Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 9

    "నా ఖర్మ డాడీ" అన్నాను పట్టుకొన్న గొంతుతో. నాలాంటి కేర్ ఫ్రీ గర్ల్, నాలాంటి మోడర్న్ గర్ల్ నోటి నుంచి ఖర్మ, పాపంలాంటి మాటలు ఎన్నడూ వినని నాన్నగారు నిజంగా తల్లడిల్లిపోయారు.
    "నన్ను ఇక్కడినుంచి తీసుకెళ్ళిపో డాడీ! నేనిక్కడ వుండను. ఐయామ్ ఫీలింగ్ మిజర్ బుల్ హియర్. ఓ సరదా లేదు పాడులేదు. ఇలాంటి వాళ్ళ మధ్య నేనుండలేను డాడీ! నేనింక చదువనక్కరలేదుట. చదివినా వాళ్ళ ఇంట్లో ఉండి చదవాలిట. ప్రతిరోజూ ఏదో వంకతో నన్ను దెప్పి సాధించి ఏడ్పిస్తారు. ఐ కెనాట్ టోలరేట్ ఎనీమోర్.... నాకీ మొగుడు వద్దు, కాపురం వద్దు. ముప్ఫై రోజులకే ముప్ఫై ఏళ్ళ అనుభవం పూర్తయినట్టుంది డాడీ! నెలరోజులకే ఇలా ఉంటే ఈ మనిషితో ఇంకో నలభై ఏళ్ళు కల్సి ఎలా బతకడం. ఇంపాజిబుల్.... నావల్ల కాదు.... పెళ్ళి అంటే లైఫ్ లో ముఖ్యమైనటర్న్. జీవితానికి పెళ్ళి ముఖ్యం. వప్పుకుంటాను..... కాని ఇలాంటి పెళ్ళి కాదు డాడీ! పెళ్ళి జీవితంలో ఆనందాన్ని సమాధి చేసేట్లయితే ఇంక పెళ్ళికి అర్థం ఏమిటి డాడీ?"    
    జవాబు చెప్పలేనివారిలా నాన్నగారు నిస్సహాయంగా నిట్టూర్చారు.
    "పోనీ, ఎలాగో అలాగ ఆ కారు కొనిస్తాను, అప్పుడన్నా తిన్నగా ఉంటారేమో!" ఆశగా అన్నారు.
    "నో.... వీల్లేదు డాడీ! కారుకోసం కొత్త పెళ్ళికూతుర్ని ఇలా ట్రీట్ చేసే మనుష్యులు ఆ కారిచ్చాక ఇంకేదో కావాలంటే! అలా ఇస్తూండగలరా - ఒక ప్రాణంలేని వస్తువుకోసం ప్రాణమున్న మనిషి మనసుని చిత్రవధ చేసే ఈ కుసంస్కారులమధ్య నేనుండలేను డాడీ.... నాకీ కాపురం వద్దు. నన్ను మీతో తీసుకువెళ్ళండి. జరిగిన నష్టం చాలు. కారిచ్చి ఇంకో ఎనభైవేలు నష్టపోవడం ఎందుకు? ఆ డబ్బుతో కొద్దిగానైనా సుఖం అనుభవించవచ్చు.... ఈ మనుషుల మధ్య ఇలా బతికేకంటే." ఆవేశంగా అన్నాను.
    "అమ్మా..... పెళ్ళంటే అంత సులువుగా ఒక్కరోజుతో తెంపుకొనిపోయే బంధం కాదు. నీవన్నంత, అనుకున్నంత సులువుకాదు వెళ్ళిపోవడం. అయినా మనం అంత తొందరపడటం మంచిది కాదు."
    "తొందరపడకపోతే నిండా మునిగేవరకు ఉండమన్నారా! రేపు నాకు ఏ ప్రెగ్నెన్సీనో వస్తే ముడి బిగిసి ఈ ఇల్లు నాకు బంధిఖానా అవుతుంది డాడీ! నేను గత పదిరోజులబట్టీ ఆలోచించాను డాడీ. ఈ మనిషి తత్వం మారేది కాదు.... ఇలాంటి మొగుడితో కాపురం నావల్ల గాదు. నిండా మునిగేవరకు నన్నిక్కడ వుంచితే మీ కూతురు మీకు దక్కదు.... ఆలోచించుకోండి" తీవ్రంగా అన్నాను.                      
    నాన్నగారు విస్తుపోయి చూశారు. బహుశా ఈ కాలం పిల్లల తెగువకి ఆశ్చర్యమేమో!"అప్పుడే అంతదూరం ఆలోచించావా విద్యా.... చూడమ్మా....! కొన్ని  రకాల వస్తువులు కొన్ని రకాల ద్రవాలలోనే కరుగుతాయి. ఆ సరి అయిన ద్రావకమేమిటో చూడాలి గాని కరగదు అని వదిలేసిపోతే పని సానుకూలపడేది ఎలా తల్లీ! ఇతను బహుశా తల్లిదండ్రుల మాటవిని ఏదో అపోహతో ఇలా ప్రవర్తిస్తున్నాడేమో, నేవెళ్ళి మీ మామగారితో మాట్లాడతాను. నలుగురు పెద్దమనుషులతో చెప్పిస్తాను. మనప్రయత్నం మనం చెయ్యకపోతే ఎలా తల్లీ."
    "డాడీ..... తల్లి, తండ్రి అందరికీ ఉంటారు. పెద్దవాళ్ల మాటవినేది ఉంటుంది..... విననిది ఉంటుంది. అసలా తల్లీదండ్రీ కూడా నా కాపురంలో నా డబ్బుతో ఏం కొనుక్కోవాలో కూడా చెప్పేటంత జ్యోక్యం ఎందుకు కల్గించుకోవాలి? అసలు ఆ విషయాలు ఈయనెందుకు చెప్పాలి వాళ్లకి. డాడీ.... ఎవరో ఏదో చెపితే ఈయన బుద్ధి ఏమయింది? చదువుకున్నవాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మిగతా మగవాళ్లంతా పెళ్ళాలని ఇలా ట్రీట్ చేస్తున్నారా.... డాడీ? మీరేం చెప్పినా అతని బేసిక్ నేచర్ మార్చలేరు. మీరేదో ద్రావకం తెచ్చి కరిగిస్తానంటున్నారు. కరిగిస్తే ఆకారం కోల్పోవచ్చుకాని బేసిక్ ప్రోడక్ట్ ఆద్రావాకంలోంచి ఎక్కడికి పోతుంది? ఈయనా అంతే డాడీ" అంటూ వాదించాను. చిన్నప్పటి నుంచీ డాడితో ఏదో విషయంలో ఆర్గ్యు చేయడం అలవాటు. ఆ రోజు నా అర్గ్యుమెంటుకి డాడీ జవాబు చెప్పలేకపోయాడు.
    'చూద్దాం అమ్మా! ఒక ఛాన్స్ ఇచ్చి చూడటం మన ధర్మం. నీవేదో నాకు బరువని, నీకు పెళ్ళి చేసి పంపేసి నా బాధ్యత తీరిపోయిందని అనుకోవడం లేదు. నీ జీవితంలో నిజంగా సుఖసంతోషాలు కరువయ్యే స్థితి వస్తే చూస్తూ మాత్రం వూరుకోను. లోకం కోసం, సంఘం కోసం నిన్ను పిరికిగా బలిపెట్టను..... ఐ ప్రామిస్.... నేను మీ ఆయనతో, మీ అత్తవారితో మాట్లాడతాను' అన్నారు.
    తర్వాత నాన్నగారు, సాయంత్రం ఆయన ఆఫీసు నుంచి వచ్చాక బయటికి తీసుకెళ్ళి దగ్గిరున్న పార్కులో ఓ గంట కూర్చోపెట్టి మాట్లాడారు. 'నాకు చాలా పొగరని అత్తమామలన్న గౌరవం లేదని, పెద్దాచిన్న లేకుండా వాదిస్తానని, పెళ్ళిలో వాళ్ళ వాళ్ళకి చాలా అమర్యాదలు జరిగాయని, తనవాళ్ళు చాలా అవమానంగా ఫీలయ్యారని, తనవాళ్ళ అవమానం తనదని, ఈ రోజు పెళ్ళవగానే, తల్లిదండ్రులని పట్టించుకోకుండా వాళ్ళమాట లెక్కచెయ్యకుండా వదిలేయడం తనవల్లకాదని, మీ అమ్మాయికి మొగుడు కావాలిగాని ఆ మొగుడి తల్లిదండ్రి పనికిరారా? ఆడపిల్లకి అణుకువ ఉండాలి, ఇలా పెడసరం జవాబులు చెప్పే పిల్ల కాపురం ఏం చేస్తుంది? మొగుడి మాట వింటే పరువు తక్కువ, స్త్రీ జాతికి అవమానం అన్నట్లు ప్రవర్తిస్తుంది. మీ అమ్మాయికి బుద్ధి చెప్పుకోండి. కాపురం కావలిస్తే ముందు అత్తమామల్ని తరువాత భర్తని గౌరవించాలని, వాళ్ళ మాటలకి విలువ ఇవ్వాలని చెప్పండి. నాకు నీతులు చెప్పేముందు మీ కూతురిని అదుపులో పెట్టుకోండి" అని మామగారు అనైనా లేకుండా ఆవేశంగా పట్టుకుదులిపారట.
    పెళ్ళిలో మీ ప్రవర్తనకి మీరు మావాళ్ళ దగ్గరకి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. 'మా వాళ్ళకి మర్యాద యిస్తే నాకు ఇచ్చినంత. మా యింట్లో మా నాన్నగారికి చెప్పకుండా, ఆయన అంగీకారం లేనిదే ఏం జరగదు. ఈ రోజు మీ అమ్మాయి లెక్కలేదంటే కుదరదు' అని తెగేసి చెప్పారట.
    అదివిని "డాడీ.... ఇంకా మీరు వాళ్ళింటికి కూడా వెళ్ళి ఇన్సల్ట్ అవుతారా! నేను వప్పుకోను డాడీ, వాళ్ళచేత మాటలు పడాల్సిన ఖర్మ మీకేమిటి? నాకోసం వాళ్ళముందు తలవంచడం నేను సహించలేను" అన్నాను. అల్లుడి మాటలకి ఆయన ఎంత అవమానపడ్డారో చిన్నపోయిన ఆయన మొహం చూస్తేనే తెలుస్తుంది.
    "తప్పదుకదమ్మా, ఆడపిల్లనికన్నాక!" శుష్కహాసం చేశారు.
    "ఆడపిల్ల! ఏం.... ఆడపిల్లని కంటే వాళ్ళ పాదాలు వత్తాలా. మీరు అన్నింట్లోనూ అంత మాడర్న్ అయి వుండి ఈ విషయానికి వచ్చేసరికి పాత చింతకాయ భావాలు మాట్లాడుతున్నారేమిటి? ఆడపిల్లని కన్నంతమాత్రాన మీ తప్పులేకపోయినా క్షమాపణ చెప్పాలా? ఈ ఆడపిల్లే లేకపోతే ఒకడికి పెళ్ళాం, మరొకడికి తల్లి, చెల్లి, పిల్ల ఎలా వుండేది?" ఆడపిల్ల..... ఆడపిల్ల, ఆ రోజులు పోయాయి డాడీ ఆడపిల్ల అయినంత మాత్రాన ఆత్మాభిమానం చంపుకుని మొగుడు లేకపోయినంత మాత్రాన నేను చచ్చిపోను అని నిరూపిస్తాను -" నా రక్తం       ఉడికిపోయింది. డాడీ ఎటూ చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ఆయన మొహం చూస్తే నా కోసం ఆత్మాభిమానం చంపుకుని ఓసారి మా అత్తవారింటికి వెళ్ళి మాట్లాడతారనిపించింది."

 Previous Page Next Page