Previous Page Next Page 
శిక్ష పేజి 6


    రంగారావు కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయారు. తరువాత తీక్షణంగా మేనేజరు వంక చూసి "దీనికి మీ సమాధానం ఏమిటి?" అడిగారు. "అబ్బే ...... అబ్బే ..... అదేం లేదండి ఈ పిల్లలు ...... రాక్షసులండి. వీళ్ళ కెంతపెట్టినా ఆకలేనండి. అబ్బా అమ్మా లేని వాళ్ళందరికి రెండు పూటలా తిండి పెడ్తే యిలాగే విశ్వాస ఘాతకుల్లా తయారవుతారు. పెట్టిన చేయినే కరచే రకం అండి వీళ్ళు....." "మేనేజరుగారూ! మీ చేతులు కరిచే శక్తికూడా లేదండి మాకు. మీరు పెట్టే తిండికి అంతశక్తి మాకెక్కడ నుంచి వస్తుందండీ....." శ్యామల వెటకారంగా అంది. "సార్ ఈ పిల్లమాటలు నమ్మకండి, చాలా పొగరుమోతండీ మీ అంతట మీరే చూస్తున్నారు లెక్కలవీ" తీక్షణంగా అన్నాడు. "కూడికలు తీసివేతలు వచ్చినవాళ్ళు కాగితాల మీద కరక్టుగానే చూపించవచ్చు" శ్యామల కూడా తీక్షణంగానే అంది- అంతదాకా వచ్చాక ఆ అమ్మాయికి యింక భయపడడానికి ఏమీ కన్పించలేదు. ఏదో మొండితనం, ధైర్యం వచ్చాయి రంగారావు యిద్దరి మాటలు విన్నారు "ఏం అమ్మాయి, మరి యిన్నాళ్ళు ఈ విషయాలు మాతో ఎందుకు చెప్పలేదు. ప్రతి సంవత్సరం వస్తూనే వున్నాం గదా" రంగారావు ప్రశ్నించారు.
    "చెపితే తరువాత మేం యిక్కడ ఎదుర్కోవలసిన పరిణామాలను తల్చుకుని ఆ ధైర్యం చేయలేకపోయాను యిదివరకు. గత ఏడాదినించే నేను 'పెద్దక్క' నయాను. పిల్లలందరి మంచిచెడ్డలు చూడాల్సినది పెద్దక్క ఆమెకే ఏ నిర్ణయం తీసుకునే అధికారం వుందికాని తక్కిన వాళ్ళకి లేదని మాలో మేం చేసుకున్న నియమం నాముందు వుండే 'పెద్దక్క' కాస్త అధైర్యస్థురాలు- చెపితే మా బతుకులు మరింత అధ్వాన్నం అవుతాయన్న భయంతో ఆమె చెప్పసాహసించలేదు. అంతకుముందు ఒకసారి ఓ అమ్మాయి మేనేజిమెంటుని నిలదీసి ప్రశ్నించినందుకు, వారిమీద తిరగబడినందుకు ఆ అమ్మాయి తరువాత ఎదుర్కొన్న నరకం చూశాక ఇంకెవరూ ఆ పని చెయ్యలేకపోయారు ......."
    "ఏమయింది- ఏం జరిగింది?" రాణి ఆత్రుతగా అడిగింది.
    "ఒకసారి వారు పెట్టేతిండి -- వారు చూపే నిరాదరణ సహించలేక పెద్దక్క తిరగబడింది. డబ్బంతా ఏమవుతుందని నిలేసింది. దాంతో మేనేజరు మొదలు పనివాళ్ళు అంతా కలిసి ఒకటయి పిల్లలకి నరకం చూపారు. ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగానో హింసించారు తిండిపెట్టకుండా ఏదో దొంగతనం అంటగట్టి సూటిపోటి మాటలతో సాధించి, ఆఖరికి ఆమెకంటే చిన్నవాడైనా ఓ పదిహేనేళ్ళ కుర్రాడితో ముందు నిలబెట్టి వాతలు పెట్టి హింసించి తరిమి తరిమి కుక్కలా వెళ్ళగొట్టారు శరణాలయం నుంచి ఆ హింస, అవమానం సహించలేక ఆ రాత్రి ఆ అమ్మాయి శరణాలయంలోనే చెట్టుకు ఉరిపోసుకు చచ్చిపోయింది."
    "ఎంత ఘోరం - ఈ సంగతులు మాకెందుకు తెలియలేదు" జమీందారు ఉగ్రుడై ప్రశ్నించాడు మేనేజరు నీళ్ళు నిమిలాడు. "అప్పటికప్పుడు ఆ అమ్మాయితో పాటు ఆ సంఘటననీ ఆ ఆవరణలోనే సమాధి  చేశారు. మా కందరికి అది గుర్తే ఇది పైకి చెప్పిన వాళ్ళగతి అంతేనని బెదిరించారు. ఆనాటి కీనాడు మళ్ళీ నేను యిలా మీకు విన్నవించుకున్నందుకు రేపు నాగతి ఆ అమ్మాయి గతే అవుతుంది" శ్యామల ఉద్రేకంగా అంది.
    "వీల్లేదు- యీ అరాచకం యింక సాగనీయను. దీని అంతు చూస్తాను. శ్యామలా ఇన్నాళ్ళకయినా నీవు సాహసించి చెప్పి మా కళ్ళు తెరిపించావు- ఏదో ఏడాదికి ఒకసారి ఖాతా పుస్తకాలు సరిచూడడంతో మా బాధ్యత అయిపోలేదన్న సంగతి గుర్తుచేసినందుకు నిన్నభినందిస్తున్నాను. ఈ సంగతి రేపే తేలుస్తాను" జమీందారుగారు ఉగ్రరూపం దాల్చి వడివడిగా నిష్క్రమించారు.
    తరువాత ఆయన పూర్తిగా శరణాలయం సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమించారు. ప్రతీనెలా శరణాలయంలో ఏర్పాటులు సంతృప్తికరంగా వున్నట్లు శరణాలయంలో పిల్లల తరఫున 'పెద్దక్క' జమీందారుగారికి ఉత్తరం రాసి తెలియపరచాలి. ఎవరి పని వారు సరిగా చెయ్యకపోయినా, డబ్బు అసహరించినా వెంటనే వారిని తొలగించే ఏర్పాటు చేశారు. ఏర్పాటులు పకడ్బందీగా చేసి పిల్లల కృతజ్ఞతకి లోనయ్యారు ఆయన- శ్యామల వున్నన్ని రోజులు శరణాలయం కాస్త బాగుపడింది. తరువాత 'పెద్దక్క' అయిన సుగుణ కాస్త అమాయకురాలు. తరువాత మళ్ళీ సిబ్బంది పాతబడి కాస్తకాస్త అరాచకం ఆరంభమయింది. ఈలోగా జమీందారు భార్యబిడ్డల వియోగంలో శరణాలయం పట్ల శ్రద్దాశక్తులు కనపరచకపోవడం పరిస్థితి ఇదివరకంత అధ్వాన్నంగా లేకపోయినా మెరుగుగా లేదు.
    ఈనాడు శ్యామలని చూడగానే ఆయనకీ సంగతులన్నీ గుర్తు వచ్చాయి. తను మళ్ళీ శరణాలయం విషయం అశ్రద్ధ చేస్తున్నందుకు నొచ్చుకున్నారు. ఆనాటి శ్యామల ధైర్యసాహసాలు చూసి రాణి కూడా మెచ్చుకుంది. తరువాత సంవత్సరం వచ్చేసరికి శ్యామలని రాణీ అభిమానంగా పలకరించి వివరాలడిగింది. వారి దయవల్ల శరణాలయంలో పిల్లలు హాయిగా వున్నారంటూ కృతజ్ఞతతో చెప్పింది శ్యామల. జమీందారు దంపతులు సంతోషించారు. ఆ శ్యామల ఈనాడిలా తటస్థపడింది ఆయనకి మళ్ళీ.
    మర్నాడు ఉదయం లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకున్నాక శ్యామలని చూడడానికి నర్సింగ్ హోమ్ కు బయలుదేరా రాయన. తీయని పళ్ళు, బిస్కట్లు, హార్లిక్స్ వగైరా కొని. శ్యామల ఏక్సిడెంటు షాకునించి తేరుకుని తేటగా కన్పించింది. గాయాలు మరీ మోపయినవి కావు కనుక మరొక నాలుగైదు రోజులలో పూర్తిగా నయం అయ్యాక డిశ్చార్జి చేస్తానన్నాడు డాక్టర్.

 Previous Page Next Page