Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 7


    ఆమెలో ఆవేశం పరవళ్ళు త్రొక్కింది. "నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో, నీ పాదాలు మాత్రం నేను పట్టుకోవటం కల్ల" విసురుగా అని ఛివాల్న వెనక్కి తిరిగి గ్యాలరీ హాల్లోకి వెళ్ళిపోయింది.


            * * *


    లంచ్ అవర్ లో మళ్ళీ ర్యాగింగ్ జరిగింది. హాస్టల్స్ నుంచి భోజనం కాలేజికే వస్తుంది. మేల్ స్టూడెంట్స్ క్లోక్ రూంలో వాళ్ళు, ఫిమేల్ స్టూడెంట్స్ క్లోక్ రూంలో వీళ్ళు లంచ్ తీసుకుంటారు.

 

    మేల్ స్టూడెంట్స్ కు మంచినీళ్ళు త్రాగటానికి గ్లాసులుండవు. అందరికీ కలిపి వాటర్ జగ్ ఒకటే వుంటుంది, అదే ఎత్తిపట్టుకుని జాగ్రత్తగా త్రాగాలి. సీనియర్స్ కు బాగా అలవాటయిపోయింది. జూనియర్స్ కు ఎలా త్రాగాలో తెలియటంలేదు. జగ్గు మంచినీళ్ళతో చాలాసేపు వాళ్ళని ఏడిపించారు సీనియర్స్.

 

    లేడీ స్టూడెంట్స్ తమతోబాటు ఓ జూనియర్ కుర్రాడిని తీసుకెళ్ళారు.

 

    అతన్తో అంతా సర్వ్ చేయించుకున్నారు.

 

    తర్వాత అతనికి వాళ్ళమధ్య భోజనం పెట్టారు. అతను అన్నంగానీ, సాంబారు వగైరాలుగానీ అరిచేతికి అంటుకోకుండా వ్రేళ్ళతో తినాలి. పొరపాటున అరచేతికి అంటుకుందా? పనిష్మెంట్.

 

    "నీకు కిమాం అలవాటుందా?" అనడిగిందా అమ్మాయి.

 

    కిమాం తెలీదు. ఇంకా జర్దా, బాబా జర్దాలేం వాడతావు? ఇదిగో ఇది తిను" అని ఓ కిళ్లీ అందించింది.

 

    "ఉమ్మేయకు. నమిలి మింగెయ్యి."

 

    వాళ్ళు చెప్పినట్లు చెయ్యకపోతే కోపమెస్తుందని అలా చేశాడు. మొదట తమాషాగా వుంది. తర్వాత గిలిగింతలుగావుంది. ఆ తర్వాత వళ్ళంతా తిమ్మిరెక్కినట్లుగా వుంది. కాని కుర్రాడికి బలే హుషారొచ్చింది.

 

    "ఎలా వుంది?"

 

    "బాగుంది."

 

    "బాగుందా? అంటే?"

 

    "హాయిగా వుంది."

 

    "మేమంతా ఎలా కనిపిస్తున్నాం?"

 

    "నువ్వు... నువ్వు... జ్యోతిలక్ష్మిలా కనిపిస్తున్నావు.

 

    "ఏయ్?"

 

    "నువ్వు... జయమాలినిలా కన్పిస్తున్నావు."

 

    "జాగ్రత్త. ఒళ్ళు..."

 

    "నువ్వు... నువ్వు... సూర్యకాంతంలా కనిపిస్తున్నావు."

 

    అంతా విరగబడి నవ్వారు.

 

    లంచ్ పూర్తయి ఆడపిల్లలందరూ బయటకు వస్తోంటే సీనియర్ మేల్ స్టూడెంట్స్ ఓ జూనియర్ కుర్రాడిని పట్టుకుని ఆడపిల్లల దగ్గరకువెళ్ళి వాళ్ళ పేర్లు కనుక్కురమ్మన్నారు. వాళ్ళందరి పేర్లూ కనుక్కోవాలి. మరిచిపోకుండా తిరిగి చెప్పాలి. ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి పేరేమిటో, ఫలానా పేరున్న అమ్మాయి ఏ చీర కట్టుకున్నదో తప్పులేకుండా చెప్పాలి.

 

    ఓ సీనియర్ ఇంకో కుర్రాడిని పట్టుకున్నాడు. "అదిగో ఆ లేతాకు పచ్చచీరె కట్టుకుని పువ్వుల జాకెట్ వేసుకున్నదే... ఆ అమ్మాయిని వర్ణించు పైన చుట్టు దగ్గర్నుంచీ, కాలివ్రేళ్ళవరకూ అంగాంగ వర్ణన చెయ్యాలి. వర్ణన చాలా వివరంగా ఉండాలి."

 

    ఆ కుర్రాడు కవిత్వంలా చెప్పటం మొదలుపెట్టాడు. మాట్లాడితే సంస్కృతంలో చెప్పాలి."

 

    "ఏం చేస్తాడు? అలాగే వర్ణించాడు.

 

    సాయంత్రానికి కాలేజి ముగిసింది. లేడీ స్టూడెంట్సందరూ బస్సు ఎక్కుతూ ఓ జూనియర్ కుర్రాడిని తమతో తీసుకొచ్చారు. అతన్ని బస్సు మధ్యలో నిలబెట్టారు. పైన ఏ ఆధారమూ పట్టుకోకూడదు. ఏ లేడీ స్టూడెంట్ మీదా పడకూడదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. బస్సు గోతులలో పడినప్పుడల్లా ఎత్తికుదేస్తోంది, ఆ కుర్రాడు చేసిన భరతనాట్యం, పడిన అవస్థ వర్ణనాతీతం.

 

    లేడీస్ హాస్టల్ ముందు బస్సాగింది. అందరితోబాటు కల్యాణికూడా దిగి, ఏదో అనుమానం వచ్చి తలత్రిప్పి చూసింది.

 

    గేటవతల చెట్లక్రింద పార్క్ చేయబడ్డ స్కూటర్ ప్రక్కన రాజా నిలబడి వున్నాడు. అతని కళ్ళ మెరుపుల నుండి  తారాజువ్వులు వెలువడుతున్నాయి.


                                   * * *


    "నాకు చాలా భయంగా వుంది" అంది కల్యాణి ఆ సాయంత్రం గదిలోకి వెళ్ళి డ్రెస్ ఛేంజ్ చేసుకుని మంచాలమీద చేరగిలబడ్డాక.

 

    "ఆ రాజా గురించా?"

 

    కల్యాణి అవునన్నట్టు తల ఊపింది.

 

    "ఎందుకు అతనంటే అలా భయపడుతున్నావు?"

 

    "అతను నన్ను చాలా బెదిరించాడు. అతని వాలకంచూస్తే అనుకున్నదంతా చెయ్యగల పట్టుదల మనిషిలా కనబడుతున్నాడు. అంతేకాదు, ఇందాక బస్సు దిగేసరికి చెట్లక్రింద నిలబడి నావంక తీక్షణంగా చూస్తున్నాడు."

 

    "అయితే ఏం జరిగిందట?" అన్నది మాధవి నవ్వుతూ.

 

    "నా అంతు చూస్తాడేమోనని."

 

    మాధవి ముఖం గంభీరంగా మారింది. "కల్యాణీ! ర్యాగింగ్ ని ఓ సంప్రదాయం క్రింద జమకట్టి ఇంతవరకూ నేను సీరియస్ గా తీసుకోలేదు. స్పోర్టివ్ గానే వుంటూ వచ్చాను. కాని దేనికన్నా ఓ హద్దు అంటూ ఉంది. అది మీరటం అంటూ జరిగితే నీకు అభయమిస్తున్నాను నీ వెనక నేను వున్నాను. నీ మర్యాద కాపాడటానికి నా ప్రాణమన్నా ఇస్తాను" ఆమె కంఠస్వరంతో దృఢత్వం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ధ్వనిస్తున్నాయి.

 

    కల్యాణికి కొండంత బలం వచ్చినట్లైంది. ఇహ ఏడుపొక్కటే తక్కువన్నట్లు వున్న మనిషికల్లా గొప్ప ఊరడింపు కలిగింది.


                                    * * *


    ఎవరీ రాజా? హీరోనా రౌడీయా? అతనికి కాలేజీలో ఫాలోయింగ్ వున్నదా?

 

    ఈ రెండురోజులబట్టి పరిశీలించినదాన్ని బట్టి అతని స్వభావాన్ని ఎనలైజ్ చేయటానికి ప్రయత్నించింది మాధవి. చూపులకు చాలా అందంగా వున్నాడు. చలాకీగా కదిలే అతని కళ్ళలో చురుకుదనంతోబాటు కొంచెం కరకుదనం, లోపల గంభీరమైన మరోమనిషి వున్నాడేమో అనిపింపచేసే విశాలత్వం గోచరిస్తాయి. అతని ప్రవర్తన, మాటలసరళి ఆ కరుకుతనం తెచ్చిపెట్టుకున్నదేమో అన్న సంశయం కలిగిస్తూ ఉంటుంది.

 Previous Page Next Page