"మీకు 'లా' చదువుతున్న కొడుకు వున్నాడటగా!"
ఆమె ఏదో తప్పుచేసినట్టుగా, వెంటనే మాట్లాడలేకపోయింది.
"నేను మొదట నమ్మలేదు. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు...నిజంగానా?" అతను అమాయకంగా అడుగుతున్నట్టు అడుగుతున్నాడు.
"అవును" ఆమె స్వరం సన్నగా వణికింది.
"అయితే వినండి! నేను మిమ్మల్ని ఇంకా గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే, మీరు దేవతా స్త్రీ అని నా నమ్మకం. బహుశా వయస్సు పెరగకుండా అమృతం తాగి వుంటారు కదూ!"
ఆమెని ఆ మాటలు ఏవో లోకాల్లోకి తీసుకుపోయాయి.
అతను ఆమెని ఊరికి దూరంగా వున్న తన గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టలేదు!
భరద్వాజలో చమత్కారంగా మాట్లాడగలగడం, బావుకతతో పద్యాలు అల్లి చెప్పగలగడం, ముఖ్యంగా స్త్రీ మనస్సు స్పందించేటట్టు ప్రవర్తించే శక్తి అపారంగా వున్నాయి.
ఆమె అతన్ని గాఢంగా ప్రేమించేసింది. ప్రేమరాహిత్యంలో పడి కొట్టుకుపోతున్న ఆమెకి, భగవంతుడు తనకిచ్చిన వరంలా అతను కనిపించాడు!
'నా శరీరాన్ని నా భర్తకోసం దాచి పెట్టి, నా మనస్సు మాత్రం నీకిస్తాను' అనే స్వార్ధం ఆమె అతనిపట్ల చూపించలేకపోయింది.
ఆమె మొదటిసారి అతను దగ్గరకు తీసుకుంటూ వుంటే, ప్రతిఘటించలేదు. పైగా సహకరించింది. ఆమె అందాన్ని సంపూర్ణంగా....మనస్పూర్తిగా అతనికి అందించింది.
నాలుగుసార్లు బలవంతం చేయించుకుని, ఐదోసారి ఒప్పుకోవడం ఆమెకి ఇష్టంలేదు. ఎందుకంటే.... ఆమె నిజంగా....నిజాయితీగా...అతన్ని ప్రేమించింది కాబట్టి.
* * *
జగన్మోహనరావు ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా ఎప్పటిలాగే నిశ్శబ్దంగా వుంది.
అమ్మగారు లేరా?" ఎదురొచ్చిన పనిమనిషిని అడిగాడు.
"లేరు బాబూ!" పనివాలలు ఎంతవరకూ అవసరమో అంత వరకే మాట్లాడతారు ఆ ఇంట్లో. కానే అందుకు విరుద్దంగా ఆమె, "అమ్మగారు చాలా కోపంగా వెళ్ళారు. వెళ్ళి చాలాసేపయింది కూడా. నాకు ఏమిటో భయంగా వుంది బాబూ!" అంది.
"ఆమె గురించి భయపడడం మన అవివేకం" ఆయన గొంతు కసిగా పలికింది.
ఆ రాత్రి చాలా ఆలస్యంగా ఇల్లు చేరింది అహల్య.
జగన్మోహనరావు అప్పటిదాకా మేలుకునే వున్నాడు. దాదాపు తెల్లవారేదాకా వాళ్ళ మధ్య గొడవ జరుగుతూనే వుండడం, క్రింద పనివాళ్ళకి లీలగా వినిపిస్తూనే వుంది.
* * *
జగన్మోహనరావు మధ్యాహ్న సమయంలో అంత హడావుడిగా, జేవురించిన మొహంతో రావడం చూసి, పనివాళ్ళు హడలిపోయారు.
ఆ సమయంలో అహల్య పైన బెడ్ రూంలో వుంటుందని అతనికి తెలుసు. సరాసరి విసురుగా పైకి వెళ్ళాడు.
అహల్య తన వంటి రంగుతో పోటీపడే క్రీమ్ కలర్ సిల్క్ చీర కట్టుకుని, అద్దం ముందు కూర్చుని వుంది. జుట్టుని పాయలుగా చేసి, ముందుకి వేసుకుని, దువ్వుకుంటున్నదల్లా, అద్దంలో కనిపించిన భర్త మొహాన్ని చూసి, ఆశ్చర్యంగా వెనుతిరిగి చూసింది.
ఎప్పుడో కానీ అతను ఆమె గదిలోకి రాడు! ఆ అవసరం లేనట్టుగా సంచరిస్తాడు!
జగన్మోహనరావు మొదటిసారిగా భార్య అందాన్ని గమనిస్తున్నట్టు నిశితంగా చూడసాగాడు.
'చెక్కుటద్దాలు' అంటే అవేనేమో! ఆమె చెక్కిళ్ళలో ఎదుటివారి ప్రతిబింబం కనిపిస్తుందా! అన్నంత నున్నగా, పలచగా వున్నాయి. ఆ కళ్ళు కాంతిపుంజాల్లా, వాటిమీద కనుబొమలు మన్మధుడు ఎక్కుపెట్టిన విల్లులా వున్నాయి. తీరైన ముక్కూ, లేత తమలపాకుల లాంటి పెదవులూ, ముఖ్యంగా ఆమె అలా పక్కకి తిరిగి కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న భంగిమలో పాలరాతి శిల్పంలా వుంది. ఆ పక్కకి తిరగడంలో ఆమె నడుము వొంపులో పడిన ముడత, పాల సంద్రం మీద మీగడతరకలా వుంది!
"మైగాడ్! ఈమె నా భార్యా! ఈ వయసులో కూడా ఇంత అందమా?" అనుకున్నాడతను.
ఆమె వెనకనున్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిరూపం తనని పరిహసిస్తున్నట్టు అనిపించింది. ఆయన కళ్ళలో ఆమె అందాన్ని చూస్తున్న కొద్దీ అదోలాంటి కసి చోటుచేసుకుంది.
భర్త మాటా పలుకూ లేకుండా అలా చూస్తుండిపోవడం, ఆమెకూ ఆశ్చర్యం కలిగించింది. "ఏవిటీ?" అంది. ఆ అనడంలో చాలా నిర్లక్ష్యం, గర్వం ధ్వనించాయి.
అతను మాట్లాడకుండా వెనక్కి తిరిగి గది తలుపులు మూసి బోల్ట్ పెట్టాడు.
అతను చేస్తున్న పనిని గమనిస్తున్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు విస్మయంతో మరింతగా విప్పారాయి. అతను తన షర్ట్ పైకెత్తి ప్యాంట్ కున్న బెల్ట్ తీశాడు.
జరుగుతున్నదాన్ని ఆమె జీర్ణం చేసుకునేలోపల ఆమె శరీరం మీద మొదటి దెబ్బ పడింది. సరిగ్గా....అక్కడే చీర కుచ్చెళ్ళకీ, జాకెట్టుకీ మధ్యనున్న అందమైన ప్రదేశంలో!


