ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇది సాధ్యపడదు.
తను అనవసరంగా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నానేమో అనుకున్నాడు. ఒకవేళ ఈ వ్యవహారంలో విఫలమైనా నష్టపోయేది ఏమీ లేదుకదా అన్న భావం ఇంకోవైపు. ఈ పరస్పర విరుద్ధమైన భావాల్తోనే అతడు విజిటర్ స్లిప్ మీద తన పేరు వ్రాసి లోపలికి పంపేడు. పదిహేను నిముషాల తర్వాత అతడికి పిలుపొచ్చింది.
అతడి పదేళ్ళ వ్యాపార జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత టెన్షన్..... అతడు చైర్మన్ చాంబర్స్ లోకి అడుగుపెడుతూ వుండగా అనుభవించేడు.
అంత చల్లటి ఎయిర్ కండిషన్ రూమ్ లోనూ అతడి నుదుటిమీద చిరుచెమట పట్టింది.
"చెప్పండి. మీ కోసం ఏం చెయ్యగలను?" చైర్మన్ అడిగేడు. కొంచెం రిలాక్సవటం కోసం బలంగా ఊపిరి పీల్చుకొని చైతన్య చెప్పటం మొదలు పెట్టేడు.
-తన ప్రాంతపు జాలర్లు..... వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు- వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బు వివరాలూ.... అంతా వివరంగా చెప్పేడు.
"గుడ్, రియల్లీ ఎక్సలెంట్....." అభినందిస్తున్నట్లు తలూపేడు చైర్మన్. "చెప్పండి, ఇంత కష్టపడి మూలధనాన్ని సంపాదించుకొన్న మీకు మా బ్యాంక్ ఎలా సాయపడగలదు?"
చైతన్య ముందుకు వంగి "ఓ కోల్డు స్టోరేజి పెడదామనుకొంటున్నాము" అన్నాడు.
ఎదురు కుర్చీలో వున్నాయనకి యాభయ్ ఏళ్ళ వయసుంటుంది. అందులో పాతికేళ్ళు బ్యాంకింగ్ అనుభవం వుండి వుంటుంది. తన సర్వీసులో ఎంతోమంది రకరకాల వ్యక్తులను చూసేడు. అనుభవంతో పండిపోయేడు. అంత అనుభవజ్ఞుడు కూడా ఈ మాటలకి అదిరిపడ్డాడు.
"ఏమిటీ-?" తను వింటున్నది నిజమేనా అన్నది నిర్థారణ చేసుకోవటానికే మళ్ళీ అడిగేడు.
"ఒక కోల్డు స్టోరేజి ప్లాంట్ పెట్టి రొయ్యలు ఎగుమతి చెయ్యాలనుకుంటున్నాం. మీరు అప్పు ఇవ్వాలి".
"ఎంత?"
"ప్లాంట్ కి రెండున్నర లక్షలు- వర్కింగ్ కి ఆరు లక్షలు".
'మీ తరపునుంచి ఎంత పెడతారు?"
"యాభయ్ వేలు".
తన ముందు కూర్చున్నవాడు బయట వర్షం వస్తోందని, ఏమీ తోచక సరదాగా లోపలికి వచ్చి తనతో హస్కు కొడుతున్నాడేమో అన్న అనుమానం ఛైర్మన్ కి వచ్చింది.
"యాభయ్ వేలు పెట్టుబడితో ఎనిమిదిన్నర లక్షలు అప్పివ్వమంటారా? సెక్యూరిటీ ఏమిటి?"
"శ్రమ!"
బ్యాంకు అధికారి వెనక్కివాలి, "క్షమించండి నేనేం చెయ్యలేను....."
"అంతేనంటారా.....?" అన్నాడు. "సెక్యూరిటీ లేకుండా అప్పివ్వరా?"
"అది ముఖ్య సమస్య కాదు. కానీ మీరు ఎలా సరుకు అమ్ముతారు? ఫ్యాక్టరీ ఎలా నడుపుతారు?? అన్నీ సమస్యలే".
ఇంతలో ప్యూన్ ఇంకో విజిటింగ్ కార్డు తెచ్చి బల్లమీద పెట్టేడు. "రమ్మను" అన్నాడాయన.
అంటే తననిక వెళ్ళమని. చైతన్య కుర్చీలోంచి లేచేడు.
"ఐయామ్ సారీ....." అన్నాడాయన.
"ఇట్సాల్ రైట్ సార్" అతడికీ ఈ పని అవుతుందన్న నమ్మకం లేదు. ఆయనకి షేక్ హ్యాండిచ్చి బయటకు రాబోతూ వుంటే తలుపు తీసుకొని విజిటర్ లోపలికి ప్రవేశించేడు.
చైతన్య తన ఆలోచనల్లో తను వుండి బయటికి వెళ్ళబోతున్నాడు. "వర్షం వల్ల ప్లయిట్ కాన్సిల్ అయి వుండిపోవల్సి వచ్చింది......." తనకి పరిచయమైన గొంతు విని చైతన్య వెనక్కీ తిరిగి చూసేడు.
అదే సమయానికి అతన్ని చూసిన హమాషో తోషిమా, చీఫ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్..... "హల్లో చైతన్యా! మీరిక్కడ వున్నారేమిటి-?" అన్నాడు.
19
ఆమెవైపే చూస్తున్నాడు వృద్ధుడు.
ఆమె బట్టలు పీలికలై దైన్యాన్ని చాటుతున్నాయి. వళ్ళు దుమ్ము కొట్టుకుపోయి వుంది. జుట్టు పాయలు పాయలుగా వేలాడుతోంది.
వృద్దురాలిగా కనబడుతూంది. అనారోగ్యం మొహంమీద ముడతల్ని తెచ్చింది. బీదతనం వాటిని పెంచింది. మరో ఇద్దరు బిచ్చగాళ్ళు ఆమెవైపే నిర్లిప్తంగా చూస్తున్నారు. చావుకీ బ్రతుక్కీ వాళ్ళ దృష్టిలో తేడా లేదు. జీవచ్ఛవాలు.
వృద్ధుడు ఆమె తలని వళ్ళోకి తీసుకొని మట్టిపాత్రలో నీళ్ళు గొంతులో పోసేడు.
అయిదు నిముషాలు గడిచినయ్. ఆమె కళ్ళు విప్పడం చూసి వృద్దుడి మొహం వికసించింది.
ఆమె బలహీనంగా వణుకుతున్న రెండు చేతులూ దగ్గరకు చేర్చి నమస్కారంచేసి "రక్షించారు బాబుగారూ!" అంది.
అతడు మాట్లాడ వద్దన్నట్టు సైగచేసి తన దగ్గరున్న గిన్నెను ముందుకు జరిపేడు. అది తిన్నాక ఆమెకి సత్తువ చేకూరినట్టయింది. కృతజ్ఞత నిండిన కళ్ళతో అతడివైపు చూసి, "మీ బుణం ఈ జన్మకి తీర్చుకోలేను బాబూగారూ..... మీ పేరు?" అని అడిగింది.
"నిరంజన్ దాస్" అన్నాడు వృద్ధుడు. "ఎండలో చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నావ్. ఎక్కడి కెళ్ళాలమ్మా?"
"ఇంకా చాలా దూరం ప్రయాణం చెయ్యాలి బాబుగారూ- ఇప్పుడక్కడేముందో తెలుసుకోవాలి. కానీ అనుమానంగా వుంది- గమ్యాన్ని చేరుకొనే లోపులో ఈ ప్రాణం తన గమ్యం పూర్తిచేసుకొంటుందేమోనని."
"ఇంత వేదాంతం మాట్లాడుతున్నావ్, నీ పేరేమిటమ్మా?"
"పేరులో ఏముంది బాబుగారూ....." అందామె. తల అడ్డంగా వూపుతూ...."ఏమీలేదు, ఏమీలేదు".
ఆమె లేచి "వెళ్ళొస్తాను బాబూ. మీకు మరోసారి కృతజ్ఞతలు" అంది.
"ఇంత ఎండలో ఎక్కడ కెళతావమ్మా....."
"చాలా దూరం వెళ్ళాలి. నెలలే పట్టొచ్చు. సంవత్సరాలే పట్టవచ్చు. కానీ వెళ్ళాలి. వెళ్ళేవరకూ ప్రాణాలు నిలుపుకోవాలి. వెళ్ళాలి- వెళ్ళాలి-" గొణుక్కుంటూ వెళ్ళిపోతూన్న స్త్రీని కనుమరుగయ్యే వరకు అలానే చూస్తూ వుండిపోయాడు.
* * *
"ఏమిటీ, మీరింతకాలం ఏమైపోయారు?" అడిగాడు చీఫ్. "నేను ఎంక్వయిరీ చేస్తే ఏవో ట్రబుల్స్ లో వున్నారని తెలిసింది".
బ్యాంకు అధికారి ఫోనులో మాట్లాడుతున్నాడు. తనొచ్చినపని క్లుప్తంగా చైతన్య అతడికి చెప్పేడు. "మీకు అప్పివ్వటానికి సంశయం ఏమిటి?"
"నేను పూర్వపు స్థితిలో లేను" నవ్వేడు చైతన్య. పరిస్థితి వివరించేడు.
ఫోనులో మాట్లాడటం ముగించిన అధికారివేపు తిరిగేడు చీఫ్. "మార్కెట్ ఒకటేకదా మీ అనుమానం".
"అవును" అని చైతన్య వేపు తిరిగి, "ఒక బలహీన వర్గం స్వంతంగా కాళ్ళమీద నిలబడటానికి ప్రయత్నిస్తానూ అంటే మాకూ సంతోషమే. కాని వాస్తవిక పరిస్థితుల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా".
"ఓ.కే....." బల్లమీద పేపరు వెయిట్ తిప్పుతూ అన్నాడు చీఫ్. "మూడు సంవత్సరాలపాటు వీరి సరుకు మొత్తం కొంటామని ఎక్స్ క్లూజివ్ కాంట్రాక్ట్ వ్రాసిస్తాను. ఎల్.సీ. ఓపెన్ చేస్తాం. సరేనా....."
ఇక్కడ యిలా సంభాషణ జరుగుతున్న సమయంలో అక్కడ రవి తన ఆడిటార్ తో మాట్లాడుతున్నాడు.
"డబ్బు మీరు పెట్టేరా, మీ భార్యదా అన్నది ప్రశ్నకాదు. చైతన్య వెళ్ళిపోయాక ఆయన బిజినెస్సంతా మీరు వున్న దున్నట్లు తీసుకొన్నారు. కాబట్టి అప్పులన్నిటికీ మీరు బాధ్యులవుతారు".
"కానీ ఆ సరుకంతా పూర్తిగా నాశనమైంది. అయినా సరే ఆ సరుకు అమ్మిన వాళ్ళందరికీ డబ్బు చెల్లించేను. నా ఉద్దేశ్యం ఏమిటంటే ఆ సంఘటన కారణంగా ఫ్యాక్టరీ ఆగిపోకూడదని".
"మీరు చెప్పింది నిజమే" అన్నాడు ఆయన. "కానీ మీరు కొంచెం తెలివిగా ప్రవర్తించి వుండాల్సింది. ఆ ఫ్యాక్టరీ చైతన్య నుంచి మీ భార్య కొనుక్కున్నట్టూ అగ్రిమెంటు వ్రాసుకుంటే మీకీ కష్టం వుండేది కాదు. అలా చేసిన పక్షంలో ఆ సంస్థ పూర్వపు లాభాల్తోకానీ, నష్టాల్తోకానీ మీకు సంబంధం వుండేది కాదు."
"అలా చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు పూర్వపు లాభాలమీద కూడా టాక్స్ కట్టాలంటారు".
"కట్టాలి మిస్టర్ రవీ! ఒక సంవత్సరం ఘోరంగా నష్టపోయినా, అంతకు ముందు వచ్చిన లాభంమీద బాక్స్ కట్టాల్సిందే.... అది 'లా'".
"లా? అదో గాడిద" అంటూ అన్నిటికీ సిద్ధపడిన వాడిలా అతడు వెనక్కివాలి, "మొత్తం ఎంత కట్టాలి?" అని అడిగేడు.
ఆయన కొద్దిసేపు లెక్కలు కట్టి "లక్షా డెభ్భయ్ వేలు" అన్నాడు. రవి ముఖం రక్తం ఇంకిపోయినట్టు తెల్లగా పాలిపోయింది. "లక్షా డెభ్భయ్ వేలు" గొణిగాడు.
"ఎక్కడ్నుంచి తెస్తాడు?
* * *
చైతన్యకి ఆశ్చర్యంగా వుంది.
తమ కంపెనీకి జపనీస్ ఫర్మ్ సాయపడటంలో కాదు.
ఆ ఫర్మ్ తరపున ఈ దేశపు ప్రతినిధిగా తనను నియమించడంలో! "నేను మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు."
"ఇందులో నేను చేసింది ఏముంది?" అన్నాడు చీఫ్. "మీలాంటి అనుభవజ్ఞుడులభించడం మా అదృష్టం. మామూలు పరిస్థితులలో ఐతే మీరు ఇంత చిన్న పనికి వప్పుకొనేవారా?"
నిజమే వప్పుకొనేవాడు కాడు. అది వేరే సంగతి. కానీ ఈ పని మాత్రం అంత తక్కువదేమీ కాదు. కమీషన్ కూడా ఆకర్షణీయంగా వుంది. ఇంటికొచ్చేక విషయం అంతా శారదకి చెప్పేడు.
అతనింటి కొచ్చేసరికి ఆమె కూర్చుని తల చిక్కుతీసుకొంటూంది. విషయం అంతా విని, ఆమె ఆనందంతో" చూసేరా మరి, నా శకునం అంటే ఏమనుకున్నారో- మీరు నాకు మంచి ప్రజంటేషన్ ఇవ్వాలి" అంది.