Previous Page Next Page 
పర్ణశాల పేజి 5


    చైతన్య కెదురుగా బల్లమీద ప్లాస్టిక్ కవరుంది.

    వాళ్ళని తనింటికి తీసుకొచ్చినరోజే దాన్ని ఇద్దామనుకున్నాడుగాని తండ్రి మరణం సంగతి వినగానే వాళ్ళు దుఃఖసాగరంలో మునిగిపోవటం చూసి మళ్ళీ ఈ లోకంలో పడేదాకా  ఆగాడు.

    ఆ రోజు శారద మాటల సందర్భంలో "మా అడ్రస్ ఎలా దొరికింది" అని అడగటంతో అతడికి కవరు సంగతి జ్ఞాపకం వచ్చింది. తన బట్టల బీరువాలో భద్రంగా దాచినదాన్ని తెప్పించేడు.

    అందరూ కుతూహలంగా చూస్తూవుంటే అతడు కవరు విప్పేడు. అందులో మళ్ళీ రెండు చిన్న కవర్లున్నాయి. ఒకదాని మీద కిరణ్మయి పేరూ రెండో దానిమీద శారద పేరూ వ్రాసి వున్నాయి, అడ్రసుతో సహా.

    "నాన్నకు మరీ ఛాదస్తం" అంది  కిరణ్మయి. ఎవరూ  మాట్లాడలేదు.

    అందరిలో ఉత్సకత పెరుగుతోంది. ఎవరి కవర్ వారికి ఇచ్చేడు. "లోపలికి తీసుకెళ్ళి విప్పుకోండి. ఏ రహస్యం వుందో" అన్నాడు రవి నవ్వుతూ.

    లోపలున్న కాగితాలు చూసి ఆమె మొహం అవమానంతో మాడిపోయింది.

    తమ  తండ్రి చచ్చిపోతూ తమకు ఆస్థిగా భద్రపరిచి ప్రేమతో ఇచ్చినవి రకరకాల లాటరీ టిక్కెట్లు!

    ఒక క్షణం ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని  ఎలా ఛేదించాలో ఎవరికీ అర్థం కాలేదు. అందరికన్నా ముందుగా  తేరుకున్నది చైతన్య నవ్వుతూ "ఏమో ఎవరికి తెలుసు." అందులోనే  లక్ష తగలొచ్చు" అన్నాడు.

    "అవును. అలా ఎందుకు కాకూడదు?" అంటున్న రవి తన కుర్చీలోంచి చప్పున లేచి "అరె-అదేమిటి?" అన్నాడు.

    అప్పటికే టిక్కెట్లను చింపి పోగులు పెడుతున్న శారద. ఆ ముక్కల్ని వేస్టు పేపర్ బాస్కెట్ లో పడేస్తూ "వాటి తారీఖులయిపోయి నెల, రెండు నెలలు  కావొస్తుంది రవిబాబూ. ఇంకా ఎందుకని" అంది పేలవంగా నవ్వుతూ.

                               *    *    *


    "ట్రాలర్స్ మీద బెస్తలు సముద్రంలో వారం పదిరోజులు ఉండి వీటిని పట్టుకొస్తారు" అంటూ గుట్టలు గుట్టలుగా పడివున్న రొయ్యల్ని చూపించాడు చైతన్య.

    కిరణ్మయి, శారద వింటున్నారు. బాబు బల్లమీద కూర్చొని తల్లి చేతిగాజులతో ఆడుకొంటున్నాడు. "వీటిలో పెద్దసైజుకి డిమాండ్ ఎక్కువ. కిలోకి ఆరేడు మాత్రమే తూగేటంత పెద్దవి కూడా వుంటాయి. అలాటివి దొరికితే వాళ్ళకారోజు పండుగే" అంటూ ముందుకు నడిచేడు.

    దాదాపు వందమంది పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళచేతులు  ఎంతో కళాత్మకంగా తమ పని చేసుకుంటూ పోతున్నాయి.

    "దాదాపు పదిహేను వ్యాన్ లు  వున్నాయి. ఈ కంపెనీకి. అవి తీరానికివెళ్ళి వేలంపాటలో వీటిని కొని ఇక్కడికి తీసుకొస్తాయి. వెంటనే ఇక్కడ తల, పైపొట్టు తీసెయ్యిబడుతుంది. తర్వాత క్లోరిన్ నీటిలో శుభ్రం చేస్తారు వీటిని."

    పెద్ద ఛాంబర్ తలుపు తీసేడు చైతన్య "దీన్ని కోల్డు స్టోరేజి అంటారు" అని  ప్రక్కనే ఉన్న ప్రెస్సింగ్  మిషన్ ని చూపిస్తూ- "ఇక్కడ  రొయ్య  ఐస్ మధ్య ప్రెస్ చేయబడుతుంది. తర్వాత  ఈ పాకెట్స్ ని కోల్డు స్టోరేజిలో భద్రం చేస్తారు" అన్నాడు.

    కోల్డు ఛాంబర్ లోకి ప్రవేశించగానే చల్లటిగాలి వాళ్ళను చుట్టుముట్టింది. చలి శరీరాన్ని వణికిస్తోంది. అరలలో పాకెట్స్ వరుసగా  సర్దబడి వున్నాయి. ఎక్కువసేపు లోపల  వుండలేక కిరణ్మయి బయటకొచ్చేసింది.

    "లోపల ఎవరన్నా వుండగా తలుపు పొరపాటున వేసేస్తే!" కౌసల్య  అన్నయ్యని అడిగింది.

    చైతన్య నవ్వేడు. "అరగంటలో చచ్చిపోతాడు. కానీ శవం మాత్రం  ఎన్నిరోజులైనా పాడవదు."

    శారద వళ్ళు జలదరించింది. మాట మారుస్తూ "ఈ రొయ్యల్ని ఏంచేస్తారు?" అనడిగింది.

    "ఎగుమతి....." అన్నాడు చైతన్య బయటకు నడుస్తూ. అమెరికా, ఫ్రాన్స్ లలో  వీటికి వున్నంత డిమాండ్ మరి వేటికీ లేదు. అదీగాక మన సముద్రతీరాలలో తప్ప ఇంకెక్కడా ఈ రకం రొయ్యలు దొరకవు."

    కారు నెమ్మదిగా కదిలింది. 

    "నీళ్ళలోంచి బయటకొచ్చిన రొయ్య చాలా తొందరగా చచ్చిపోతుంది. ఆ తర్వాత అంత తొందరగానూ పాడయిపోతుంది. కొన్న వెంటనే వీటిని ఐస్ వేన్ లో పెడతారు. ఫ్యాక్టరీలో కూడా ఐస్ మధ్యనే పనంతా  జరుగుతుంది. ష్రిమ్స్ ఫ్యాక్టరీ నుంచి ఓడ చేరేవరకూ, ఓడలోనూ కూడా ఈ వాతావరణంలోనే వుంటాయి. చివరకు ఆమెరికాలో కష్టమర్ కొనుక్కున్నప్పుడు కూడా సూపర్ బజార్  వాడు  ఫ్రిజ్ లోంచి తీసిస్తాడు వీటిని."

    కారు కంపౌండ్ లోకి ప్రవేశించింది. ఎర్రటి మట్టిరోడ్ అందంగా నీరెండలో మెరుస్తోంది. ఇరుప్రక్కలా తెల్లటిరాళ్ళు వరుసగా పేర్చి వున్నాయి. గాలికి వూగుతోంది. ఎత్తయిన భవంతి  లోపలి గోడల డిస్టెంపర్ పెయింట్ మీద  సూర్యకిరణాలు పరివర్తనం చెందుతున్నాయి. రవి ఇంట్లో వున్నట్లున్నాడు. నీల్ డయిమండ్ కంఠం గిటార్ ధ్వనులతో కలిసి వినిపిస్తోంది.

    "సముద్రంలో వారం పదిరోజులు వుండి నిద్రాహారాలు మాని వీటినిపట్టే బెస్తవాడికి కిలోకి ఐదారు రూపాయలు దొరుకుతుంది. ఆ కిలో రొయ్యలకే అమెరికాలో నూట ఇరవై రూపాయలు ధర."

    "ఏమవుతుంది ఈ డబ్బంతా...."

    "మధ్యలో చాలా కొద్దిమంది పంచుకుంటారు. కాపిటలిస్ట్ వాతావరణం కదా" కారు పోర్టికోలోకి తీసుకొస్తూ అన్నాడు చైతన్య. "మాకు యీ వ్యాపారం చెయ్యటానికి లక్షలకు లక్షలు ప్యాకింగ్ క్రెడిట్ యిచ్చే బ్యాంక్, బెస్తవాడికి ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఇవ్వాలంటే సంకోచిస్తుంది."

    కారు ఆగింది.

    "మీరే ఇలా మాట్లాడుతున్నారేమిటి?" కిరణ్మయి కారు దిగుతూ అంది. "మీరూ కాపిటలిస్టే కదా."

    "అయినా  మనిషినే కదా" నవ్వేడు.

    కాంతిమతి కూడా నవ్వి, "ఆయన కప్పుడప్పుడు అలాటి స్మశాన వైరాగ్యం వుంటుందిలే" అంది.

    చివరగా శారద దిగి డోర్ వేసింది. అప్పుడే డ్రయివింగ్ సీటులోంచి దిగిన చైతన్య డోర్ మళ్ళీ తీసి బలంగా వేస్తూ "మీరు మరీ సున్నితస్తుల్లా వున్నారే- కారు తలుపు ఫ్రిజ్ తలుపులా వేస్తున్నారు" అన్నాడు. శారద సిగ్గుతో నవ్వింది. బాబు బోసిగా నవ్వేడు. కాంతిమతి స్నేహపూర్వకంగా నవ్వింది.

    కిరణ్మయి నవ్వలేదు.

    ఆమెకి తెలుసు..... తనకీ, తన  చెల్లెలికీ అది రెండోసారి కారు ఎక్కడం అని!


                               *    *    *


    రాత్రి తొమ్మిదయింది. కిరణ్మయికి నిద్ర రావటంలేదు.

    ఆ రోజు సాయంత్రం రవి అన్న మాటలే ఆమెకి జ్ఞాపకం వస్తున్నాయి మాటిమాటికీ.

    అంతకుముందు నాల్గయిదు రోజుల్నుంచీ ఆమెకి టేబిల్ టెన్నిస్ నేర్పుతున్నాడతడు. అతడు తనపట్ల చూపుతున్న ప్రత్యేకాభిమానాన్ని ఆమె ఎప్పుడో పసిగట్టింది. కానీ అంత తొందరగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడని  అనుకోలేదు. ఒకవేళ అతడేగాని ఆ కోర్కెని వెళ్ళబుచ్చితే ఎలా ప్రవర్తించాలో- డబ్బూ, అందమూ, తెలివీ చూసుకొని ఏది కోరితే  అది వస్తుందన్న ధీమాలో ఉన్న  యువకుడికి ఎలా బుద్ధి చెప్పాలో ముందే ఊహించుకొని సిద్ధంగా వుంది. పేదతనంలో వున్న యువతులు కూడా శీలానికి ప్రాముఖ్యత ఇస్తారని గుణపాఠం చెప్పాలనుకొంది.

    ఇంటి యాజమాని చేసిన అల్లరిలో, మధ్య దేవుడిలా వచ్చి చైతన్య ఆదుకోవటం ఆ క్షణంలోనే ఆమెకి అత్యంత సంతోషం కలగజేసినా ఆ తరువాత మూల ఏదో అర్థంకాని కాంప్లెక్స్ ఆమెని బాధిస్తోంది. నిజానికి ఆ యింట్లో  అందరూ ఆ అక్కా  చెల్లెళ్ళని అత్యంత ఆప్యాయతతో చూచుకొంటున్నారు. ఆమెకి  అర్థంకానిది అదే, ఎందుకలా చూసుకుంటున్నారూ- అని! గది తలుపులు  బిగించి మధ్యలో వుంచినట్లు వూపిరాడడంలేదు ఆమెకు.

    ఈ పరిస్థితుల్లో రవి ప్రవర్తన ఆమెలో ఒక రకమైన ఆనందాన్నే  కలుగజేసింది. ఎందుకంటే, ఎవరికీ లేని ఆస్థి ఒకటి తనకుందని ఆమెకు తెలుసు. అది తన అందం! అయితే ఇక్కడ కూడా ఆమె ఘోరంగా దెబ్బతిన్నది.

    అప్పటివరకూ ఆమె వున్న ప్రపంచం వేరు. అక్కడ యువకులు సంస్కారహీనులు. మిడిమిడి చదువులతో కాలరెత్తుకుని తిరిగేవారు. అక్కడ ప్రేమకి అర్థం చౌకబారుగా చెలామణి అయ్యేది. ద్వందార్థం వచ్చే మాటలు, ఏదో  మిషమీద స్పృశించటాలూ- ఇలా ప్రకటిత మయ్యేది. ఆమెని దక్కించుకోవాలని ప్రయత్నించిన యువకులందరూ ఆమెపట్ల యిలా ప్రవర్తించేరు. ఆమెకు ప్రేమంటే ఒక హీనమైన అభిప్రాయాన్ని కలుగజేసేరు.


    ...............

    "మీరు..... మీరు ..... ఈ చీరెలో చాలా అందంగా వున్నారు...." అన్నాడు రవి.

    కారిడార్ లో టేబిల్ టెన్నిస్ ఆట మధ్యలో.

    "అయితే?" అందామె మొహంలో ఏ భావమూ కనబడనీయకుండా.

    తన ప్రేమను దాచుకొనే ప్రయత్నం ఏమీ చెయ్యలేదతడు. "ఐ లవ్ యూ కిరణ్" అన్నాడు  నెమ్మదిగా- కానీ స్ఫుటంగా.

    ఆమె అతడివేపు సూటిగా  చూసింది. ఈ మాట ఆమెకి క్రొత్తకాదు పెళ్ళయిన వాళ్ళు, వృద్దులు-చాలామంది అన్నారామాట. కొంతమంది చెంపలు పగిలినయ్. కొంతమందిని సున్నితంగానే తిరస్కరించింది. ఈ ప్రేమ  అనేది  అందమైన స్త్రీని చూడగానే పురుషుడికి అసంకల్పితంగా పుట్టుకొస్తుందని ఆమె దృఢమైన అభిప్రాయం. స్త్రీ వప్పుకుంటే దగ్గరగా చేసుకుంటాడు. తీయటి మాటలు  చెబుతాడు. అంతా రహస్యంగా వుంచుతాడు. హాయిగా అనుభవిస్తాడు. కొంతకాలం తరువాత మొహం మొత్తుతుంది- వదిలేస్తాడు.

    పక్కింటి పంకజం, ఎదురింటి సుశీల, అందరూ ఇలా మోసపోయినవాళ్ళే. తమ వీధి చివరలో వున్న కాకాహొటల్ బల్లమీద  కూర్చొనే గిరజాలజుట్టు రమేష్, అడ్డపంచె నారాయణ- వీళ్ళూ ఆ ప్రాంతపు హీరోలు.

    ఈ వాతావరణంలో పెరిగిన స్త్రీకి తనను రక్షించుకొనే అలవాటు సహజంగానే వస్తుంది. ఆ స్త్రీ హృదయంలో సున్నితపు భావానికి చోటులేదు. అందుకే ఆ యువకుడు ప్రతిపాదించిన కోర్కెకి విసురుగా..... "అయితే ఏమిటి?" అంది.

    "మీరు వప్పుకుంటే అన్నయ్యకు చెబుతాను. తను కూడా కాదనడనే నా నమ్మకం."

    నిజంగా ఇది ఆమె వూహించని జవాబు. ప్రేమకి పెళ్ళి పర్యవసానం అనీ, మొగవాళ్ళు యింత నిజాయితీగా వుంటారనీ ఆమెకు తెలీదు. ఇది ఆమెకి ఒక షాక్. తనని ఈ విధంగా అడుగుతున్న యువకుడు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టేడనీ, చిన్నతనం నుంచీ మంచి కట్టుబాట్ల మధ్య పెరిగేడనీ ఆమెకు ఆ క్షణం తోచలేదు!

 Previous Page Next Page