Previous Page Next Page 
రాక్షసుడు పేజి 35


    అతడు మాట్లాడలేదు. ఆమెవైపే చూస్తున్నాడు.

 

    భయమా?- ఈ శరీరంనిండా బుల్లెట్లు తూట్లు తూట్లుగా గుచ్చుకున్నా భయం వుండదు నాకు. రక్తం సెలయేళ్ళులా కారినా బాధవుండదు నాకు. కానీ రెడ్ టేపిజంతో నిండిపోయిన, బ్యూరోక్రసితో పుచ్చి పోయిన ఈ దేశాన్ని చూస్తూంటే రక్తం కన్నీరై ప్రవహిస్తోంది. లంచగొండితనం ఇటికలుగా, అధికారం సిమెంటుగా కట్టిన ఈ పదవి అనే భవంతిలో, రాజ్యాంగం గార్డుగా, న్యాయస్థానం బాడీ గార్డుగా నిలబడిన ఈ దేశం అనే బ్రోతల్ హవుస్ లో- స్వార్థం అనే పక్కమీద భారతమాత రేప్ చేయబడుతూ వుంటే మాత్రం కన్నులనీరు వెల్లువలవుతుంది.

 

    దూరంగా అలికిడి అయింది.

 

    జానకి బ్యాండేజి తెస్తున్నాడు. అది చూసి ఆమె బుల్లెట్ బయటికి తీయటానికి ప్రయత్నం మొదలు పెట్టింది. అతడు పళ్ళమధ్య బాధని నొక్కి పెట్టాడు. నరాలు నలిపేస్తూన్న బాధలో కూడా అతడు మామూలుగా వుండటాన్ని గమనించి ఆమె ఆశ్చర్యపోయింది.

 

    "నిజంగా నువ్వు విక్రమ్ సింగ్ అనుచరుడివేనా"

 

    "ఆహఁ"

 

    "ఇలా దొంగతనాలూ అవీ చేయటం తప్పుకదూ"

 

    "తప్పే"

 

    "మరెందుకు చెయ్యడం"

 

    "అయ్యేయస్ ఆఫీసర్లు ఆడవారిని అల్లరి చేయగా లేనిది మామూలు మనుష్యులు దొంగతనం చేస్తే తప్పేముంది?"

 

    ఆమె మాట్లాడలేదు. కట్టుకట్టడంలో నిమగ్నమైంది. నిజం చెపుదామా అనుకున్నాడు. అప్పుడే వద్దనిపించింది. వాళ్ళిద్దర్నీ చూస్తూంటే అతడికి ముచ్చటగా అనిపించింది. అతడి అండర్ వరల్డ్ ప్రపంచంలో తుపాకులు, బుల్లెట్లు, మాఫియా, గంజాయి, ఎత్తులు పైఎత్తులు తప్ప ఇలాటి అభిమానాలు కానరావు. ముఖ్యంగా ఆమెని చూస్తుంటే సముద్రంలోకి కృంగిపోతున్న సూర్యుడు గుర్తొస్తున్నాడు.

 

    ఆమె కాలిదగ్గర గాయాన్ని పరీక్షిస్తూంది.

 

    "నువ్వు ఎమ్.బి.బి.యస్. పూర్తిచేయక పోవటంవల్ల దేశం ఒక మంచి డాక్టర్ని- మంచి సర్జన్ని కోల్పోయింది" అన్నాడు. ఆమె సిగ్గుపడింది. ఆ సిగ్గులో అందం ముచ్చటగా వుంది.

 

    "కాలేజ్ లైఫ్, చదువు- అంతా మధ్యలో వదిలేసి రావటం నీకు అదోలా అనిపించటంలేదా?" సంభాషణ కొనసాగిస్తూ వుంటే, గాయం దగ్గిర కత్తి చేస్తున్న బాధ తెలియటంలేదు.

 

    "మొదట్లో అనిపించింది. కానీ ఒకసారి ఈ పల్లె వాతావరణానికి అలవాటుపడిన తర్వాత ఇదే చాలా బావున్నట్టు అనిపించింది. ముఖ్యంగా చిన్న పిల్లలు- వాళ్ళకి పాఠాలు చెప్పటం...."

 

    "ఇలాగే వుండిపోతావా?"

 

    "ఆహా"

 

    "పెళ్ళి?"

 

    ఆకుల మధ్యనుంచి పడుతున్న వెలుగులో ఆమె మొహం ఎర్రబడింది. జానకి నవ్వుతూ ఏదో అనబోయాడు. అంతలో ఆమె ప్రసక్తి మార్చటానికి అన్నట్టు రెండు బుల్లెట్స్ నీ ఒకచోట పెడుతూ "ఇవిగో రెండూ, జాగ్రత్తగా దాచుకో" అంది వెక్కిరిస్తున్నట్టు. "చిన్నప్పుడు కాలిలో ముల్లు గుచ్చుకుంటే తీసిన తర్వాత ఇలాగే దాచుకునేవాళ్ళం".

 

    "అవును. ఇరవై గంటలపాటు శరీరపు భాగాల్లో భాగంగా కలిసి వున్నాయి. దాచుకోకపోతే ఎలా?" లేవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

 

    జానకి ఒక వైపు సాయంపట్టాడు.

 

    అతడు లేస్తూంటే ఆమె దృష్టి అతడి చేతిమీద పడింది. అరచేతి క్రింద మోచేతి వరకూ నల్లగా కమిలిపోయి వుంది.

 

    "ఏమిటిది?" అని అడిగింది.

 

    "ఇదా" అన్నాడు చేతివంక చూసుకుంటూ. "...దీని వెనుక పెద్ద కథ వుంది".

 

    "ఏమిటో"  

 

    "చిన్నప్పుడు ఎప్పుడో పచ్చబొట్టు పొడిపించుకోవటానికి వెళ్ళాను. ముందు ద్రవం వ్రాశాడు. "ఏం పేరు చెక్కమంటావ్?" అని అడిగాడు. సాధారణంగా ఏ పేర్లు చెక్కించుకుంటారని అడిగాను. "నీ పేరు చెక్కించుకో" అన్నాడు నాకు పేరు లేదన్నాను. విచిత్రంగా చూశాడు. ఎవరూ పెట్టలేదన్నాను. "అయితే కొంతమంది తమకి చాలా దగ్గిరవాళ్ళ పేర్లుగానీ, ఆత్మీయుల పేర్లుగానీ చెక్కించుకుంటా"రని అన్నాడు. అలాటి వాళ్ళు కూడా లేరన్నాను. అయితే నీ ఖర్మ అని వదిలేశాడు. ఆ ద్రవం తుడవను కూడాలేదు. ఆ మచ్చ అలాగే వుండి పోయింది".

 

    "అయితే నీ తల్లెవరో నీకు తెలీదా?"

 

    "తెలీదు"

 

                                           11

 

    నాలుగు రోజులు గడిచాయి.

 

    అతడు వూరి చివర జానకితోపాటే వుంటున్నాడు. గాయాలు తగ్గుముఖం పట్టినయి. లేచి తిరుగుతున్నాడు. ఊళ్ళో ఎవరూ అతని గురించి పట్టించుకోలేదు. ఎవరికీ అంతగా తెలీదు కూడా. సుమతి మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతుంది.

 

    జానకికీ, అడవికీ చనువు పెరిగింది. చాలా కొత్త ప్రపంచం ఇది.

 

    పాకలో వుండటం.... చాపమీద పడుకోవటం.... అన్నిటికన్నా ముఖ్యంగా ఏ టెన్షనూ లేకుండా వుండటం.

 

    కానీ ఒక రోజు జానకి నిలదీశాడు. "ఎన్నాళ్ళు వుంటావిలా?"

 

    "ఎన్నాళ్ళయినా వుంటాను. ఏం? నీకేమైనా అభ్యంతరమా?"

 

    "అభ్యంతరమా? అదేంలేదు. కానీ చూడు- ఇవ్వాళ్టితో బియ్యం అయిపోయాయి. నిన్నటినుంచీ బొగ్గులు లేవు. నీకు తెలిసినదేకదా?"

 

    "అవును మరెలా?"


    
    జానకి వెక్కిరిస్తున్నట్టు- "అవును మరెలా?" అన్నాడు. "ప్రతిదానికీ డబ్బు కావాలి. ఈ మాత్రం తెలీదూ!"

 

    "అవునుకదూ! నాకు తెలీదు. అన్నట్టు మనకి ఎంత కావాలి?"

 

    "ఎంత లేదన్నా నెలకి వంద రూపాయలు కావాలి".

 Previous Page Next Page