Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 31

    పెళ్ళివారు వచ్చారు. మామూలు మర్యాదలయ్యాయి. శకుంతల కూడా వచ్చింది కుర్చీలో కూచుని పెళ్ళికొడుకుని నిర్భయంగా చూసింది.    
    'ఇతడు అందంగానే వుంటాడట! అందమంటే ఏమిటి? కన్ను, ముక్కు, నోరునా? ఏమో! మరి రాజులో ఉన్నదేమిటీ? ఇతనిలో లేని దేమిటీ? ఇతనికంటే రాజు కాస్త ఛాయా తక్కువ. రాజుకళ్ళే కాస్తచిన్నవి. కానీ రాజు కళ్ళలోవున్నా స్థయిర్యం, ధీరత్వం, నిబ్బరం, గాంభీర్యం ఇతని కళ్ళలో లేవు. ఇతఃని కళ్ళు బోలుగా బేలగా వున్నాయి. అందమంటే, పెద్ద కళ్ళా? చిన్న కళ్ళా?' అనికాదు - ఆ కళ్ళలో కనిపించేది ఏమిటవి.    
    'ఇతని పచ్చని పసిమి, ఒడ్డూ పొడుగూ మామూలు కళ్ళకు అందంగా కనిపించవచ్చునేమోగాని అందమంటే ఏమిటో తెలిసిన తన కళ్ళకు అందంగా కనిపించటం లేదు. తనకు రాజుకంటే అందగాడు__అతని కంటే మంచివాడు కనిపించడు. పెళ్ళికొడుకువంక కన్నార్పక చూసే శకుంతలను చూసి అందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. చివరకు అతడే ఇబ్బందిగా కదిలాడు. శకుంతలలేచి_"మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఒంటరిగా కొంత మాట్లాడాలని వుంది" అంది పెళ్ళికొడుకుతోనే సూటిగా.    
    అతడు ఉలిక్కిపడ్డాడు. తల్లి వంక చూశాడు. ఆవిడ మొదట ముఖం చిట్లించి తరువాత అంగీకార సూచకంగా తల ఊపింది. అది గమనించిన శకుంతల తను తోటలోకి నడిచింది. లేగ దూడలాగ వెంబడించాడు అతడు. ఒక పాలరాతి అరుగుమీద తనుకూచుని, మరో అరుగుమీద అతన్నికూర్చోమని సైగ చేసింది.    
    "మీరు నన్నెందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు?"    
    "నేను-నేను-" అతడు తడబడ్డాడు. అంతలో సర్దుకున్నాడు.    
    "మీరు అందంగా ఉంటారు."    
    "ఈ అందం ఒక కాన్పు రాగానే పోవచ్చు. మరేదైనా జబ్బు చేసినా పోవచ్చు."    
    "అయినా, నా ప్రేమ పోదు"    
    "ఓ! ఐతే మీరు నన్ను ప్రేమిస్తున్నారన్నమాట!"    
    "లేకపోతే ఎందుకు పెళ్ళి చేసుకుంటాను?"    
    "నా వెనుక వున్న లక్షల ఆస్థి మీకు వస్తుందనే భ్రమలో ఉన్నారా?"    
    "నాకు రాక ఎవరికి వస్తుంది?"    
    "నాకు!"    
    "మనలో ఎవరికి వస్తేనేం?    
    "నేనలా అనుకోను. నాకు ఆస్థివస్తే అధికారమంతా నాదే! అన్నీ ఇష్టం వచ్చినట్లే చేస్తాను. మీరు నేను చెప్పినట్లు పడివుండవలసిందే తప్ప స్వతంత్రంగా ఏమీ చెయ్యటానికి వీల్లేదు.    
    "నాకు అభ్యంతరం లేదు."    
    "ఛీ! ఇంత వ్యక్తిత్వం లేని మనుష్యులా మీరు- కుక్కపిల్ల లాగ...."    
    శకుంతల నవ్వుతోంటే, అతడు కోపంగా లేచి వెళ్ళిపోయాడు. అప్పటికైనా అతనికి కోపం వచ్చినందుకు మనసులో కనపడని ఆ దేవుడికి శతకోటి ధన్యవాదాలర్పించుకొని నవ్వు అణచుకొని, మళ్ళీ విశాలమైన మధ్య వరండాలోకి వచ్చింది. నాలుగు పక్కలా  అద్దాలున్న ఆ వరండాలో ఎవరేం చేసినా అందరికీ కనిపిస్తుంది.    
    ఎర్రబడిన ముఖంతో పెళ్ళికొడుకు తల్లితో ఏదో మాట్లాడటం అందరికీ కనిపించింది. కోపంగా లేచి నిలబడింది. తల్లి-ఆమె వెనుక మిగిలిన వారూ లేచారు.    
    "రాజవల్లీ గారూ! ఇద్దరు తండ్రుల కూతురని తెలిసీ మీ అమ్మాయిని చూచుకోటానికి వచ్చినందుకు బాగా బుద్ది చెప్పారు" అనేసి విసవిస లాడుతూ వెళ్ళిపోయింది. మిగిలిన వారూ వెళ్ళారు. బాధపడుతున్న రాజవల్లి ముఖం చూసి శకుంతల తన నవ్వును బయటకు రానీయలేదు. కొంతసేపటికి రాజవల్లి - "అతనితో ఏం చెప్పానమ్మా" అంది.    
    "ఏంలేదు అమ్మమ్మా! నన్ను నా డబ్బుకోసం గాక, నా కోసం పెళ్ళిచేసుకోవాలని అన్నాను. పెళ్లయినా నా ఆస్థిమీద అధికారం అతడికి రాదని చెప్పాను. నువ్వే చెప్పు అమ్మమ్మా! ఇప్పుడు డబ్బు కోసం నన్ను చేసుకొని పెళ్ళిపేరిట మన డబ్బంతా లాక్కుని, ఆ తరువాత నాతోపాటు మరో అమమయిని కూడా చేసుకుంటే, మీ కాలంలో లాగ నేను భరించగలనా? - చెప్పు!"    
    'వద్దమ్మా - వద్దు! అయినా....."    
    "నా డబ్బు మీకు రాదు," అనగానే, ఇద్దరు తండ్రుల కూతురని" తిట్టిపోయారు. ఇలాంటి సంబంధం మంచిదేనా అమ్మమ్మా?"    
    "వద్దులేమ్మా - వద్దు! నా చిట్టి తల్లికేం లోటని? మరో మంచి సంబంధం రాకపోతుందా?"    
    పైకి అలాఅన్నా, ఆ వృద్దురాలి ముఖాన వేదన స్పష్టంగా కనిపిస్తోంది. శకుంతలకు బాధతోచింది. రాజవల్లి మనసులో బాధను ఎలా మరపించాలో శకుంతలకు తెలుసు. పసిపిల్లలా ఆవిడ మెడ చుట్టూరా చేతులు వేసి, అమ్మమ్మా! అదిగో బాధపడుతున్నావ్? పోనీ ఇప్పుడు వెళ్ళి ఆ పెళ్ళికొడుకును వెనక్కు లాక్కొచ్చి వాడిచేత తాళి కట్టించుకోనా? మన డబ్బు కోసం గడ్డి మేయటానికయినా సిద్దంగా ఉన్నాడు-" అంది. శకుంతల మాటలకు, ఆ మాట్లాడిన తీరుకు రాజవల్లి నవ్వింది.    
    "శకుంతలా! నీ కిష్టంలేని సంబంధం ఒక్కనాటికీ చేయను. నీ సౌభాగ్యానికి కాకపోతే ఈ సంపదంతా దేనికి?"    
    "ఒక గండం తప్పింది!" అని నిట్టూర్చింది శకుంతల.
    
                                                             20
    
    జీతాల రోజు సాధారణంగా ఎవరికయినా ఆనందం కలిగించే రోజు. కానీ, రాజవల్లీ నగర్ లో ఫ్యాక్టరీల ముందు మాత్రం జీతాలనాడు పరమ విషాదకరమైన దృశ్యా లెదురవుతాయి. పిల్లలను కొట్టి డబ్బు లాక్కునే తండ్రులు, వాళ్ళను కూలీలుగా చేర్చినందుకు కమీషన్ కోసం వేధించే పెద్ద మనుషులు, అప్పులు వసూలు చేసుకోవటానికి వచ్చిన నానా రకాల చిల్లర దుకాణదారుల కేకలు__ ఇలా బీభత్సంగా ఉంటుంది- ఫ్యాక్టరీ ఆవరణ అంతా.    
    ఆ దృశ్యాలు తన మనసు నెంతగా కలచివేసినా చూడకుండా ఉండలేదు శకుంతల. ఎప్పటి కప్పుడు మనసు విల విల లాడటమూ ఏం చెయ్యాలా అని మధన పడటమూ 'బిడ్డను వేధించే తండ్రిని తానేం చెయ్యలేదు. అది అతడి జన్మ హక్కు. బిడ్డ సౌఖ్యం కోసం ఏం చేసినా చెయ్యకపోయినా వేధించే అధికారం అతనికి వుంది. ఇకపోతే కమీషన్ ఇయ్యకుండా కూడా తాను అడ్డుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆమెకు ఫ్యాక్టరీ వ్యవహారాలు తెలుస్తున్నాయి. చిన్న పిల్లల పేర్లు కూలీలుగా రిజిస్టర్ లో వుండవు వాళ్ళను ఎప్పుడయినా పీకివేయవచ్చు. మరెవరినైనా వేసుకోవచ్చు. ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్ వారు డైరెక్టుగా అరణ్యాలలోని గ్రామవాసులతో సంబంధాలు పెట్టుకోరు. పెట్టుకోలేరు. మధ్య దళారి అవసరం రమేష్ లాంటి వ్యక్తులు ఆటవికులతో స్నేహితుడిలాగ సంబంధాలు పెంచుకొని వాళ్ళకేదో మహా ఉపకారం చేస్తున్నట్లు వాళ్ళ సంతానాన్ని ఫ్యాక్టరీలో కూలీలుగా చేరుస్తాడు. అందుకు బోలెడు పోటా పోటీలు! అంచేత అటూ, ఇటు రమేష్ కి అతడి అనుచరులకి కమీషన్ దక్కుతుంది.

 Previous Page Next Page