Home » Dr. dasaradhi rangacharya » Rigveda Samhitha - Part 1


        ఓం నతా మనన్తి మాయివో నధీరా వ్రతా దేవావాం ప్రథమా ధ్రువాణి |
        నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతావి నమేత స్థివాంసః ||

             ఆరవ అధ్యాయము - ఎనుబది ఒకటవ సూక్తము
           ఋషి-రహోగణపుత్రుడు గౌతముడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-పంక్తి.


    1. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. ఇంద్రునకు బలము ఉత్సాహము కలుగుటకు ఋత్విజులు స్తుతించుచున్నారు. చిన్న, పెద్ద యుద్ధములందు ఇంద్రునే ఆహ్వానించుచున్నాము.

    2. ఇంద్రా ! నీవు వీరుడవు. సేవ అంతటి బలవంతుడవు. శత్రువులను పరాభవింతువు. వారి ధనములు తెత్తువు. నిన్ను అర్చించినవాడు అల్పుడు అయినను వానిని అనల్పుని చేతువు. యాగముచేసిన వారికి, సోమము సమర్పించినవారికి ధనములు ఇత్తువు.

    3. యుద్ధములందు జయించినవారికి ధనము లభించును. ఇంద్రా ! నీ రెండు గుఱ్ఱములు మదమును అణగించునవి. వానిని రథమునకు బూన్చుము. ఒకనిని చంపుము. ఆ ధనము మాకు ఇమ్ము.

    4. ఇంద్రుడు కర్మలచేత గొప్పవాడయినాడు. అతడు భయంకరుడు. ఇంద్రుడు సోమపానము చేసినాడు. బలమును వృద్ధిపరచుకున్నాడు. అతడు గొప్ప దవుడలవాడు. దర్శనీయుడు. రెండు గుఱ్ఱములవాడు. ఇంద్రుడు సంపదకొఱకు ఇనుముతో కూడిన వజ్రమును ధరించినాడు.

    5. ఇంద్రుడు భూమిని అంతరిక్షమును వ్యాపించినాడు. అంతరిక్షమున నక్షత్రాదులను నిలిపినాడు. అట్టి ఇంద్రుడు పూర్వము పుట్టలేదు. ముందు పుట్టబోడు. ఇంద్రుడు సర్వజగత్తును నిర్వహించగల సమర్ధుడు.

    6. ఇంద్రుడు పాలకుడు. అతడు అన్నమును హవిస్సులను అనుగ్రహించినాడు. ఇంద్రా ! నీవద్ద అనంత ధనము ఉన్నది. అందులోని కొంత భాగము మాకు ఇమ్ము. మేము అనుభవింతుము.

    7. ఇంద్రుడు సోమపానము చేసినపుడెల్ల సత్కార్యములు చేయును. మాకు ఆలమందలను ఇచ్చును. రెండు చేతుల ఇవ్వగలిగినంత ధనము ఇంద్రునకు కలుగవలెను. అతడు మాకు ధనములు అందించవలెను.

    8. శూరవీరా ! ఇంద్రా ! మాకు ధనము, బలము కలిగించుటకు తృప్తిగా సోమము సేవింపుము. నీవు అనంత ధనవంతుడవు. మా కోర్కెలు తీర్చుమని నిన్ను వేడుకొందుము. మాకు రక్షణ కల్పింపుము.

    9. ఇంద్రా ! నిన్ను భజించు యజమానుల హవిస్సులను అభివృద్ధి పరచుచున్నావు. నీవు ధనస్వామివి. నిన్ను పూజించని వారి ధనమును హరింపుము. పూజించువారికి ప్రసాదించుము.

        ఎనుబది రెండవ సూక్తము, ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు
               దేవత - ఇంద్రుడు, ఛందస్సు - 1-5 పంక్తి, 6 జగతి


    1. ఇంద్రా ! నీవు ధనవంతుడవు. మా దరికి రమ్ము. మా స్తుతిని వినుము. మావిషయమున నీవు పూర్వమువలె అనుగ్రహింపుము. నీవే మమ్ములను సత్యవచనులను చేయుచున్నావు. నీవే మమ్ములను నిన్ను యాచించునట్లు చేయుచున్నావు. ఇంద్రా ! రథమునకు గుఱ్ఱములు పూన్చుము.

    2. ఇంద్రా ! నీవు యజమానులకు అన్నములు అందించినావు. వారు అన్నములు తిన్నారు. దేహములు నిలుపుకున్నారు. దీప్తవంతులగు విద్వాంసులు నూతన మంత్రముల నిన్ను నుతించినారు. ఇంద్రా ! రథమునకు గుఱ్ఱములు పూన్చుము.

    3. ఇంద్రా ! నీవు దర్శనీయుడవు. నిన్ను మేము కీర్తించుచున్నాము. నిన్ను పూజించువారి కొఱకు రథముతో బయలుదేరుము. ఇంద్రా ! రథమునకు గుఱ్ఱములు పూన్చుము.

    4. ఇంద్రుడు హరి యోజనమను పేరుగలదియు సోమరసముతో నిండిన పాత్ర ఉన్నదియు అగు రథమును గుర్తు పెట్టుకున్నాడు. ఆ ఇంద్రుడు మాకు వర్షము, గోవులను ప్రసాదించుటకు రథమును అధిరోహించవలెను. ఇంద్రా ! రథమునకు గుఱ్ఱములు పూన్చుము.

    5. శతక్రతూ ! ఇంద్రా ! నీ రథమునకు కుడి ఎడమల అశ్వములను ఉంచుము. ఆ రథమున రమ్ము. సోమపానము చేయుము. ఉన్మత్తుడవు అగుము. ప్రియమయిన నీ భార్యను చేరుము.

    6. ఇంద్రా ! బొచ్చుగల రెండు గుఱ్ఱములను స్తుతి మంత్రములతో రథమునకు పూన్చినాము. నీవు సోమపానము చేసి ఉన్మత్తుడవయి ఉన్నావు. కళ్లెమును పట్టుకొనుము. ఇల్లు చేరుము. నీ భార్యతో తృప్తినొందుము.

        ఎనుబది మూడవ సూక్తము, ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు
                     దేవత - ఇంద్రుడు, ఛందస్సు - జగతి.


    1. ఇంద్రా ! నీవు మానవులను రక్షించుచున్నావు. వారు భద్రముగా ఉన్నారు. వారివద్ద అశ్వములు ఉన్నవి. గోవుల కొఱకు నిన్ను అర్ధించుచున్నారు. అంతటి నీరు సంద్రమును నింపినట్లు మానవుని ధనము, జ్ఞానములతో నింపుము.

    2. చమపము అణు యజ్ఞపాత్రలో దీప్తమయిన జలము చేరును. చేరినంతనే అంతరిక్షమున ఉన్న దేవతల సూర్యకిరణములవంటి దృష్టి ఆ పాత్ర మీద పడును. ఒకే కన్యను అనేకులు వరించవత్తురు. అట్లే చమస పాత్ర కొఱకు దేవతలు చేరుదురు.

    3. ఇంద్రా ! స్రుచములు సిద్ధపరచినాము. రెండు హవిర్థానులు నిన్ను పూజించుచున్నవి. నీవు 'యుజేవాం' అను మంత్రమును వాటికి జోడించినావు. నీకు హవిస్సులు, సోమము సమర్పించు యజమాని శత్రువులను ఎదిరించుటకు యుద్ధమునకు పోడు. అయినను తుష్టి పుష్టి కలిగి శుభప్రదముగా ప్రకాశించును.

    4. గోవులను కోల్పోయిన అంగిరసులు ముందు హవిస్సులను ధరించినారు. అగ్నిని ప్రజ్వరిల్ల చేసినారు. యాగములు చేసి ఇంద్రుని పూజించినారు. అప్పుడు వారు 'పణి' అపహరించిన గుఱ్ఱములను, గోవులను ఇతర పశు సంపదను పొందినారు.

    5. పణి గోవులను అపహరించగా అధర్వర్షి ఇంద్రయాగము చేసినాడు. మార్గములను చక్కపరచినాడు. అధర్వుడు ఆ గోవులను అభిముఖముగా పొందినాడు. కవి పుత్రుడు అగు 'నుశనుడు' ఇంద్రునకు సాయపడినాడు. అప్పుడు వ్రతముల పాలించు సూర్యుడు, రాక్షసులను జయించుటకు ఆవిర్భవించినాడు. అమృతుడగు ఇంద్రుని యజింతుము అమృతం. యజామహే.

    6. విఘ్నములేని సుకర్మకొఱకు దర్భకోయబడినప్పుడు, హోత యజ్ఞమున స్తుతిమంత్రము పఠించునప్పుడు, ఉక్థను చేసిన స్తోత ధ్వనించునట్లు అభిషవ శిల ధ్వనించినప్పుడు ఇంద్రుడు సంతసించును.

        ఎనుబది నాలుగవ సూక్తము-ఋషి-రహోగణపుత్రుడు గౌతముడు,
        దేవత-ఇంద్రుడు, ఛందస్సు 1-6 అనుష్టుప్, 7-10 ఉష్ణిక్కు, 10-13 పంక్తి,
        14,16 గాయత్రి, 15,18 త్రిష్టుప్, 19-20 బృహతి.

    1. ఇంద్రా ! నీ కొఱకు సోమము అభిషవింపబడినది విచ్చేయుము. అంతరిక్షమున సూర్యుడు కిరణములచేత ప్రకాశించునట్లు నీవు సోమము సేవించి ప్రకాశించవలెను.

    2. అప్రతిహత బలముగల ఇంద్రునే ఋషులు, మానవులు స్తుతించుచున్నారు. హరియను గుఱ్ఱములు ఇంద్రుని ఆ స్తుతి స్థలమునకే చేర్చును.

    3. వృత్రుని వధించిన ఇంద్రా ! స్తుతిమంత్రములతో గుఱ్ఱములను నీ రథమునకు పూన్చినాము. రథమును ఎక్కుము. అభిషవశిల నీ మనసును అభిషవించినప్పటి ధ్వనితో విచ్చేయుము.

    4. సోమము ప్రశస్తము. మాదకము. అమృతము. యజ్ఞగృహమునందు అట్టి సోమము నీ ఎదుట ధారలుగా ప్రవహించుచున్నది. దానిని సేవింపుము.

    5. ఋత్విజులారా ! త్వరగా ఇంద్రుని యజింపుడు. ఉక్థలు పఠింపుడు. ఇంద్రుడు సోమము సేవించవలెను. ఉన్మత్తుడు కావలెను. ఇంద్రుడు బలవంతుడు. అతనికి నమస్కరింతము.

    6. ఇంద్రా ! హరి అను పేరుగల రెండు గుఱ్ఱములను రథమున పూన్చినావు. కావున నిన్ను మించిన రథికుడులేడు. నీకు సాటివచ్చు బలవంతుడు లేడు. ఎంతమంచి గుఱ్ఱములు ఉన్నను మరొకడు నిన్ను సమీపించజాలడు.

    7. హవిస్సులు సమర్పించు నరులకు ఇంద్రుడు ఒక్కడే ధనములు ఇవ్వగల సమర్థుడు. ఇంద్రునకు ఎదురులేదు. ఇంద్రుడే సర్వజగములకు ప్రభువు.

    8. యజ్ఞము చేయని నరుని ఇంద్రుడు ఎపుడు అణచివేయునో ? ఇంద్రుడు మా స్తుతి మంత్రములను ఎపుడు గ్రహించునో ?

    9. సోమము అభిషవించి యజించిన యజమానికి ఇంద్రుడు సకల బలములను ప్రసాదించును.

    10. గోవులు, వర్షించువాడగు ఇంద్రునితో కూడి సంచరించుచున్నవి. యజ్ఞములందు ఇంద్రుడు సేవించగా మిగిలిన సోమరసము త్రావి మదించి ఉన్నవి. జీవనాధారమగు పాలను ఇచ్చు గోవులు ఇంద్రరాజ్యము తమదేనని భావించుచున్నవి.

    11. నానా వర్ణముల గోవులు ఇంద్రుని స్పర్శను ఆశించుచున్నవి. తలపాలతో సోమరసమును కలుపుచున్నవి. గోవులు ఇంద్రునకు ప్రియతమములు. అవి శత్రువును వధించుటకు వజ్రము విసరుచున్నవి. జీవనాధారమగు పాలను ఇచ్చు గోవులు ఇంద్రరాజ్యము తమదేనని భావించుచున్నవి.

    12. గోవులు ఉత్కృష్ట జ్ఞానము కలవి. అవి తమ పాలతో ఇంద్రుని బలమును పోషించుచున్నవి. ఇంద్రునకు నానావిధ కార్యములను తెలియపరచుచున్నవి. జీవనాధారమగు పాలను ఇచ్చు గోవులు ఇంద్రరాజ్యము తమదేనని భావించుచున్నవి.

    13. ఇంద్రునకు ఎదురు చెప్పువారులేరు. అట్టి ఇంద్రుడు దధీచి ఎముకలతో ఎనిమిది వందల ఎనుబదిమంది వృత్రులను సంహరించినాడు.

    14. పర్వతములందు దధీచికి సంబంధించిన అశ్వ శిరస్సు జారిపడినది. ఇంద్రుడు దానికొఱకు వెదకినాడు. ఆ గుఱ్ఱపుతల 'శర్యణావతి' నదిలో దొరికినది.

    15. చంద్రమండలమున రాత్రిపూట సూర్యుని తేజస్సును కనుగొన్నారు.

    16. ఇంద్రుని హరులను గుఱ్ఱములు వీర్యవంతములు. తేజోవంతములు. శత్రు దుస్సాధ్యములు. ఉగ్రములు. నోటిలో అమ్ములు గలవి. శత్రువు గుండెలమీద పాదము మోపునవి. వానిని రథమునకు ఎవడు పూన్చగలడు? అది అసాధ్యము. ఈ వాక్యమును పోషించువాడు జీవించవలెను.

    17. ఇంద్రుడే అనుగ్రహింప వచ్చినపుడు శత్రువునకు భయపడి పారిపోనేల ? హింసింపబడనేల? భయపడనేల? ఇంద్రుని తెలుసుకొననేల? సంతానము, గజములు, ధనములు, ఆరోగ్యము, పరివారము కోరనేల? కోరకనే సర్వము లభించును.

    18. ఇంద్రుని స్తుతించు శక్తి ఎవరికి ఉన్నది ? స్రుక్కులలో నేయిపోసి ఋతువులను యజించు శక్తి ఎవరికి ఉన్నది ? యజమానులకు హోమద్రవ్యములు సమకూర్చు శక్తి ఏ దేవతలకు ఉన్నది ? యజ్ఞమును ఆరంభించి శోభన దేవతలను తెలిసికొను శక్తి ఏ యజమానికి ఉన్నది? ఎవరికీ లేదు. ఇంద్రునకు మాత్రమే ఉన్నది.

    19. ఇంద్రా ! నీవు తేజోవంతుడవు. బలవంతుడవు. ధనవంతుడవు. నీవే మానవులకు సుఖములు ప్రసాదించగలవు. అన్యులకు సాధ్యపడడు. మేము నిన్నే స్తుతించుచున్నాము.

    20. ఇంద్రా ! నీవు మాకు జీవన హేతువవు. నీవు ప్రసాదించు అన్నములు, రక్షణలే మమ్ము బాధలనుండి కాపాడును. మేము మంత్రద్రష్టలము. మాకు సమస్త ధనములు తెచ్చి ఇమ్ము.

                   (ప్రథమ మండలమున పదమూడవ అనువాకము సమాప్తము.) 

    ఆలోచనామృతము :

    1. 13,14 మంత్రములలో దధీచిని పేర్కోనుట జరిగినది. శాట్యాయనుడు అందును గురించి ఒక వృత్తాంతము వివరించినారు.

    అధర్వరుషి పుత్రుడు దధీచి. అతడు భూలోకమున అసురులను నిర్మూలించినాడు. స్వర్గమునకు చేరినాడు. దధీచిలేనందున భూలోకమున అసురుల బాధ అధికమయినది. ఇంద్రుడు దధీచి కొఱకు వెదకుచు కురుక్షేత్రము చేరినాడు. 'శర్యణావతి' సరస్సువద్ద దధీచికి సంబంధించిన గుఱ్ఱపుతల లభించినది. ఇంద్రుడు దధీచి తలయొక్క ఎముకలతో శస్త్రము చేపినాడు. అసురులను వధించినాడు.

    వృత్రుడు దిక్కునకు 88మంది వృత్రులను మాయా రూపమున నిలిపినాడు. పది దిక్కుల వారు 88x10=880 మంది అగుదురు. వారందరిని ఇంద్రుడు సంహరించినాడు.

    శ్రీమద్భాగవతమున దధీచి వృత్తాంతము మరొక తీరుగా ఉన్నది.

    అశ్వినులు దధీచిని తమకు బ్రహ్మ విద్య ఉపదేశించవలసినదని వేడినారు. దధీచి అంగీకరించినాడు. అశ్వినులు బ్రహ్మ విద్యావంతులు అగుట ఇంద్రునకు ఇష్టములేదు. అది ఎరిగిన అశ్వినులు దధీచి తలదాచి అతనికి గుఱ్ఱపు తల తగిలించినారు. దధీచి గుఱ్ఱపుతలతోనే అశ్వినులకు బ్రహ్మవిద్య ఉపదేశించినాడు. ఇంద్రుడు దధీచి గుఱ్ఱపుతలను నరికినాడు. అశ్వినులు దధీచి తలను అతనికి తగిలించినారు. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra