"ఈ సమయంలో మననెవరు డిస్టర్బ్ చేస్తారు?" అంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది.
తలుపు తీయగానే ఎదురుగా కనిపించిన మనిషిని చూడగానే కెవ్వున కేకవేసి వెనక్కి పరుగెత్తుకొచ్చి భర్తను గట్టిగా పట్టుకుంది.
"ఏమయింది సిరీ....ఎందుకలా అరిచావ్?" అతను కంగారుగా లేస్తూ అడిగాడు.
ఆమె భయంతో వణికిపోతూ "ఆ రోజు.... ఆ రోజు..." అంటూ ఏదో చెప్పబోయింది. అతనది గమనించి గుమ్మంవైపు చూశాడు, ఎదురుగా ఇబ్రహీనం. రవితేజ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తనని చూడగానే అతని ముఖంలో రంగులు మారటం గుర్తించి నవ్వాడు ఇబ్రహీం.
అంతలోనే తేజా తన తొందరపాటును కప్పిపుచ్చుకుంటూ చూపు త్రిప్పి శూన్యంలోకి చూస్తూ... "యెవరు.... యెవరు.... యెవరు మీరు?" అని గద్దించినట్లుగా అడిగాడు.
"నన్ను గుర్తుపట్టలేదా రవితేజా?" ఇబ్రహీం కంఠం కంచులా మ్రోగింది. "లేదు. మీరు... మీరు......." అతని గొంతుగుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అన్నాడు.
"వ్వాహ్..... మిస్టర్ రవితేజ మళ్లీ నాటకమాడుతున్నావ్?"
"నో.... నాటకమేంటి? అసలు మీరెవరో ముందు చెప్పండి!"
"బస్..... ఈ వేషాలు ఇదివరకే చూశాను. ఇక నువ్వో మేమో తేల్చుకోవడానికే వచ్చాను. ఇక నటించాలని చూడకు."
ఒహూ! అయితే నువ్వు గోల్డ్ స్మగ్లర్ ఆలీఖాన్ వన్నమాట. ఇంతకీ ఏం కావాలి నీకు?" అతని కంఠంలో పోలీసాఫీసర్ తాలూకు ధైర్యం ధ్వనించింది.
"నేనెందుకొచ్చానో నీకు తెలుసు రవితేజా! కానీ, నీ కసలు యేమీ తెలీనట్టు మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావ్. నీ కసలు కళ్ళే లేనట్లు అటు పోలీస్ శాఖనూ, ఇటు నీ ఇంటివాళ్ళనీ అమోఘంగా నమ్మించావ్, కానీ మమ్మల్ని మాత్రం వెయ్యి జన్మలెత్తినా నమ్మించలేవు. ఆ రెండు బ్రీఫ్ కేసులూ నాకు హండో వర్ చెయ్యి. వచ్చే లాభాన్ని ఫిప్టీ ఫిప్టీ పంచుకుందాం. లేకపోతే నీ ఖర్మ. నిన్నూ, నీ పెళ్ళాన్నీ ...ఆఖరికి ఆ కమిషనర్ గాడ్ని కూడా చంపి, నా బంగారం నేను ఎలా స్వాధీనం చేసుకోవాలో నాకు బాగా తెల్సు. ఆపైన నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో" అంటూ ఫ్యాంటు జేబులోంచి రివాల్వర్ తీసి గురిపెట్టాడు.
రవి పరిస్థితి ఇరకాటంలో పడింది. "చూడు మిస్టర్.....ఆ బ్రీప్ కేసులు నా దగ్గరున్నా నేను నీతో చేతులు కలపను. నేను ప్రభుత్వం మనిషిని. ప్రాణం పోయినా నేనాపని చేసేవాణ్ణికాను. ఎందుకు అనవసరంగా నా చుట్టూ తిరుగుతూ నీ టైమ్ వేస్తు చేసుకుంటావ్? నన్నూ నా వాళ్లని చంపినంత మాత్రాన గవర్నమెంట్ కి హాండోవర్ చేసిన ఆ గోల్డ్ బిస్కెట్స్ తిరిగిరావు" సాధ్యమైనంత కూల్ గా చెప్పాడు.
"తేజా! నువ్వు బ్రతకనేర్చిన వాడివనుకుని ఇంతసేపూ ఓపిక పట్టాను. కానీ ఇప్పుడే అర్థమయింది. నువ్వు బ్రతకడం చేత గాని మూర్ఖుడివని. నీ నుండి నా సొమ్ము ఎలా రాబట్టుకోవాలో తెలీనివాణ్ణి కాదని గుర్తు చేయటానికే వచ్చాను" అంటూ ఓ చేత్తో రివాల్వర్ పట్టుకుని ముందుకు అడుగువేసి సిరి జుట్టుపట్టి తన వేపుకు లాక్కున్నాడు.
'కెవ్వు' మని అరిచింది సిరిచందన.
ప్లీజ్, నా భార్యనేం చేయకు" కంగారుగా లేచి గాల్లో చేతులు సాచి ముందుకొస్తూ అన్నాడతను.
"స్టాప్ దేర్....." రివాల్వర్ అతని గుండెలకు గురిపెడుతూ అరిచాడు ఇబ్రహీం. రవితేజ అతనికి మూడడుగుల దూరంగా ఆగి పోయాడు.
ఇబ్రహీం నవ్వుతూ సిరిజట్టు గట్టిగా ఒడిసి పట్టుకుని ముఖాన్ని తనవేపుకు తిప్పుకుంటూ పెదాలను ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగుతున్నాడు. అసలు ప్లానంతా రవితేజలో రియాక్షన్ తెప్పించటం కోసమే. అది ఫలించింది.
రవితేజ ఇక నిగ్రహించుకోలేకపోయాడు. నించున్న చోట నుంచి కుడికాలుని బలంగా కదిపాడు. పుట్ బాల్ ఆడే క్రీడాకారుడి టెక్నిక్ వల్ల రివాల్వర్ బంతిలా వెళ్లి దూరంగా పడింది. ఒక్కక్షణం షాక్ తిన్నాడు ఇబ్రహీం ఖాన్. ఆ సమయం చాలా ఐ.పి.యస్ చేసిన రవితేజకు.
ఇప్పుడు రివాల్వర్ అతని చేతిలో వుంది. ఇబ్రహీం ఖాన్ ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయాడు. మృత్యుదేవతలా రివాల్వర్ గురిపెట్టి వున్నతేజాని చూడాగానే అప్రయత్నంగా సిరిని వదిలి పెట్టాడు.
రవితేజ చూపులు శూన్యంలో లేవు. సూటిగా ఖాన్ కళ్లల్లోకి చూస్తున్నాడు.
"రవితేజా! నన్ను తక్కువగా అంచనా వేయకు, బయట నా మనుషులు ఇద్దరు ఉన్నారు. రివాల్వర్ పేలిందంటే ఇక్కడ కొస్తారు. నాకేమైనా జరిగిందంటే నిన్నూ, నీ భార్యనీ ముక్కలకింద నరికేస్తారు. ఖబడ్దార్' ఖాన్ ఏ మాత్రం బెదరకుండా అన్నాడు.
"ఏడిశారు. ముందు నిన్నూ, తర్వాత నీ వాళ్ళనీ షూట్ చేస్తాను."
"అది నీ వల్ల కాదు. కేవలం నీకు కళ్ళుపోలేదని నిరూపించటానికే ఈ నాటకం ఆడాను. పాపం ఇన్ని రోజులూ నేషనల్ అవార్డు కొట్టేసే లెవెల్లో యాక్షన్ చేశావు. ఇప్పటికయినా నువ్వాడింది నాటకమని రుజువైంది కనుక ఇక ఆ గోల్డ్ బిస్కెట్స్ ఎక్కుడున్నాయో చెప్పు."
ఏ దైర్యంతో ఖాన్ అంత సూటిగా నిలబడి రివాల్వర్ కి బెదరకుండా మాట్లాడుతున్నాడో రావితేజకి అర్థంకాలేదు.
"చెప్పకపోతే....."అన్నాడు.
"చెప్పకపోతే....సింపుల్. నీ కళ్ళముందే నీ భార్యని రేప్ చేస్తాను".
"ఇడియట్.....ఎంత ధైర్యం నీకు?" రవితేజ చూపుడు వేలు ట్రిగ్గర్ పై బిగుసుకుంది.
ఖాన్ కళ్ళలో ఎలాంటి బెదురూ లేదు. చిరునవ్వు అతని ముఖంలో తాండవిస్తోంది.
ఇదంతా అయోమయంగా చూస్తోంది సిరిచందన. భర్తకి కళ్లు పోలేదన్న విషయం జీర్ణం కావడానికి ఆమెని ఇంతసేపు పట్టింది. ఇన్నిరోజులూ భర్త కళ్లులేనట్లు నాటకమాడటం ఆమెకి షాక్ కి గురిచేసింది.
రవితేజ ఇక ఆలస్యం చేయలేదు. ముంచును రాబోతున్న ఖాన్ ని ఆపటంకోసం ట్రిగ్గర్ బలంగా నొక్కాడు.
'క్లిక్' మన్న శబ్దం. బుల్లెట్ బయటికి రాలేదు. కంగారుని అణుచుకుంటూ మళ్ళీ నొక్కాడు. అదే శబ్దం!
అప్పుడు తెలిసిందతడికి-అంతసేపూ ఖాన్ ఎంత ధైర్యంగా నిలబడి ఎలా మాట్లాడగలిగాడో!
గది ప్రతిధ్వనించేలా నవ్వాడు ఖాన్.
రివాల్వర్ తీస్తూ "ఇప్పుడర్థమయిందా రవితేజా! ఈ ఖాన్ అంటే ఏమిటో డబుల్ గేమ్ ఆడటం నీ ఒక్కడికే చేతనవుతందనుకున్నావా? మూడు సంవత్సరాలు బొంబాయి నగర పోలీసుల్నే గడగడలాడించిన నన్ను అంత తక్కువ అంచనా వేయకు" అంటూ గుమ్మంవైపు తిరిగి-
"జేమ్స్,దాన్నిలాకెళ్ళి జీప్ లో పడేయండ్రా" అని ఆజ్ఞాపించాడు.
ఇద్దరు అనుచరులు సిరిని చెరోవైపు కవర్ చేసి లాకెళ్ళాసాగారు. అప్పుడు తేరుకుంది సిరిచందన షాక్ నుండి. కానీ, ఏమీ మాట్లాడలేదు. కనీసం చిన్న కేక కూడా వేయలేదు. నిర్లప్తంగా జరిగేది చూడసాగింది.
"మిస్టర్ ఖాన్! మాకేమీ తెలీదు. దయచేసి మమ్మల్నిలా వదిలెయ్!" రవితేజ నిస్సహాయంగా అడిగాడు.
"సారీ మిస్టర్ రవితేజ! నేను ఖూనీకోర్ ల నయినా నమ్ముతానుగానీ, మీ పోలీస్ డిపార్ట్ మెంట్ ను నమ్మను. అయినా నీ భార్యను నేనేం చేయను. రేపు రాత్రి పన్నెండు గంటల్లోగా నా రెండు బ్రీఫ్ కేసుల గోల్డ్ నా కప్పగించాలి. అప్పుడే భార్యను నీకు నిక్షేపంగా.....ఉహూ....పవిత్రంగా అప్పచెప్తాను. రేపు సాయంత్రం ఫోన్ చేస్తాను అవి ఎక్కడ అందించాలో! ఏమయినా తేడా వచ్చిందో నీ భార్యని ఘోరాతి ఘోరంగా రేప్ చేసి శవాన్ని నీకు గిప్ట్ గా పంపిస్తా"
"ప్లీజ్ ఖాన్ నా భార్యనేం చేయకు. కమీషనర్ తో మాట్లాడి అవి ఏమయ్యాయో కనుక్కుంటాను."
"నో.... నీ నక్కజిత్తులు నేను నమ్మను. నా సంగతి నీకింకా బాగా తెలీదు పోలీసుల్తో కలిసి వచ్చి పిచ్చివేషాలు వేయాలని చూస్తే పరిణామాలు విపరీతంగావుంటాయ్" అని అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. రెండు నిమిషాల తరువాత బయట జీపు కదిలిన శబ్దం వినిపించింది.
8
"నీకు కళ్లు తిరిగి వచ్చినందుకు ఆనందించాలో, ఇలా జరిగినందుకు బాధపడాలో తెలియటంలేదు" అన్నాడు కమిషనర్ అస్వత్ధామ. రవితేజ సమాధానం చెప్పలేదు.
"అసలు నీకు కళ్ళెలా వచ్చాయి?" అని అడిగాడు కమిషనర్.
"ఏమో నాకు తెలీదు. ఉదయం తలుపు కొడుతున్న శబ్దం వినిపించి కళ్ళు తెరిచాను . నాకు అంతా కనిపించసాగింది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే సరికే సిరిచందన తలుపు తీయటం, ఆ గూండాలు లోపలికి ప్రవేశించటం జరిగిపోయింది" అన్నాడు రవితేజ.
"రవీ! నా మాట విని నేను చెప్పినట్లు చేయి. సిరిచందనకి ఏమీకాదు. మొత్తం పోలీసు ఫోర్సునంతా ఉపయోగిద్దాం. వాళ్ళనెలాగైనా సరే మనం పట్టుకోవచ్చు."
"వద్దు సార్. మన ప్లాన్ తెలిస్తే వాళ్ళు నా భార్యకి ఏమైనా ప్రమాదం తలపెట్టొచ్చు" ఖండితంగా చెప్పాడు రవితేజ.
వాళ్ళిద్దరిమధ్య ఈ విషయమై చాలాసేపు వాదోపవాదాలు జరిగాయి చివరికి కమీషనర్ ఆ గోల్డ్ బిస్కెట్స్ ని స్మగ్లర్స్ కి అందజేయటానికి ఒప్పుకోక తప్పలేదు. రవితేజ అన్నాడు "ఆ బ్రీఫ్ కేసుల్ని మీరు ప్రభుత్వానికి హాండో వర్ చేసి వుంటే బావుండేదేమో". దానికి వప్పుకోనట్టు అశ్వద్ధామ అన్నాడు. "అవి పోలీస్ డిపార్ట్ మెంట్ దగ్గిర వుండబట్టే కదా స్మగ్లర్స్ మళ్ళీ తెరపైకి వచ్చారు."
"కాని నా భార్య అపాయంలో పడింది కదా!"
రవితేజ చెబుతున్న దాంట్లో కూడా నిజం కనబడింది. మరీ పంతాలకిపోతే అక్కడ ఒక ప్రాణహాని జరగొచ్చు. మొత్తం విషయం బయటపడవచ్చు.
కమీషనర్ లేస్తూ "బ్రీఫ్ కేసులు నేనే బ్యాంక్ లాకర్ లో పెట్టాను. వాటిని వెంటనే తీసుకొస్తాను. అవెక్కడున్నాయో డిపార్ట్ మెంట్ కి తప్ప మరెవరికీ తెలీదు' అని లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన అరగంటకి ఫొనోచ్చింది.
రవితేజ రిసీవర్ ఎత్తాడు "యస్...."
"హలో మిస్టర్ రవితేజా.....హౌ ఆర్ యూ?" అట్నుంచి ఇబ్రహీంఖాన్ గొంతు వినిపించింది.
"ఖాన్! కుశల ప్రశ్నలు వేసుకోవటానికి మనమేం బంధువులం కాము. తొందరగా విషయానికి రా"
"ఓ.కే గోల్డ్ తిరిగి అప్పగించటానికి మీరొప్పుకున్నట్టేగా?"
"ఒప్పుకుంటున్నాను. ఆ గోల్డు ఎక్కడ, ఎప్పుడు, ఎలా అందజేయమంటావో చెప్పు"
ఇబ్రహీంఖాన్ చెప్పాడు. "ఈ రోజు రాత్రి సరిగ్గా పదకొండు గంటలకు అరకువేలిలో పెదరాయి చెట్టు దగ్గరకు కారులో వచ్చి ఆబ్రీఫ్ కేస్ లు ఆక్కడ పెట్టి, తిన్నగా మరో రెండు కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. ఆ తరువాత వెనక్కు తిరిగి మళ్ళీ వస్తే ఆ బ్రీఫ్ కేసులు పెట్టినచోటే నీ భార్య నిలబడి వుంటుంది."
"సరే అయితే. నువ్వు చెప్పినట్లే చేస్తాను"
"ఈ విషయంలో నువ్వేదైనా అతి తెలివితేటలు ప్రదర్శించినా, పోలీస్ సహాయం తీసుకున్నా నీ భార్య ప్రాణాలు పోతాయి. నా సంగతి నీకు తెలుసుగా?"
"తెలుసు"