సుశీల వాలకం చూసి హడిలిపోయాడు భాస్కర్. దగ్గిరగా వచ్చి "ఏం జరిగింది సుశీలా?" అన్నాడు.
సుశీల చూపు లేని తన కళ్ళను భాస్కర్ వైపు తిప్పింది "మీరు నా డబ్బుతో చదువుకున్నారు. మా నాన్న పరపతితో ఉద్యోగస్థులయ్యారు. అయినా ఏనాడూ, 'సుశీలా! ఇది నీకోసం.... అంటూ నాకు అభిమానంతో ఏదీ తీసుకురాలేదు. ఇన్నాళ్ళకి ఇవాళ నేను ఇదే మొదటిసారిగా, ఇదే చివరిసారిగా ఒకటి కోరుకుంటున్నాను - ఇస్తారా?"
భాస్కర్ తన విసుగు నణుచుకుంటూ శాంతంగా "అడుగు!" అన్నాడు.
"నాకు కొద్దిగా విషం తెచ్చి పెట్టండి!"
భాస్కర్ కోపం పట్టలేకపోయాడు.
"ఎందుకూ? నా కియ్యాలనా?" అన్నాడు.
సుశీల నవ్వింది కచ్చగా.
"ఛ! మీకెందుకిస్తాను? మీరు నాకిచ్చే విషానికి ప్రతి ఫలంగా నేను మీకిచ్చే బహుమతి ఇదిగో!"
మతిపోయింది భాస్కర్ కి.
"ఈ వుత్తరం.... ఇది నీకెలా వచ్చింది?"
"మీ ప్రియురాలు నాకందించమని సుబ్బలక్ష్మితో రేవతిని పంపించింది."
"అసంభవం!"
"సుబ్బలక్ష్మి!" అని అరిచాడు భాస్కర్.
సుబ్బలక్ష్మి భయపడుతూ వచ్చింది.
"నిజం చెప్పు! ఈ ఉత్తరం నీకెలా వచ్చింది?" గర్జిస్తున్నట్లు అడిగాడు భాస్కర్....
సుబ్బలక్ష్మి రేవతి లాగ తెలివైంది కాదు - రేవతి కల్పించి చెప్పిన మాటలు సుబ్బలక్ష్మి వినలేదు - పై పెచ్చుభయంతో ఆవిడకి ప్రాణాలు పోతున్నాయి. అంచేత వణుకుతూ నిజం చెప్పేసింది-
"ఛీ! అవతలికి పో!" అని చీదరించుకున్నాడు భాస్కర్ -
జ్యోత్స్న తన కాపురానికి ఎసరు పెట్టే ప్రయత్నంలో లేదని తెలిశాక సుశీల ప్రాణాలు కొంతవరకు కుదుటపడ్డాయి - అయినా భాస్కర్ మీద కోపం మాత్రం తగ్గలేదు -
"నాకు కళ్ళులేవు- ఆ ఉత్తరాన్ని చదవలేను - కానీ, రేవతి చదివి వినిపించింది - ఎంత చక్కని ఉత్తరం! మీరు ఎంత ప్రేమతో ఎంత బాగా ఉత్తరాలు రాయగలరో, మిమ్మల్ని పెళ్ళి చేసుకున్న ఇన్నాళ్ళకు, ఇప్పుడు మొదటిసారిగా తెలిసింది నాకు!"
భాస్కర్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు - దోషిగా దొరికి పోయిన తరువాత ఏం మాట్లాడగలడు?
హీనస్వరంతో "నేను నీకేమీ అన్యాయం చెయ్యలేదు సుశీలా! ఆ ఉత్తరం చదివితే ఆ విషయం స్పష్టపడుతుంది గదా?" అన్నాడు -
సుశీల ముఖం జేవురించింది -
"అవును - అన్యాయం చెయ్యలేదు - జ్యోత్స్నకి ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నట్లు ఉత్తరాలు వ్రాసినా - ప్రతిరోజూ పార్కులో కలుసుకుని ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటున్నా.... అవకాశం.... వీలు కుదరక.... సాహసం లేక.... సాంగత్యం పెట్టుకోలేదు గనుక అన్యాయం చేసినట్లు కాదు - నన్ను వదిలించుకునే మార్గంలేక - మనసులో ఏ కోశానా ప్రేమలేక పోయినా.... ఏనాడూ ఆప్యాయంగా పది నిముషాలు మాట్లాడకపోయినా.... సినిమాలకూ, షికార్లకూ, వెంట తీసుకుపోవటానికి పనికి రాకపోయినా.... ఏ అర్థరాత్రో మనసు చంపుకుని ప్రాశవిక స్థాయిలో సంసారం చేస్తున్నారు గనుక నాకు అన్యాయం చేసినట్లు కాదు-అంతేనా?-"
భాస్కర్ భరించలేకపోయాడు - అతనూ రెచ్చిపోయాడు -
"అవును - అంతే! నేను ఎంత సహనంతో ఉన్నా, నీకు సంతృప్తి లేదు - ఇంకా ఇంకా నన్ను సతాయించకుండా నువ్వు స్తిమిత పడలేవు - నేనూ ఇంక భరించలేను - అవును - నేను జ్యోత్స్నను ప్రేమిస్తున్నాను - ఇది నిజం! జ్యోత్స్న కాదనబట్టిగాని లేకపోతే, ఈపాటికి జ్యోత్స్నను పెళ్ళి చేసుకునేవాడిని - నా యిష్టం - నా యిష్టం వచ్చినట్లు ఉంటాను."
సుశీలకు నెత్తిమీద పిడుగుపడినట్లయింది - భాస్కర్ "నా యిష్టం!" అనేస్తే ఇక తను చెయ్యగలిగిన దేముందీ?
16
సుశీల ఎలుకలకు పెట్టే విషం మింగేసింది - ఆ విషంతో మనుష్యులు తేలిగ్గా చావరనీ, విపరీతంగా బాధపడతారనీ పాపం, సుశీలకు తెలియదు.
కడుపు ఉబ్బిపోయి బాధపడుతూ సుబ్బలక్ష్మితో "సుబ్బలక్ష్మి! నేనింక బ్రతకను - మీ అయ్యగారినీ, ఆ బజారుముండని పెళ్ళి చేసుకుని హాయిగా ఉండమను - ఇంక నా అడ్డు ఉండదు - నేను ఎలుకలకు పెట్టే విషం తినేశాను-" అంది ఏడుస్తూ -
సుబ్బలక్ష్మి సుశీల బాధచూసి కంగారు పడిపోతూ "అదేదో కథలో హీరోనీ, హీరోయిన్ నీ పెళ్ళి చేసుకోమని హీరో భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు, భాస్కర్ గారినీ, జ్యోత్స్నగారినీ పెళ్ళి చేసుకోమని సుశీలగారు విషం మింగేశారు -" అని అందరికీ చెప్పేసింది-
జ్యోత్స్న దగ్గిరకు కూడా వచ్చి "జ్యోత్స్నగారూ! మీకోసం పాపం, సుశీలగారు చాలా త్యాగం చేశారు - విషం మింగేశారు - మీరు భాస్కర్ గారిని పెళ్ళి చేసుకోవచ్చు-" అని చెప్పింది.