Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 30


    ఆయన నవ్వేడు.
    
    ఆయన ఎందుకు నవ్వుతున్నాడో నాకు అర్ధంకాలేదు.
    
    ఆయన అన్నాడు-"ఇప్పుడు నా పరిస్థితి అంతకన్నా గొప్పగా ఏమీలేదు ఆనంద్. తరళ నిన్ను తప్ప ఎవర్నీ చేసుకోనని పట్టుబడుతూంది". "నా సంగతి తెలిశాక కూడానా?" విస్మయంగా అడిగాను. "ఆ! తెలిశాక కూడా".
    
    నా నోట మాట రాలేదు. తెల్లబోయి కన్నార్పకుండా చూస్తూ వుండిపోయాను. ఏం మాట్లాడాలో తోచలేదు.
    
    గుండె సరిగ్గా పనిచెయ్యని ఈ మనిషితో గూడు పంచుకోవటానికి తరళ, ఆ విషయం తెలిశాక కూడా సిద్దపడుతుంది!! ఇది ప్రేమా? మూర్ఖత్వమా? చిన్న తనమా? మంకు పట్టా?
    
    ఆ అమ్మాయికంటే బుద్దిలేదు. ఈయన విచక్షణాజ్ఞానం ఏమైంది?
    
    నా ఉద్దేశ్యం గ్రహించినట్టుగా ఆయన అన్నాడు-
    
    "మిగతా అమ్మాయిల్ని పెంచినట్టు తరళని పెంచలేదు నేను. తను అన్నమాట ఏదైనా సరే - దాన్ని కాదంటే ఆ అమ్మాయి బతకదు. చచ్చయినా సరే- సాధించి తీరుతుంది. అంతవరకూ ఎందుకూ? నా విషయమే తీసుకో, ఏ తండ్రయినా యిలా వస్తాడా? బ్రతుకుతాడో లేదో తెలియని మనిషిని అల్లుడివి కమ్మని ప్రాధేయ పడతాడా?"
    
    "ఏం మాట్లాడుతున్నారు మీరు?"
    
    "నా కూతుర్ని చేసుకొమ్మని అడుగుతున్నాను. నీ సర్జెరీ విషయం నా కొదిలిపెట్టు. అమెరికానుంచి డాక్టర్లని తెప్పిస్తాను".
    
    "బైపాస్ సర్జెరీ అంటే టాన్సిల్స్ ఆపరేషన్ కాదు. డాక్టర్లు అమెరికానుంచి వచ్చినా ఆఫ్రికానుంచి వచ్చినా బ్రతికే ఛాన్సు సగం సగం మాత్రమే".
    
    "ఆ విషయం నాకు తెలుసు".
    
    "తెలిసి ఈ రాయబారానికి వచ్చారా? చూస్తూ చూస్తూ ఏ కన్నతండ్రీ తన కూతురు విధవరాలవ్వటానికి వప్పుకోడనుకుంటాను. ఆ ఛాన్సు సగం వున్నాసరే".
    
    "ఇవన్నీ నేను ఆలోచించ లేదనుకున్నావా? దాని కెన్ని విధాలా చెప్పి చూశాను. వినటంలేదు".
    
    "నేను మీ పొజిషన్ లో వుంటే గదిలో పడేసి నాలుగు రోజులు భోజనం పెట్టకుండా వుండేవాడిని. ఆ గారాబం కాస్తా తగ్గిపోయివుండేది".
    
    "నేను నీ పొజిషన్ లో వుంటే ఏం చేసి వుండేవాడినో తెలుసా?" అన్నాడాయన.
    
    "ఏం చేసి వుండేవారు?"
    
    "మృత్యు ముఖంలో వున్నవాడని తెలిసి కూడా పెళ్ళికోసం పట్టుబట్టిన అమ్మాయిని చచ్చినా వదులుకుని వుండేవాడిని కాను. అంతగా ప్రేమించేవాళ్ళు దొరకటం అదృష్టం... అసాధ్యం".
    
    నిజమే అయి వుండవచ్చు. నాకు మనసులో ఒక మూల ఆశ్చర్యంగా వుంది. ఆ అమ్మాయిది ఇన్ ఫాక్చుయేషన్ కాకుండా అది ప్రేమే అయి వుంటే దానికి జోహార్లు. అది నా కవసరం లేని అదృష్టమే అయినా ప్రేమించటం మాత్రం అపూర్వం.
    
    "మీకు నాకన్నా పాతికేళ్ళ వయసు ఎక్కువ వుండి వుంటుంది. ఒక ప్రశ్నకి సమాధానం మీ అనుభవంతో చెప్పండి".
    
    "అడుగు" అన్నారాయన.
    
    "జీవించటం ముఖ్యమా? ఆనందంగా జీవించటం ముఖ్యమా?"
    
    ఈ ప్రశ్న వూహించని ఆయన తెల్లబోయాడు. కానీ గొప్ప వ్యాపారవేత్త ఆయన! తన తడబాటు కనబడనివ్వకుండా వెంటనే తేరుకుని "జీవించటం అంటూ కొనసాగుతే, ఆనందంకోసం ఎలాగూ వెతుక్కుంటాడు మనిషి కాబట్టి జీవించటం ముఖ్యం" అన్నాడు.
    
    "కాబట్టి నేను మీ దగ్గిర రెండు లక్షలు తీసుకుని, ఆపరేషన్ చేయించుకుని జీవించటం ప్రారంభించాలి. దానికి ప్రతిగా మీ కూతుర్ని వివాహమాడాలి. మీ థియరీ ప్రకారం జీవించటం మొదలు పెట్టాక, వివాహం జరిగాక, ఎలాగూ అందులో ఆనందం వెతుక్కోవటం తప్పదు కాబట్టి మేమిద్దరం సుఖంగా వుంటాం".
    
    "అంతే అంతే" అన్నాడాయన.
    
    "నేను మీ దగ్గిర రెండు లక్షలూ తీసుకుని, లేదా ఆపరేషన్ అయ్యాక మూటాముల్లె సర్దుకుని వెళ్ళిపోయాననుకోండి. మీ థియరీ అప్పుడూ కరెక్టే అవుతుంది కదా" అన్నాను.
    
    "వెళ్ళిపోయాక తీరిగ్గా ఆనందం గురించి వెతుక్కుంటాను".
    
    "కానీ నీ ఆపరేషన్ వివాహం జరిగాక కదా అయ్యేది" అన్నాడు. ఈసారి తెల్లబోవటం నా వంతయింది.
    
    "ఒకవేళ ఆపరేషన్ టేబిల్ మీద నేను చచ్చిపోతే"? అని అడిగాను.
    
    "నా కూతురు విధవరాలవుతుంది".
    
    "మీరు మహామూర్ఖులైనా అయివుండాలి. లేదా పిచ్చి వాళ్ళయినా అయివుండాలి" అన్నాను. ఆ మాటలకు ఆయనలో నేనూహించిన మార్పు కనపడలేదు. వేదాంతిలా "అవును" అన్నాడు. "....తరళలాంటి కూతురున్న తండ్రికి ఈ రెండు అర్హతలూ కరెక్టుగా సరిపోతాయి".    

 

    నేనేదో అనబోతూంటే ఆయన అడ్డుపడి- తనే అన్నాడు. "లేకపోతే నాలాటి తండ్రిని ఎక్కడన్నా చూశావా? ... 'నా కూతుర్ని వదిలిపెట్టు- లక్షిస్తాను. రెండు లక్షలిస్తాను' అనే తండ్రుల్నే చరిత్ర పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ చూసివుంటావు తప్ప 'నా కూతుర్ని చేసుకో రెండు లక్షలు పెట్టి ఆపరేషన్ చేయిస్తాను' అని అడిగే తండ్రిని నన్నొక్కడినే చూసివుంటావు. ఇదంతా ప్రారబ్ధం".
    
    ఆయన మాటల్లో నీలాటి బికారి దగ్గిర కొచ్చి నేను ప్రాధేయపడటం నా ప్రారబ్ధం కాక మరేమిటి-అన్న అర్ధం ధ్వనించి వుండవచ్చు. నేనది పట్టించుకోలేదు.
    
    నా కింకో ఆలోచన కూడా వచ్చింది. డబ్బుతో దేన్నైనా కొనవచ్చుననే ఈ తండ్రీకూతుళ్ళ అహంభావానికి తగిన గుణపాఠం చెప్పాలంటే-వివాహం చేసుకుని, ఆపరేషన్ అయ్యాక చెప్పా పెట్టకుండా చెక్కెయ్యటమే! కానీ క్షణాల్లోనే నా ఆలోచకి నాకే సిగ్గేసింది. నేను లేచి నిలబడి, చేతులు జోడించి, "మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు" అన్నాను.
    
    "ఇంతకీ నేను చెప్పిందీ-"
    
    "నా నిర్ణయంలో మార్పులేదు క్షమించండి-"
    
    ఆయన వెళ్ళిపోలేదు, ఆగి, "మళ్ళీ మరొకసారి ఆలోచించు" అన్నాడు. "ఇంక ఆలోచించేదేమీ లేదు. తరళకి తండ్రిగా మీరుపడే కష్టం చూస్తూ, ఆవిడకి భర్తగా పదవి స్వీకరించలేను. దానికి బదులు ఈ గుండెజబ్బుతో మరణించటమే మంచిదనుకుంటున్నాను".
    
    ఆయన మొహం ఎర్రబడింది. "నన్నేమైనా అను కానీ, నా కూతుర్ని మాత్రం ఏమీ అనకు. నేను భరించలేను".
    
    "నేను మీకంటే చిన్న వాడిని అయినా మీకో సలహా చెప్పటానికి సాహసిస్తాను. వింటే వినండి. పిల్లల్ని పెంచే విధానం ఇదికాదు. ఈ రోజు కాకపోతే రేపన్నా మీరు చిక్కుల్లో పడతారు మీ కూతురువల్ల-"
    
    ఆయన మొహం మరింత జేవురించింది. "కోరి వచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు" అన్నాడు.
    
    "మీరు మరీ మగ వరూధునిలా మాట్లాడుతున్నారు".
    
    ఆయన పెద్దగా అడుగుల శబ్దం చేసుకుంటూ కోపంగా వెళ్ళిపోయేడు అక్కన్నుంచి.

 Previous Page Next Page