దాదాపు పన్నెండు గంటల డ్రైవ్ తర్వాత కారు వైజాగ్ ప్రవేశించింది. ఓ గంటసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత అతడు తులసి గదిలోకి ప్రవేశించాడు.
కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ వుంది తులసి కిటికీ లోంచి సముద్రం. మనిషి పాపాన్ని తనలోనే దాచుకున్న మనసులా ఉంది.
"నౌ వాడూ యూ ఫీల్ బేబీ" అన్నాడు
ఆమె మాట్లాడలేదు ఆమె కళ్ళు గాజు గోళాల్లా భావరహితంగా వున్నాయి.
"హుషారుగా వుండడానికి నీకో ఇంజెక్షన్ ఇస్తాను" అంటూ ఆమె జవాబుకు ఎదురు చూడకుండా ఇంజెక్షన్ చేసేడు. అయిదు నిమిషాల్లో ఆమె పక్కమీద వాలిపోయింది.
అతడు తన గదిలోకి వచ్చేడు. అక్కడ కూర్చొని వుంది ఓ డాక్టర్. ఆమెకు నలభయ్ ఐదేళ్ళుంటాయి. తెల్లటి వెంట్రుక పాయలు మెరుపుతోనూ, కళ్ళు విజ్ఞానంతోనూ మెరిసిపోతున్నాయి.
"వెళ్ళండి డాక్టర్" అన్నాడు జయదేవ్ "తులసికి సెడెటివ్ ని ఇచ్చేను"
ఆమె లేచి వెళ్ళటానికి ఉద్యుక్తురాలయింది. జయదేవ్ అన్నాడు "ఏదీ వదిలిపెట్టవద్దు, జాగ్రత్తగా పరీక్ష చేయండి"
డాక్టరు తలూపి లోపలికి తులసి గదిలోకి వెళ్ళింది ఆమె చేతిలో చిన్న కంప్యూటర్ లా ఎలక్ట్రోమాగ్నెట్ డివైస్ వుంది. ఇంకో చేతిలో మెటల్ డిటెక్టివ్ వుంది.
తులసి మంచం పక్కనే నిలబడి పేషెంట్ వేపు చూసింది. ఆమె ముగ్జంగా మనోహరంగా నిద్రపోతున్న ఈ అమ్మాయి మానసిక ఘర్షణకి కారణాన్ని ప్రొఫెసర్ జయదేవ్ ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు....సైన్స్...... సైన్స్......సైన్స్......డామిట్.
ఆమె నెమ్మదిగా వేళ్లతో తులసి చీర కుచ్చెళ్ళను తప్పించింది. ఆ తరువాత జాకెట్ నీ, బ్రానీ.......
లేత సాయంత్రపు సూర్యకాంతి సముద్రం మీదనుంచి విశ్లేషణ చెంది శరీరం మీద పరావర్తన మవుతూంది.
చాలామంది అమ్మాయిలు చీరల్లోనే బావుంటారు.
తులసి అలాకాదు ఓ పాలరాయిని గుర్తు తెలియని గ్రీకు శిల్పి కారుడు ఏళ్ళ తరబడి నిద్రాహారాలు మాని చెక్కినట్టుంది. పాలిండ్లు పిరమిడ్లయ్, మొనలు వడ్లయ్, కడుపు అలల అలజడ్లయ్, నడుము వంపుల తెడ్లయ్. దానికి కటి అడ్డయి, యవ్వనం శరీరపు అంగాంగాల్లోకి ఉబికిపోయింది. ఆ అందం డాక్టర్నే కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తూంది క్షణంలో తేరుకుని డాక్టర్ తన పనిలో నిమగ్నమయింది.
తులసి వెంట్రుక చివర్లనుంచీ కాలి బొటన వ్రేలి గోరువరకు క్షుణ్నంగా పరీక్షించింది. ఈ లోపులో జయదేవ్ తన స్నేహితుడికి ఫోన్ చేసేడు. అతడు మద్రాసు వెళుతూంటే తన కారు అతడికిచ్చి, అతడి కారు తీసుకున్నాడు. తమ తాలూకు వస్తువులేవీ తులసి దగ్గిరలో వుంచటానికి వీలులేకుండా జాగ్రత్త పడుతున్నాడు అతడు.
డాక్టర్ జయదేవ్ వున్న గదిలోకి వచ్చింది.
"ఏమైనా దొరకిందా?" ఫోన్ పెట్టేస్తూ అడిగేడు.
"లేదు, ఆమె శరీరం అంతా పరీక్షించేను. చివరికి గాజులూ, చెవి పోగులు కూడా చెక్ చేశాను. ఏ 'ఫారిన్ బాడీ' ఆమెలో గానీ, ఆమె ధరించిన ఆభరణాల్లోగానీ లేదు.
జయదేవ్ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.
పదకొండు సంవత్సరాల క్రితం ఒక తాయెత్తు ద్వారా తులసికి సంకేతాలు పంపేడు పిళ్ళై, ఈసారి అన్ని మార్గాలూ ఇప్పట్నుంచే మూసేస్తున్నాడు తను.
జయదేవ్ ఇలా ఆలోచిస్తున్ సమయంలో అక్కడ శారదకి ఫోన్ వచ్చింది. "ఎవరు మీరు" అని అడిగింది.
"తులసి క్రికెట్ టీమ్ తాలూకు కోచ్ ని. తులసి కావాలి" అన్నాడు పిళ్ళయ్.
"తులసి వూళ్ళో లేదు"
పిళ్ళయ్ ఉలిక్కిపడ్డాడు. "లేదా" అన్నాడు. "ఏ వూరెళ్లింది?"
"తెలీదు" అన్నది శారద.
"సిలోన్ వెళ్ళే క్రికెట్ జట్టు ఎంపిక జరుగుతూంది. ఆమె అవసరము చాలా వుంది."
"సారీ తులసి క్రికెట్ ఇక ఆడదు" ఫోన్ పెట్టేసింది శారద. తులసి గురించి ఏమీ మాట్లాడవద్దని ఆమెకి ప్రత్యేక సూచనిచ్చేడు జయదేవ్.
ఫోన్ డిస్ కనెక్టవటంతో పిళ్ళయ్ కుర్చీ వెనక్కి జారబడ్డాడు.ఒక క్షణం మొహం గంభీరంగా వుంది. సాలోచనగా చెయ్యిసాచి సిగార్ వెలిగించుకున్నాడు.


