Previous Page Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 9


    అతడు రామ్మూర్తివైపు తిరిగి, "పంచేంద్రియాల్ని కంట్రోల్ చేయడం అంటే తెలుసామీకు? పోనీ అది చేసి చూపించనా?" అన్నాడు.
    "ఎలా?"
    "తలుపు మూసివున్న పెట్టెలో ఇరవై నాలుగు గంటలపాటు కూర్చొని ఉండటం ద్వారా? ఎంతెంత పందెం?"
    రామ్మూర్తి మాట్లాడలేదు. వెంకటేష్ నావైపు తిరిగి- "చూశారా! పందెం విషయం వచ్చేసరికి మనుష్యులు ఎలా వెనక్కి తగ్గుతారో?" అన్నాడు.
    "నేనేమీ వెనక్కు తగ్గటం లేదు. సీలువేసి పెట్టెలో ఒక రోజంతా పడుకుని, మానవాతీత శక్తులు ఉన్నాయని మీరుగానీ నిరూపించుకోగలిగిన పక్షంలో-నేనే పందానికైనా సిద్ధమే" అన్నాడు.
    "మెజీషియన్స్ శక్తిఅంతా వాళ్ళకుడిచేయి చూపుడు వేలులో వుంటుంది. నేను పందెం ఓడిపోయిన పక్షంలో నా చూపుడువేలును కోసి ఇచ్చేస్తాను."
    రామ్మూర్తి భార్య చప్పున వారిస్తూ, ఏమిటండీ ఇది! హాయిగా భోజనం చెయ్యక.....అర్థంలేని పందాలూ, ఇవీ" అంది.
    కాని వాళ్ళిద్దరూ దాన్ని పట్టించుకోలేదు.
    "మీరు పందెం గెలిచిన పక్షంలో నేను పదివేలు ఇవ్వడానికి సిద్ధం. అదే పందెం" అన్నాడు రామ్మూర్తి.
    "నా చూపుడువేలు విలువ పదివేలు అని నేను అనుకోవటం లేదు."
    "పోనీ ఇరవైవేలు....."
    నేను ఆందోళనగా ఇద్దరివైపూ చూస్తూ ఉండిపోవటం తప్పఏమీ  చేయలేకపోయాను. వెంకటేష్ మొహంలో అదోలాటి కసిలాంటిది కనిపించింది. ఆ వికృతమైనా చిరునవ్వు నాకు సుపరిచితమే. కానీ ఈ క్షణం అది మరింత ప్రస్ఫుటంగా బైటపడింది.
    రామ్మూర్తి మాత్రం కుర్చీలో వెనక్కివాలి కూర్చొని వున్నాడు. అతడి కళ్ళు విజయవంతంగా నవ్వుతున్నాయి. ఇదంతా చూస్తుంటే వాళ్ళిద్దరూ తామే ఈ పందాన్ని గెలవగలమన్న నమ్మకంతో ఉన్నట్టూ కనిపిస్తున్నారు.
    "ఒక మనిషి శరీరపు అత్యంత ప్రధానమైనా అంగాన్ని డబ్బుతో కొలవటం అన్యాయం."
    "పోనీ మీరు చెప్పండి. ఏ పందానికైనా సిద్ధమే."
    "అయితే దేనికైనా సిద్ధమేనంటారు."
    "ఆ దేనికైనా!"
    "లక్ష రూపాయలైనా సరేనా?"
    రామ్మూర్తి భార్య కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. అతడి కూతురు తన కళ్ళని మరింత పెద్దవి చేసి అమాయకంగా, భయంగా ఇద్దర్నీ చూస్తూంది.
    "ఆఁ, లక్ష అయినా సరే."
    "లక్ష రూపాయలు పందెం అని నేను అనలేదు."
    "పందెం ఏదైనా సిద్ధమే అని నేను అంటున్నాను."
    వెంకటేష్ వెంటనే మాట్లాడకపోవటంతో తిరిగి మళ్ళీ ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. అతడు నెమ్మదిగా  తలెత్తి మొదట నావైపు చూశాడు. తరువాత తల తిప్పుతూ వరుసగా  రామ్మూర్తి భార్యవైపూ, కుతూరు వైపూ చూశాడు. 'మీరంతా దీనికి సాక్షులు సుమా....' అన్న హెచ్చరిక అతడి కళ్ళలో వుంది.
    "ఏవండి" అంది రామ్మూర్తి భార్య. ఆమె మొహంలో ఆందోళన ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూంది. "దీన్ని మనం ఇక్కడితో ఆపుచేస్తే మంచిదేమో."
    "ఇంత వరకూ వచ్చాక ఇక ఆపటం కుదరదు" కటువుగా రామ్మూర్తి అన్నాడు.
    "అవును కుదరదు" అన్నాడు వెంకటేష్. "మానవతీత శక్తులు ఉన్నాయని నిరూపించటానికి నేను ఈ  అపూర్వమైన ప్రయోగం మీ ముందు చేసి చూపించదలచుకున్నాను. దీనిలో నేను ఓడిపోతే నా చూపుడువేలు కోసి ఇవ్వటానినికి పందెం కాస్తున్నాను. దీనికి ఎదురుగా నేను కోరే పందెం ఏమిటంటే....." అతడు ఆగి రామ్మూర్తివైపు చూశాడు. ఆ గదిలో సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దంగా వుంది. దాన్ని చీలుస్తూ అతడి కంఠం తాపీగా పలికింది. "......దాని ఎదురుపందెం  నేను కోరేది..... మీ అమ్మాయి చిటికెనవేలు! అఫ్ కోర్సు......కోసికాదు. అందుకోవటానికి మాత్రమే!" అంటూ నవ్వాడు. మెత్తని  కేకుని  కత్తితో కోసినట్టుంది ఆ నవ్వు. ఆ మాటల్లో అర్థం బోధపడి , అప్పటివరకూ నిశ్శబ్దంగా మౌనంగా కూర్చున్న రామ్మూర్తి కూతురు ఒక్కసారిగా కుర్చీలో ఎగిరిపడి "నో......." అని అరిచింది భయంతోనూ, టెన్షన్ తోనూ ఆ అమ్మాయి కంఠం కీచుమంది.
    రామ్మూర్తి భార్య కూతురివైపు తిరిగి, "లేదమ్మా, వాళ్ళు వూరికే జోకులు వేసుకుంటున్నారు" అంది. ఆమె స్వరంలో 'ఇదంతా జోకయితే ఎంత  బావుణ్ణు' అన్నా తీవ్రమైన ఆశ స్పష్టంగా కనిపిస్తూంది.
    "మేమేమీ జోకులేసుకోవటంలేదు" అన్నాడు వెంకటేష్. "ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని నిరూపించటానికి మా సర్వస్వాన్నీ ఒడ్డుతున్నాం."
    లైటు వెలుతురుకి అతడి జుట్టులో తెల్లటిపాయ అస్పష్టంగా మెరుస్తూంది. వయసు అతడి బుగ్గలమీద ముడతలుగా మారింది. అతడు రామ్మూర్తివేపు తిరిగి, "ఏం? అంతేనా" అని అడిగాడు.
    "ఇది అన్యాయం." అరిచాడు రామ్మూర్తి.
    వెంకటేష్ తాపీగా. "ఏ పందానికైనా సిద్థమే అని ఇప్పుడే మీరన్నారు" అన్నాడు.
    "నా ఉద్దేశం డబ్బు అని."
    "ఆ విషయం మీరు ముందే చెప్పలేరు. అందుకే మీ అమ్మాయితో పెళ్ళిని పందెంగా అడిగాను. పోనీ ఇప్పుడు ,మీరు  మాట తిరిగిపోదల్చుకుంటే సరే. ఈ విషయం ఇక మరచిపోదాం."
    "నేను నా మాట తిరిగిపోవటం అన్న ప్రశ్న లేదు" దృఢంగా అన్నాడు రామూర్తి. "ఈ మానవాతీత శక్తులూ ఇదంతా బోగస్ అని నేను నమ్ముతున్నాను. అందువల్ల నేను పందెం గెలుస్తానన్న మాట యదార్థం. అందులో అపనమ్మకం లేదు."
    "అయితే పందానికి రెడీయేనా?"
    వెంటనే జవాబు చెప్పలేదు. టేబిల్ మీద పడిన నీటి చుక్కాని చూపుడువేలుతో రాస్తూ పందెం ఓడిపోతే, తన క్కాబోయే అల్లుడివైపు చూశాడు. ఆ చూపులో కనబడిన సంసిద్ధతని గమనించి, అతడి కూతురు భయంతో ఒక్కసారిగా...... "నాన్నా, ప్లీజ్" అన్నది.
    అతడు కూతురువైపు చూడలేదు. వెంకటేష్ నే సూటిగా చూస్తూ, "ఓ.కే. నాకీ పందెం ఇష్టమే" అన్నాడు.
    ఆ గది ఒక్కసారిగా చైతన్యవంతమైంది.
    ఆ అమ్మాయి ఒక్కసారిగా చేతిలోవున్న  గ్లాసు విసిరికొడుతూ- రోషమూ, దుఃఖమూ ముప్పిరిగొనగా, "ఇలా నా మీద  పందెం కట్టటానికి నేనొప్పుకోను" అని అరిచింది.
    "లేదమ్మా! వాళ్ళంతా వూరికే ఈ పందేలు వేసుకుంటున్నారు" అనునయిస్తూ అంది వాళ్ళ అమ్మ. "అంతేగాని ఇదంతా నిజంకాదు."
    "అవునా నాన్నా?"
    "లేదమ్మా, నేను సీరియస్ గానే  పందెం కాస్తున్నాను."
    "నో డాడీ! యూ కాన్ట్...." ఆమె గొంతు జీరబోయింది. నేనూ ఏదో అనబోతూ వుంటే రామ్మూర్తి దాని మధ్యలో కట్ చేసి  తను చెప్పసాగాడు-
    "నేను ఒడ్డుతున్నది చాలా.... సంస్కారహీనమైన పందెం అని నాకు తెలుసు. కానీ నాకు నమ్మకం వుంది. ఈ పందెం నెగ్గుతానని. ఒక మనిషి ఒక చిన్న పెట్టెలో గాలి జొరబడకుండా ఒకరోజు పాటూ ఎలా ఉండగలడు? ఇంపాజిబుల్ ఒకవేళ అతడు అంత అద్భుతమైన శక్తులున్నవాడే అయితే అతడ్ని అల్లుడు కాదుకదా- దేవుణ్ణి చేసుకొని పూజించాలి. అందుకే అంత ధైర్యంగా పందెం  కట్టాను. అయినా హేతువాదం దీనికి ఎలా ఒప్పుకుంటుంది?"
    "మీ హేతువాదం తగలెయ్య. దానికి అమ్మాయి పచ్చటి బ్రతుకు  బలి పెడతారటండీ?"
    "నోర్ముయ్! అంతా నేను ఓడిపోయినట్టు మాట్లాడతారేమిటి?" విసుగ్గా అన్నాడు రామ్మూర్తి.
    "ఒకవేళ ఓడిపోతే?" అంటూ ఆవిడ వెంకటేష్ వైపు చూసింది- అతడికి నిశ్చయంగా తన భర్తకన్నా  తక్కువ వయసే ఉందన్న విషయాన్ని నిశ్చయించు కోవటానికి.

    "ఓడిపోయే ప్రసక్తేలేదు. ఈ ప్రపంచంలో ఎవరికీ మానవాతీత శక్తి లేదని నమ్ముతున్నాను నేను . గాలిలోంచి దేన్నయినా సృష్టించడం కూడా థర్డు డైమన్షన్ మాజిక్కే అని భావిస్తున్నాను. అలాంటిది నా కళ్ళముందు ఒక వ్యక్తి ఒక అద్బుతమైనా శక్తిని ప్రదర్శిస్తానూ అంటే దానికి నా కూతుర్నే కాదు- నా జీవితాన్నే ఓడటానికి నేను సిద్ధం....."
    అతడి మాటల్లో కనబడిన ఆవేశానికీ, సిన్సియారిటీకి అతడి కూతురే కాదు- నేనూ జవాబు చెప్పలేకపోయాను. కానీ ఆ అమ్మాయి కళ్ళలో ఇంకా  బెదురూ, అనిశ్చలతా కదలాడుతూనే ఉన్నాయి. ఒక చిన్న పందెం తన జీవితగతిని ఇంత త్వరగా మార్చేస్తుందని అనుకోవటానికీ, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవటానికీ ఆమె సిద్ధంగా లేదు.
    అతడు కూతురివైపు తిరిగి, ఆమె చేతిమీద చెయ్యివేసి, "అమ్మా!అతడు పందెం గెలవడు. నన్ను నమ్ము" అన్నాడు. నేను వెంకటేష్ వైపు చూశాను. అతడు  నిశ్చలంగా కూర్చున్నాడు. నా కెందుకో అనుమానం వేసింది. తనమీద తనకి  ఎంతో నమ్మకం వుంటేతప్ప ఆ నిశ్చలత రాదు. మరోవైపు నమ్మశక్యం కూడా కావటంలేదు. గాలి చొరబడని ఒక చీకటి పెట్టెలో ఒక రోజంతా ఎలా వుండగలడు? గాలి సంగతి సరేసరి- అసలంత చీకటిలో పది నిముషాలు వుంటేనే భయంతో పిచ్చెక్కిపోతుందే! ఏ ధైర్యంతో తన చూపుడువేలుని పందెం కట్టగలిగాడు?
    మళ్ళీ అతనివైపు చూశాను.
    అప్పుడు గమనించాను అతడి కళ్ళని!! ఆ కళ్ళలో స్థయిర్యం వెనుక ఒక డెవిలిష్ అంశ ఆ క్షణం నాకు కనపడింది. అతడు మా మధ్య తిరిగే మనిషే. ఎప్పుడూ కనబడేవాడే! కానీ ఆ క్షణంలో నా దృష్టి ఆ 'మనిషిలో మనిషి'ని కెమేరా పట్టుకున్నట్టు పట్టుకుంది. నాకు 'ఓమెన్' అన్న  చిత్రం గుర్తొచ్చింది. ఒకవేళ ఇతడు అటువంటి అంశ వున్న మనిషిమో! అ ఆలోచన రాగానే నా ఒళ్లు జలదరించింది. నా కళ్లు నన్ను మోసం చెయ్యలేదు. ఇతడింత నిశ్చలంగా, నిర్వికారంగా కూర్చొని ఉన్న ఈ  భంగిమ వెనుక  ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఎలా ఉంటుంది? దీన్ని ఇక్కడే ఆపాలి. ఒక మంచి స్నేహితుడిగా రామ్మూర్తి కుటుంబాన్ని రక్షించాలి.
    నేను ఆ ఆలోచనల్లో నుంచి తేరుకుని వారించబోయే లోపులో అమ్మాయి- "సరే నాన్నా! నీ యిష్టం" అనటంతో నేను దెబ్బతిన్నట్టు వెనక్కి వాలిపోయాను. అయిపోయింది. నేనిక ప్రేక్షకుడిలా ఈ తంతు చూడటమే తప్ప చేయగలిగింది ఏదీ ఇకలేదు.
    "మనం పందెం ఎప్పుడు మొదలు పెడ్డాం.?"
    "ఈ రెప్పుడంటే అప్పుడే"
    "మీరు ఇంటికి వెళ్ళి పెట్టె అదీ తెచ్చుకోవాలేమో" అన్నాడు రామ్మూర్తి, అందులో చాలా అర్థాలున్నాయి. మీరు తెచ్చుకునే పెట్టెలో ట్రిక్స్ ఏదైనా ఉండొచ్చు. దాన్ని తెచ్చుకుంటారా అని పరోక్షంగా అడగటం అది. దాన్ని గుర్తించినట్టూ వెంకటేష్ నవ్వి, "అక్కర్లేదు. మీ ఇంటిలో ఏదైనా పెట్టె వుంటే చాలు. కొంచెం పెద్దది- కంఫర్టబుల్ గా ఉండేది" అని నవ్వి "ఇరవై నాలుగు గంటలు అందులో వుండాలిగా" అన్నాడు.
    ఉన్నట్టుండి రామ్మూర్తి భార్యఏడవటం మొదలు పెట్టింది. దాంతో అందరం కంగారుపడ్డాం. రామ్మూర్తి మాత్రం  గట్టిగా విసుక్కున్నాడు. "వూరుకో- ఏమైందిప్పుడు? కూతుర్ని అంకం పెట్టేసినట్టూ అలా ఏడుస్తాంవేం?" అని కసిరాడు. ఆవిడ సర్దుకోవటానికి అయిదు నిముషాలు పట్టింది.
    "అదిగో ఆ పెట్టె సరిపోతుందేమో చూడండి" అన్నాడు రామ్మూర్తి.     

 Previous Page Next Page