తన శరీరాన్ని ఒక దుంగమీద పడేయటం తెలుస్తూంది. ప్రవాహవేగానికి కొట్టుకుపోతూ వుండటం తెలుస్తూంది. అతడు అప్రయత్నంగా ఆ చెక్కని గట్టిగా పట్టుకున్నాడు. దూరం నుంచి కాల్పులు ఆగి ఆగి వినిపిస్తున్నాయి.
అతడికి పూర్తిగా స్పృహ తప్పింది.
10
"అయ్య బాబోయ్ ఇదేమిటి?"
అతడు నెమ్మదిగా కళ్ళు విప్పాడు. సూర్యకిరణాలు సూదుల్లా చరుకున్న పొడవటంతో వెంటనే కళ్ళు మూసుకున్నాడు. తరువాత అతి కష్టం మీద మళ్ళీ తెరిచాడు.
తన మీదకి వంగి చూస్తున్న ఆకారం కనిపించింది. ఆ ఆకారం చిత్రంగా వుంది.
మీసాలూ, గెడ్డమూ నున్నగా గొరిగినట్టున్నాయి. కానీ జాకెట్టు. చీరె కట్టుకున్నాడు. పొడవాటి జుట్టును ముడివేసుకున్నాడు. పాన్ వెయ్యటం వల్ల నోరంతా ఎర్రగా పండి వుంది. కళ్ళకి కాటుక పెట్టాడు. షాపుల ముందు డాన్సు చేస్తూ అడుక్కునే వాళ్ళలా వున్నాడు.
"అయ్యబాబోయ్ ఇదేమిటి" మళ్ళీ అన్నాడు చెయ్యి అందిస్తూ. ఆ చెయ్యి పట్టుకుని లేవబోయాడు అతడు. అప్పటి వరకూ చచ్చుపడి నట్లున్న చెయ్యి, కాలూ భగ్గున మండాయి. వడ్డుకు వచ్చి పడి చాలా సేపవటం వల్ల, తడి ఆరి గాయాల చుట్టూ ఉప్పుతెల్లగా మెరుస్తూంది. రక్తం గడ్డకట్టి భయంకరంగా కనబడుతూంది.
కోల్పోయిన సత్తువనంతా తెచ్చుకొని, అందించిన చేయిసాయంతో అతడు వడ్డుమీద చెట్టు నీడ వరకూ రాగలిగాడు. అక్కడ కొచ్చేసరికి మరి కదలలేకపోయాడు. చెట్టు మొదట్లో కూలబడిపోతూ "ఇక్కడెవరూ డాక్టర్లు లేదా దగ్గిర్లో" అన్నాడు. అతడి కంఠం అతడికే ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టూ వినపడింది.
"ఇక్కడా! ఇంకానయం. డాక్టరు కాదుకదా కాంపౌండరు కూడా లేరు. ఆఁ కాంపౌండరు అంటే గుర్తొచ్చింది. మంత్రసాని పంతులమ్ముంది, తీసుకొస్తా నుండు".
"మంత్రసాని పంతులమ్మా?"
"అదే.... స్కూలుంది చూడు! అందులో పాఠాలు చెపుతుంది".
"నువ్వు ... నువ్వెవరూ?"
"నేనా.... హి హ్హి.... నేను కనపడటంలేదూ... పోతే నా పేరంటావా... అమ్మనాన్నలు పెట్టిన పేరు రాముడు. పెద్దయ్యాక అందరూ జానకి అని పిలుస్తున్నారు. జానకీ రాముడనుకో! అరె... మంత్రసాని విషయం మర్చిపోయాను. వెళ్ళి తీసుకొస్తాను" అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు.
అతడు కళ్ళు మూసుకున్నాడు. నదిమీద నుంచి చల్లటి గాలి వస్తూంది. అసలు తనెంత దూరం వచ్చాడో, ఇదేం వూరో కనుక్కోవలసింది. అతడు తల తిప్పి చూడటానికి ప్రయత్నించాడు. భుజం దగ్గిర నొప్పి పెట్టింది. ప్రయత్నం విరమించుకున్నాడు. నదివడ్డున చెట్లు ఏపుగా పెరిగివున్నాయి. బహుశా వూరు చాలా దూరంగా వుండి వుండవచ్చు. అతడికి రాబోట్ గుర్తొచ్చాడు. మనసు కలత చెందింది. తామందరూ కలిసి ఒకటిగా చేసిన పనులు గుర్తొచ్చాయి.
తను ఇలా అర్థంతరంగా మాయమవటంగురించి తమ వాళ్ళు ఏమనుకుంటారు? మరణించాననుకుంటారా? అసలు రామ్మూర్తికి తన ప్లాన్ సంగతి ఎలా తెలిసింది?
అతడి తలలో తిరిగి సన్నటి నొప్పి ప్రారంభమయింది. కళ్ళు మూతలుపడ్డాయి. అలా మళ్ళీ ఎంతసేపున్నాడో తెలీదు.
వంటిమీద చల్లటి చెయ్యిపడి మెలకువ వచ్చింది. 'అమ్మో' అంటూంది కంఠం! అది నాజుగ్గా, మృదువుగా వుంది. ఆ స్వరంలో భయం తొణికిసలాడుతూ వుంది. అంత రక్తాన్నీ, అన్ని గాయాల్నీ ఆ మంత్రసాని ఎప్పుడూ చూడలేదు! ఆ భయం గమ్మత్తుగా అనిపించింది.
"మన దగ్గిర టించర్ తప్ప ఏమీ లేదే. ఏం చేద్దాం?"
"అవును ఏం చేద్దాం?"
క్లాసులో మాస్టారు ఉన్నటుండి నేలమీద విరుచుకుపడిపోతే చుట్టూ చేరి ఏం చెయ్యాలో తోచక మాట్లాడుకునే చిన్న పిల్లల్లా వున్నారు వాళ్ళు. తన శరీరంలో రెండు ఇనుప బుల్లెట్లు నిక్షిప్తమై వున్నాయని తెలిస్తే వీళ్ళ భావాలు ఎలా వుంటాయి? అయినా ఈ అర్థనారీశ్వరుడు ఒకరిద్దరు మొగవాళ్ళని తీసుకురాకుండా కాస్త రక్తాన్ని చూసి భయపడే ఈ మంత్రసానిని ఎందుకు తీసుకు వచ్చాడు? ఈ పల్లెలో కాన్పులకికూడా ఈవిడని పిలవరనుకుంటా.
అతడు నెమ్మదిగా కళ్ళు విప్పాడు.
కళ్ళ మీద నుంచి కనురెప్పలు నెమ్మదిగా పైకి వెళ్ళుతూ వుంటే రంగస్థలం మీద తెర పైకి లేచినట్టు ఆమె క్రమక్రమంగా కనబడసాగింది. పసుపురంగు పాదాలు, పొడవైన కాళ్ళు, వంపులు తిరిగిన నడుము, తెల్లటి మెడ. ఇవి కాదు అతడు చూస్తున్నది - ఆమె మొహాన్ని.
గుండ్రంగా వుంది అది. ప్రతీ అణువులోనూ అమాయకత్వం తొణికిసలాడుతూంది. ఆమె కళ్ళు పాలపిట్ట రెక్క మీద పడిన వర్షపు చుక్కలా స్వచ్చంగా వున్నాయి.
అదికూడా కాదు అతడికి ఆశ్చర్యం కలిగించింది, అంత చిన్న అమ్మాయి మంత్రసాని ఏమిటి?
"ముందు రక్తాన్ని తుడవాలి" అంటూంది ఆ అమ్మాయి.
ఇక వీళ్ళతో లాభంలేదనుకున్నాడు. చాలా నాజుగ్గా సమస్యని చర్చిస్తున్నారు వీళ్ళు. ముందు శరీరంలోంచి బుల్లెట్స్ బయటికి తియ్యకపోతే కష్టం!
"మీ దగ్గిర ఫోర్ సెప్స్ వున్నాయా?"
శవంలా పడుకున్నవాడు అకస్మాత్తుగా అలా మాట్లాడేసరికి మధ్యలో బాంబు పడ్డట్టు ఇద్దరూ చెరోవైపుకీ గెంతారు. ముందు అమ్మాయే సర్దుకుంది.
"ఫోర్ సెప్సా..... అవి ఎందుకు వుంటాయి?" అని అడిగింది.
"నర్స్ దగ్గిర ఫోర్ సెప్స్ లేకపోవటమేమిటి?"
మొహంలో కొట్టొచ్చినట్టు ఆశ్చర్యం కనపడుతూవుండగా, "నర్సా, నర్సేమిటి" అంది. అతడు జానకీ రాముడివైపు చూశాడు. వాడు తడబడి "అదే... అదే..." అన్నాడు. ఆమెకేదో అర్థమైనట్టు నవ్వి "చిన్న చిన్న మందులూ మాకులూ ఇస్తూవుంటాను. అంతే తప్ప నాకేం అంతగా తెలీదు" అంది.
అతడా మాటలు వినటంలేదు. ఆమె నవ్వుని చూస్తున్నాడు. మనసు ఎంతో స్వచ్చమైతే తప్ప అంత నిష్కల్మషమైన నవ్వురాదు.
అకస్మాత్తుగా అతడికి 'ఇదేమిటి' అనిపించింది. ఎక్కడ నుంచి ఎక్కడకొచ్చాడు తను... కోట్లతోచేసే వ్యాపారాలు- స్మగ్లింగ్- ఒకరిమీద మరొకరు పై ఎత్తులు... చావులూ... చంపుకోవటాలూ... వీటి నుంచి దూరంగా- ఈ నది ఒడ్డున- చెట్టు క్రింద- ఓ అమ్మాయి, ఓ అర్థనారీశ్వరుడు- వీళ్ళ మధ్య ఇంత తీరిగ్గా! అసలింత 'తీరిక' తన జీవితంలో ఎప్పుడైనా అనుభవించాడా....