సుధ సమక్షంలో తనకింత శాంతిగా ఉండటానికి కారణం ఏమిటో సరిగా అర్ధం కాకపోయినా, ఆ అపూర్వమైన శాంతిని వదులుకోవాలనిపించలేదు వామన్ కి
ఆర్తితో సుధ రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకున్నాడు.
"సుధా! నన్ను పెళ్ళి చేసుకుంటావా?"
సుధ ఒక్క క్షణం ఆలోచించింది.
"నువ్వు నన్ను పెళ్ళి చేసుకోగలవా?"
"ఎందుకు చేసుకోలేను?"
"సరే."
"వెంటనే....కొద్ది రోజుల్లోనే....కాదు....రేపే. ఇవాళే ఇప్పుడే"
సుధ నవ్వింది.
"నీ ఇష్టం. కానీ నువ్వు మిసెస్ కామేశ్వరీదేవికి చెప్పాలి. ఆవిడ అనుమతి తీసుకోవాలి. నేనింకా ఆవిడ అధీనంలోనే ఉన్నాను కదా."
వామనమూర్తి ముఖం పాలిపోయింది.
"మిసెస్ కామేశ్వరీ దేవిని అడగాలా?" బెంగగా అన్నాడు.
"నీకింత బెంగ దేనికి? ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటుంది. ఒప్పుకోక తప్పదు."
"అది కాదు..."
ఆవిడ ఒప్పుకుంటుందని వామన్ కు తెలుసు. బహిరంగంగా తిరస్కరించటానికి బలమైన కారణం లేదు. కనుక...కానీ తరువాత ఆవిడ తన మీద తప్పక పగబడుతుంది. సమాజంలో బలమైన ప్రాపకాన్ని వదులుకోవటం- దానికి ఎదురు తిరగటం...
వామనమూర్తి ముఖంలోకి చూసి నవ్వింది సుధ. నెమ్మదిగా అతని చేతుల్లోంచి తన చేతులు విడదీసుకుంది.
"వస్తాను వామన్" అంది.
వామనమూర్తి మాట్లాడలేదు.
స్థిరమైన అడుగులతో నెమ్మదిగా తనకు దూరమవుతున్న సుధను చూస్తూ కూర్చున్నాడు.
16
"డాక్టర్ వామన్! ఇలా వచ్చారేమిటి?" ఆశ్చర్యంగా అడిగింది సుధ.
గాఢమయిన నిద్రలోంచి మేల్కొన్న వాడిలా చుట్టూ చూసి "ఇక్కడకు వచ్చానా?" అన్నాడు వామన్.
సుధ నవ్వింది. సుధాకరుని కిరణాలలో చల్లదనమంతా ఆ నవ్వులో కురిసింది.
"ఏం జరిగింది?"
"ఈ రోజు ఒక రోగికి ఎడం చేతికి చెయ్యవలసిన ఆపరేషన్ కుడి చేతికి చేశాను. నా తప్పు లేదు. నర్స్ ఆపరేషన్ చెయ్యవలసిన ఎడమ చేతికి బదులుగా కుడి చేతికి గుర్తుపెట్టింది. నేను పరాగ్గా ఉన్నాను. గుర్తును బట్టి కుడి చేతికి ఆపరేషన్ చేశాను. రోగి లబోదిబోమని ఏడుస్తూ శాపనార్ధాలు పెడుతున్నాడు. సిగ్గుతో చితికి పోతున్నాను. గుండె మీద రాయి మోస్తున్నట్లుగా ఉంది.
సుధ ధైర్యం చెపుతున్నట్లు అతని చెయ్యి పట్టుకుంది.
"వామన్! మనసంతా ఎంత దొంగలమో ఆలోచించావా? తప్పు నాది కాదు.. అంటే.. నాది కాదు అని ఒకొక్కళ్ళము జరిగిన వినాశాలకు ఎవరినో బాధ్యులుగా చేసి చేతులు దులుపుకుని అంతరాత్మలను ఓదార్చుకుంటూ బ్రతికేస్తున్నాం. అంతే కాని మన కర్తవ్యాన్ని మనం నిర్వహించుకోలేకపోతున్నాం."
"ఇప్పుడేం చెయ్యమంటావ్! అంతా అయిపోయింది కదా!"
"ఏదీ అయిపోలేదు. అయిపోదు. ఇప్పటికయినా నువ్వు నిజంగా జబ్బు పడిన చేతికి ఆపరేషన్ చెయ్యి. ఆ రోగి సంతోషిస్తాడు."
"ఆస్పత్రి యాజమాన్యం ఇందుకు ఒప్పుకోదు. ఇంత ఖర్చు భరించదు."
"పోనీయ్! నీ సొంత ఖర్చుతో ఆపరేషన్ చెయ్యి. పొరపాటు నువ్వే చేశావు"
"నా సొంత ఖర్చుతోనా? నేనెందుకు నష్టపోవాలి?"
వామన్ తన చేతిని సుధ చేతిలోంచి లాగేసుకున్నాడు. ఏదో మహాపరాధం చేసి శిక్ష తప్పించుకోవటానికి పారిపోతున్నవాడిలా తలవంచుకుని వెళ్ళిపోయాడు.
ఒక్క నిట్టూర్పు వదిలింది సుధ. డాక్టర్ వామన్ లాంటి వారెందరో ఆత్మ విమర్శ చేసుకోగలరు. కానీ బయటపడలేరు. ఆదర్శాలు గుర్తిస్తారు, కానీ వాటిని అందుకోవటానికి ఒక్క అడుగయినా ముందుకు వెయ్యరు. ఇతనికి ఈ దుఃఖం నుండి విముక్తి ఎన్నటికో! తన చేతిని ఆలంబనగా అందించగలదు. కానీ, అందుకోవటానికి అతడు ఇష్టపడడు. తానేమిటో అంగీకరించి అబద్దాల అల్లిక నుంచి వాస్తవం వైపు నడవాలనే ప్రయత్నం చెయ్యడు. "షేక్స్ పియర్" టెంపెస్ట్ అనే నాటకంలో 'కేలిబన్' అనే పాత్ర అబద్దాలు ఆడి, ఆడి తన అబద్దాలను తానే నిజమని నమ్ముకునే దశకు చేరుకున్నాడు. వామన్ కూడా తాను ప్రతిభావంతుడనని ఇతరులను భ్రమలో ఉంచుతూ తాను కూడా అదే భ్రమలోకి వచ్చేసినట్లున్నాడు. ఈ భ్రమ తాగుడు వల్ల వచ్చే మైకం కంటే ప్రమాదమయినది.
"చీకట్లో ఏం చేస్తున్నావ్?" కొద్ది పాటి గద్దింపుతో కూడిన కామేశ్వరీ దేవి గొంతు విని తాను లైట్ వేసుకోలేదని గుర్తించింది సుధ.
"కొంపదీసి వామన్ ని ప్రేమిస్తున్నావా ఏమిటి? నిన్ను నట్టేట ముంచుతాడు!"
విరగబడి నవ్వింది. ఆ నవ్వులో క్రౌర్యం - ఈర్ష్య. ఎవరు ఆనందంగా ఉన్నా సహించలేని శాడిజమ్ ఆమె కళ్ళలో.
"అదేం లేదు. నేను ఎవరితోనయినా సాధారణంగా స్నేహంగానే ఉంటాను."
"గుడ్! ఈ చీర నాకు బాగుందా?"
"బాగుంది మేడమ్! ఈ చీర మాత్రమే కాదు. ఏ చీర అయినా మీకు బాగానే ఉంటుంది. చీరకి అందాలు తెచ్చే అంగ సౌష్టవం మీది!"
గర్వంగా నవ్వింది కామేశ్వరీ దేవి. ఈవిడ మరొక రకం హిపోక్రసిస్ట్. అయితే ఈమెకు అంతరాంతరాల్లో తానేమిటో తెలుసు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆమె ఉనికికి అదే ఆధారం. లోకమంతా డబ్బు చుట్టూ తిరుగుతుందనేది ఆమె నమ్మిన న్యాయం.
"మేడమ్! మన శరణాలయంలో పిల్లలకి డిన్నర్ టైం అయింది. నేను ఆ ఏర్పాట్లు చూడాలి!"
"సరే! ఖర్చు ఎక్కువ కాకుండా చూడు. డోనర్స్ కి లెక్కలు చూపించాలి. అవి కూడా చూడు. అన్నీ టాలీ అవ్వాలి. మన ఖర్చు ఎక్కువ అన్నట్లు చూపించాలి."
"సరే!"
"నేను బయటకు వెళ్తున్నాను. నేను వెళ్ళకపోతే అక్కడ ఏమీ జరగదు. ఏమిటో ఒక్క నిమిషం కూడా తీరిక ఉండదు." అతి కష్టం మీద వయ్యారంగా నడవటానికి ప్రయత్నించి వంకరలు తిరుగుతూ వెళ్ళిపోయింది.