నిర్మల తెల్లబోయిఅతడివంక చూసి"నువ్వంతా నిజమేచెబుతున్నావా?" ఆన్నాడు.
"అవును సాగర్ వంచకుడు మామూలు వంచకుడుకాదు. నయవంచకుడు. అతడెలాంటి వాడంటే నీతో తనఅవసరంతీరిపోయేక ఆవిషయంచెప్పి నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను ప్రయోజనం పొందమన్నాడు...."
"ఛీ-" అంది నిర్మల.
"దేవుడిసాక్షిగా నేను నిజం చెబుతున్నాను. సాగర్ గురించి నాకు బాగా తెలుసు. వాడికి ఒట్టంటే విపరీతమైన నమ్మకం అరవిందను పెళ్ళిచేసుకుంటానని వాడు ఒట్టువేసి మరీ ఆమెకు చెప్పాడు. నువ్వుకూడా వాణ్ణి ఒట్టువేయమను అప్పుడు వాడిబండారం బయటపడుతుంది...." అన్నాడు. చంచల్రావు.
నిర్మలకు వెంటనే తను చేయి సాచడం, వివాహానికి ముందు తనామె శరీరాన్ని తాకనని సాగర్ అనడం గుర్తుకొచ్చింది.
ఔన్నత్యంతో నీచత్వం! నిర్మల కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"నిర్మలా! నేను నీకన్యాయం చేయాలనుకున్నాను. కానీ చేయలేకపోయాను. నేను దుర్మర్గుణ్ణే కావచ్చు. కానీ నయవంచుకులంత ప్రమాదకరమైన వ్యక్తిని కాదు. తెలివివుంటే దుర్మార్గులబారినుండి తప్పించుకోవచ్చుకానీ నయవంచకులబారినుండి తప్పించుకోవడం ఇంచుమించు అసాధ్యం!"
"ఇంతకూనువ్వు నాకు చెప్పుదల్చుకున్నదేమిటి?"
"నువ్వు ఊహించని ప్రమాదంలో ఉన్నావు. నిన్ను నువ్వు కాపాడు కోవాలి...."అన్నాడు చంచల్రావు.
"అందువల్ల నీకు ప్రయోజనం?"
"ఒక మంచిపని చేశానన్న తృప్తి!"
"కాదు. నీకు దక్కనిది సాగర్ కి కూడా దక్కకుండా చేశానన్న తృప్తి! నీ స్నేహితుడి అదృష్టానికి అసూయ....."
చంచల్రావు తెల్లబోయి- "పోనీ-అలాగే అనుకో....కానీ అది నీకు మేలే చేస్తుందికదా!...."అన్నాడు.
"నీకు నిజంగా నా గురించిన వ్యధ ఉందా?" అంది నిర్మల.
"ఉంది!"
"అయితే వచ్చేనెలలో ఓ రెండోపెళ్ళి మోటుమనిషితో నా పెళ్ళి జరుగబోతోంది. అది ఆపడానికి నువ్వేమైనా చేయగలవా?"
"నేనేం చేయగలను?" అన్నాడు చంచల్రావు.
"అది ఆపలేనప్పుడు అదీ ఆపి ప్రయోజనంలేదు. రెండోపెళ్ళివాడికి రెండోపెళ్ళిపెళ్ళాం తప్పుకాదు...." అంది నిర్మల.
"అంటే?" అన్నాడు చంచల్రావు.
"నువ్వు పదివేలూ సిద్దంచేసుకో- పందెంఓడిపోతావు-" అంది నిర్మల.
18
"నువ్వు నిజమే చెబుతున్నావా?" అంది అరవింద.
"దేవుడిమీద ప్రమాణంచేసి అంతా నిజమేచెప్పాను. అబద్దంచెప్పలేదు...." అన్నాడు చంచల్రావు.
"సాగర్ కిలాంటి పాడుబుద్ది ఎందుకుపుట్టింది?"
"అది నాకు తెలియదు...."
"అరవింద క్షణం ఆలోచించి ఇదినాకు నువ్వెందుకు చెప్పావు?" అంది.
"సాగర్ బుద్ది పెడదారి తోక్కుతోందని నేను హెచ్చరించాను. దానికి బదులుగా నువ్వు వాడిచేత ఒట్టువేయించుకుని తృప్తిపడ్డావు. రేపు సాగర్ ఆ అమ్మాయిని తన గదికి రప్పించుకుంటున్నాడు. అటు ఒక అమాయకురాలి జీవితం ఇటు స్నేహితురాలి ఆశలు- కూలి పోకుండా నిలబెట్టాలన్నది నా తాపత్రయం...." అన్నాడు చంచల్రావు.
"ఇందువల్ల నువ్వు సాధించేదేమిటి?
"నాకు తెలియదు....."
"ఇప్పుడు నేనేం చేయలంటావు?"
"చెబితే నేను చెప్పినట్లు చేస్తావా?"
"ఊఁ
"వెళ్ళి నిర్మలను హెచ్చరించు...."
"ఏమని?"
"సాగర్ మోసగాడని....?"
"సాగర్ నిజంగానే మోసగాడా?"
"అవునుకదామరి!"
"నేను మోసగాడిని పెళ్ళిచేసుకుంటానా?
చంచల్రావు ఏమనాలో తెలియక_ "ఏమో? సాగర్ విషయంలో నువ్వేంచేస్తావో నాకు తెలియదు. ప్రేమ గుడ్డిది...." అన్నాడు.
"నా ప్రేమ గుడ్డిదికాదు నేను మోసగాణ్ణి పెళ్ళిచేసుకోను....."
"అంతా నీ యిష్టం...."
"సాగార్నినేను పెళ్ళిచేసుకోనప్పుడు- నిర్మలనతడుమోసం చేస్తే నాకేం?"
"అయితే ఏమంటావ్?" అన్నాడు చంచల్రావు.
"సాగర్ ని నేను నమ్ముతున్నాను . అతడు నామీద ఒట్టువేశాడు. నన్నతడు మోసం చేయడు...." అంది అరవింద.
"సాగర్ తప్పుచేయబోతున్నాడు. తలచుకుంటే నువ్వాపని ఆపగలవు"
"సాగర్ తప్పు చేయడు...."
"రేపు సాయంత్రం నాతోరా నిజంనీకేం తెలుస్తుంది....."
"కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావని నాకు తెలుసు...."
"కానీ...."
"మిస్టర్ చంచల్రావు! సాగర్ నీకంటేముందే అన్నీ నాకు చెప్పాడు. నీ నుంచి పదివేలు గుంజడానికి తానో తమాషా చేస్తున్నాననీ- అందుకు నిర్మల అనే అమ్మాయి సహకరిస్తోందనీ!"
చంచల్రావు తెల్లబోయి- "ఎప్పుడు?" అన్నాడు.
"ఎప్పుడై తేనేంలే కానీ పదివేలకోసం మనుషులజీవితాల్లోచిచ్చుపెట్టకు"
"పొనీ ఒక్కసారివచ్చి జరిగేది చూడకూడదూ?"
"అలావస్తే సాగర్ని అవమానించినట్లవుతుంది. అతణ్ణి నేనెప్పుడూ అనుమానించను. అవమానించను....."
అంతా నీ దురదృష్టం!" చిరాగ్గా అన్నాడు చంచల్రావు.