Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 31


    ఆ సలీంశంకర్ అనేవాడెవడో జపాన్ వెళ్ళిపోయే వరకూ తన ప్రాణాలు ప్రమాదంలోనే వుంటాయి.

    ఆమెకు ఒకందుకు సంతోషం వేసింది.

    తనవల్ల తన కుటుంబానికి ఏ కష్టమూరాలేదు.... తనా ఇంటికి వెళ్ళనంత కాలమూ తన వాళ్ళకి పర్వాలేదు.
   
    .....ఆమె మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఏ శక్తో తనకి సాయంచేసి తన కుటుంబాన్ని రక్షించింది. లేకపోతే తనకి కిటికీ తలుపు తెరవాలని ఆ క్షణం అనిపించడం ఏమిటి? నెంబర్ ప్లేట్ మీద పువ్వు గుర్తు కనిపించడమేమిటి? ఆ ఇంట్లో తను పట్టుబడితే జరగబోయే దృశ్యం, ఒక కలలాగా, ముందే కళ్ళముందు కదలాడటమేమిటి? తన తల్లి చేసుకున్న పుణ్యం, తండ్రి అనుక్షణం చేసే భగవత్ర్పార్థన ఇవే వాళ్ళని రక్షించాయి.

    ఆమె అక్కణ్ణుంచి కదిలింది. వంద గజాల దూరంలో మెయిన్ రోడ్డు వుంది. శవాల్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్నారు.

    మెయిన్ రోడ్డు మీదకి రాగానే చుట్టూ చూసింది.

    అప్పుడే వెలుగు రేఖలు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి.

    ఆ వెలుగులో ఆహ్వానిస్తున్నట్టు కనిపించింది పోలీసు స్టేషను.


                                                   *    *    *

    "ప్లీజ్... కమిన్.." అంత ప్రొద్దున్నే లోపలికి ప్రవేశించన ఇరవయ్యేళ్ళ అమ్మాయిని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టరు.

    బయట సెంట్రీలేడు. రైటరు బల్లమీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. డ్యూటీనుంచి వెళ్ళిపోవడానికి అప్పుడే ఆయత్తమవుతున్నాడు ఇన్ స్పెక్టరు. ఆమెను ముందు అనుమానంగా చూశాడు. తరువాత చదువుకున్న స్త్రీ అని గ్రహించి సర్దుకున్నాడు. ఆమెకి కూడా అతడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ గుర్తు రాలేదు.

    "నేనొక విషయం చెప్పడానికి వచ్చాను-"

    "దేని గురించి-"

    "మాఫియా-"

    ఇన్ స్పెక్టర్ చేతిలో బాల్ పాయింట్ పెన్ను క్రిందపడింది. "ఏమిటీ?" అని రెట్టించాడు.

    "అవునుసార్" అంటూ చెప్పడం ప్రారంభించింది. విష్ణుశర్మని వాళ్ళు ఎందుకు చంపిందీ, అతడి వుత్తరాల సంగతీ, తను పోలీసు అధికారికి ఆ వుత్తరాన్ని ఇవ్వడం అంతా వివరంగా చెప్పింది. చెపుతూంటే మధ్యలో ఆమెకి దుఃఖం వచ్చింది. ముఖ్యంగా డాక్టర్ హరనాథరావు గురించి చెపుతున్నప్పుడు...... తమాయించుకుని, కళ్ళు తుడుచుకుంటూ మొత్తం మీద చెప్పడం పూర్తి చేసింది.

    ఇన్ స్పెక్టర్ లో చలనం లేదు. శిలాప్రతిమాలా వింటున్నాడు. ఆమె పూర్తి చేయగానే, "ఆ వుత్తరం ఎక్కడుంది" అని అడిగాడు.

    "శ్రీనివాసరావు దగ్గిర వుండేది. అతడిని కూడా చంపేశారు. బహుశ వాళ్ళకి చేరి వుంటుంది"

    "మీరా వుత్తరాన్ని చదివారా?"

    ఆమె తటపటాయించింది. ఆమెకి శ్రీనివాసరావు మాటలు గుర్తొచ్చాయి. 'చదివాను' అంటే రేపు కోర్టులో సాక్ష్యం ఇవ్వవలసివుంటుంది.

    "చ.....చదవలేదు. శ్రీనివాసరావు దగ్గిర చూసానంతే" అంది.

    "మీరు అబద్ధం చెపుతున్నారు. మీరు చదివారు".

    ఆమె తలెత్తింది. అతడు ఆమెవైపే సూటిగా చూస్తున్నాడు. ఆమె మాట్లాడలేదు.

    "మీరు నిజం చెప్పడం మంచింది".

    ఆమె జవాబు చెప్పలేదు.

    "మీ ప్రాణాలు ఎంత ప్రమాదంలో వున్నాయో మీకు తెలియడంలేడులా వుంది. ఆ విషయం పూర్తిగా చెప్పేస్తే మీకు పోలీసు రక్షణ లభిస్తుంది. ఈ విషయం మీలో మీరే దాచుకుంటే ఈ స్టేషన్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం మిమ్మల్ని వాళ్ళు చంపేస్తారు. చంపేసి మాకు సాక్ష్యం మిగలకుండా చేస్తారు. మీ వెనుక మేమున్నామన్న ధైర్యంతో అంతా నిర్భయంగా చెప్పండి....."

    ఆమాత్రం ఓదార్పుకి ఆమె చిగురుటాకులా కదిలిపోయింది. అలలు అలలుగా దుఃఖం వచ్చింది. అప్పటి వరకూ బింకంగా వున్నది, ఆ ఆప్యాయతకు చిన్నపిల్లలా రోదించడం మొదలుపెట్టింది. నిశ్శబ్దంగానే ఆమె చాలాసేపు అలా రోదించి కళ్ళు తుడుచుకుంది. ఆమె వయసెంతనీ? అక్కడ వయసు కూడా ముఖ్యం కాదు. ఆమె పెరిగిన వాతావరణం..... అదీ ముఖ్యం! శుద్ధ శోత్రియ వంశంలో పుట్టి పెరిగిన ఆ ఆడపిల్ల - విధి విసిరేసిన పావులా వచ్చి ఈ నరరూప రాక్షసుల విషవలయంలో చిక్కుకుంది. ఆ రాపిడి వేగానికి తట్టుకోలేక ఏ చిన్న ఆధారం దొరుకుతుందా అని చూస్తోంది. ఇలాటి ప్రపంచం ఒకటి వుంటుందని ఆమె కలలో కూడా వూహించలేడు.

    "నేనా వుత్తరం చదివాను"

    "గుడ్. ఏముంది వుత్తరంలో...?"

    ఆమె ఎక్కడనుంచి ప్రారంభించాలా అని ఆలోచిస్తూ వుండగా అతడు అన్నాడు. "ఆ వుత్తరంలో వున్న విషయాలని బట్టి మీకెంత ప్రొటెక్షన్ ఇవ్వాలా అన్నది మేము ఆలోచిస్తాము".

    ఆమె చెప్పడం ప్రారంభించింది. ఆ వుత్తరంలో ప్రతీ చిన్న విషయాన్ని. ప్రతీ వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్పింది. అతడు పూర్తిగా వినలేదు. మొదటి రెండు  వాక్యాలు వినగానే అతడి మొహంలో రక్తం పూర్తిగా ఇంకిపోయింది. "మీరు... మీరు చాలా ప్రమాదంలో వున్నారు" అన్నాడు.

    ఆమె తలదించుకుంది. "నాకు తెలుసు"

    "సలీంశంకర్ బదులు జపాన్ మరెవర్నో పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరు వెల్లడి చేసిన మరుక్షణం ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి జాగ్రత్తలు తీసుకుంటుంది. అతడు ఉరికంబం ఎక్కేవరకు ప్రతీక్షణము అతడిని మేము గమనిస్తాం. అతడు మరణించడం ఖాయం. కానీ మీ సంగతి? ఇన్ని విషయాలు తెలిసిన మిమ్మల్ని ఆ తరువాతయినా వాళ్ళు వదిలి పెడతానుకోను".

    "నేను వెళ్ళిపోతాను".

    "ఎక్కడికి?"

    "ఎవరికీ కనపడని చోటుకి" అందామె తొందరగా. "అందరూ అంతా మర్చిపోయాక తిరిగి వస్తాను".

    "వాళ్ళు ఆ విషయాన్ని అంత తొందరగా మర్చిపోరు మిస్ ఉత్పలా!"

    "అయితే ఎప్పటికీ తిరిగిరాను".

    చిన్నపిల్లలా ఆమె ఇలా అనడం చూసి ఇన్ స్పెక్టర్ నవ్వేడు. అయితే ఈ సారి ఉత్పల తలదించుకోలేదు. "ఏమండి సార్? అర్దరాత్రి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెడుతున్నాను. మీ పోలీస్ స్టేషన్ సంగతి చూసేసరికి ఈ ఆలోచన వచ్చింది తప్ప అంతవరకూ లేదు. నేను మరణించేలోపులో కనీసం ఈ విషయాలన్నీ మీకు చెపుతే మీరు చర్యలు తీసుకుంటారని ఆశ! నేను చెప్పినట్లు కాకుండా మీరు ఎంక్వయిరీ చేయండి. ఈ ఒక్క విషయమూ సాయంచేస్తే ఇక నేను సాక్ష్యం ఇచ్చే అవసరం కూడా వుండదు. ఆ తరువాత నా అదృష్టం ఎలా వుందో అలా జరుగుతుంది. కనీసం ఇంతమందిని హత్య చేసిన ఆ సలీంచి ఉరికంబం ఎక్కించామన్న సంతృప్తి మిగులుతుంది".

    "మీ ధైర్యాన్నికి జోహార్లు. అన్నట్లు సలీంశంకర్ అంటే గుర్తొచ్చింది. మీ  ఇంటికి మోటార్ సైకిల్ మీద వచ్చింది వాళ్ళే అని మీకెలా తెలిసింది".

    "దానిమీద పువ్వు గుర్తు వుంటుంది. దొంగ సరుకు రవాణా చేసే వాహనాల మీద, వాళ్ళ జీపుల మీద అన్నిటి మీద అలాంటి గుర్తే వుంటుంది. ఒకర్నొకరు గుర్తుపట్టి రక్షించుకోవడానికి అదే గుర్తుట. విష్ణుశర్మ వ్రాశాడు".

    "చాలా విషయాలు బయటకు తెలిసినట్టున్నాయే" కాగితం కలం ముందుకు తోస్తూ అన్నాడు. ".......మీక్కావల్సినంత టైమ్ తీసుకుని మీరా వుత్తరంలో చదివిన విషయాలన్నీ ఒకదాని తరువాత ఒకటి వ్రాయండి. ఏదీ మర్చిపోకుండా".

    ఆమె తటపటాయించింది.

 
    "మీరు నోటితో చెప్పిన విషయాలమీద నేను ఇన్వెస్టిగేషన్ ప్రారంభించలేను. ఈ కాగితం వుంటే కనీసం పోస్ట్ లో ఇది వచ్చిందని నాపై అధికారులకు చెప్పగలను. ఇదివుంటే ఇక మీ అవసరం వుండదు. మీరు చెప్పింది నిజమే.. పోలీసులు ఎంతకాలం మీకు రక్షణ కల్పించగలరు? ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది. అఫ్ కోర్స్ పోలీసు అధికారిగా నేనా సలహా ఇవ్వకూడదనుకోండి. కానీ ఒక అన్నయ్యగా చెపుతున్నాను. వ్రాయండి. ఒకసారి ఈ విషయాలన్నీ బయటపడితే అది అందరికీ తెలిస్తే ఇక ఎంతమందినని చంపుతారు వాళ్లు? తెలిసిన చాలా మందిలో మీరు ఒకరయిపోతారు. అప్పుడిక నిర్భయంగా బయటకు రావొచ్చు మీరు".

    ఇంతసేపూ తనకా ఆలోచన రానందుకు తిట్టుకుంది. కాగితం కలం తీసుకుంటూ వుండగా "ఈ వూళ్ళో ఎవరైనా స్నేహితులున్నారా మీకు? బయటికి రాకుండా వాళ్ళింట్లో వుండొచ్చు కొంతకాలం?" అని అడిగాడు.

    "మా వీథిలోనే ఒకరిద్దరు అమ్మాయిలున్నారు".

    "ఆ వీథే అంటే కష్టం"

    "అవును, అన్నట్టు బెజవాడలో మా బాబాయ్ వున్నాడు. వాళ్ళింట్లో కొంతకాలం వుండొచ్చు".

    " బెస్ట్ అక్కడికి వెళ్ళండి. ఇంకెవరూ లేరా? స్నేహితులూ- బంధువులూ...."

    "ఊహూ..."

    "మా జీప్ లోనే మిమ్మల్ని బస్ స్టాండ్ కి పంపిస్తాను. మఫ్టీలో దూరంగా మా వాళ్ళుంటారు. మీరు  బెజవాడలో వున్న విషయం సాధ్యమైనంతవరకూ మీ ఇంటివాళ్ళకు కూడా తెలియనివ్వకపోవడం మంచిది. వీళ్ళు చిత్రహింస పెట్టయినా అవతలి వాళ్ళనుంచి రహస్యాలు రాబట్టడంలో సిద్ధహస్తులు".

    తనింత దూరం ఆలోచించలేదు. ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.

    "మీరు వ్రాయండి. మీకు తెలిసిన విషయాల్తో మొత్తం గాంగ్ అంతా బయట పడితే ఇక అసలు శత్రుశేషమే వుండదుకదా!"

    ఆమె వ్రాయడం ప్రారంభించింది. వుత్తరం మొత్తంలో వున్న విషయాలన్నీ ఏకాగ్రతతో గుర్తుతెచ్చుకుని ఒక్కొక్కటీ వరుసగా అంకెలువేసి మొదలు పెట్టింది.

    1. బీహార్ రాష్ట్రంలో వున్న సాత్నాలా* బ్రిడ్జిమీద వసూలు చేసే టోల్ గేట్ సుంకం ప్రభుత్వం విధించినదికాదు. బందిపోట్లనుంచి లారీల్ని రక్షిస్తున్నామన్న నెపంమీద కేవలం దాదాగిరితో* కోల్- మాఫియా వసూలు చేస్తుంది. దీని వెనుక వున్నది ప్రస్తుత మినిస్టర్ సంపత్ లాల్. మీసా క్రింద వసంత్ దాదా అరెస్ట్ అయినప్పుడు అతడిని విడుదల చెయ్యవలసిందిగా ఆర్డరు చేసింది ఇతడే.

    2. ఆంధ్రప్రదేశ్ లోని ఒకపెద్ద పట్టణంలో కొత్తరకం స్కీమ్ క్రింద విపరీతమైన చౌక ధరలకి రకరకాల వస్తువులు అమ్మడం మొదలుపెట్టి ప్రజల్ని ఆకర్షించిన సప్తగిరి..."

    "ఎక్స్ క్యూజ్ మీ మాడమ్..." ఉత్పల తలెత్తింది. "మీకోసం జీప్ ఏర్పాటు చేస్తాను. మీరు వ్రాస్తూ వుండండి".

    ఆమె తలదించలేదు. అతడినే చూస్తూ వుంది.

    అతడు నిలబడ్డప్పుడు-

    అప్పుడు ఫ్లాష్ లా మెరిసింది ఆమె మెదడులో

    అతడు లోపలికి నడుస్తూ వుండగా-

    అప్పుడు స్థిరపడింది అతడినెక్కడ చూసిందో,

    అదే నడక- అదే విగ్రహం- అదే మొ...హం.

    అనూషని అరెస్ట్ చేసిన ఇన్ స్పెక్టర్ అతడు.

    ......ఆమె చేతిలో పెన్ జారిపోయింది. కన్నార్పకుండా అతడు వెళ్ళినవైపే చూస్తూ వుండి పోయింది. ఆమెకేదో అపశకునంలా తోచింది.

 Previous Page Next Page