Previous Page Next Page 
13... 14.... 15 పేజి 37


    ఇన్ స్పెక్టర్  భైరవమూర్తి టేబిల్ లోంచి చిన్న టేప్ రికార్డర్ తీసాడు. క్యాసెట్  సైజులో వుందది. దాన్ని ఆమెకు అందిస్తూ "దీన్ని వుపయోగించండి" అన్నాడు. ఆమె దాన్ని అందుకుని లేస్తూ, "థ్యాంక్సండీ! ఇలాటి కేసులు మీరు టేకప్ చేస్తారో లేదో అని భయపడ్డాను. మీరన్నట్టు......ఇందులో ఏ సాక్ష్యాలూ దొరక్కపోవచ్చు. కానీ పోలీసు వ్యవస్థమీద నాకున్న నమ్మకాన్ని బలపర్చారు" అని వెళ్ళబోయింది.

    "మనుష్యులమీద  నీకున్న నమ్మకం పోకుండుగాక!" మనసులోనే అనుకున్నాడు భైరవమూర్తి.....ఆమె వెళ్తున్న వైపే చూస్తూ.


                                                                  *    *    *

    ఆమె అందించిన రిపోర్టులన్నీ పరీక్షించాడు డాక్టర్ విశాల్. అవన్నీ బోగస్ రిపోర్టులు. ప్రహసిత్ తయారు చేయించి ఇచ్చినవి.

    మధూహ మొదట్లో భయపడింది. కానీ డాక్టర్ విశాల్ ఆమెని గుర్తుపట్టినట్టు కనిపించలేదు.

    "మీభర్త తాలూకు రిపోర్టులు పరిశీలించాను. అందులో ఏలోటూ కనిపించలేదు. మీలో కూడా ఏలోపమూ లేదు"

    "కానీ మా వివాహం జరిగి అయిదేళ్ళు అయింది. పిల్లలు కలుగలేదు."

    "మీ డేట్స్ ఎప్పుడు?"

    ఆమె చెప్పింది.

    "మీరు 13.....14.....15రోజుల్లో రండి. అండం పరిపక్వమయ్యే రోజులవి. అప్పుడు డి అండ్ సి చేస్తాను."

    ఆమె కాస్త తటపటాయించి, "డి అండ్ సి కీ పిల్లలకీ సంబంధం వుందా డాక్టర్" అంది. "ఎందుకంటే, రెండు సంవత్సరాలక్రితం  ఒకడాక్టరు మా ఆయన రిపోర్టులు పరిశీలించి, పిల్లలు కలగటం కష్టం అని చెప్పారు."

    "మీరు అటువంటి అనుమానలేమీ పెట్టుకోకండి. నామీద నమ్మకం వుంచండి. డాక్టర్ విశాల్  క్లినిక్ లో చేరిన తరువాత పిల్లలు కలుగక పోవటమంటూ వుండదు. మీకు అబ్బాయి పుడితే విశాల్ అని  పేరు పెట్టుకోవాలి సుమా"నవ్వేడు.

    "ఆమ్మాయి పుడితే విశాలి అని కూడా పెట్టుకుంటాము.  ఇన్నాళ్ళకి మాకో వెలుగురేఖ కనపడింది. మీఫోటో కూడా బెడ్ రూమ్ లో పెట్టుకుంటాము. ఇన్నాళ్ళకి మాకో జ్యోతి వెలిగించబోతున్నారు. ఎల్లుండే నా పదమూడోరోజు. ఎల్లుండి వస్తాను" అంటూ లేచింది.

    ఆమె వెళ్ళిపోయాక విశాల్ రాజుకి ఫోన్ చేసాడు. "ఇప్పుడే ఒక కేసు వచ్చింది. ఎల్లుండి రమ్మన్నాను. నువ్వు వస్తావా?" అని.

    "వస్తాను. అయితే ఎల్లుండినుంచీ నేను వుద్యోగంలో చేరుతున్నట్టేగా." "చేరుతున్నట్టే. మొదటి కేసు ఇదే."

    భైరవమూర్తి ఆమెకు ఒక చిన్న స్విచ్ లాటిది ఇచ్చాడు. "ఏదన్నా అపాయం అనిపిస్తే ఈబెల్ నొక్కు నేను క్లినిక్ బయటవుంటాను. టేప్ లో ఈ సంభాషణ అంతా రికార్డు చేయటం మర్చిపోకు....."

    ఆమె అక్కణ్ణుంచి బయల్దేరి విశాల్  క్లినిక్ కి వచ్చింది.

    భైరవమూర్తి మోటార్సైకిల్ మీద ఆమె  వెనుకే బయల్దేరాడు.

    ఆమె గుండె వేగంగా కొట్టుకొంటోంది. వణుకుతూన్న కాళ్ళతో క్లినిక్ లోకి అడుగుపెట్టింది. భైరవమూర్తి వీధి మొదట్లో ఆగిపోయాడు.

    ఆమెకు భయం వేసింది. అయితే ఆ భయం.....తనకేమయినా జరుగుతుందనికాదు. ఇంత చేసినా విశాల్ కి కోర్టులో శిక్ష పడదేమోనని! ఏ సాక్ష్యమూ దొరకదేమోనని.....

    అసలు ఇప్పుడేం జరుగుతుంది?

    ......నర్సు ఆమె బట్టలు  తీస్తుండగా  కూడా ఇదే ఆలోచన. ఆమెకి గౌను తొడిగింది నర్సు. నిర్వికారంగా తన పనులు చేసుకుపోతోంది. ప్యూబిక్ హేర్ తీసేసింది. ఆపరేషన్ టేబిల్ మీద పడుకోబెట్టింది.

    అప్పుడు ప్రవేశించాడు డాక్టర్ విశాల్. చేతులకి గ్లవుస్ తొడుక్కుని వున్నాడు. మదూహని చూసి పలకరింపుగా నవ్వేడు.

    ఆమె మోచేతి దగ్గిర పట్టుకుని ఐ.వి. ఇంజెక్షన్ ఇవ్వటం ప్రారంభించాడు. "ఏమిటది డాక్టర్?" మామూలుగా అడిగినట్టు అడిగింది.

    "కంపోజ్"

    మధూహపై ఆకాశం విరిగిపడినట్టు అయింది.

    కం....పో....జ్.

    అంటే.....తను కొద్దిక్షణాల్లో మత్తులోకి జారిపోబోతోంది. తరువాత ఏం జరిగిందీ తనకి తెలీదు! నర్సుకి తెలియకుండా ప్లాస్టిక్ కవర్ క్రింద దాచిన స్విచ్ నొక్కలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా....రికార్డు చేయటానికి సంభాషణేమీ వుండదు. ప్రాణాలకు తెగించి ఇంత చేసిందీ వృథా అయిపోతోంది......

    ఆమె తలవాల్చేసింది.

    "ఇంకో ఇంజెక్షన్ అవసరం లేదులే" ఆమెనే పరీక్షగా చూస్తున్న విశాల్ అన్నాడు. నర్సు వెళ్ళిపోయింది.

    డి అండ్ సి ఆపరేషన్ కోసం ఆమెకాళ్ళు పైకి మడతపెట్టి, గౌను పైకి లాగాడు విశాల్. చేతిలోకి సిరెంజి తీసుకున్నాడు. అది మామూలు సిరెంజి కాదు. వెటర్నరీ సిరెంజిలా వుంది. సూది లేదు. దాని స్థానే పొడవాటి  సన్నటి  గొట్టం వుంది. ఒక చిన్నసైజు పిచికారీలా వుంది.

    మధూహ మనసుతో  పారాడుతోంది. మనిషి మత్తులోకి జారుకోవటానికి ఒక ఇంజెక్షన్ చాలు. అది చాలకపోతే రెండోది ఇస్తారు. ఆ విషయం మధూహకి తెలుసు. అందుకే మొదటి దానికే తలవాల్చేసింది. నిద్రకమ్మేస్తుంది.

    ఆమె మనసుతో తీవ్రంగా పోరాడుతోంది. మైకం కమ్మకుండా వుండటంకోసం నరాల్తో ఘర్షిస్తోంది! "నాకు నిద్ర రాకూడదు. మైకం కమ్మకూడదు" అని పదే పదే  అనుకుంటోంది.

    అంత విపత్కర పరిస్థితిలోనూ ఆమెకు నవ్వొచ్చింది. ఏ హిప్నాటిజానికి వ్యతిరేకంగా ఇంతకాలం పోరాడుతూ వచ్చిందో, ఇప్పుడు దాన్నే  ఆశ్రయిస్తోంది! సెల్ఫ్  హిప్నాటిజం ద్వారా భౌతికమైన శారీరక అవస్థను అధిగమించటానికి ప్రయత్నిస్తోంది!!

    హిప్నాటిజం!!!...... అదెప్పుడూ గొప్పదే. కానీ దాని సాయంతో అన్నీ రోగాల్నీ నయంచేస్తామనే మోసగాళ్ళ చేతిలోపడి, అస్తిత్వం కోల్పోతోంది!

    ఇంతలో బాత్ రూమ్ తలుపు చప్పుడయింది.

    ఆపరేషన్ థియేటర్ ని  అనుకునివున్న బాత్ రూమ్ లోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. మధూహ కళ్ళు మూసుకుపోతున్నాయి. బలవంతం మీద కళ్ళు విప్పి అతడిని చూడటానికి ప్రయత్నించింది. కళ్ళముందు మసగ్గావున్న అతడిరూపు క్రమంగా స్పష్టం కాసాగింది!

    రాజు!!

    అతడు రాజు!!!

    ఈ పరిణామాన్ని ఆమె వూహించలేదు.

    రాజు ఆమెని గమనించలేదు. పేషెంటు ఎవరయినదీ తనకి సంబంధం లేనట్టు డాక్టర్ విశాల్ కి  తన చేతిలో గిన్నె అందించాడు. విశాల్ ఆ గిన్నెలో ద్రవాన్ని  సిరెంజిలోకి ఎక్కిస్తున్నాడు. రాజు అలిసిపోయినట్టు వున్నాడు. బాత్ రూమ్లోంచి రావటం వలన చొక్కా తడిసిపోయింది.

    రాజు లోపల్నుంచి తీసుకొచ్చిందేమిటో ఆమెకి అర్థమైంది.

    స్పెర్మ్!!

    అతడి వీర్యం!!!

    13...14....15 రహస్యం ఆమెకి అర్థమైపోయింది.

    స్త్రీ అండం పరిపక్వమైన దశలో, 13....14....15రోజుల్లో కలుసుకోవటానికి డాక్టర్ విశాల్ ఎందుకు రమ్మంటాడో తెలిసింది. డాక్టర్ విశాల్ క్లినిక్ లో యాభైశాతం స్త్రీలు ఎలా  గర్భవతులవగల్గుతున్నారో అవగాహనకొచ్చింది. భర్తస్పెర్మ్ ని ఇంటి వద్దనుంచి తీసుకురమ్మనిచెప్పి, దాన్ని పారబోసి, తన కంపౌండర్ వీర్యాన్ని ఎక్కిస్తున్నాడని కూడా అర్థమైంది. లేదా తన క్లినిక్ లోనే "పరీక్ష" పేరుతో (డి అండ్ సి) చేస్తున్న మోసం బహిర్గతమైంది.

    ఈలోపులో డాక్టర్ విశాల్ సిరెంజి పట్టుకుని ఆమెవైపు తిరిగాడు. అప్పటికే ఆమె కాళ్ళు మామూలుగా  జరుపుకుని, కాళ్ళు క్రిందికి జార్చేసింది.

    ఆమె పడుకున్న భంగిమలో మార్పురావటం చూసి అతడు రాజుతో, "ఈమెని సరిగ్గా సర్దు" అన్నాడు. విశాల్ వెనుకనుంచి ముందుకొచ్చిన రాజు ఆమెను చూసి సన్నగా కేక పెట్టాడు. "ఈమె.....ఈమె.....నాక్కాబోయే భార్య"

    విశాల్ మొహం చిట్లించి, "ఏమిటి?" అన్నాడు అర్థం కానట్టు.

    క్లినిక్ కి వచ్చినప్పటినుంచి మధూహ.... తన దగ్గిరున్న టేప్ రికార్డర్ అన్ చేసే వుంచింది. విశాల్ రాజుతో అంటున్నాడు.... "ఈమె డేంజరస్ అని నీకారోజే చెప్పాను. వినలేదు నువ్వు. తనకి పెళ్ళయి అయిదేళ్ళు అయిందనీ, పిల్లలు పుట్టలేదని చెప్పింది."

    "ఏం సాధిద్దామని చెప్పి వుంటుంది?"

    "ఇక్కడ జరిగేదేమితో తెలుసుకోవటం కోసం" అన్నాడు డాక్టర్. "......మనం కంపోజ్ ఇంజెక్షన్ ఇస్తామని వూహించివుండదు బహుశ. అయినా ఈమె  చాలా ప్రమాదకరమైన వ్యక్తి రాజూ. ఎలాగయినా వదిలించుకో."

    "అవును. ఇప్పుడు వదిలించుకోక తప్పదు. నా కళ్ళు పోయినప్పుడు ఎవరో ఒకరు ఆసరా కావాలనిపించింది. ఉద్యోగం కూడా లేదు. అందుకని ఈవిడమీద ఆదారపడవలసి వచ్చింది."

    మధూహకి లోపల్నుంచి దుఃఖం తన్నుకువస్తూంది. మనుష్యులపట్ల ఆమె పెంచుకున్న నమ్మకాన్ని సమూలంగా నాశనం చేస్తున్నాడు ఆమె ప్రియుడు. మనిషిలో ఇంత అవకాశవాదం, కృత్రిమత్వం వుంటుందని మొదటిసారి తెలుసుకొంటోంది! ఇతడే ఒకప్పుడు అంధుడై.....తనఒళ్ళో పడుకుని "నువ్వు లేకపోతే నాకు దిక్కెవరూ?" అంటూ విలపించాడు.  ఇప్పుడు తన దుఃఖం.....అతడు మోసం చేసినందుకుకాదు. అంత అమాయకంగా తను రెండుసార్లు మోసపోయినందుకు.

    "కానీ తనకి ప్రెగ్నెన్సీ అన్న అనుమానమని చెప్పిందే....." రాజు సాలోచనగా మధూహవైపు చూస్తూ అన్నాడు.

    "బహూవ నిన్ను ట్రాప్ చేయటానికి చెప్పివుంటుంది"

    మధూహ.....బయటవున్న  ఇన్ స్పెక్టర్ కి సూచనలిస్తున్నట్టు కాలింగ్ బెల్ కొట్టింది. ఆమె కళ్ళు విప్పటం మొదటగా చూసినవాడు రాజు. అంతసేపూ  మత్తులోనే వుందనుకున్నాడు ".....ఏమిటిది?" గద్దించాడు.

    మధూహ జీవంలోని నవ్వుతో, "....ఇంతకాలం మీరు చేస్తున్న మోసం ఏమిటో తెలుసుకోవటానికి చేసిన ఆఖరి ప్రయత్నం" అంది. ".......భార్యాభర్తల్ని పూర్తి పరీక్షలు చేయకుండానే కేవలం 13... 14.... 15 రోజుల్లో రమ్మని ఎలా సంతానవంతుల్ని చేస్తారో తెలుసుకున్నాను....."

    డాక్టర్ విశాల్ బిగ్గరగా నవ్వేడు. "అవును. మేం చేసేది అదే. రకరకాల పరీక్షలకీ, రిపోర్ట్ లకీ వేలకి వేలు ఖర్చవుతాయి. ఛాన్సు పాతికశాతం కూడా  వుండదు. మా పద్ధతిలో భార్యభర్తలకి అనుమానం రాదు. నా ఫోటోలు ఇళ్ళలో పెట్టుకుంటారు. చిన్న వీర్యం మార్పిడిలో ఎందరికో నేను దేవుణ్ణి అయ్యాను"

    "అవును. నీ కంపౌండర్లని వాళ్ళకి భర్తల్ని చేసి" కసిగా అన్నదే కానీ మధూహలో అలజడి మొదలైంది. ఇన్ స్పెక్టర్ ఇంకా రాలేదు. కారణం తెలీదు.

    "మధూ. ఈ విషయం ఇక్కడే మర్చిపో. నీ మంచి కోసమే చెపుతున్నాను" అన్నాడు రాజు హెచ్చరికగా.

    "మర్చిపోకపోతే?"

    "నన్ను వదులుకోవలసి వస్తుంది" కటువుగా అన్నాడు.

    "ఇంత జరిగాక నిన్ను వదలకుండా వుంటానని ఎలా అనుకున్నావ్ రాజూ? కళ్ళుపోయి అంధుడివైనప్పుడు నాకెందుకు చేరువయ్యావో..... డాక్టర్ విశాల్ తో చెపుతూండగా విన్నాను ఇప్పుడు నేను చెపుతున్నాను విను. ఇంకో అయిదునిముషాల్లో ఈ థియేటర్ నుంచి బయటకు వెళ్ళగానే నేను ప్రెస్ కాన్ఫరెన్స పెట్టి విశాల్ సంతానోత్పత్తి కేంద్రాల.... హిప్నాటిజం మోసాల్ని బయటపెట్టబోతున్నాను."    

 Previous Page Next Page