"లేదు కిరణ్. నువ్వే నన్ను క్షమించాలి ఇన్ని లక్షల రూపాయలు ఇంత కొద్దికాలంలో కరిగిపోతూ వుంటే ఏమీ చెయ్యలేకపోయేను" అన్నాడు. ఆమె తలెత్తి చూసింది.
ఆమె కళ్ళలోకి నెమ్మదిగా వెలుగొచ్చింది. "ఇదేనా.... ఈ ఒక్క కారణమేనా రవీ నిన్నింతగా బాధపెడుతోంది" అందామె. ఆతృత - కొద్దిగా ఆనందం మిళితమైన స్వరంతో. "నా మీద ఏ కోపమూ లేదా? నా ప్రవర్తన పట్ల అసహ్యం లేదా??"
రవి అయోమయంగా "కోపమూ- అసహ్యమూనా.....ఎందుకు?" అన్నాడు.
"నిన్ను కష్టపెట్టినందుకు....స్త్రీనన్న విషయం మర్చిపోయి....." ఆమె ఏదో చెప్పబోతూంటే నోటిని చేత్తో మూసి "నువ్వు కాబట్టి నన్ను సహించగలిగేవ్ కిరణ్" అన్నాడు.
ఆమె అలాగే అతడి చేతిని తన చెక్కిలికి ఆన్చుకుని, "ఇంకా చర్చవద్దు రవీ.... పెళ్ళయిన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమనీ, అనురాగాన్నీ మన మధ్య లేకుండా చేసింది డబ్బు. ఒకర్నొకరు కళ్ళలో పెట్టుకొని కాలం తెలియకుండా గడపాల్సిన అపూర్వ క్షణాల్ని.....ఈ డబ్బు కాపాడటం కోసం వృధా చేసేం. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు రవీ- ఈ పాడు డబ్బు మనకి శాశ్వతం వీడ్కోలు చెప్పబోతూ ఉంది. అది వెళ్ళిపోయాక హాయిగా మనిద్దరమే రవీ! బీదతనం నాకు అలవాటే.... నీ క్కొద్దిగా మొదట్లో కష్టంగా ఉంటుందనుకో- అయినా దాని గురించి భయం అక్కర్లేదు..... నీకో చిన్న ఉద్యోగం వస్తుంది...సాయంత్రం అలసిపోయి ఇంటికొస్తావ్.... కుక్కూ, గిక్కూ ఉండరుగా.... నేనే కాఫీ కాచి తెచ్చిస్తాను. మన చిన్న ప్రపంచంలోకి తొందర్లో ఓ పాప కూడా వస్తుంది.....ఇక అంతా సుఖమే...."
రవి ఒక అపూర్వమైన అనుభవాన్ని పొందుతున్నట్లు ఆమె మాటలు వినసాగేడు. అతడు మొదటిసారిగా కొత్త కిరణ్మయిని చూస్తున్నాడు.
ఆమె ఆ ఇంటికి వచ్చిన కొత్తలో ఆమె కళ్ళలో ఒక అనూహ్యమైన వేదన కనబడుతూ వుండేది. అది పూర్తిగా వేదన కాదు! కసి- ఉహుఁ ఆ సున్నితమైన భావానికి అంత కర్కశమైన పదం అనవసరం. చాలా బీద స్థితిలోంచి వచ్చిన కారణంగా ఒక్కసారిగా ఈ వాతావరణాన్ని అన్వయించుకోలేక, పూర్వపు అసహ్యకరమైన పరిస్థితుల్ని- ఆ కొత్త వాతావరణంతో పోల్చుకుని- ఒక రకమైన కాంప్లెక్స్ పెంచుకున్న స్థితి ఆ తర్వాత విధి ఆడిన ఒక చిన్న చదరంగపు ఆటతో ఆమెకి అంతులేని సంపద వచ్చిపడి ఉక్కిరి బిక్కిరి అయ్యేట్లు చేసింది. తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఇప్పుడు.
కానీ అది కలిగించిన నష్టం కంటే ఆమెకి అది తగ్గిపోయిందన్న భావమే ఎక్కువ హాయిని కలిగిస్తోంది. ఆ సంతృప్తితోనే ఆమె భర్త ఒడిలో తల పెట్టుకుని హాయిగా నిద్రపోగలిగింది. అంతా ప్రశాంతంగా వుంది.
కిటికీలోంచి వస్తున్న పిల్లగాలికి ఆమె చెవిక్రింద ముంగురుల పాయనెమ్మదిగా వూగుతోంది. ఒక వెన్నెల కిరణం ఆమె చెక్కిలి మీద పడి ప్రతిబింబిస్తోంది. ఆమె నిశ్చలమైన కనురెప్పల మధ్య గాఢమయిన నిశ్శబ్దం అలుముకుంది.
స్నిగ్ధమూ, అపురూపమూ అయిన ఆ ప్రశాంతతకి విచలితుడైన రవి - ఆమె నిద్రకి భంగం కలిగించకుండా నెమ్మదిగా వంగి, బల్లమీదున్న చిన్న సీసాని కిటికీలోంచి బయటకు విసిరేశాడు.
* * *
పెద్ద హడావిడేమీ లేదు.
కొద్దిమంది జనం వున్నారు- నాలుగయిదు కార్లున్నాయి.
ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ కి సంబంధించిన ఇద్దరాఫీసర్లు ఏదో నోట్ చేసుకుంటున్నారు.
రోడ్డుమీద ఇద్దరు వ్యక్తులు ఆ ఇంటివేపు చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ వెళుతున్నారు. రోడ్ కిరువేపులా వున్నా క్రోటన్స్ మొక్కలు సరయిన పోషణ లేక వాడిపోయి వున్నాయి.
దూరంగా పన్నెండు కొట్టింది. దాహంతో దూరంగా కాకి అరుస్తోంది. దూరంగా నిలబడి వున్నారు రవీ,. కిరణ్మయి. ఆమె చెయ్యి అతడి చేతిలో వుంది. వాళ్ళిద్దరూ మౌనంగా చూస్తున్నారు. జరిగేదాంతో సంబంధంలేని ప్రేక్షకుల్లా వున్నారు. పాట మొదలయింది.
"డెభ్భై ఐదువేలు."
లక్షా పాతిక వేలు చేసే బిల్డింగ్ ని చౌకగా కొట్టేద్దామని ఎవరో ఆశపడ్డారు.
రెండు గొంతులు వెంటనే "ఎనభైవేలు" అన్నాయి.
"తొంభైవేలు".
"కొద్ది నిశ్శబ్దం.
"..లక్ష" అన్నాడు నానక్ రామ్.
"లక్షా పదివేలు" ఒక మూలనుంచి రామయ్య సెట్టి అరిచాడు. నానక్ రామ్ అతడివేపు చూచి తలాడించేడు. అతడి గుమాస్తా వంగి, "చాలు సాబ్ - ఇంకా అనవసరం " అన్నాడు. నానక్ రామ్ ఆలోచిస్తున్నాడు.
చాలాసేపు మౌనం.
"లక్షా ఇరవై వేలు" చివరికి అన్నాడు.
రామయ్య సెట్టి ధైర్యంగా, "లక్షా పాతికవేలు" అన్నాడు.
రవికి ఇది ఆశ్చర్యంగా వుంది. వీళ్ళంతా తన స్నేహితులు! ఇప్పుడు తనని గమనించనట్లే ప్రవర్తిస్తున్నారు.
తోటి పక్షి చచ్చిపోతూంటే, తమ తోటిదే అనైనా ఆలోచించకుండా పీక్కుతినే రాబందులు గుర్తొచ్చాయి. అంత అర్థరాత్రి సర్వం వదిలి పెట్టి అన్నయ్య ఎందుకు వెళ్లిపోయేడో అర్థమైంది.
పాట పోటీల మీద సాగుతూనే వుంది. "లక్షా యాభైవేలు" అన్నాడు భగవాన్ దాస్.
ఆ ఇంటికి అంతకన్నా ఎక్కువరాదు. కానీ నానక్ రామ్ ది పక్కఇల్లే. కొనుక్కొంటే తన దాంట్లో కలిపేసుకోవచ్చునని ఆశ. కొంచెం తటపటాయించి "లక్షా డెభైవేలు" అన్నాడు ఒక్కసారిగా ఇరవయ్ వేలు పెంచి.
దాంతో ఇంకెవరూ మాట్లాడలేదు.
"ఒకటోసారి!"
చీమ చిటుక్కుమంటే వినబడేటంత నిశ్శబ్దం.
అది లక్షా డెభ్భైవేలకి అమ్ముడుపోతే తమకి ఎంత వస్తుందో.....తామింకా ఎంత ఇవ్వతేలతామో లెక్కకడుతున్నాడు రవి. కిరణ్మయి ఆఖరిసారిగా బంగ్లావేపు చూసింది.
ఎంత కాదనుకున్నా దుఃఖం లోపల్నుంచి పొంగివస్తూంది. ఓ అర్థరాత్రి నిస్సహాయమైన స్థితిలో తాము మొదటిసారి ఆ ఇంటికి కట్టుబట్టలతో రావటం...చైతన్య అభిమానం....అంతా జ్ఞాపకం వచ్చింది. విధి వైపరీత్యంవల్ల అతడు ఈ ఇంటిని వదులుకున్నాడు. ఈ రోజు తాముకూడా దాన్ని నిలుపుకోలేకపోతున్నారు...
ఆమె ఈ ఆలోచనలలో వుండగానే రామయ్య సెట్టి "లక్షా డెభ్భైయ్ ఐదువేలు" అన్నాడు ఆవే ఆఖరి బెట్ అన్నట్లు.
అందరూ నానక్ వేపు చూశారు-పోటీగా పాడతాడేమోనని. కానీ ఆవేశంతో నష్టపోకుండా హెచ్చించే వ్యాపార లక్షణం అతని రక్తంలో జీర్ణించుకుపోయి వుంది.
ఇక ఇష్టం లేనట్లు తల పకక్కు తిప్పుకున్నాడు
"లక్షా డెభైయ్ ఐదువేలు ... మొదటిసారి"
ఎవరూ మాట్లాడలేదు.
"రెండోసారి....."
ఇంకా నిశ్శబ్దంగానే వుంది.
డీల్ ముగియబోతున్నట్టు బల్లమీద కొట్టి "మూడోసారి" అనబోతూ వుండగా "రెండు లక్షలు" అని అప్పుడే వచ్చిన వ్యక్తి కంఠం వినబడింది.
రవి చప్పున తలెత్తాడు. అందరూ అటు తిరిగేరు.
అక్కడ చైతన్య నిలబడి వున్నాడు.
రవికి ఒక్కక్షణం నోటమాట రాలేదు. అడుగు తడబడింది. చప్పున అటు పరుగెత్తుబోయాడు. ఆత్మీయుడ్ని చూసిన సంతోషం- కష్టం గట్టెక్కుతోందన్న ధైర్యం ఉమ్మడిగా ఒక్కసారిగా పెనవేసుకొన్నాయ్. కిరణ్మయి కూడా అదే స్థితిలో వుంది.
రవి చైతన్యని చేరుకొన్నాడు. రెండు చేతులూ పట్టుకొని గట్టిగా వూపేస్తూ "....అన్నయ్యా" అన్నబోయాడు. చిన్న పిల్లాడిలా ఏడుపొచ్చింది. గొంతులో అడ్డుపడింది. మాట రాలేదు.
చైతన్య చెయ్యిచాచి దగ్గరకు తీసుకొని అనునయిస్తున్నట్టు "డోన్ట్ బి ఎక్సెయిటెడ్" అన్నాడు చిరునవ్వుతో గుసగుసగా.
21
ఆస్థి వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తేవటానికి మూడు నెలలు పట్టింది.
ఇన్స్యూర్ చెయ్యని కారణంగా వచ్చిన నష్టాన్ని, ఆ తరువాత జపనీస్ కంపెనీ ఏజంట్ గా ఆర్జించిన లాభాన్ని సరిపుచ్చటానికి ఇన్ కంటాక్స్ వాళ్ళు వప్పుకోవటంతో రెండు సంవత్సరాల లాభంమీద పన్ను కట్టే అవసరం లేకపోయింది.
అతడి పూర్వపు వ్యాపార దక్షతని తెలిసినవాళ్ళు మళ్ళీ అతడికి అప్పివ్వటానికి ముందుకొచ్చేరు. అదీగాక అతడికి తీర ప్రాంతంలో ప్రస్తుతం చాలా మంచి సంబంధాలున్నాయి. అది అతడికి చాలా లాభించింది.
శారద కూడా వచ్చేసింది. ఇంట్లో పూర్వపు వాతావరణం మళ్ళీ చోటు చేసుకుంది. వాడిపోయిన చెట్లు మళ్ళీ తలత్తాయి. మొక్కలు క్రొత్త చివుళ్ళు పుంజుకున్నాయి. గేటుముందు మళ్ళీ గూర్ఖా వచ్చాడు.
ఆ రోజు సాయంత్రం చైతన్య బాల్కనీలో నిలబడి వున్నాడు. ఆకాశం నిర్మలంగా వుంది. కొంగలు బారులుగా ఇళ్ళవేపు సాగిపోతున్నాయి.
ఎందుకో దృష్టి క్రిందకి మరల్చిన చైతన్య భృకుటి క్షణం పాటు ముడిపడింది.
ఒక వృద్ధురాలు-వయసు పండకపోయినా, అనుభవాలు పండించినవి. కొద్దిగా కుంటుతూ ఆ యింటివైపు వస్తున్నది. ఆమె బట్టలు శిధిలమై వున్నాయి. జుట్టు తైల సంస్కారం లేక పీచులా వ్రేలాడుతోంది. శరీరం శుష్కించింది. అడుగులు బలహీనంగా పడుతున్నాయి.
ఆ యింటివైపు పరీక్షగా చూస్తూ వస్తోంది.
ఆమె గాజు కళ్ళలో ఎక్కడో అంతర్లీనంగా కుతూహలం వుంది. బలహీనత దాన్ని చంపేస్తోంది. అయినా పట్టుదలగా ఆమె నడుస్తూనే వుంది.
ఆమె కడుపు వీపుకు అంటుకుపోయి వుంది. కాళ్ళ క్రిందికి జారిన చీరపీలిక రోడ్డుమీద దుమ్ములో జీరాడుతోంది.ఇంటి ముందుకొచ్చి తలెత్తి చూసింది.
కొత్తగా రంగులు వేసిన యిల్లు. సాయంత్రపు నీరెండలో మెరుస్తోంది. ముందున్న ఆశోఖ వృక్షాలు ఠీవిగా గాలికి వూగుతున్నాయి. బాట కిరువైపులా పాతిన తెల్లటి సున్నపురాళ్ళు కొత్త అందాన్ని సంతరించుకొని వున్నాయి. అప్పుడే విచ్చుకొన్న గులాబిమొగ్గ తన హొయలు చూసుకొని, మురుస్తున్న స్త్రీలా వుంది. ఒకప్పటి పాపలు శరీరంలోంచి ఉబికి వచ్చినట్లుగా ఫౌంటెన్ లోంచి నీరు రివ్వున పైకొస్తోంది. పందిరి మీదకి వంగిన మల్లెతీగ పశ్చాత్తాపం పొందిన మనిషిలా వుంది. అర్థంలేని ఉపమానాలు, అర్థంకాని జీవిత సత్యాలు-