Home » Kommuri venugopala rao » పెంకుటిల్లు


    సుగుణ తలవంచుకొని "చాల్లెండి" అంది.

    "చాలా రోజులు పేపరు చదవకుండా హఠాత్తుగా ఒకరోజు చదవితే ఈ ప్రపంచ రాజకీయాలు ఎంత గంద్రగోళ పరుస్తాయో, ఏదయినా ఒకరోజున కూర్చుని ఈ ఇంటి సాధక బాధకాలు తల్చుకుంటే అంత బాధ కలుగుతుంది. ఎప్పటికైనా ఈ ఇంట్లో వాళ్ళకి అశాంతినుండి విముక్తి వుందా? అనిపిస్తుంది.

    "అలా అనకండి" అంది సుగుణ.

    "భయంకరమైన మాటలు నే నేమన్నాను? మనం రోజూ చేస్తున్నాదే. కూర్చుని తల్చుకుంటే భయమేస్తుంది అంతే."

    "మీ ధోరణి మానరా ఏమిటి?"

    నారాయణ తన ధోరణి మానకుండా "చూడు. నాకు జ్యోతిష్యం తెలీదు. అయినా, ఈ కుటుంబం భవిష్యత్తు అవలీలగా చెప్పగలను. ఎన్నో సంవత్సరాలక్కర్లేదు. రెండు మూడు సంవత్సరాల్లో ఈ కుటుంబంలోని మనుష్యులగతి అల్లకల్లోలం అయిపోతుంది. కొందరు చచ్చిపోతారు. కొందరు దేశాలపాలయిపోతారు. కొందరు అడుక్కుని తింటారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. ఏ రోజుకి ఆ రోజు తిండి విషయం ఒక సమస్య. మొగవాళ్ళకి మాత్రం ఇంతవరకూ లేదనకుండా వేలకింత పెడుతున్నారు. ఆడవాళ్ళు ఏం తింటున్నారో ఏమిటో అగమ్యగోచరం. నాకు తెలుసు, కొన్ని రోజుల్లో నే ననుకున్నంతా జరుగుతుంది. ఎందుకు పెళ్ళి చేసుకున్నావు సుగుణా." అని గడ గడ అనేస్తూ వుంటే సుగుణ తన చేత్తో అతని నోరు మూసింది.

    "ఎందుకలాంటిమాట లంటారు? మీతోపాటే నేనూ."

    "చిన్నతనంనుంచీ సుకుమారంగా పెరిగినదానివి మాతోపాటు నువ్వూ ఎలా ఒకటి అవగలవు? అవన్నీ చూసి నీకు చీదరింపు కలగటం లేదూ"

    సుగుణ అతని వంక కోపంగా చూసింది. ఆమె నేత్రాల్లో నీరు చిమ్ముతున్న సంగతి అతను గ్రహించి చకితుడవక ముందే "నన్ను చూస్తే మీ అందరికీ అలా ఎందుకు అనిపిస్తుంది? మీతోపాటు అనుభవించటానికి నేను తగనా? మొన్న రాధ ఈ మాటే అంది. నన్నే మీరు భేద భావంతో చూస్తున్నారనటానికి ఈ నిదర్శనం చాలదా?" అంది.

    నారాయణ ఏదో చెప్పబోయి ఆమె ముఖంవంక చూసి ఆగిపోయాడు.

    "చూడండి నేను పొరబాటున మన అనకుండా 'మీ' అనే మాటను ఉపయోగించినందుకు మీరు చాలా చిన్నబుచ్చుకున్నారు! నన్ను మీతో కలుపుకోకుండా ప్రతిదానికీ పరాయిదాన్నయినట్లు చూస్తే నేనెంత చిన్నబుచ్చుకోవాలి? రాధతో మొన్న ఈ మాటే అన్నాను. ఆమె కూడా మీలాగే మాట్లాడింది. ఇహముందు అలా వద్దన్నాను. మీతోకూడా చెప్పేది అదే."

    నారాయణ జవాబు చెప్పకుండా అక్కడ పడివున్న పాత పత్రికలోంచి చిన్న కాగితం చింపి దానిమీద పెన్సిలుతో ఏదో రాసి ఆమె కళ్ళముందు వుంచాడు. ఆమె చదువుకుంది.

    తప్పయింది, క్షమించండి. ఇహముందు ఎప్పుడూ అనను."

    ఆమె పెదాలమీద చిరుహాసం ఉదయించింది. "పోండి" అని సిగ్గుతో క్రీగంటి చూపులు చూస్తూ "మీరిప్పుడే పడుకోరా?" అంది.

    "దీన్ని కాస్త మరమ్మత్తు చేసివస్తాను."

    సుగుణ వెళ్ళి పడుకొని సంతోషం వెల్లివిరిసి పోతున్న ముఖంతో అతన్ని గమనించసాగింది. అతను తలవంచుకొని దీక్షగా "ఈ యింట్లో ఒక భాగము అద్దెకు ఈయబడును." అని బాగా కనిపించేటట్లు రంగు పూయసాగాడు.


                                                         21

    పరీక్షలకు ప్రకాశరావు బాగా చదవలేకపోయాడు. అతనికి సావకాశం ఎక్కడిదీ? ఏదో ఒక కొత్త యోచనతో, తల బ్రద్దలయిపోతూ వున్నదాయె! పెళ్ళికి వెళ్ళి ఈ వూరు వచ్చిన వారంరోజులదాకా పుస్తకం ముట్టుకునేందుకు వీలుపడలేదు. ఎంతసేపూ శకుంతలని సంతోషపరచటానికి ప్రయత్నించటంలోనే కాలం అంతా సరిపోయేది. తరువాత తరువాత ఆమె యితన్ని చదువుకోమని మందలించసాగింది. ఒక రాత్రి ఎనిమిది గంటలకు చదువుకోవటానికి మనస్సుపోక ఆమె దగ్గరకు పోయి పేకాడుకుందాం రండని పిలిస్తే ఆమె కోపగించుకుంది కూడాను. అంతకు ముందు నుంచీ యింట్లోవున్న పేక ఆవేళనుంచీ కనిపించటం మానేసింది. వెనుకటి ఫిడేలు అనుభవం జ్ఞాపకం వచ్చీ బహుశా ముక్కలు ముక్కలుగా చింపి వీధిలో పారవేసిందనో, పొయ్యిలో పెట్టిందనో అనుకుని వూరుకున్నాడు. ప్రకాశరావు సాధ్యమైనంత వరకూ  శ్రద్ధగానే చదువుదామని ప్రయత్నించాడు. కాని ఏదో  ఒకటి గుర్తుకు వచ్చి అతని ధ్యానానికి భంగం కలుగజేస్తూ వుండేది. ఒక రోజున అతను బజారున వస్తూంటే అతని బాబాయి  కనిపించి ఆపాడు. "నీ కింకా బుద్ధిరాలేదు" అన్నాడు. "మరీ మీ యింటికి రావడం ఖాయం" అని భయపెట్టాడు. మామూలు పరిస్థితిలో వుంటే ప్రకాశరావు ఏమనేవాడో! బహుశా జవాబు చెప్పకుండా మౌనం ధరించేవాడు. కాని అప్పుడు పరీక్ష పాడుచేశానని విచారపడుతూ యింటికి వస్తున్నాడు. నడిబజార్లో యిలా అతనిని చిన్నపిల్లాడిలా మందలిస్తూంటే అతనికి కోపం వచ్చింది. "నీ యిష్టం వచ్చినట్లు చేసుకో బాబాయి. నా శ్రేయస్సు యిందులో కావాల్సివచ్చిందేం!" అని రెండు  దులిపేసి అక్కడ్నుంచి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక రాత్రి పడుకున్నప్పుడు తన దుడుకుతనానికి భయపడి బాధపడ్డాడు. "ఆయన నిజంగా యింటికి రాస్తే?"

    ఈ రోజు ప్రకాశరావు సాయంత్రం డాబాపై ఒక కుర్చీ వేసుకుని కూర్చుని సరదాగా వుండటం కోసం స్టాన్లీగార్డినర్ డిటెక్టివ్ నవల ఒకటి చదువుకోసాగాడు. అతనికి వినిపించలేదు. మూడోసారి ఆమె గట్టిగా "పంతులుగారూ!" అని పిలిచేసరికి ఉలుక్కుపడి చూసి "మీరా?" అన్నాడు.

    తను చేసిన పనికి ఆమె మరుక్షణంలో నొచ్చుకుంటూ "మీ నిష్ఠకు భంగం చేశానే!" అంది.

    దీనికి ప్రకాశరావు జవాబు చెబుతూ "ఒక్క చదువు విషయంలోనే ఏమిటి? ఇంకా చాలా వాటిల్లో నా  నిష్ఠకు  భంగం కలుగజేశారు" అన్నాడు.

    "నిజంగా?" అని శకుంతల ఆశ్చర్యంగా ప్రశ్నించింది.

    "నిజంగా."

    అతను ఆమె ముఖ కవళికలు పరిశీలిస్తున్నాడు. ఎటొచ్చీ కొద్ది రోజుల్నుంచీ ఆమె ఎప్పటిలాగా సంతోషంగా ఉండసాగింది. అందులో ఎక్కువగా శ్రమ తనదే ఐనా ఎప్పుడయినా హఠాత్తుగా తండ్రి గుర్తుకు వచ్చినప్పుడు ఆమె ముఖం, చంద్రుని చూడని కలువపూవులా ముకుళించుకుపోతుంది.

    కొంచెం వుండి మీరంకా ఎన్నాళ్ళిక్కడ వుంటారు?" అని ఆమె ప్రశ్నించింది.

    "వెళ్ళిపో మంటారేమిటి, చెప్పండి" అని ప్రకాశరావు వెంటనే జవాబు చెప్పేశాడు.

    ఆమె కొంచెం దెబ్బతిని "ఆ మాట ఎవరన్నారు? నేనే వెళ్ళిపోదామనీ" అంది.

    "ఎక్కడికి?"

    "నాకు కొంతకాలం దేశ సంచారం చేయాలని వుంది."

    "అప్పుడేనా?"

    "అంటే?"

    "ఇంత చిన్న వయస్సులోనే?"

    "ఏం , వయస్సుకూ, ఊళ్ళు తిరగటానికీ ఏమయినా సంబంధం వుందా ఏమిటి?"

    ఆమెలో తండ్రిపోయిన విచారం తాలూకు ఛాయలు ఇంకా అంతరించి పోలేదని అతను గ్రహించాడు. ఆ కారణంచేత ఆమెకు అటువంటి కోరిక ఉద్భవించిందని అతననుకున్నాడు.

    "మీకు భయం పోయిందా." అని ఆకస్మికంగా అడిగాడు.

    "ఏ భయం?"

    ఆమె ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా "ఏమో బాబూ! మీకు తోడుగా పడుకోటానికి మీ వెంట దేశాలు రమ్మంటే నేను రాలేను" అన్నాడు.

    ఆమె గ్రహించి సిగ్గుతో నవ్వింది. అతను బయటికి నవ్వాడు గాని ఆమె నోటినుంచి ఈ మాట విన్నప్పటినుంచీ మనసంతా కలచివేసినట్లయింది. ఆమెకూ తనకూ ఏమీ  సంబంధం లేకపోవచ్చుగాని ఏవో భావాలు బంధాలులాగా పెనవేసుకుని ఆమెను తననుండి వేరుచేయకుండా వున్నాయి. పరీక్షలయిపోయాయి. ఇహ ఇంటికి పోవాలి. ఎలాగ? శకుంతలని విడిచిపోవాలి. ఆమెను వంటరిగా విడిచి వెడితే ఎలాగో అతనికి అర్థంకావటం లేదు. రామారావుగారు పోతూ పోతూ ఆమె బాధ్యతనంతా తన పైనవేసి పోయారు. కాని శాశ్వతంగా ఈమెని ఏమిటి చేయాలి అన్న విషయం గురించి యివాలిటి వరకూ ఆలోచించలేదు. అప్పుడు ఆలోచనకు ఒక అంతం వుండేటట్లు కనబడలేదు.

    ఆమె వంక పరిశీలనగా చూచాడు. ఈసారి ఒక నూతన దృష్టితో చూశాడు. "ఈమె ఎలా వుంది?" అని చూశాడు. ఆరోగ్యవంతులైన పిల్లలు ఆ వయస్సులో ఎలా వుంటారో అలా వుంది. అతి అలంకరణ ఏమీ లేకుండా నాజూకుగా  వుంది. సహజ సౌందర్యంతో ఆమె అతన్ని ఆకర్షించింది.

    ఇతని చూపులకు ఆమె సిగ్గుపడి చూపులు మరల్చుకొని పట్టగోడ మీదుగా బయటకు చూస్తున్నట్లు నటించింది. కాని అలా యెక్కువ సేపు చేయలేక అతను ఇంకా అలానే  చూస్తున్నాడా? లేదా? అనుకుంటూ ఓరగా అతనివంక చూడబోతూ దొరికి పోయింది. ప్రకాశరావుకి నవ్వు వచ్చింది. అప్పుడతనికి జ్ఞానోదయం అయినట్లుగా వుంది. చప్పునలేచి, చెప్పా పెట్టకుండా మెట్లుదిగి క్రిందికి వస్తూ "శకుంతల పెళ్ళిచేస్తే?" అనుకున్నాడు. ఈ ప్రశ్న అతనిలో వెయ్యిసార్లు ధ్వనించింది. "పెళ్ళిచేస్తే? శకుంతల పెళ్ళిచేస్తే?"

    తను బాధపడుతున్నానని తెలియకుండానే అతను బాధపడసాగాడు. రామారావుగారు పోయి మూడు నెలలు దాటింది. ఇంతవరకూ ఆమె పెళ్ళి విషయం తనకు తట్టలేదు. రామరావుగారు చివరిసారిగ అన్నమాటలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి. బాధ్యత! అంటే ఏమిటి? ఆమె పెళ్ళి చేసే బాధ్యతయేనా? మంచి వరుడ్ని చూసి ఆమెకు.....

    తరచినకొద్దీ ప్రకాశరావు బాధ, అసూయ, క్రోధం -వీటన్నిటితో కూడిన కొత్తరకం అనుభూతులు పొందసాగాడు. తన చేతులు మీదుగా ఆమెకు పెళ్ళి- అనగానే అతనెందుకో కంపించ నారంభించాడు.

    కాని తను యిక్కడ యెక్కువ కాలం  వుండలేడు. తన యింటికి పోవాలి. పరీక్షలయి ఇప్పటికే వారంరోజులు దాటింది. త్వరగా వెళ్ళకపోతే వాళ్ళు అనేక విధాల అపోహపడిపోతారు. తనకీ వెళ్ళిపోవాలనే వుంది. వాళ్ళతోపాటు కష్టాలు అనుభవించాలనే వుంది. ఈలోగా శకుంతల విషయంలో ఒక నిర్ణయానికి రావాలి.

    అతను హాల్లో అటూ యిటూ తిరుగుతూ యోచించసాగాడు. అప్పుడే చిన్నగా చీకటి పడుతోంది. అంతలో బజారులో ఏదో పని చేసుకుని వచ్చిన రంగయ్య లైటు వేసి ఇతన్ని చూస్తూ" చీకటిలో వున్నారా బాబూ!" అనడిగాడు.

    "ఏమీ లేదులే" అని ప్రకాశరావు బయటకు వెళ్ళిపోబోయాడు. కాని మళ్ళీ ఏదో స్ఫురించి ఆగిపోయాడు. రంగయ్య చిన్నతనం నుంచీ శకుంతలని పెంచాడు. ఆమె మంచి చెడ్డలు అతనికి బాగా తెలుసు. ఈ విషయంలో అతని సలహా తీసుకుంటే?

    వెనక్కి తిరిగివచ్చి "రంగయ్యా?" అని పిలిచాడు.

    "ఏమిటి బాబూ!"

    "నీతో కాస్త మాట్లాడాలోయ్."

    "చెప్పండి."

    "ఇక్కడకాడు, గదిలోకి పోదాం రా."

    ప్రకాశరావు గదిలోకిపోయి కుర్చీలో కూర్చున్నాడు. "గది తలుపులు దగ్గరగా వేసివచ్చి "నువ్వూ కూచో" అన్నాడు. రంగయ్య అలాగే వేసివచ్చి దగ్గర్లో కూర్చున్నాడు.

    "మా పరీక్షలు అయిపోయినాయి. నేనింకా మా వూరు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలోగా యిక్కడ కొన్ని పనులు చూసి పోవాలనుకుంటున్నాను."

    రంగయ్య మాట్లాడలేదు.

    "రామారావుగారు పోతూ శకుంతల బాధ్యత నామీద వుంచారు కదా?"

    రంగయ్య తల వూపాడు.

    "నేను బాధ్యత నిర్వర్తించుకోవాలనుకుంటున్నాను."

    రంగయ్య ప్రశ్నార్థకంగా చూశాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra