శారద స్వతహాగా ధైర్యవంతురాలు అంత పెద్ద ఇంట్లో ఒక్కతే పడుకోటం అంత సులభం కాదు. ఔట్ హౌస్ కూడా ఇంటికి చాలా దూరంలో వుంది.
ఇంకోసారి చప్పుడవటంతో ఆమె మరి ఆగలేక తలుపు తీసుకొని బయటకు వచ్చింది. వరండాలో నీడ పొడుగ్గా పడుతూంది. కిందికి మెట్లు మెలికలు తిరిగి వున్నాయి. ఆమె చేతిలో బ్యాటరీలైటును చుట్టూ తిప్పింది. ఫర్నిచర్ మీద వెలుతురు పాక్కుంటూ వెళ్లింది.
అంతా నిశ్చలంగా, నిశ్శబ్దంగా వుంది. ఎక్కడి వస్తువులు అక్కడే వున్నాయి. ఆమె నెమ్మదిగా మెట్లు దిగి కిందికి రాసాగింది. గోడ గడియారం చప్పుడు తప్ప ఇంకేమీ లేదు.
ఆమె మెట్లు దిగుతూ వుంటే అకస్మాత్తుగా గాలి వీచింది. ఆమె నిశ్చేష్టురాలయింది. అంతవరకూ మామూలుగా వున్న వాతావరణం లోంచి చిన్న సూచన కూడా ఇవ్వకుండా ఒక్కసారి అంతలా గాలి రావటం ఆమెలో భయోత్పాదన కలిగించింది. ధడేలుమన్న శబ్దంతో తలుపులు మూసుకుపోయాయి. తులసి. తనూ పడుకునే గది తలుపులు. ఆ గదిలోంచే బయటకు వచ్చిన గాలి వరండాలోకి పాకుతూంది. ఆమె వెనక్కి వెళ్ళి బలవంతంగా తలుపులు తీసుకుని గదిలోకి ప్రవేశించింది. కిటికీలోంచి వస్తూంది గాలి. ఆమెనే లేపేసేటట్టు వుంది. అతి కష్టంమీద ఆమె కిటికీ తలుపులు వెయ్యగలిగింది. అద్దాల అవతల చెట్లు, అప్పటి వరకూ అమాయకంగా వున్నవి, దెయ్యం పట్టినట్టూ ఊగసాగాయి.
పెద్ద లైటు వేసుకుని పడుకుంటే బావుంటుందని ఆమె భావించింది.
లైటు వేయటానికి వంగుతూంటే అకస్మాత్తుగా కడుపులో తిప్పింది.
ఆమె చప్పున వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది.
* * *
"ఎన్ని రాత్రుల్నుంచి ఇలా అవుతూంది?" పార్ధసారధి అడిగేడు.
"మూడు రోజుల్నుంచీ " అంది శారద. "పగలంతా బాగానే వుంటుంది. చీకటి పడగానే అదోలా వుంటుంది. బ్లెడ్ ప్రజర్ ఎక్కువైనట్లు......ఏదో ఉద్వేగం ఆవరించినట్టూ! దానితో కడుపులో త్రిప్పటం మొదలు పెడుతూంది. రాత్రి ఏ రెండింటికో మెలకువ వస్తుంది వామిటింగ్ అవుతుంది."
"ఫుడ్ కంట్రోల్ చెయ్యలేకపోయారా....."
"రెండోరోజే చేసేను. అయినా మార్పేమీ లేదు. ఒక రోజంటే అనుకోవచ్చు. వరుసగా మూడురోజులూ అదే సమయానికి అలా అవటం ఏమిటి?"
కొంచెం సేపు పార్ధసారధి మాట్లాడలేదు. తర్వాత మాటమారుస్తూ "శ్రీధర్ ఎప్పుడు వస్తున్నాడు?" అనడిగేడు.
"ఇంకో నాలుగయిదు రోజుల్లే"
"తులసి......."
"తెలీదు"
"మరి అంత పెద్దింట్లో ఒక్కరే ఎందుకు -మా ఇంట్లో వుండొచ్చుగా! అక్కయ్యవాళ్ళు వచ్చేరు."
"నౌకర్లున్నారు -ఫర్లేదు" నవ్వింది "థాంక్స్"
"పోనీ ఈరోజు డిన్నర్ కి పుండిపోండి"
ఆమె కాదనలేదు. తులసి లేకపోవటం ఆమెకి ఒంటరితనాన్ని కలుగచేస్తోంది. ఆమె మౌనాన్ని అర్ధం చేసుకొని అతడు ఆమెను లోపలికి తీసుకెళ్ళి విధవ అక్కయ్యకు పరిచయం చేశాడు.
అతడు తిరిగి వచ్చేసరికి పండిత్ ఎదుటి కుర్చీలో కూర్చుని వున్నాడు. "హలో" అన్నాడు పార్ధసారధి.
"ఎప్పుడొచ్చేరు?"
"శారదగారు మీతో మాట్లాడుతూ వుంటే......" అన్నాడు పండిత్. "మీ కన్ సల్టింగ్ రూమ్ సౌండ్ ప్రూఫ్ చేయించుకోవాలి డాక్టర్ గారూ! మాటలన్నీ బయటకు వినిపిస్తున్నాయి."
సారధి నవ్వి వూరుకున్నాడు.
"మా ఇంటితాళం ఎక్కడో మర్చిపోయాను" అన్నాడు పండిత్ ".....ఎలా వెళ్ళను?"
"నా దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోకూడదూ -ఆర్నెల్లలో మీ మతి మరుపు బాగుచేస్తాను" అన్నాడు డాక్టర్.


