Home » Yandamuri veerendranath » చీకట్లో సూర్యుడు


    "జరిగేది జరగక మానదు. ఈ రోజు కడుపునిండా భోజనం చేద్దాం.....రేపు వాళ్ళు మనల్నే లొట్టలు వేసుకుంటూ తినవచ్చు."

    "అలా మాట్లాడకు. వచ్చి ఇప్పుడే పట్టుకుపోయినా పోతారు." అన్నాడు నిఖిల్ నిర్లప్తతతో వ్యంగ్యంతో.

    "ఈ రోజు ఇక  రారు. వాళ్ళకు యింత ఆక్సిజన్ పడదు. అందులో వాయుపుత్ర మొత్తం గాలిలో ఆక్సిజన్ వదిలాడు. ఇక సంగీతం గొల. అసలు భరించలేరు" అంది బ్రహ్మవిద్య.

    "వీళ్ళ దగ్గర చివరి కోరికలు తీర్చే సంప్రదాయం వుందో లేదో" దిగులుగా అన్నాడు వాయుపుత్ర.

    "ఏం కావాలని అడుగుదామని?" అంది అనూహ్య.

    "ఈ  ఆల్ఫాగ్రహంలో అత్యంత సుందరితో ఓ రోజు గడపాలని."

    ఎప్పుడూ నవ్వని యశ్వంత్ కూడా ఆ మాటలకి నవ్వేడు.

    జడ్జీలనించి పిలుపు వచ్చేంతవరకూ అతడలా మాట్లాడుతూనే వున్నాడు.


                                        9

    "రెండు వైపుల వారి వాదనలు విన్నాక ఎన్ని విధాలుగా ఆలోచించినా మాకు ఆల్ఫాగ్రహవాసులు వాదనే సబబుగా కనిపిస్తుంది. తమలో తాము నిష్కారణంగా యుద్దాలు చేస్తూ, చంపుకుంటూ, తమపైన ఆధారపడి తమకు తాము నిష్కారణంగా యుద్దాలు చేస్తూ, చంపుకుంటూ, తమపైన ఆధారపడి తమకు సాయం చేస్తున్న జంతు జాలాన్ని నిర్దాక్షిణ్యంగా హింసించడం గమనించాక భూలోకవాసులకి బ్రతికివుండే అర్హత లేదు అనిపించింది. వాళ్ళు ఏ పవిత్రమైనా బుద్ధిజీవులూ కారు. వారి బుద్ధి బ్రతకటానికి కాక, మారణహోమం కోసం ఉపయోగపడుతూంది. వాళ్ళపట్ల ఏ విధమైన సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా కలగడంలేదు. కాబట్టి వాళ్ళ సూర్యుడి శక్తిని ఆల్ఫాగ్రహవాసులు వాడుకుంటానంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళకు అనుమతి యిస్తున్నాం."

    వాళ్ళ నిర్ణయం ముందుగానే వూహించుకున్నదే అయినా చాలా బాధకలిగించింది యశ్వంత్ కి. అనాలోచితంగా భూలోకవాసులు చేసే తప్పులకి సరైన శిక్షే పడుతున్నట్లనిపించింది. వంద సంవత్సరాలుగా అంతరిక్షవాసుల కోసం పరిశోధనలు చేయడం, అతికష్టంమీద  వాళ్ళను కనుక్కోవడం, ఆ వెంటనే వాళ్ళ దృష్టిలో అవినీతులుగా చిత్రించబడి శిక్ష పొందడం-మానవజాతి సిగ్గుపడాల్సిన విషయం.

    ఆల్ఫా గ్రహవాసులు సంతోషంతో గంతులు వేస్తున్నారు.

    ఉన్నట్టుండి ఆ సంబరాల మధ్య ఎక్కడనుంచో శబ్దం రాసాగింది. అది వెంటనే ఎవరూ పట్టించుకోలేదు. చిన్నగా విజిల్ లా ప్రారంభమయి, సంగీతంగా మారి స్టీరియోఫోనిక్ నించి శబ్ద తరంగాలుగా దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా మారుమ్రోగుతోంది. 'మాయాస్' ని ఎవరో కట్టేసినట్లు కదలడానికి కూడా శక్తిలేని వాళ్ళలా నిశ్చేష్టులై నిలబడి పోయారు. యశ్వంత్ ఫీడ్ చేసిన శబ్దాన్ని బ్రహ్మవిద్య రిపీట్ చేస్తోంది.

    అదంతా శూన్యం. శబ్దతరంగాలు వ్యాపించవు. మాటలు కూడా టెలీపతివల్లే కమ్యూనికేట్ అవుతాయి. కానీ ఈ తరంగాలు మాత్రం అద్భుతమయిన రీతిలో చుట్టూ వ్యాపిస్తున్నాయి.

    కొద్దిసేపట్లో అవి తగ్గుముఖం పట్టాయి. శబ్ద తరంగాలన్నీ కుదించుకుపోయి ఒకవైపుకే కేంద్రికరించినట్లుగా నిశ్శబ్దం నిలబడి పోయింది. ఇప్పుడు శబ్దం వినిపించటం లేదుగానీ, ఏదో తరంగం. అంతే. బంధవిముక్తులైనట్లు 'మాయాస్' హడావుడిగా పరిగెడుతున్నారు. "ఆగండి" వాయుపుత్ర స్వరం మైక్ లో వినిపించింది. అందరూ ఆగారు. "ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి" అందరూ ఆ వైపుకి చూసి ఆగిపోయారు.

    అక్కడ గుంపుగా కొందరు మాయాస్ గాలిలో పల్టీలు కొడుతున్నారు. పిచ్చిగా గంతులు వేస్తున్నారు. జరిగిందేమిటో అందరికీ అర్థమయిందిప్పుడు. ఆల్ట్రాసోనిక్ శబ్ద తరంగాలు వాళ్లను నాలుగువైపులనించి ముట్టడిస్తున్నాయి. శబ్దానికి 'అలర్జిటిక్' అయిన మాయాస్ దాన్ని తట్టుకోలేక పిచ్చివాళ్ళవుతున్నారు.

    వాయుపుత్ర జడ్జీలవైపు తిరిగి అన్నాడు. "ఎలాగూ మమ్మల్ని నీచులుగానే చిత్రించారు. మీకంటే అన్నివిధాలా బలహీనులమన్నారు. కాని సంపూర్ణ శక్తి మంతులు అంటూ ఎవరూ వుండరు. ప్రతి జీవిలోనూ భౌగోళికంగా కొన్ని బలహీనతలుంటాయి. శబ్దాన్ని తట్టుకోలేకపోవడం మీ బలహీనత. అది మేము కనిపెట్టలేనంత అసమర్థులనుకోవడం మీ పొరపాటు! అందుకే యిలాంటిపాఠం చెప్పడానికే వాళ్ళను హింసపెట్టక తప్పడం లేదు. మీ రెంతటి శక్తినైనా సులభంగా ఎదుర్కోగలరు. చేతనయితే ఎదుర్కోండి. ఆపండి యీ శబ్దాన్ని-"అని అరిచాడు.

    జడ్జీలలో ఎవరూ కదలలేదు.

    "అది మీ వల్ల కాదు. మామూలు శబ్దమే స్టీరియోఫోనిక్ సౌండ్ లొ వినిపిస్తే ఆమడదూరం వెళ్ళిపోతారు మీరు! ఇది దానికి లక్షరెట్లు శక్తివంతమైంది. దాని దరిదాపుల్లోకి వెళ్ళడం అంటే మృత్యువుని కోరితెచ్చుకున్నట్లే, చెప్పండి. ఇప్పటికీ మేము మీ కంటే తెలివిహీనులమని అంటారా?"

    "ముందుగా  అదో ఆపండి. కాస్సేపయితే వాళ్ళు నాశానముయి పోతారు" అన్నాడు ఆల్ఫా.

    "ఆపుతాను. మీ గ్రహవాసుల్ని బాధించాలనీ, నాశనం చేయాలనీ మా ఉద్దేశ్యం కాదు. కాని మాకు న్యాయం కావాలి. మీకంటే బలహీనులమన్న వాదన యిప్పుడు సరైంది. కాదని అర్థమయిందనుకుంటాను. మీ కంటే నేనేమీ పెద్ద విజ్ఞానవంతుడిని కాను. చిన్న లాజిక్ తో ఓడించగలిగాను. తెలివితేటలు ఒకరి సొత్తు  కాదని యిప్పుడైనా అర్థం చేసుకోండి. మా సూర్యుడిని మాకు వదలమనే మా  ప్రార్థన. మమ్మల్ని  సుఖంగా వుండనివ్వండి. మీరూ సుఖంగా వుండండి. సూర్యుడిలాంటి నక్షత్రం మీకు ఎక్కడైనా దొరుకుతుంది."

     వాయుపుత్ర వాళ్ళ  జవాబు కోసం  ఎదురుచూస్తున్నట్లు నిలబడ్డాడు. జడ్జీలు తేరుకున్నారు. ఒకరినొకరు సంప్రదించుకున్నారు. "ముందుగా మా వాళ్ళని ఆ శబ్దాన్నించి రక్షించండి" అన్నాడు ఆల్ఫా జడ్జి. "ఈ విధంగా మమ్మల్ని భయపెట్టలేరు మీరు."

    "మిమ్మల్ని భయపెట్టటం నా ఉద్దేశ్యం కాదు. మిమ్మల్ని నాశనం చెయ్యగల అస్త్రం మా దగ్గర వుందని చెప్పి - రాజీకి బేరం ఆడటం ఇది. ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం-" అంటూ వాయుపుత్ర రిమోట్ స్పీకర్ నించి చెప్పాడు. "బ్రహ్మ విద్యా, యిక చాలు."

    శబ్దం ఆగిపోయింది.

    మాయాస్ గుంపు అచేతనంగా కింద పడిపోయారు. జడ్జీల మధ్య చాలాసేపు సంభాషణ జరిగింది.

    ఆల్ఫా తరపున వచ్చిన జడ్జి లేచి నిలబడ్డాడు.

    "ఇంతకుముందు మేము తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటున్నాము. మీ సూర్యుడి దగ్గరకు ఎప్పటికీ రాము. వాయుపుత్ర చెప్పింది నిజం. తెలివితేటలకు ఒక లిమిట్ లేదు" అతడు యశ్వంత్ వైపు చూస్తూ అన్నాడు. "ఇది మీకు  భయపడికాదు. ఈ ఆల్ట్రాసోనిక్  సౌండ్ కీ యిన్సులేటర్లని తయారుచేయటం మాకు పెద్ద కష్టం కాదు. అది మాకు  కొద్ది గంటల పని. మతి  చలించిన మా వాళ్ళను నాలుగురోజుల్లో నయం చేసుకోగలం. కానీ మీ వాయుపుత్ర చూపించిన తెగువ, ధైర్యం, సమయస్ఫూర్తి మాకు బాగా నచ్చాయి. అందుకే మీకు బహుమతిగా అడిగింది యిస్తున్నాం." అనూహ్య అప్రయత్నంగా చప్పట్లు చరిచింది.

    "థాంక్యూ, థాంక్యూ వెరీమచ్" అన్నాడు వాయుపుత్ర.

    "ఇక మీరు మీ గ్రహానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క ప్రశ్న. ఇక్కడ వాతావరణం దాదాపు శూన్యంగా చేశాం. మాకున్న ఈ సౌండ్ ఎలర్జీయే దానిక్కారణం. కాని శూన్యంలో శబ్ద తరంగాలను ఆల్ట్రాసానిక్ గా మార్చే పరికరాన్ని ఎప్పుడు కనుక్కున్నారు. అది మాకు తెలియకపోవడం ఆశ్చర్యంగా వుంది."

    "అది మా యశ్వంత్ ఈ ప్రయాణంలో కనుక్కున్న గొప్ప పరికరం. దాన్ని మా బ్రహ్మవిద్యకు ఫీడ్ చేశాడు. అది ఈ రకంగా ఉపయోగపడింది."

    "కంగ్రాచ్యులేషన్స్ యశ్వంత్ అండ్  గుడ్ బై" అన్నాడు  ఆల్ఫా జడ్జి. "థాంక్యూ" యశ్వంత్ తన బృందంవైపు చూశాడు. అందరి కళ్ళలోనూ ఆనందభాష్పాలు.....

    వాయుపుత్ర చేతులు సాచేడు. అనూహ్య అందులో వాలిపోయింది. ఆమెను అతడు గాలిలో గిర్రున తిప్పాడు. ఆమె చిన్న పిల్లలా గట్టిగా నవ్వుతోంది.

    అందులో నిశ్చయంగా రొమాన్సు లేదు.


                                                                   *    *    *

    "కృతజ్ఞత లనేవి మీ దగ్గర సాంప్రదాయం కాకపోయినా ఇప్పుడు మాత్రం మీరు మా కృతజ్ఞతలను అందుకోక తప్పదు" అన్నాడు వాయుపుత్ర వేగా బి సెవెన్ తో.

    "దానికేముంది. మా పద్ధతులకు కట్టుబడి చేయగలిగింది చేశాం. మీకు  మంచి జరిగింది సంతోషం." అన్నాడు అతడు...."చెప్పండి మీకేం బహుమతి కావాలి?"

    "ఏమీ వద్దు. ఇచ్చింది చాలు." సుహృద్భావ్ భూమికి ప్రయాణం చేయడానికి సిద్ధంగా వుంది. అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నిఖిల్ ఒక్కడే ఒంటరిగా ఉదాసీనంగా ఓ పక్కన కూర్చున్నాడు. అది గమనించింది అనూహ్య. "నిఖిల్ ఏం జరిగింది?"

    "ఏమీ లేదు. నేనెలాంటి పరిస్థితిలో వచ్చానో నీకు తెలుసు. మనం ఏనాడో రోదసీలో అంతం అయిపోయామని అక్కడ అందరి ఉద్దేశ్యం. ఇప్పుడు వెళ్ళేసరికి పరిస్థితి ఎలా వుంటుందో? శ్రీజ తమరో వివాహం చేసుకుంటే? నేను వెళ్ళి ఆమెను యిబ్బంది పెడతానేమోనని భయంగా వుంది. అంతకంటే ఈ శూన్యంలో కలిసిపోతే నయమేమో కదా" అన్నాడు అతడు వేదనగా.

    వాళ్ళ మాటలు వింటున్న వేగా - 7 దగ్గరగా వచ్చాడు.

    "మీరు భూమిని వదలి వచ్చి ఎన్నేళ్ళయిందనుకుంటున్నారు?" అడిగాడు.

    "బ్రహ్మవిద్య లెఖ్ఖ ప్రకారం నాలుగు సంవత్సరాలు-"

    వారిని తనతో రమ్మని వేగా ఒక భవంతిలోకి తీసుకువెళ్ళాడు. ఒక పెద్ద ప్లానిటోరియంలా వుంది అది. భూమి, భారతదేశం అని తెలుస్తూంది. ఒకమ్మాయి కారు దిగి నడుస్తుంది. ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి. ఇద్దరు పిల్లలు ఆమెతో పాటు వున్నారు.

    "ఆమె ఎవరో గుర్తుపట్టగలరా?"

    నిఖిల్ లేదన్నట్టు తలూపాడు. వేగా మరో కంట్రోలు తిప్పాడు. ఆ అమ్మాయి మొహం ఒక్కటే పెద్దగా కనపడూతూంది.

    "ఇప్పుడు?"

    నిఖిల్ పరీశీలనగా గమనించి, ",,,,,,శ్రీజ పోలికలు కనపడుతున్నాయే" అన్నాడు. పక్కన పిల్లల్ని చూసి అతడి మొహం వాడి పోయింది. కాని ఆ అమ్మాయి పూర్తి శ్రీజలా లేదు. నాలుగు సంవత్సరాల్లో మరీ అన్ని మార్పులు రావటం కష్టం.

    "శ్రీజా....."అస్పష్టంగా గొణిగాడు తనలో తనే. పక్కనుంచే అతడి మొహాన్ని చూస్తున్న వేగా, "ఆమె మీ భార్య శ్రీజ కాదు నిఖిల్" అన్నాడు నెమ్మదిగా.

    "మరి?" అనుమానంగా అడిగాడు.

    "శ్రీజ మనవరాలి కూతురు."

    వాళ్ళంతా షాక్ తగిలిన వారిలా నిశ్చేష్టులయ్యారు అక్కడి వారందరూ. "మీరనుకున్నట్టు మీరు భూమినుంచి బయల్దేరి నాల్గుసంవత్సారాలు కాలేదు, డెబ్భైఆరు సంవత్సరాలు గడిచింది."

    ఒక శీతల పావనం తమని చుట్టుముట్టినట్టు వణికిపోయారు వాళ్ళు. డె.....బ్భై.... ఆ....రు.... సం.....వ....త్స....రా....లు! తాము వెళ్ళేసరికి తమ వాళ్ళంటూ ఎవరూ వుండరు. మూడు నాలుగు తరాలు గడిచాయా?

    "మీరు బ్లాక్  హోల్ లో దాదాపు డెభ్భై సంవత్సరాలు నిద్రపోయారు" అన్నాడు వేగా.

    నిఖిల్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చాలాసేపు నిశ్శబ్దం తరువతా వాయుపుత్ర అడిగాడు- "మరి... మరి....బ్రహ్మవిద్య అబద్ధం ఎందుకు చెప్పింది?"

    "కాంతి వేగంతో ప్రయాణం చెయ్యటంవల్ల మీలో పెద్దగా మార్పులేదు. మీ ఆనందాన్ని తగ్గించిమ్ బెంగని పెంచేలా చెయ్యటం బ్రహ్మవిద్యకు యిష్టం లేక పోయింది. నిజానికి టైమ్ తో మీకు పనేం వుంది? అంత అనవసరమైన విషయానికి ప్రాముఖ్యత యిచ్చి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టటం ఆ కంప్యూటర్ కి ఇష్టంలేదు. అంత  చిన్నరాకెట్ లో నాలుగుగోడల మధ్య డెబ్భై ఆరు సంవత్సరాలు గడుపుతున్నట్టు తెలిస్తే మీరు భౌతికంగా కన్నా మానసికంగా బలహీనం అవుతారన్న భయంతో బ్రహ్మవిద్య ఈ విషయాన్ని నొక్కిపెట్టి వుంచింది__" అక్కడ చాలా వేదనా పూరితమైన నిశ్శబ్దం అలుముకుంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra