
అసంఖ్యాకంగా బుడగలు కనబడ్డాయి నేలమీద.
అవి ఫైబర్ గ్లాస్ గుడ్డతో చేసి, ఎయిర్ ప్రెజర్ తో నిలబడే గుడారాల్లాంటి 'బబుల్ హవుసెస్' అని గ్రహించాడు అజిత్.
అది మెకానికా దేశం అయి ఉండాలి. టకటక మీటలు నొక్కి కారుని కిందకి దింపడం మొదలెట్టాడు.
"ఎందుకు దిగుతున్నాం?" అంది అపురూప.
"గంటల తరబడి ఏకధాటిగా తరుముకొచ్చాం ఫ్లయింగ్ సాసర్ని. పిచ్చుక డేగని తరిమినంత విచిత్రంగా ఉందికదూ ఇది? సోలార్ బేటరీలు వీక్ అయిపోయాయి. రీఛార్జ్ చేయించాలి. లేదా కొత్తవి వేయించాలి."
ఒకసారి తనవైపు తాను చూసుకుంది అపురూప. ఇందాక తప్పించుకుపోయే హడావిడిలో ఏదో తగులుకుని షర్టు రెండు చోట్లా, పాంటు ఒక చోటా బాగా చిరిగాయి. తన బట్టలు వున్న సూట్ కేస్ ఎక్కడో పడిపోయింది.
ఇలాంటి అవస్థలో తను జనం కళ్ళలో ఎలా పడుతుంది?
అదే అంది అతనితో, "అసహ్యంగా ఇలా చిరిగిపోయిన బట్టలతో అందరి ముందుకీ ఎలా రాను?"
అతను అప్పుడే గమనించినట్లు ఒక్కసారి ఆమెవైపు చూసి, వెంటనే ఇబ్బందిగా చూపులు మరల్చుకున్నాడు.
"మరేం ఫర్వాలేదు! మనమిప్పుడు మెకానికాలో వున్నాం. ఇక్కడ మనుషులు బట్టలు వేసుకుని తిరిగేటంత "అనాగరికులు" కారు. మీ వంటి మీద మిగిలిన బట్టలను చూసి నవ్వుకుంటారేమో గానీ, లేనందుకు నవ్వరు" అన్నాడు.    
'మెకానికా!'
'అక్కడి మనుషుల విశృంఖల శృంగారం చూసి జంతువులు సిగ్గుపడతాయి!
అక్కడి ప్రజల భోగలాల సత్వానికి రోజుకి ఇరవై నాలుగు గంటలు చాలవు!
జమిస్తాన్ దేశంలో ఊపిరాడని డిక్టేటర్ షిప్పు ఉంటె ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకంగా అనార్కీ! అరాచకత్వం!
"అక్కడా దిగడం!"
"కానీ తప్పదు! బేటరీలు కావాలి."
ఆదుర్దాగా చూస్తోంది అపురూప.
కారు కిందకి దిగుతున్నకొద్దీ జంటలు జంటలుగా, గుంపులు గుంపులుగా, పూర్తి నగ్నంగా తిరుగుతున్న మనుషులు కనబడ్డారు.
ఆ నగరం శివార్లలో కారు దింపాడు అజిత్. "అపురూపా, మీరిక్కడే ఉండండి. నేను వెళ్లి బాటరీలు పట్టుకొస్తాను" అన్నాడు.
"అమ్మో! మీరు వెళ్ళిపోతే నేనొక్కదాన్నే ఇక్కడుండాలా?" అంది గాభరా పడిపోతూ.
"సరే! మీరు కూడా రండి! ఇద్దరం వెళ్ళొద్దాం!"
"ఛీ! ఇలా అర్ధనగ్నంగా ఎలా రాను?"
"మరేం చేద్దాం? మీరు నాతో రాలేరు. ఇక్కడ ఒంటరిగా ఉండలేరు. పజిల్ లాగ ఉంది ఇది" అని నుదురు చిట్లించి ఆలోచించి - "ఆల్ రైట్! మన కేటుగాడు మీకు తోడుగా ఉంటాడు." అన్నాడు.
"కేటుగాడా? వాడెవడు?" అంది అపురూప ఆశ్చర్యంగా.
"స్పష్టంగా చెప్పాలంటే K.2 అన్నమాట. నేను సరదాగా తయారుచేసిన చిన్న రాబొట్" అన్నాడు అజిత్ నవ్వుతూ.
"మీకు రాబొట్స్ తయారుచెయ్యడం కూడా వచ్చా? నిజంగా ఆ లేసర్ కిరణ్ చెప్పినట్లు మీరు సకల కళా వల్లభులే!"
కాస్త వంగి వినయం అభినయించాడు అజిత్. "నేను రాబొటిక్స్ లో ప్రపంచ ప్రసిద్ధులైన డాక్టర్ సంజీవ్ గారి కొడుకునని మర్చిపోతున్నారు మీరు."
"ఓహ్! లైక్ ఫాదర్, లైస్ సన్ అన్నమాట! అసలు ఇంతకీ మీ రాబొట్ ఏదీ?" అంది.
"ఇది అన్ని రాబొట్లలాగా పొద్దస్తమానం కాళ్ళకు అడ్డం పడుతూ తిరుగుతూ చోటు ఆక్రమించుకుంటూ ఉంటే ఇంక నా గొప్ప ఏముంది? అందుకే దీన్ని అవసరం లేనప్పుడు మడిచి పెట్టెయ్యడానికి వీలుగా ఫోల్డింగ్ టైప్ లో చేశాను. అయితే మీరు దీనితో జాగ్రత్తగా ఉండాలి" అంటూ కారులోంచి చిన్న బ్రీఫ్ కేసు తీశాడు.
"జాగ్రత్తా? ఎందుకూ?" అంది అపురూప హడలిపోయి.
అజిత్ నవ్వేశాడు. "మరేంలేదు. ఇది చాలా గడుగ్గాయి. వసపిట్టలా ఊరికే వాగుతుంది."
బ్రీఫ్ కేసులో కొన్ని లోహపు రేకులూ, నట్లూ బోల్టులూ, చిన్న బాక్సూ వున్నాయి.
వాటిని అజిత్ బిగిస్తూ వుంటే ఆసక్తిగా చూస్తోంది అపురూప.
"అజిత్!"
"చెప్పండి!"
"మనిషిని మించిన తెలివిగల మరమనుషులూ - అవి ఈ భూగోళాన్ని ఆక్రమించుకునే ప్రమాదం - ఇదంతా సాధ్యమేనా? లేకపోతే లేసర్ కిరణ్ లాంటి వాళ్ళెవరో సంచలనం కలిగించడానికి అలాంటి పుకార్లు పుట్టిస్తున్నారా?" అంది. డైరెక్టుగా రాబొట్ నరహరిని గురించీ, డాక్టర్ సంజీవ్ ని గురించీ అడిగితే అతను నొచ్చుకుంటాడని భయం ఆ అమ్మాయికి.
చేస్తున్న పని ఆపి ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు అజిత్.
"అజిత్!"
"ఊ!"
"తప్పుగా ఏమైనా మాట్లాడానా?"
"అవును! అడిగి చాలా తప్పే చేశారు. అంచేత మీకు శిక్షగా పావుగంటసేపు బోర్ కొడతాను కంప్యూటర్ల గురించీ, రాబొటిక్స్ ని గురించీ చెప్పి" అని నవ్వాడు అజిత్.
భయం నటించింది అపురూప. కానీ అతను చెప్పడం మొదలెట్టగానే చెవులప్పగించేసి శ్రద్ధగా విన్నది.
"దాదాపు 1946 ప్రాంతంలో కంప్యూటర్ల శకం మొదలయిందనొచ్చు. అప్పటినుంచీ ప్రతి ఎనిమిదేళ్ళకీ పదింతలు పెరుగుతోంది కంప్యూటర్ల మేధస్సూ, శక్తీనూ. ఇప్పటికే కంప్యూటర్లలో అనేక 'తరాలు' మారాయి. ఇరవయ్యో శతాబ్దపు చివరి సంవత్సరాలలో సిలికాన్ ద్వారా ఉద్భవించిన కంప్యూటర్ మేధాశక్తి మనిషి మెదడుకి సమానమయింది.
"అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఈ కంప్యూటర్ ఇంటలిజెన్సుతో మానవ మేధస్సు పోటీపడలేక పోతోంది. గత లక్ష సంవత్సరాలలో మనిషి మెదడు సైజు చెప్పుకోదగ్గంతగా పెరగలేదు. ఇప్పుడు వున్న కపాలంలోని ఫిక్సెడ్ సైజు క్రేనియంలో పట్టే సమాచారం పరిమితం అంటున్నారు శాస్త్రజ్ఞులు. జీవనవేగం తాపీగా, నత్త నడక నడుస్తున్న కాలంలో మన మెదడు పరిణితి చెందింది. అది ఏకకాలంలో కొద్దిరకాల సమాచారాన్ని మాత్రమే గ్రహించి భద్రపరుచుకోగలదు.
కానీ కొత్తగా వస్తున్న కంప్యూటర్లు అలా కాదు. వాటికి శక్తి అపారం!
అపురూపా! వానరంలోనుంచి నరుడు ఉద్భవించాడు. 'హోమో ఎరెక్టస్' అనే కోతి లాంటి జీవిలో నుంచి 'హోమోసపైన్' అనే మానవుడు వచ్చినట్లు - మానవజాతిని మించిన కొత్తరకం ప్రాణులు రూపొందవచ్చు.
ఆ తెలివైన ప్రాణులు సిలికాన్ చిప్స్ లోనుంచి వచ్చే కంప్యూటర్లే అయినా ఆశ్చర్యం లేదు.
దాదాపు అలాంటిదాన్నే తయారుచేశారు మా నాన్నగారు. నిజం మాట్లాడితే ఆయన అలా చేసి ఉండవలసింది కాదు. దురదృష్టవశాత్తు ఆ తర్వాతే మా ఇద్దరికీ అభిప్రాయబేధాలొచ్చాయి అని ఆగిపోయి నిస్పృహగా నిట్టూర్చాడు అజిత్. కొద్దిక్షణాల తర్వాత ఒక్కసారి తలవిదిల్చి, "అదలా ఉండనివ్వండి. సీ! మన కేటుగాడు తయారయి పోతున్నాడు" అని చకచక స్టీలు ప్లేట్లు బిగించేశాడు.
పొట్టిగా, గుమ్మటంలా ఉన్న రాబొట్ తయారయింది. కావాలనే అతను దాన్ని జోకరు ఆకారం వచ్చేటట్లు చేశాడని తెలిసిపోతోంది. పెద్దగా, గుండ్రంగా ఉన్న లెన్సులు దాని కళ్ళ స్థానంలో ఉన్నాయి. ఉండలాంటి ముక్కు కొంటెగా నవ్వుతున్నట్లు విచ్చుకుని ఉన్న పెదిమలూ.
ఆ పెదిమల మధ్య హార్మణీ మెట్లలాంటి పళ్లున్నాయి. నిజానికి అది దాన్ని కంట్రోల్ చేసే మీటలు.
స్విచ్ ఆన్ చెయ్యగానే ప్రాణం వచ్చినట్లు కదిలింది రాబొట్.
"వ్ టాంస్తుకితిబ పించ కీటిమాటిమా లాకిదుంన్నెన?" అంది గబగబా.
"ఓ సారీ! వాయిస్ ప్లేటు తలక్రిందులుగా బిగించాను" అన్నాడు అజిత్ అపురూప వైపు తిరిగి.
'మీ ధ్యాసలో పడిపోయి!' అని పైకి అనలేదు. రాబొట్ ని ఆఫ్ చేసి, మళ్ళీ సరిగ్గా బిగించాడు.
"నన్నెందుకిలా మాటిమాటికీ చంపి బతికిస్తుంటావ్!" అంది ఈసారి సరిగ్గా.
అజిత్ నవ్వాడు. "దాన్ని చంపటం అనరు. నిన్ను ఆఫ్ చేసి, మళ్ళీ ఆన్ చేస్తుంటాను."
"ఓహో! అలాగా!" అని రాబొట్ గిర్రున బొంగరంలా తిరిగి పరిసరాలన్నీ పరికించింది.

 Previous Page Next Page