22
రాత్రి పన్నెండయింది.
స్మశానం మూలలో ఎండిన చెట్టు మొదట్లో కాళ్ళుసాచి చెట్టుకి జారబడి నిస్త్రాణగా కూర్చొని వున్నాడు దార్కా. అతడి మొహం భావరహితంగా వుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే..........ఎదుటిమంట వెలుగులో ఆ మొహంలో ప్రతిబింబిస్తున్న బాధా వీచికలు కనబడకపోవు.
అతడి ఎదురుగా మంట ఉజ్వలంగా వెలుగుతూంది. ఎర్రగా. నాలుకలు సాచి, ఎనిమిది దిక్కులకూ ప్రతినిధులయిన ఎనిమిది ఎముకలు ఆ మంటల్లో కాలుతున్నాయి. ఆ రోజు పూజ పూర్తయింది. అయినా అతడు అక్కడనుంచి లేవలేదు. అలాగే కూర్చుని వుండిపోయాడు.
ఆలోచన్లలో సముద్రపు హోరు.
గుండెల్లో అనూహ్యమైన వ్యధ.
అతడి కళ్ళముందు ఒకే దృశ్యం పదే పదే కదలాడుతున్నది.
ఒక పాప పదేళ్ళది, అల్లరినీ అమాయకత్వాన్నీ కలబోసుకున్నది. బాణంలా లోపల్నుంచి బయటకు దూసుకొచ్చింది. లేడిలా కింది మెట్టు మీదకు దూకింది. అంతే. వేటగాని బాణం డొక్కలో తగిలిన లేడిలా విలవిలలాడింది. భూమ్మీదకు వాలిపోయింది.
ఆ వేటగాడు తనే ........తనే!
నిర్లక్ష్యంగా.........నిర్దాక్షిణ్యంగా చంపేసేడు. తనకి నిష్కృతిలేదు. శక్తి వున్నదన్న అహంతో తొందరపడ్డాడు. తప్పు తనదే.... తనదే......
ఎర్రటి మంటలు తనవైపు తీక్షణంగా చూస్తున్నట్టూ అనిపించింది. పరిశీలిస్తే అందులో ఆచార్యుల వారి ఆకృతి గోచరించింది. "దార్కా! నా కిచ్చిన మాట ఏం చేసేవు?" అని వేయి గొంతుల్తో ప్రశ్నిస్తున్నట్టూ వుంది. "ఒక అమాయక ప్రాణిని నీ శక్తితో బలిపెట్టటానికి నీకేం అదికారం వుంది దార్కా" అని పరిహసిస్తున్నట్టూ వుంది
అతనికి దుఃఖం వచ్చింది. అది కంటి నీరు కాదు. కడుపులో తెరలు తెరలుగా వెల్లుబికే దుఃఖం. ఎంతో మానసిక వ్యధతో మనసంతా కదిలిపోతే తప్ప మొగవాడికి అటువంటి దుఃఖం రాదు.
కాలుతున్న ఎముక చేతిని కాలుస్తూంది. మనసు మంటతో పోల్చుకుంటే అదేపాటిది. అతడు ఆచార్యులవారిని తల్చుకున్నాడు. "ఓ నా గురువా! నేను నీ కిచ్చినమాట నిలబెట్టుకోలేనందుకు ఈ శిక్ష విధించు కుంటున్నాను. సర్వశక్తి సంపన్నమయిన ఈ విద్య ఇంత వినాశకరమైందని తెలిసి దీన్ని ఈ క్షణమే విడిచిపెడుతున్నాను. నా వల్ల జరిగిన పాపం ఈ శిక్షతో పరిహారమయ్యేలా అనుగ్రహించు."
ఆ తరువాత రెండు చేతుల్తోనూ ఎముకను కంటి వద్దకు తెచ్చేడు. ఇనుప ఊచలా వున్న ఎర్రటి ఎముక భగభగ మండుతూ అతడి ఎడమ కంటిలోకి చొచ్చుకుపోయింది. గంగవెర్రులెత్తించే బాధ అతడి గొంతులోనే సుడులు తిరిగి ఆగిపోయింది. బాధతో బిగించిన పెదవి పళ్లకింద నలిగి ఓ చుక్క రక్తం కారినదంతే!
ఆర్ద్రతతో స్మశానమే వణికింది. చిరుగాలి అతడిని ఆప్యాయంగా జాలిగా స్పర్శించింది. కాలిన రక్తపు వాసన ఆ గాలిలో వ్యాపించింది.
తనకి కోపమొస్తే మూడో కన్ను తెరిచే దేవుడు ఆ కన్నే శక్తిగా భక్తుల్నుంచి పూజలందుకుంటున్న ఆ శివుడి కన్నా, తన కంటి శక్తి ప్రపంచానికి హానికరమయిందని తెలుసుకొని, దాన్ని వదిలిపెట్టిన దార్కా వేయిరెట్లు గొప్పవాడు!
* * *
అదే రాత్రి -
రెండు గంటలు కావొస్తుంది. తులసి లేకపోవటంవల్ల శారద ఒక్కతే ఆ గదిలో పడుకొని వుంది. ఆమె కెందుకో మెలకువ వచ్చింది. అయితే అది సాధారణమయిన మెలకువ కాదు. ఏదో జరిగింది.
తులసి పక్క ఖాళీగా వుంది. బెడ్ లైట్ వెలుతుర్లో రూమ్ మామూలుగా వుంది. కానీ ఏదో జరిగింది.
ఆమె క్షణం పక్కమీద అలాగే కూర్చుని వుంది. అప్పుడు వినిపించింది సన్నటి చప్పుడు ఎక్కడో కిర్రుమని
శారద లేచి తల దిండుకింద నుంచి బ్యాటరీలైటు తీసుకుంది. చాలా పవర్ ఫుల్ బ్యాటరీలైటు అది. కిటికీలోంచి బయటకు వేసి చూసింది.లైట్లు కూడా గాలిలేక నిశ్చలంగా వున్నాయి. అంతా నిశ్శబ్దం ఆ చీకట్లో బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు.
ఆమె లైటు ఆర్పి పడుకుంది.
అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ సన్నగా శబ్దం అయింది.
"ఎవరిదీ?" అందామె లేచి. అలికిడి లేదు.
ఏదో జరుగుతూంది.


